Monday, December 31, 2012

అగ్రకులతత్వంతో అధ్యాపక స్పందన - డేవిడ్, వంగపల్లి శ్రీనివాస్, కంతి జగన్, మర్పల్లి ఆనంద్



ఉస్మానియా యూనివర్సిటీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అధ్యాపకులను, అధికారులను మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు అనేక సార్లు అవమానించి, భౌతిక దాడులకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేసినప్పుడు ఔటా నాయకులు ఎందుకు స్పందించలేదు? అనేక మంది ప్రొఫెసర్లపై మతోన్మాద విద్యార్థులు దాడులకు పాల్పడినప్పుడు రాజీనామాలు చేయని అగ్రవర్ణ డీన్‌లు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఇప్పుడే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారో వివరించాలి. 

భ్రష్ఠత్వానికి పరాకాష్ట (డిసెంబర్ 20, ఆంధ్రజ్యోతి) అన్న వ్యాసంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయునిపై ఒక విద్యార్థి దాడిచేసిన విషయాన్ని ఖండిస్తూ అఖిలేశ్వరి గారు చర్చను లేవనెత్తారు. ఆ వ్యాసంలో లేవనెత్తిన విషయాన్ని కాస్త సీరియస్‌గా పరిశీలిస్తే ఆ వ్యాసకర్తలో ఎక్కడో ఒక దగ్గర అగ్రకుల భావజాలం పనిచేసిందనేది స్పష్టమౌతుంది. ఎందుకంటే మొన్న విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనను వ్యాసకర్త ఖండిస్తూ పరుషమైన పదజాలంతో విమర్శిస్తూ ఒక వర్గం విద్యార్థులపై విరుచుకపడి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 'మన కళ్లముందే జరుగుతున్న విషాదానికి మనమందరమూ బాధ్యత వహించాలని, ఇది యావత్ సమాజాన్ని దిగజారుస్తోంది, సమాజంలోని ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తోందని' ఆవేదన వ్యకం చేశారు. సమాజంలోని ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నం చేసే స్థాయిలో ఆ ఘటన జరిగిందా అనేది సీరియస్‌గా చర్చించాలి. నిజానికి ఉపాధ్యాయునిపై దాడి జరగడానికి కారణాలు ఏమిటనేది ఆలోచించకుండా చర్చలు లేవనెత్తితే విషయం పక్కదారి పట్టి, ఒక వర్గం విద్యార్థులను అపార్థం చేసుకొనే అవకాశం ఉంటుంది. అఖిలేశ్వరి గారి చర్చ అలాగే ఉంది. మొన్న విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయునిపై జరిగిన దాడిని అక్కడ ఉన్న విద్యార్థులందరూ ఖండించారు. దాడికి పాల్పడిన అలెగ్జాండర్ అనే విద్యార్థి వైస్ ఛాన్స్‌లర్ ముందే ఆ ఉపాధ్యాయునికి క్షమాపణలు కూడా చెప్పాడు. తను ఏ బలహీన క్షణంలో దాడికి పాల్పడిందీ వివరించాడు.

గతంలో తన సోదరి స్నేహితురాలు ఉపాధ్యాయుని వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుర్తొచ్చి తాను భావోద్వేగానికి గురయ్యానని వివరించాడు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు. ఇంత జరిగాక తన తప్పును ఒప్పుకున్న విద్యార్థిని పెద్దమనసుతో క్షమించాల్సిన ఉపాధ్యాయులు ర్యాలీలు తీస్తూ, మీడియాకు ఎక్కుతూ, ఈ దాడులకంతటికీ ఒక వర్గం విద్యార్థులే కారణం అంటూ దుష్ప్రచారం చేయడం ఆ వర్గాల విద్యార్థులను అవమానించడమే అవుతుంది. నిజానికి దాడికి పాల్పడిన విద్యార్థికి కానీ, ఆ ఘటన సందర్భంగా అక్కడ ఉన్న విద్యార్థులకు కానీ గతంలో ఉపాధ్యాయులను వేధించిన చరిత్ర కానీ, దాడులు చేసిన చరిత్రకానీ లేదు. ఈ ఘటన జరిగిన తర్వాత దాడికి గురైన అధ్యాపకుడు, నాపై దాడికి పాల్పడిన విద్యార్థి క్షమాపణలు చెప్పడం, అరెస్టు కావడం జరిగింది కనుక ఇంతటితో నేను ఈ విషయాన్ని వదిలేస్తున్నానని చెప్పాడు. యూనివర్సిటీలోని మెజారిటీ అధ్యాపకులు కూడా ఈ విషయాన్ని ప్రొఫెసర్, విద్యార్థులు కూర్చొని సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలని కూడా సూచిస్తున్నారు. కానీ తమ స్వప్రయోజనాలను రక్షించుకొనేందుకు ఔటా నాయకులు ఆ దాడిని ఒక సాకుగా తీసుకొని అగ్రవర్ణ భావజాలంతో ర్యాలీలు తీస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య వైషమ్యాలు పెంచి తమ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారు.

