Thursday, January 10, 2013

'నిర్భయ' మహిళా ఉద్యమం - పాలడుగు వెంకట్రావు



మహిళల రక్షణ కోసం మన దేశంలో చట్టాలు చేశారు. ఆచరణలో అవి విఫలమయ్యాయి. దానికి ప్రధాన కారణం రాజకీయనాయకులే. 'నిర్భయ' ఘటనానంతర ఉద్యమంలో పురుషుల ప్రమేయం నామమాత్రమే. స్త్రీ శక్తి స్వరూపిణి అని ఉద్యమించిన చెల్లెళ్లు రుజువు చేశారు. 'కొందరు దుష్టుల వల్ల ఇది జరిగింది. దానికి సిగ్గుపడుతున్నాం. ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తాం. రక్షగా నిలుస్తాం' అంటూ పురుషులు ముందుకు వచ్చి ఉంటే.. పరిపూర్ణ ఘటనగా భావించేవారం. పోలీసు చొక్కా పట్టుకు లాగిన ఘటన లక్ష మాటలకు సమానం. 

వ్యక్తుల సమీకరణ క్రమంగా ఉద్యమంగా రూపాంతరం చెందుతుంది. సంఘటిత శక్తిగా మారుతుంది. సహజంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాలతో ఉద్యమాలు తలెత్తుతుంటాయి. ఇప్పటివరకు చరిత్రలో చోటుచేసుకున్న ఉద్యమాలు అన్నింటా పురుషాధిక్యమే, పురుషుల నేతృత్వమే కనిపిస్తుంటుంది. కానీ వీటన్నింటికీ భిన్నంగా ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో 'నిర్భయ' (ఆమె తండ్రి బద్రీసింగ్ పాండే వెల్లడించిన ప్రకారం అసలు పేరు జ్యోతి సింగ్ పాండే) సామూహిక దారుణ అత్యాచార ఘటన నేపథ్యంలో మహిళా ఉద్యమం మన దేశంలో ఉవ్వెత్తున ఎగసిపడింది. 

యువతులు వీధుల్లోకి వచ్చి ఇన్నాళ్ళుగా తమలో నిద్రాణంగా ఉన్న శక్తి స్వరూపాన్ని లోకానికి చాటారు. ఊహించనలవి కాని రీతిలో.. ఒక దశలో పోలీసుల చొక్కా కూడా పట్టుకుని ప్రశ్నించారు. ప్రభుత్వాలు కుంచించుకుపోయేలా ప్రాకృతిక అననుకూలతను సైతం వారు అధిగమించి నిరసన తెలిపారు. అనేక అంశాలపై వ్యాసాలు రాసిన నేను (వ్యాసకర్త) దీనిపై స్పందించకపోతే చరిత్ర హీనుడవుతాననడంలో సందేహం లేదు. 

అనాది నుంచీ మహిళలను గౌరవించినట్టు పురాణాలు ఉటంకించాయి. కానీ నిత్య జీవితంలో దానితో సారూప్యత లేకుండా పోయింది. అలాగని పురాణాలను తప్పుపట్టడం లేదు. కానీ స్వాతంత్య్రానంతరం సంఘ నిర్మాణం ప్రభుత్వాల చేతుల్లోకి వచ్చింది. మతపర కట్టుబాట్లు వేరు-లౌకిక సమాజంలో ప్రభుత్వ బాధ్యత వేరు. ఢిల్లీలో మహిళా సమాజం ఉవ్వెత్తున లేచిన సందర్భం ఇది. అరవై ఏళ్ళ తర్వాత కూడా ఆ స్వేచ్ఛాయుత సమాజాన్ని ఇవ్వలేకపోయినందుకు ప్రతి ఒక్కరూ సిగ్గు పడవల్సిందే. అన్నా హజారే నిరాహారదీక్ష, 'నిర్భయ' ఘటన తర్వాత ఎగసిన ఉద్యమాలు ప్రజలలో ఉన్న భావాలను వెల్లడిస్తున్నాయి. సమాజంపై ప్రజలలో కొన్ని ఆలోచనలున్నాయి. దేశ ప్రధాని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఈ రచయితకే కాదు-అన్ని రకాల ప్రజలకు కొన్ని ఆలోచనలున్నాయి. వాటి పర్యవసానమే తాజా ఉద్యమం. ఇదో ఆకస్మిక ఘటన. ఇదో చైతన్యం. దానిని ఎక్కడా చెడుగా భావించాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే స్వాతంత్య్రానంతరం జరిగిన పవిత్ర ఉద్యమంగా దీనిని భావించాలి. 

