ఒక ఉద్యమానికి నెలబాలుడు అని చెప్పుకుంటూనే తానే తెరచాప అయినవాడు, చరిత్ర గమనాలు గతులూ కవిత్వంలో అక్షరబద్దం చేసినవాడు, ఏ నావను నడపాలనుకున్నాడో ఆ నావ నుంచి అర్ధాంతరంగా తానే దిగాడా? యేరు దాటినవాళ్లు ఆ నావను తగలబెట్టారా? ఇంకా కాలనాళికలో పోస్టుమార్టం జరుగుతూనే ఉంది. ఒక వింత చర్చలో సత్యమూర్తి గతాన్ని పాతరేసారు సహచరులూ శత్రువులూ. ఒకరికి సత్యమూర్తి కావాలి, మరొకరికి శివసాగర్ కావాలి. ఇదో అసంబద్ధ నాటకం. ఇక్కడ ఎవరి భాష్యాలు వారివే.
శివసాగర్ తాను నడిచిన నేలంతా పోరాట బీజాలు చల్లిపోయాడు. వ్యక్తిగత జీవితం లేకుండా ఒక మెరుగైన మానవీయ సమాజాన్ని కల ్జకని ఒక ప్రత్యామ్నాయ ఆలోచనా స్రవంతిని ఈ లోకానికి అందించి మననుంచి వెళ్లిపోయాడు. ఒక పరిశోధక విద్యార్థిగా నాకున్న అవగాహన ప్రకారం ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా విప్లవ సాహిత్యాలలో శివసాగర్‌కు ఉన్న సైద్ధాంతిక దృక్పథం సుదీర్ఘ విప్లవ రాజకీయాలలో ఉన్న అనుభవంతో పాటుగా దానికి సమాంతరంగా విప్లవ సాహిత్య సాంస్కృతిక అవగాహన చాలా కొద్దిమందికి మాత్రమే ఉందని నిర్ద్వందంగా చెప్పవచ్చు.
తెలుగు సాహిత్య లోకంలో ఉన్న పండితులు ప్రబంధ సాహిత్యం లో, బ్రాహ్మణీయ ప్రతీకలు వాడుకుంటున్న సమయంలో, యుగాలను కవులకు అరువు ఇస్తోన్న సంక్షుభిత కాలంలో, ప్రజలకు చెప్పాలనుకున్న విషయాన్ని వాళ్లలోంచే నేర్చుకొని జీవితాంతం పీడిత ప్రజల కోసమే కవిత్వాన్ని రాసి విప్లవ రాజకీయాలకు కేవలం ఆర్థిక పునాది మాత్రమే కాదు సాంస్కృతిక పునాది కూడా ముందు ఉండాలి అని, ఆ క్రమంలో మౌఖిక కళారూపాల ద్వారా విప్లవ భావజాల ప్రచారం చేయాలనే సత్యమూర్తి సైద్ధాంతిక దృష్టి, విప్లవ సాహిత్య, సాంస్కృతిక రంగాలకు దిశానిర్దేశం చేసింది. ఇలా శివసాగర్ అరుదైన సాంస్కృతిక సంపదను లోకానికి అందించాడు.
ఆ క్రమంలో దళిత సౌందర్య శాస్త్రానికి ఒక బలమైన స్థానిక ప్రతీకలు వాడుకొని 'ఇంతకాలం దళిత సాహిత్యం కేవలం ఇంద్రియ జ్ఞానానికి కట్టుబడి వుండటం వల్ల, దళిత సమస్యను చారిత్రక రాజకీయ తాత్విక దృక్పథం నుండి వీక్షించకపోవడం వల్ల, ఆ సాహిత్యం సంక్షోభంలో పడిపోయింది' అని హెచ్చరించాడు. అంతేకాకుండా ఇది విప్లవ వాదానికీ, స్త్రీవాదానికి కూడా హెచ్చరికగా వుండాలి అన్నాడు.
ఆయన ఎన్ని రాజకీయ పార్టీలు మారినా, ఎంత రాజకీయ సంక్షోభానికి గురైనా, తన జీవితం అంతా అతి నిర్మలంగా, స్వచ్ఛంగా నిజాయితీగా గడిపాడు. సాంప్రదాయ, విప్లవ కమ్యూనిస్టు శిబిరాల్లో కుల సమస్యపై తమ అవగాహనను మార్చుకోవాలి అని ఆనాడు ఆయన చేసిన ఒంటరి పోరాటం ఒక స్ఫూర్తిదాయకం.
తత్ఫలితంగా, కమ్యూనిస్టు పార్టీలలో కుల చర్చ ఒక అనివార్యతను సంతరించుకుంది. సమాజంలో ఉన్న కులతత్వం కమ్యూనిస్టు పార్టీలలో ప్రవేశించిన తీరును ఎండగడుతూ తాను చేసిన అంతర్ బహిర్గత పోరాటానికి పరిష్కార మార్గాలు వెతుకులాడే క్రమంలో ఆయన నుండి కొన్ని తప్పులు దొర్లిన మాట వాస్తవమే కానీ, జీవితాంతం తాను పడిన తపన, నిరాడంబరత్వం కుహనా ప్రోగ్రెసివ్ శక్తులకు అప్రదానం అయింది. వామపక్ష, విప్లవ శిబిరాల్లో ఇదో విషాద పార్శ్వం.