అయితే గతంలో ఇదే విశ్వవిద్యాలయంలో కొందరు ప్రొఫెసర్స్‌పై విద్యార్థులు దాడులకు పాల్పడిన సంఘటనలపై ఈ అధ్యాపకులుగానీ, ఉపాధ్యాయ సంఘం(ఔటా)గానీ స్పందించిన తీరును కూడా చర్చించాలి. మరికొద్ది సంవత్సరాల్లో ప్రథమ శతాబ్దిని పూర్తిచేసుకోబోతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేకమంది బడుగు, బలహీన వర్గాల ఉపాధ్యాయులు ఒక అగ్రవర్ణ విద్యార్థి సంఘం చేతిలో అనేక అవమానాలు, దాడులకు గురయ్యారు. గతంలో ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఒక ప్రొఫెసర్‌పై అగ్రవర్ణ విద్యార్థి సంఘానికి చెందిన కొందరు విద్యార్థులు దాడిచేసి ఆయనను గాయపరచడం జరిగింది. అంతేకాకుండా ఆ ప్రొఫెసర్ భార్యను, కూతురును అవమానిస్తూ కావేరి హాస్టల్ గోడలపై రాతలు రాశారు. ఆయన తోటి ఉపాధ్యాయుల దగ్గర తన బాధను, తనకు జరిగిన అవమానాన్ని వివరించాడు. కానీ ఆ ప్రొఫెసర్‌కు ఏనాడూ ఉపాధ్యాయ సంఘం (ఔటా) మద్దతు తెలుపలేదు. ర్యాలీలు తీయలేదు. దాడికి పాల్పడి, అవమానించిన విద్యార్థి సంఘంపై చర్యతీసుకోలేదు. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో చీఫ్ వార్డన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ కేశవులును అగ్రవర్ణ విద్యార్థి సంఘం తమ కార్యక్రమాల కోసం చందాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

అందుకు అంగీకరించని ప్రొఫెసర్‌పై ఆ విద్యార్థి సంఘ నాయకులు ఆయనపై 'సాంబారు' పోసి కొట్టి, అవమానించారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా ప్రొఫెసర్ కేశవులు ఆనాడు ధర్నా నిర్వహించారు, బాధ్యులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని వీసీకి మొరపెట్టుకున్నారు. ఒక ఎస్సీ ప్రొఫెసర్‌పై దాడులకు పాల్పడిన విద్యార్థులపై చర్య తీసుకోవాలని యూనివర్సిటీలో వామపక్ష, ఎస్టీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఆనాటి వీసీ కానీ ఔటా కానీ చర్య తీసుకోవాలని డిమాండ్ చేయలేదు. ఇదే యూనివర్సిటీలో లా కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న గిరిజన ప్రొఫెసర్ పంతునాయక్‌ను ఏబీవీపీ విద్యార్థి సంఘానికి చెందిన విద్యార్థులు చెప్పులతో కొట్టి, అవమానించినా ఏనాడూ కనీసం ఔటా నాయకులు ఖండించనూలేదు. మైనారిటీ వర్గానికి చెందిన ఒక ప్రొఫెసర్ తన విద్యార్థినితో క్లాస్ రూంలో సబ్జెక్ట్ విషయమై చర్చిస్తుంటే ఇదే మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు ఉపాధ్యాయునికి, విద్యార్థికి మధ్య లైంగిక సంబంధాన్ని అంటగట్టి అవమానించి కొట్టడం జరిగింది.

