Monday, January 28, 2013

మృగాళ్లు లేని నిర్భయ సమాజానికి.. - కృపాకర్ మాదిగ - జూపాక సుభద్రప్రజాస్వామ్యంలో దోపిడీని నిర్మూలించే నిరంతర చైతన్యాన్ని అన్ని వర్గాల ప్రజలూ ప్రదర్శించాలి. రాజ్యానికి కోరలిచ్చి, ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడం విషాదమౌతుంది. రాజ్య శిక్షా వ్యవస్థ అవసరం లేని సమాజం నిర్మించుకునే దిశగా దేశ పౌరుల కార్యాచరణ చైతన్యం పెరగాలి. నేర తీవ్రతకి తగిన హేతుబద్ద శిక్షలు మాత్రమే దేశంలో ఉండాలి. నేరాలూ శిక్షలు లేని స్థాయికి, మృగాళ్లు లేని నిర్భయ సమాజ స్థాయికి పౌర సమాజ చైతన్యం పెరగాలి. 

నిర్భయపై లైంగిక, హంతక దాడి తర్వాత పౌర సమాజం ఉలిక్కి పడింది. నాయకురాళ్ళంతా కలత, కలవరం చెందారు. పార్లమెంటేరియన్ అయిన ఒక సీనియర్ సినిమా నటి బోరున విలపించింది. యువతులు, వారి కుటుంబసభ్యులు భయాందోళనలతో నలిగిపోయారు. ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. పౌర సమాజం ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ పెద్దపెట్టున స్వచ్ఛందంగా కదలి నిరసనోద్యమాల చరిత్ర సృష్టించింది. పోలీసులు ఈ నిరసనోద్యమకారులపై ఆంక్షలనూ, నిర్బంధాన్ని ప్రయోగించారు. ఒక దశలో ఢిల్లీలో రాచమార్గాలనూ, రహదారులనూ మూసుకోవాల్సిన పరిస్థితులు ప్రభుత్వానికి ఎదురయ్యాయి. ఈ నిరసన ప్రదర్శనల వెనక అసాంఘిక శక్తుల, సంఘవిద్రోహుల ప్రమేయం ఉందని కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడింది. పోలీసు ఆంక్షలను ధిక్కరించి రోజురోజుకూ పెరిగిన ప్రజల నిరసనాగ్రహాలను చూసి ముఖ్య రాజకీయ పార్టీలన్నీ ఆందోళన చెందాయి.

ప్రజల సత్యాగ్రహాన్ని తమకు అనుకూలంగా మలచుకునే రాజకీయ ప్రయత్నాలు చురుగ్గా సాగించాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ మగ నేరస్థులకు రసాయనికచర్య ద్వారా పుంసత్వం కోల్పోయే శిక్ష ఉండేలా చట్టం తేవాలన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సింగపూర్ నుంచి వచ్చిన నిర్భయ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు లాంఛనాలతో కూడిన అంత్యక్రియల వరకూ దగ్గరుండి పర్యవేక్షించారు. ఢిల్లీ నిరసనల్లో పాల్గొన్న మహిళల మీద బెంగాల్ ఎంపీ, రాష్ట్రపతి ప్రణబ్ తనయుడు అభిజిత్ ముఖర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చిందని అర్ధరాత్రి (ఆడవారు) బయట తిరుగుతారా అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ నోరు జారారు. వీరిద్దరూ నాలుకలు కరుచుకుని తమ అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ విచారం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల చైతన్యం, రాజకీయ పార్టీల వైఖరులు స్త్రీల పట్ల, ప్రజల న్యాయబద్ధ ఆందోళనల పట్ల ఎంత దివాళాకోరుతనంగా, తిరోగమనంగా, కపటంగా, అవకాశవాదంతో కూడుకుని ఉన్నాయో ఈ సందర్భంగా మరోసారి బయటపడ్డాయి. మహిళా ఓటు బ్యాంకుపై ఉన్న ఆసక్తి మహిళల రక్షణ పట్ల రాజకీయ పార్టీలకు లేదనేది మరోసారి తేటతెల్లమయింది.