వర్తమాన కాలంలో అగ్రకుల బ్రాహ్మణీయ ప్రోగ్రెసివ్ శక్తులు రాజకీయంగా ఎంత దిగజారినా, వాళ్లు చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి వారి వ్యక్తిగత జీవితంలో కొనితెచ్చుకున్న నిరాడంబర జీవితాన్ని అడ్డుపెట్టి వారిని గ్లోరిఫై చేస్తూ మహనీయులుగా కీర్తిస్తున్నారు. చరిత్ర నిర్మాణంలో స్థానం లభిస్తోన్న ప్రతి వ్యక్తి వెనుక కులం ఉంది అనేది చారిత్రక సత్యం. అలా శివసాగర్ తన జీవితాంతం ఉన్న నిజాయితీ, సాహితీ సృజన, సైద్ధాంతిక పటిమను అప్రదానం చేస్తూ అతన్ని ద్రోహి గా నిలబెట్టాలని బ్రాహ్మణీయ అగ్రకుల మేధావులు కుట్ర చేశారు.
నాల్గు దశాబ్దాలకు పైగా జరిగిన అతని ప్రస్థానంలో శివసాగర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తన రాజకీయాలలో భాగమైనారు. చివరికి ఆయన చనిపోయినపుడు ఆరడుగుల నేల సంపాదించుకోలేకపోవడం ఎంత బాధాకరం! లారీడ్రైవర్‌గా పనిచేస్తున్న తన పెద్ద కొడు కు సిద్దార్థ రెండు అద్దె గదులలో శివసాగర్‌ని చివరి రోజుల్లో సాకాడు.
ఆయన చనిపోయినప్పుడు ఇంట్లో స్థలం సరిపోకపోతే ఎదురుగా ఉన్న ఒక పాడుబడ్డ చర్చిలో పార్ధివ దేహాన్ని ఉంచాల్సిన దుస్థితి దాపురించడానికి కారణం కేవలం అతని నిస్వార్థపరత్వం, దళిత కుటుంబంలో పుట్టడమే. అలాంటి దుస్థితి ఏ విప్లవ నాయకుడికి వచ్చినా అది అవమానమే. కానీ ఇది కేవలం దళిత విప్లవకారుల విషయంలోనే ఎక్కువగా ఎందుకు జరుగుతుందో కారణాలు కావాలిప్పుడు.
ఇప్పుడిక్కడ ఏం బాగాలేదు శివసాగర్! విప్లవ సాహిత్య వీధుల్లో క్షుద్ర సాహిత్యం బొందల్లోంచి జీవం పోసుకుంటోంది. దళారుల పెరటి తోటలో కొత్త కన్ఫెషన్స్ మొగ్గలు తొడుక్కుంటున్నాయి. ఆనాడు 'నన్నయ్యను నరేంద్రుని బొందలోనే నిద్రపోని'వ్వమన్నవాళ్లు ఇవ్వాళ గురజాడనే ఆధునికతకు ఆద్యుడు అని జంధ్యం పోగులు పేనుతున్నారు. ఇక్కడ నేడు విప్లవోద్యమ చరిత్రను యూదా ఇష్కారియోతు లే రాయడానికి పునర్జన్మ లెత్తుతున్నారు. ఇప్పుడు ఇక్కడ లేకపోవడమే బాగుందిలే శివసాగర్!
ఒకసారి ఆయన కూతురు శ్రీదేవి మాట్లాడుతూ... 'మా నాన్న మా కెవరికీ చెప్పకుండానే తన దారి, గమ్యం ప్రజల్లో చూసుకున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత చిక్కిశల్యమై డస్సిపోయి ఇంటికి వచ్చాడు. మేము చిన్న పిల్లలుగా ఉన్నపుడు వెళ్లాడు. మాకు తల్లీ, తండ్రీ అన్నీ మా అమ్మ మాత్రమే' అని గద్గద స్వరంతో చెప్పింది. "ఇది పెట్టుబడిదారీ సమాజం. ఇక్కడ కీర్తి కూడా పెట్టుబడిగా మారబడుతోంది. అది అత్యంత దయనీయమైన అవాంఛనీయమైన స్థితి. అలా అనే నా సాహిత్యాన్ని నేను అచ్చు వేసుకోలేదు'' అం టూ కిక్కిరిసిన హైదరాబాద్, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నావైపు వేలు చూపు తూ "అగో! ఆ మూల కూర్చున్న అతనే ఈ పుస్త కం వేశాడు'' అని అన్నా డు. అది ఇంకా నా కళ్లల్లో మెదులుతూనే ఉంది...
చివరగా ఆయన ఇష్టం గా పాడుకునే పాట-
'నా మల్లియ రాలెను! నీ మొగిలి కూడా రాలెను! నా మల్లియ నీ మొగిలి ఆకాశం చేరెను! ఆకాశం చేరెను!!' శివసాగర్! నువ్వు భారతీయ విప్లవోద్యమంలో ఆకాశం చేరిన ధృవతారగా దిక్కు చూపే చుక్కలా ఎప్పటికీ ఉంటావు. నీకిదే రెడ్ శెల్యూట్.
- గుర్రం సీతారాములు
9951661001
(శివసాగర్ కవిత్వం మూడవ ముద్రణ ముందుమాటలోంచి కొన్ని భాగాలు)
Andhra Jyothi Telugu New Paper Dated: 14/1/2013
No comments:
Post a Comment