Monday, May 27, 2013

దళిత దిక్కార కవి కలేకూరి ప్రసాద్ --- గిన్నారపు ఆదినారాయణ పరిశోధక విద్యార్ధి               “ త్రేతాయుగంలో నేను శంభూకున్ని
                               ఇరయై రెండేళ్ళ క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు
                               నా జన్మ స్థలం కీల వేన్మ ణి,కారంచేడు,నేరుకొండ
                               ఇప్పుడు కరుడుగట్టిన భూ స్వామ్య క్రౌర్యం
                               నా గుండెల మీద నాగేటి కర్రులతో పచ్చబోడిసిన పేరు చుండూరు
                               ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం
                                ......................................................................
                               అవమానాలకు,అత్యాచారాలకు, మానబంగాలకు,చిత్రహింసలకు గురై
                                పిడికెడు ఆత్మ గౌరవం కోసం తలేత్తిన వాణ్ణి ”


                                                           అంటూ దళితుల ఆత్మగౌరవం కోసం దళితుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దళితుల పక్షాన నిలబడి తన కంఠ  ధ్వని వినిపించిన వ్యక్తి కలేకూరి.నాటి కంచికచర్ల నుండి నేటి లక్ష్మి పేట  వరకు దళిత ఉద్యమాల్లో ప్రధాన పాత్ర వహిస్తూ వృతి,ప్రవృతి ని  దళిత ఉద్యమం,దళిత సాహిత్యం గా ఎంచుకొని సామ్రాజ్య వాద శక్తులకు ,హిందూ మతోన్మాదులకు  వ్యతిరేకంగా  పోరాటం చేస్తూ దళిత దిక్కార కవిగా,ప్రజా గాయకునిగా ,రచయితగా,అనువాదకుడిగా అంటరానివారికి అండగా నిలిచి యువక,శబరి,సంఘ మిత్ర,నవత వంటి కలం పేర్లతో మన ముందుకు పరిచయమై వ్యక్తి కలేకూరి ప్రసాద్.

                                                     ఈయన అక్టోబర్ 23 1962 కృష్ణా  జిల్లా కంచికచర్ల గ్రామంలో  లలిత సరోజినీ, శ్రీనివాస్ రావు దంపతులకు జన్మించారు.తల్లి దండ్రులు ఉపాధ్యాయులు కావడం వల్ల కలేకూరి ప్రసాద్ తెలివైనవాడుగా ఎదిగాడు. తన ప్రాథమిక విద్య కంచికచర్ల ఏలూరు లో,ఇంటర్ ఏ . సి కాలేజీ గుంటూరు లో పూర్తిచేసి,డిగ్రి చదువుతున్న రోజుల్లోనే రాడికల్ విద్యార్ధి సంఘం లో పని చేసి రాజకీయాలవైపు ఆకర్షితుడయ్యాడు. ఉపాధ్యాయుడిగా తమ వారసత్వాన్ని కొనసాగిస్తాడనుకున్న  తల్లిదండ్రులు వారి ఆలోచనకు భిన్నంగా సమాజాన్ని చదివి సమాజ మార్పును కోరుకుని విప్లవ పార్టీలకు వెళ్ళడం జరిగింది. తన ప్రతిబా శక్తి ద్వారా విప్లవ పార్టీ లో ఉంటూనే సమాజంలో జరుగుతున్న  విషయాలను తెలుసుకుంటూ పాటల రూపంలో కవిత్వం ద్వారా ప్రతి విషయం పై స్పందించి  తన కళా ప్రతిభ ను బయట పెట్టేవాడు.