నిర్భయ సంఘటనకు అవతల ఇవతలగా దేశంలో చాలాచోట్ల బాలికల మీద, యువతుల మీద, గృహిణుల మీద లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయని వార్తలు తెలియజేస్తున్నాయి. సోదరీమణులుగానో, స్నేహితురాళ్ళుగానో, కనీసం సాటి మానవ ప్రాణులుగానో సౌహ్రార్దత, సహకారం, స్నేహభావం, అభిమా నం బాలికలపైన, స్త్రీలపై చూపించాల్సిన స్థితి నుంచి వైదొలగిన మగవాళ్లు మృగాళ్లుగా మారి ఆడవారిపై లైంగిక, హంతక దాడులకు తెగబడుతున్నారు. ఇటువంటి వారి మైండ్‌సెట్‌ల నిర్మితి, కారణాలు, ప్రభావాలను గుర్తించాలి.

(అ) పిల్లలు మేజర్లు కాగానే అత్యధికులు ఆర్థిక స్వతంత్రులు కాలేక పోతున్నారు. ఇష్టమొచ్చిన చదువు/నైపుణ్యాలను సంపాదించడానికి, ఇష్టమొచ్చిన వృత్తిలో ప్రవేశించడానికి, ఇష్టమొచ్చిన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి తగిన ప్రోత్సాహంలేక తరచూ తల్లిదండ్రులు, సమాజం నుంచి, కట్టుబాట్ల పేరుతో ఆంక్షలు, నియంత్రణలు, తిరస్కారాలను ఎదుర్కోవలసి వస్తున్నది. (ఆ) చదువు, వృత్తి, పెళ్ళి అంశాల్లో తమ కిష్ట మున్నట్లు నడుచుకుంటేనే తమ ఆస్తిపాస్తులకు హక్కుదార్లవుతారు, లేకపోతే కారు అనే విధంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలపై ఆంక్షలు పెడుతున్నారు. ఒత్తిళ్లు తెస్తున్నారు. (ఇ) చాలామంది తల్లి దండ్రులు పిల్లల్ని తమ భవిష్య నిధులుగా, భవిష్యత్ సంరక్షకులుగా, వారసత్వ జీవార్జితంగా పరిగణిస్తున్నారు. (ఈ) చాలామంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తమ పిల్లలు తమని ఆదరించరేమోననే భయాల నుంచి పిల్లల స్వతంత్ర జీవనాధారాలను కట్టడి చేస్తున్నారు. (ఉ) అబ్బాయిలకు ప్రత్యేక సౌకర్యాలు, అమ్మాయిలకు పరిమితులు, కష్టాలు పంచే పెంపకాలు ఇళ్ళలో జరుగుతున్నాయి. పెంపకం తీరు లింగ వివక్షలకు, వ్యత్యాసాలకు బలమైన పునాదులను ఏర్పరస్తున్నాయి.

అధికులుగా, కూడికలుగా అబ్బాయిలను చూడటం, అధములుగా, తీసివేతలుగా అమ్మాయిలను ట్రీట్ చేసే పెంపకం, దృష్టికోణం, కుటుంబ వ్యవస్థలో, సమాజంలో సర్వసాధారణమయింది. (ఊ) కొడుకు తల్లిదండ్రులను పున్నామనరకం నుంచి తప్పిస్తాడనే హిందూ ధర్మ భావన మగజన్మకి అంతులేని ప్రాధాన్యాన్ని కల్పించింది. ఆడజన్మ ప్రాధాన్యాన్ని తృణీకరించింది. (ఎ) ఆర్థికంగా తల్లిదండ్రులపై ఆధారపడే తత్వం, సోమరితనం, నిరుద్యోగం యువతలో బాగా పెరిగింది. (ఏ) యువతుల్లో, ఆడపిల్లల్లో కుటుంబ వ్యవస్థ, సమాజం న్యూనతా భావాన్ని, అంతులేని అశక్తతని పెంచింది. (ఐ) లైంగిక కోర్కెలను నిగ్రహించుకోవాలి, తీర్చుకోవడం తప్పు అనే సంఘనీతి వలన యువత లైంగిక సహజాతాలను అణచి పెట్టుకోవాల్సి వస్తున్నది. లేదా వక్రమార్గాలు తొక్కి లైంగిక నేరాలకు పాల్పడుతున్నది. (ఒ) అతిశయించిన అల్లరి చేష్టల(వేధింపుల)తో నయినా నాయికలను 'అనుకూలం' చేసుకొనే హీరో పాత్రలుండే సినిమా దుష్ట సంస్కృతి ప్రభావం యువకుల్లో పెరిగింది. 