ఈ నేపథ్యంలో పునరావలోకనం చేసుకుంటే ఫలానా వారు కారణం అనడానికి ఏమీ లేదు. సమాజమే మొత్తంగా కుళ్ళుతూ వస్తోంది. దీనికి 'నిర్భయ'తో పాటు దెబ్బలు తిని, బస్సులో నుంచి తోసివేయబడ్డ ఆమె స్నేహితుడు ఇచ్చిన ప్రకటనే చాలు. సమాజం ఎంత బాధ్యతా రహితంగా ఉందో ఆయన మాటలను బట్టి వెల్లడవుతోంది. ఇతరులు 'ఫాదర్ ఆఫ్ ది నేషన్' అంటున్నా, మన దేశాన్ని మాత్రం 'భారత మాత' అంటాం. స్త్రీ స్వరూపంగా పూజిస్తున్నాం. మహిళలకు మనం ఇచ్చే ప్రాధాన్యాన్ని అది చెప్పకనే చెబుతుంది. కానీ ఆచరణలో మాత్రం అందుకు భిన్న ఉదంతాలెన్నో. 

మత వైరుధ్యాలలోనే ఎవరికి వారు కట్టుబాట్లు చేసుకున్నారు. అయితే అవి సమాజ నిర్మాణానికి పనికిరాలేదేమో అనిపిస్తుంది. 'నిర్భయ' ఘటన తర్వాత స్త్రీ-పురుష సంబంధాలను ఒకసారి వెనక్కు చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మానవ సంబంధాలపై చర్చించాల్సిన ఆవశ్యకత నెలకొంది. మత పెద్దలతో పాటు సంఘాన్ని నడిపే ప్రభుత్వాలు కూడా ఈ సంబంధాలు, కట్టుబాట్ల గురించి ఆలోచించుకోవాలి. ఆ బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలి. దీనినో హెచ్చరికగా రాజకీయ నాయకులు భావించాలి. లేకపోతే దాని పర్యవసానాలను వారు అనుభవించక తప్పకపోవచ్చు. 

స్త్రీని శక్తి స్వరూపం అంటారు. తాజా ఉద్యమ నిర్మాతలు యువతులే. రాజకీయ నేపథ్యంలో ఈజిప్టు, చైనాలలో వచ్చిన ఉద్యమాలకు ఇది భిన్నమైనది. ప్రపంచ చరిత్రలోనే మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. స్త్రీ మేల్కొన్న ఘటన. దీనిని అణచడానికో, వక్రీకరించడానికో ఎవరైనా ప్రయత్నిస్తే మసికావడం ఖాయం. దీనిని ప్రభుత్వాలు అర్థం చేసుకుని సామాజిక మార్పుకు సమకట్టాలి. స్వీయ ఆలోచనలను మార్చుకోవాలి. 'విప్లవ అంచుల్లో మనం ఉన్నాం' అనడానికి ఈ మహిళా ఉద్యమమే నిదర్శనం. పోలీసులపై కూడా తిరుగుబాటు చేయగల శక్తి మన దేశ ఆడపిల్లల్లో వచ్చింది. ఈ దశలో కూడా రాజకీయ నాయకులు కళ్ళు మూసుకుంటే వారి ఇళ్ళలోని శక్తే వారిని హరిస్తుందనడంలో సందేహం లేదు. మన దేశంలో పురుషాధిక్యత గురించి మాట్లాడడం రివాజు. అది రూపుమాయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇక మీద అది మనజాలలేదు. స్త్రీ-పురుషులంతా ఒకటే అనే భావన రావాలి. అదిరాకపోవడానికి కూడా ప్ర

భుత్వాల వైఫల్యమే కారణం. ప్రభుత్వాల పాత్ర గురించి చర్చిస్తే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టిన సంస్కరణలను ఉటంకించవచ్చు. వెట్టి చాకిరి, అంటరానితనం నిర్మూలనకు ఆమె చట్టాలు తెచ్చారు. అవి అమలులోకి వచ్చాక ఎంతో మార్పు. వెట్టి చేయించుకోవాలంటే భయం ఏర్పడింది. అణగారిన వర్గాల వారిని 'ఏరా' అనే దగ్గర నుంచి పేరు పెట్టి పిలిచే వరకు సమాజంలో మార్పు చోటుచేసుకుంది. వేల ఏళ్ళుగా రాని సామాజిక మార్పు కఠిన చట్టాల ద్వారా సాకారమైంది. 