మొన్నటికి మొన్న ఆర్ట్స్ కాలేజీలో ఏబీవీపీకి చెందిన ఒక విద్యార్థి మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే మందలించిన లేడీ ప్రొఫెసర్‌ను ఆ విద్యార్థి దుర్భాషలాడి, అవమానిస్తే ఆ ప్రొఫెసర్ ఎగ్జామ్ హాల్ నుంచి ఏడ్చుకుంటూ నిష్క్రమించింది. ఇలాంటి ఘటనలు విశ్వవిద్యాలయంలో గత కొన్నేళ్లలో అనేకం జరిగినప్పటికీ ఏనాడూ ఖండించని ఔటా నాయకులు, అధికారులు మొన్న జరిగిన ఘటనను మాత్రం పెద్దది చేసి ఒక వర్గం విద్యార్థులను శత్రువులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే మేము యూనివర్సిటీ అధికారులను, ఔటా నాయకులను ప్రశ్నిస్తున్నాము. యూనివర్సిటీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అధ్యాపకులను, అధికారులను మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు అనేక సార్లు అవమానించి, భౌతిక దాడులకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేసినప్పుడు ఔటా నాయకులు ఎందుకు స్పందించలేదో వివరించాలి. అనేక మంది ప్రొఫెసర్లపై మతోన్మాద విద్యార్థులు దాడులకు పాల్పడినప్పుడు రాజీనామాలు చేయని అగ్రవర్ణ డీన్‌లు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఇప్పుడే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారో వివరించాలి.

అనేక సందర్భాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధ్యాపకులు దాడులకు గురైతే ఈ ఔటా నాయకులు ఎందుకు ర్యాలీలు తీయలేదో, మానవహక్కుల కమిషన్‌ను ఎందుకు ఆశ్రయించలేదో వివరించాలి. దాడులకు గురైన ప్రొఫెసర్లు యూనివర్సిటీ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఏనాడూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వని రిజిష్టార్ ఇవాళ ఎస్సీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి అగ్రవర్ణ ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడితే యూనివర్సిటీ అధికారులంతా ఆగమేఘాలమీద స్పందించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే యూనివర్సిటీ అధికారుల నిజస్వరూపం, అగ్రవర్ణ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొఫెసర్లపై జరిగిన దాడికి ఆ విద్యార్థి క్షమాపణలు చెప్పి, పోలీసుల ఎదుట స్వచ్చందంగా లొంగిపోయినప్పటికీ ఔటా నాయకులు ఆ విషయాన్ని అంతటితో వదిలి పెట్టకుండా మానవహక్కుల సంఘాన్ని, గవర్నర్‌ను కలుస్తూ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కదోవ పట్టిస్తున్నారు. యాదృచ్ఛికంగా జరిగిన ఆ ఘటనను ఖండిస్తూనే కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులతో, ప్రిన్సిపాల్‌తో చర్చించి, యూనివర్సిటీలో సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయాలని ఒకవైపు ప్రయత్నిస్తున్నారు. ఔటా నాయకులు మాత్రం విద్యార్థుల ప్రతిపాదనను తోసిపుచ్చుతూ విషయాన్ని మరింత జఠిలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

యూనివర్సిటీలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్యవర్తిత్వం వహించాల్సిన ఉపాధ్యాయులు, బాధ్యత కలిగిన అఖిలేశ్వరి లాంటి వ్యక్తులు సమస్యను సరిగ్గా అర్థం చేసుకోకుండా దానిని ఇంకా జటిలం చేస్తే ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయో ఆలోచించాలి. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులను సన్నిహితంగా గమనిస్తున్న అఖిలేశ్వరి గారు విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడిచేయడం, పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడిచేయడం కంటే తక్కువేమీ కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఒక విద్యార్థి భావోద్వేగానికిలోనై ఒక ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడితే ఆ ఘటనను ఉగ్రవాద చర్యతో పోల్చడం ఏవిధంగా సరైనదో అఖిలేశ్వరిగారే విజ్ఞతతో ఆలోచించుకోవాలి. సమాజం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు దాని నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపంచి, పరిష్కారాన్ని కనుగొనాల్సిన బాధ్యత మేధావివర్గంపై ఉంటుంది. కానీ మేధావులుగా పిలవబడుతున్న విశ్వవిద్యాలయ అధ్యాపకులు సమస్యను జటిలం చేస్తూ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే దీనిద్వారా ఎవరి ప్రయోజనాలు నేరవేరుతాయో విజ్ఞులే ఆలోచించాలి.

- డేవిడ్, వంగపల్లి శ్రీనివాస్, కంతి జగన్, మర్పల్లి ఆనంద్
రీసెర్చ్ స్కాలర్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయం

Andhra Jyothi New Year 1/1/2013 

No comments:

Post a Comment