(ఓ) మనుషులుగా మగవారికంటే తక్కువ అనే హీన భావనలు కలిగిన కొందరు మగవాళ్లు మహిళలపై లైంగిక, హంతక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరస్థులంతా ఒక్కరోజులో తయారైనవారు కారు. స్త్రీలను అగౌరవపరిచే స్త్రీలపై వివక్ష, అణచివేతను ప్రదర్శించే వ్యత్యాసాలు, అసమానతలకు తావు కల్పిస్తున్న మగ దురహంకార హీన సంస్కృతే ఇలాంటి మగదురహంకార నేరస్థులను సృష్టిస్తున్నది. (ఔ) సగం ప్రపంచమైన తల్లి జాతి పట్ల గౌరవంతో, స్నేహంతో, సానుకూలతతో ప్రేమతో, సమానత్వంతో మెలగాలనే విజ్ఞతను కొందరు మగాళ్లు కోల్పోయారు. రోగగ్రస్తమయ్యారు. నేరపూరితమయ్యారు. ఇందుకు కారణం వీరు మాత్రమేనా? ఇలాంటి సంస్కృతిని మొక్కగా మొలకగా మురిసే వారు, మానుగా ప్రోత్సహించేవారు, ప్రతిఘటనని ప్రదర్శించని వారు కూడా కారకులేనని భావించక తప్పదు. ఇది పెద్ద సామాజిక, లింగ, రాజకీయ విషాదం. ఇందుకు పురుషాధిక్య సమాజం మూల్యం చెల్లించుకోక తప్పదు. నిర్భయ సంఘటన నేపథ్యంలో దళితేతర సమాజం నుంచి వెల్లువెత్తినన్ని నిరసనలు, వెల్లడైనంత సంఘీభావం దళిత, ఆదివాసీ స్త్రీలపై దాడులు జరిగినప్పుడు వ్యక్తంకాకపోవడం చాలా బాధాకరం. 

వాకపల్లిలో ఆదివాసీ స్త్రీలపై అత్యాచారాలు జరిగినప్పుడుగానీ, గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న ఊచకోతలు, అణచివేతలప్పుడుగానీ; కారంచేడు, ఖైర్లాంజి, లక్షింపేటల్లో దళిత అలీసమ్మ, రాముడమ్మ, పింకి మొదలగు వారిపై హంతక దాడులు, హత్యలు జరిగినప్పుడుగానీ; ఇటీవల హర్యానాలో వరసగా దళిత బాలికలు, స్త్రీలపై జరిగిన లైంగికదాడుల సందర్భంగా గానీ వెలుపలి సమాజం నుంచి సంఘీభావం పెద్దగా వ్యక్తం కాలేదు. పల్లెల్లో, పని స్థలాల్లో దళిత, ఆదివాసీ స్త్రీలపై నిత్యం జరుగుతున్న లైంగిక, హంతక దాడుల నేపథ్యంలో ఇప్పటి లాంటి సంఘీభావం అందివుంటే బాధితురాళ్ళయిన ఆదివాసీ, దళిత మహిళలకు కొద్దిమేరకైనా న్యాయం జరిగి ఉండేది. కానీ దళితేతర సమాజం నుంచి గట్టి సంఘీభావం వెల్లడికాకపోవడం వెనక కేవలం కుల గీతలు, కుల వివక్షలే కారణాలని చెప్పుకోక తప్పదు.

సోషల్ కాస్ట్రేషన్ (సామాజిక లింగాధిపత్యాన్ని తొలగించడం) అవసరమని పాత్రికేయ మిత్రుడు రమేష్ హజారే సరిగ్గానే చెప్పాడు. కూడు, గూడు, గుడ్డ అని నినదించి పథకాలు ప్రవేశపెట్టాయని, ఇదే మాదిరిగా నిద్ర, మైథునం కొరవడిన బానిసలకు అవి అందించే పథకాలనూ ప్రవేశపెడితే సమాజంలో లైంగికనేరాలు తగ్గుతాయేమో ప్రభుత్వాలు పరిశీలిస్తే బాగుంటుందని మరో సీనియర్ పాత్రికేయుడు అభిప్రాయపడ్డాడు. కొన్ని సమాజాల్లో పిల్లలు యవ్వనంలోకి ప్రవేశించగానే లైంగిక స్నేహాలు చెయ్యడానికి, స్త్రీపురుషులు పరస్పరం కలిసి జీవించే వ్యక్తిగత స్వేచ్ఛ కలిగివున్నారు. కొన్ని సమాజాల్లో భార్యాభర్తలు లేదా స్త్రీ పురుషులు విడిపో యే సందర్భాలనూ సెలబ్రేట్ చేసుకోవడం, స్నేహంగా విడిపోవడం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల వల్లనేమో మన సమాజంలో జరుగుతున్న స్త్రీ జాతి నిర్మూలన స్థాయి తీవ్రనేరాలు అక్కడ జరగడం లేదనిపిస్తుంది.