మన భూస్వామ్య వ్యవస్థలో మహిళ లైంగిక దోపిడీకి గురవుతూనే ఉంది. ఆర్థిక, సామాజిక అసమానతలు ఆమెను మరింత బలహీనురాలిని చేస్తున్నాయి. దీని గురించి మతాలు, సంఘాలు పట్టించుకోలేదు. కానీ జాతిపిత మహాత్మా గాంధీ భారతదేశంలో స్త్రీ సగభాగమని చాటారు. మహిళలు లేకుండా స్వాతంత్య్రోద్యమం నడపలేనన్నారు. సంఘనిర్మాణంలో స్త్రీ-పురుషులు సమానమని చాటారు. మహిళలతో మమేకమై దిశానిర్దేశనం చేశారు. ఆ చైతన్యంలో భాగంగానే మహిళలు ముందుకొచ్చి తమ ఆభరణాలను స్వాతంత్య్రోద్యమం కోసం త్యాగం చేశారు. జైళ్ళకు వెళ్ళారు. ఇదే వరవడిలో హరిజనోద్ధరణ, గ్రంథాలయోద్యమం, పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనను గాంధీజీ చేపట్టారు. ప్రతి కోణం నుంచీ ఈ సమాజాన్ని ఆయన చూశారు. ఇప్పటి రాజకీయ నాయకులలో ఆ దృక్పథం కొరవడడమే ప్రస్తుత సామాజిక రుగ్మతలకు కారణమని నిస్సందేహంగా చెప్పవచ్చు. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని నెహ్రూల తర్వాత క్రమంగా దార్శనికత కొరవడుతోంది. ప్రతిదానిని ఆర్థిక, రాజకీయ కుంభకోణంలోనే ఇప్పటి నేతలు విశ్లేషిస్తున్నారు. అందువల్లనే ప్రపంచంలో మరెక్కడా చూడని ఘటన మన దేశంలో చోటుచేసుకుంది. 

ఫ్రాయిడ్‌ని ఉటంకిస్తూ బెర్ట్రండ్ రస్సెల్ 'పవర్' అనే పుస్తకంలో మానవ సమాజం ఏర్పడడానికి స్త్రీ-పురుష సంగమమే ప్రాతిపదిక అన్నారు. ఏకకణ జీవి నుంచి బహుకణ జీవులుగా పరిణమించాయన్నారు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం మానవజాతి ఓ పరిణామ క్రమం. బహుకణ జీవి ఏర్పడినప్పటినుంచి సంగమం (సెక్స్) ప్రాధాన్య అంశంగా మారిపోయిందని ఫ్రాయిడ్ పేర్కొన్నారు. జంతువులు, పక్షులు, జలచరాలు.. వేటికీ దీనినుంచి మినహాయింపు లేదన్నారు. సంగమం అనేది ఓ శక్తిగా ఆయన సిద్ధాంతీకరించారు. ఆ శక్తి వల్లనే మానవ శక్తి ఏర్పడిందంటారు. పరిణామక్రమంలో భాగంగా మానవ రూపం మరోలా మారిపోయినా 'సెక్స్' ప్రాధాన్యం తగ్గదన్నారు. దానిని అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. 'ప్రకృతి ఎంతో అందమైనది. ఇంత అందమైన ప్రకృతిని -మానవుడిని సృష్టించడం ద్వారా దేముడు పాడుచేశాడు' అని పి.వి.నరసింహారావు ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. 

ఆ అనందాన్ని ఆస్వాదించలేక మానవుడు పరిపూర్ణుడు కాలేకపోతున్నాడు. పశుప్రవృత్తి నుంచి బయటపడలేకపోతున్నారు. ఒకటైన యువతీ యువకులను భార్యాభర్తలుగా అన్ని మతాలూ అంగీకరిస్తున్నాయి. వారి సంబంధం పవిత్రమైనది. వారి సంగమం ఉచ్ఛస్థ స్థితికి తీసుకెళ్ళే కార్యక్రమం. ఈ అద్భుత ప్రక్రియలో ఉద్రేకం, శాంతి, ఆనందం ఉంటుంది. అక్కడ ఉండకూడనివి ద్వేషం, అసూయ, అనుమానం, కామ పైశాచికత్వం. అన్ని జీవరాశులకు 'సెక్స్' అనివార్యమని, అది పవిత్ర కార్యక్రమం అనుకుంటే మంచి భావన కలుగుతుంది. స్త్రీ-పురుష సంగమంతోనే సమాజం ఉద్భవిస్తుంది. కానీ ఆ పవిత్ర భావనను విస్మరించి మృగాలం అనుకుంటే 'నిర్భయ' వంటి ఘటనలే పునరావృతం అవుతుంటాయి. 

