Sunday, January 20, 2013

'చరిత్ర'కు సవాల్ లంబాడా చరిత్ర ---బత్తుల కార్తీక్ నవయాన్



సింహాలనుంచి చరిత్రకారుడు ఉద్భవించేవరకు వేటగాడు చెప్పే పిట్టకథలు, కట్టుకథలే చరిత్రగా చలామణి అవుతాయన్నది ఆఫ్రికన్ సామెత. ఈ దేశంలో ఆదిమజాతులు, ఆదిమకులాలు తమ తమ చరిత్రలను తిరగరాస్తున్న సమయమిది. అంటరానితనం, అవమానాల పెనుమంటల పెనుగులాటలో నుండి తమ గతాన్ని తవ్వి 'ఇదిగో ఇదీ మా చరిత్ర' అని వర్తమాన చరిత్రకారుల డొంకతిరుగుడు వాదనలకు సవాల్ విసురుతున్న నూతన చరిత్రకారుల యుగమిది.

ఇప్పుడు పేదలుగా, అంటరానివారుగా, కేవలం ఓటర్లుగా, ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వివిధ పథకాలకోసం ఎదురు చూసే అర్భకులుగా ఉన్న ఆదిమజాతుల గత చరిత్ర ఏమిటి? నాలుగైదు వందల సంవత్సరాల క్రితం కూడా వారు ఇలాగే ఉన్నారా? వారి బ్రతుకులు ఇలాగే ఉన్నాయా? తదితర అనేక ప్రశ్నలకు ప్రస్తుతం చలామణిలో ఉన్న చరిత్రకారుల వద్ద సమాధానం లేదు. ఇది మన ప్రస్తుత విద్యావ్యవస్థలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది. నిజానికి తమ తాతలు, తండ్రులు ఈ దేశంలోని అడుగుకులాలపై, జాతులపై సాగించిన అమానవీయ దోపిడీ దౌర్జన్యాలను అగ్రకుల చరిత్రకారులు చరిత్రగా రికార్డు చేయాలి. కానీ అంత నీతి, నిజాయతీ గలిగిన చరిత్రకారులు దుర్భిణీ వేసి వెతికినా దొరకరు. అందుకే అడుగుకులాలు, జాతులు తమ తమ చరిత్రలను తవ్వి తీయవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది.

ప్రొఫెసర్ భుక్యా భంగ్యా రాసిన 'నిజాంపాలనలో లంబాడాలు' (అణచబడిన సంచారులు)పుస్తకం ఆ కోవలోదే. ఇది పి.హెచ్.డి పరిశోధన గ్రంథం. మూడేళ్ల క్రితం ఇంగ్లీషులో ప్రచురించబడి ఇప్పుడు తెలుగులోకి అనువాదమైంది. అణచబడిన, అంటరాని జాతుల చరిత్రను విద్యారంగ పరిధిలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి పుస్తకం ఇది.
ఒకప్పుడు స్వయంసమృద్ధిగా రాజీలేని జీవితం గడిపిన ఆదిమజాతులు ఆ తర్వాత వెనుకబడిన జాతులుగా మిగిలిపోయాయి. ఈ దుస్థితికి వలసపాలకులే కాదు, వారితో షరీకైన స్థానిక అధికారులు కూడా ఎంతో కారణం. ఈ చారిత్రక పరిణామాన్ని పట్టి ఇచ్చేదే ఈ పుస్తకం. గతంలో పశువులద్వారా రవాణారంగాన్ని నిర్వహించిన లంబాడాలు టెక్నాలజీ ప్రవేశంతో కూలీలుగా మారిపోయారు. బ్రిటీష్ వారు తీసుకొచ్చిన చట్టాలతో నేరస్త జాతిగా ముద్రపడ్డారు. ప్రధానంగా హైదరాబాద్ డక్కన్‌లోని లంబాడా జాతి తన సాంస్కృతిక వైవిధ్యాన్ని కోల్పోయి కన్న బిడ్డలను కూడా అమ్ముకునే దుర్భర పరిస్థితులకు ఎలా లోనయ్యిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.
- బత్తుల కార్తీక్ నవయాన్
నిజాం పాలనలో లంబాడాలు
భంగ్యా భుక్యా, అనువాదం : ఆకెళ్ళ శివప్రసాద్
వెల : రూ 80, పేజీలు : 158,
ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 040-23521849

No comments:

Post a Comment