మన దేశంలో స్థానిక దోపిడీదారులు (భూస్వాములు, వారి సంతతి) బహుజనులపై రాజ్యం చేస్తున్నారు. దేశ ప్రజలకు ప్రధాన శత్రువు సామ్రాజ్యవాదమనే బూచీనిచూపెట్టి, ఆర్థిక, రాజకీయ, సామాజిక, లింగ, మైనారిటీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక తదితర అన్నిరంగాల్లో వారు చేస్తున్న దోపిడీలను కప్పిపెడుతున్నారు. ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. దేశంలోని వీరి వ్యవస్థీకృత దోపిడీకి పుట్టిన ఒకానొక పిలకే ఇప్పటి మగ దురహంకార మృగస్వామ్యం. దేశంలోని మధ్యతరగతికి మృగస్వామ్య దోపిడీ వ్యవస్థను మూలాలతో సహా నిర్మూలించే లోతైన కార్యాచరణ లోపించింది. స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడుతున్న నేరస్థులకు రాజ్యమే ఉరిశిక్ష విధించాలి అనేదాకా పోయి చేష్టలుడిగి బిక్కచచ్చి కూర్చొన్నది. ఇదెలా ఉందంటే వెనకటికి సినిమాల్లో హీరోల సాహస కృత్యాలకు ఈలలు, చప్పట్లు, కేకలతో హర్షధ్వానాలు చేసే జానపద ప్రేక్షకుల్ని తలపిస్తున్నది. ప్రజాస్వామ్యంలో దోపిడీని నిర్మూలించే నిరంతర చైతన్యం, ప్రతిఘటనని అన్ని సెక్షన్ల ప్రజలూ ప్రదర్శించాలి. రాజ్యానికి కోరలిచ్చి, ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడం విషాదమౌతుంది. రాజ్య శిక్షా వ్యవస్థ అవసరం లేని సమాజం నిర్మించుకునే దిశగా దేశ పౌరుల కార్యాచరణ చైతన్యం పెరగాలి. 

నేర తీవ్రతకి తగిన హేతుబద్ద శిక్షలు మాత్రమే దేశంలో ఉండాలి. అత్యాచారాలకు ఉరిశిక్షలు వెయ్యాలనడం వాంఛనీయం కాదు, రాజ్యానికి కోరలు తేవడమే అవుతుంది. అరుదైన నేరాలకు ఉరిశిక్ష ఉండాల్సిందే అంటున్న కేంద్ర ప్రభుత్వం చివరికి తన ఉరి కత్తిని బలహీనమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, లింగ నేపథ్యాలున్న నేరస్థుల మెడలపైకే తెస్తుంది. బలమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాలున్న నేరస్థులను వదిలివేసే ప్రమాదముంది. గ్రీకు రాజనీతి తత్త్వవేత్త సోక్రటీసు రాజ్యం ధర్మబద్దంగా ఉండాలన్నాడు. అందుకని రాజ్యమే ధర్మం అన్నాడు. తన హేతువాద భావాల ఉపన్యాసాలతో రాజ్యం లోపాల్ని ఎత్తిచూపి ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న సోక్రటీసును అప్పటి గ్రీకు నగర ప్రజాస్వామ్య రాజ్యం ప్రమాదకారిగా గుర్తించింది. క్రీ.పూ. 399లోనే సోక్రటీసుకు మరణశిక్ష విధించింది. ఇప్పటి మన ప్రజాస్వామ్య రాజ్యంలో పౌరులు ప్రాణాలు కోల్పోబోయే సోక్రటీసులు కారాదు. నేరాలూ శిక్షలు లేని స్థాయికి, మృగాళ్లు లేని నిర్భయ సమాజ స్థాయికి పౌర సమాజ చైతన్యం పెరగాలి. ఎదగాలి.

- కృపాకర్ మాదిగ
ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి
- జూపాక సుభద్ర
రచయిత్రి

Andhra Jyothi Telugu News Paper Dated: 29/1/2013

No comments:

Post a Comment