ఏ సమాజంలోనయినా సక్రమ స్త్రీ-పురుష సంబంధాలే శాంతికి మూలం అవుతాయి. మహిళల రక్షణ కోసం మన దేశంలో చట్టాలు చేశారు. కానీ ఆచరణలో అవి విఫలమయ్యాయి. దానికి ప్రధాన కారణం రాజకీయనాయకులే. 'నిర్భయ' ఘటనానంతర ఉద్యమంలో పురుషుల ప్రమేయం నామమాత్రమే. స్త్రీ శక్తి స్వరూపిణి అని ఉద్యమించిన చెల్లెళ్లు రుజువు చేశారు. 'కొందరు దుష్టుల వల్ల ఇది జరిగింది. దానికి సిగ్గుపడుతున్నాం. ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తాం. రక్షగా నిలుస్తాం' అంటూ పురుషులు ముందుకు వచ్చి ఉంటే.. పరిపూర్ణ ఘటనగా భావించేవారం. పోలీసు చొక్కా పట్టుకు లాగిన ఘటన లక్ష మాటలకు సమానం. దానినుంచి అయినా మన సమాజం నేర్చుకోవలసిన అవసరం ఉంది. మన బిడ్డలు తప్పుచేశారనే జ్ఞానం పొంది కార్మికులు, కర్షకులు, యువకులు, ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. మహిళాలోకం గుర్తించినంతగా ఈ పరిణామాన్ని రాజకీయ నాయకులు గుర్తించలేదు. నిందితులకు కోర్టుల ద్వారా శిక్ష విధించవచ్చు. తక్షణ పరిష్కారంగా 'ఎన్‌కౌంటర్' లాంటి పేరుపెట్టి రూపుమాపవచ్చు. కానీ ఇన్ని కోట్ల మంది మహిళలను ఎవరూ కాపలా కాయలేరు. సమాజ ఉన్నతికి సంబంధించిన అంశమిది. సమాజమే రక్షణ కల్పించాలి. ఆ చైతన్యం ఇళ్ళనుంచే రావాలి. 

స్వీయ అనుభవాన్ని నెమరు వేసుకుంటే.. నా(వ్యాసకర్త) చిన్న తనంలో అక్కతో కలిసి పాఠశాలకు వెళ్ళేవాడిని. మహిళలను గౌరవించడం గురించి అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. కానీ ఇల్లు దాటిన మరుక్షణమే భోజనం క్యారేజీ అక్క చేతికి ఇచ్చేవాడిని. తినడంలో మాత్రం సింహ భాగం నాదే. ఒకసారి పునరావలోకనం చేసుకుంటే, నేనేనా ఇలా చేసింది అనిపిస్తుంది. ఇది ప్రతి ఇంట్లో జరుగుతున్నదే. సమాజం ఈ దశకు ఎందుకు వెళ్ళిందనేది నిపుణులు, మానసిక వేత్తలు విశ్లేషించాలి. 

అంతులేని స్వేచ్ఛ దీనికి కారణం అవుతుందా? అనే అనుమానం రాకపోదు. కష్టించకుండా, దౌర్జన్యంగా సంపద ఆశించడం స్వేచ్ఛాయుత మార్కెట్‌లో పెచ్చరిల్లింది. ఈ రుగ్మత గురించి అంతా ఆలోచించాలి. సమాజ నిర్మాణంపై ప్రతిపార్టీకి స్పష్టత ఉండాలి. ఓటు, డబ్బు, అధికారం అనే మూడు దుర్గుణాలు కలిసి స్త్రీ స్వేచ్ఛను హరించాయనడంలో అతిశయోక్తి లేదు. ఇది ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీనిపై ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్యనేతలంతా మేల్కొవాల్సిన అవసరం ఉంది. సమాజం సరైన ధోరణిలో వెళ్ళడం లేదని వారు తెలుసుకోవాలి. జాతి హితాన్ని అన్ని కోణాల నుంచి చూడకుండా, అధికారమే పరమావధిగా భావించడమే ప్రస్తుత మహిళా ఉద్యమానికి ప్రాతిపదిక. మార్పుకోరుకుంటున్న ప్రస్తుత మహిళా ఉద్యమాన్ని ఆశీర్వదిస్తూ, స్వాగతిస్తూ జేజేలు పలుకుతున్నాను.
- పాలడుగు వెంకట్రావు
శాసనమండలి సభ్యులు

Andhra Jyothi New Paper Dated : 11/1/2013

No comments:

Post a Comment