                                               కలేకూరి ప్రసాద్ అంటే సామాన్య ప్రజలందరికి తెలుసో తెలియదో కాని ఈయన రాసిన “కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా” అనే పాట మాత్రం  తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు.ఇది ప్రజల్లో ప్రాచుర్యం పొందాకే శ్రీ రాములయ్య సినిమా లో పెట్టడం వల్ల  ప్రజలకు మరింత దగ్గరైంది. 1987 లో పీపుల్స్ వార్ పార్టీ నుంచి బయటి వచ్చాక వరకట్నం వ వేదింపులు చూసి రాసిన పాట ఇది.అలాగే “భూమికి పచ్చాని రంగేసినట్టు”అను  పాట రైతు ఆత్మహత్యల గురించి ప్రజల హృదయాల్ని పిండినది. 1991 విరసం నుండి కూడా తప్పుకున్నాడు. “విరసం భావజాలం పరంగా మొదట మార్క్సిజమే ఏకైక మార్గం అని నమ్మా ,అంబేద్కర్ ను చదివాక ,అంబేద్కర్ సిద్ధాంతం ఆసరా లేనిదే ఈ దేశంలో దళిత బహుజన విముక్తి సాధించలేమన్న స్పష్టమైన దృక్పథం తో కలేకూరి ముందుకు సాగాడు”.( డా.కోయి కోటేశ్వర రావు బహుజన కెరటాలు డిసెంబర్ 2012 పేజి నెం 24 ) తర్వాత అనేక దళిత ఉద్యమాల్లో పాల్గొని దళితుల పక్షాన నిలిచాడు.

                                             సమాజాన్ని చాల దగ్గరి నుండి వీక్షిచిన విహంగి కలేకూరి.ప్రతి చిన్న సమస్యపై  స్పందించి అనేక మంది యువకులకు యువక గా మార్గదర్శి అయి, దళిత సాహిత్యానికి దిశా నిర్దేశం చేశాడు. “దళిత సాహిత్యం” అను పేరుతోలఘు గ్రంథం వెలువరిచి అనేక విషయాలను తెలిపాడు.కేవలం తెలుగు భాష నే కాకుండా ఇతర భాషలు నేర్చుకొని అనువాద రచనలు కూడా చేశాడు. స్వామిధర్మ తీర్ధ రాసిన (Histori of hindu imperialism) ను “హిందూ సామ్రాజ్య వాద చరిత్ర”(1998) గా, అరుందతి రాయ్ రాసిన( End of the Imagination )ను  “ఊహలు సైతం అంతమయ్యే వేళ” (1998), కిషోర్ శాంతాబాయి కాళే ఆత్మకథ (Against all adds )  “ఎదురీత” (2001) గా అలాగే యూదుల పై జరుగుతున్న నాజి దురాగతాలను ప్రిమొ లివి రాసిన ఖైది నెంబర్ 174517 (2003) ఇలా ఇంగ్లీష్ భాషలో ఉన్న రచనలను తెలుగు లో ఏలాంటి వాక్య నిర్మాణం లో  ఇబ్బంది కలగకుండా అద్భుతం గా రాశారు. తెలుగు రచనలతో దళిత ప్రజలను చైతన్య పరుస్తూ దళిత ఉద్యమాల్లో ప్రధాన పాత్ర వహిస్తూ,దళిత ఉద్యమాల పైన ఆత్మ విమర్శ చేసుకోవాలని ఎటువంటి సంకోచం లేకుండా ప్రకటించిన వ్యక్తి కలేకూరి ప్రసాద్.


                                                         దళితులు అన్ని రంగాల్లో ముందుండాలి అని ఉద్యమాలు చేస్తూ, కవిగా, రచయితగా, విమర్శకునిగా గొప్ప పరిశోధకుడిగా ఉంటూ సామాజికంగా,ఆర్ధికంగా,రాజకీయంగా సైతం ఎదగాలని రాజకీయంగా కూడా ఎదుగుతనే దళితులకు అన్ని  రకాలుగా చైతన్య వంతులవుతారని 1994 లో నందిగామ నియోజక వర్గం నుండి బహుజన సమాజ్ పార్టీ నుండి పోటి చేయడం జరిగింది.తర్వాత దళిత సాహిత్యాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని యువ కవులకు,రచయితలకు దైర్యాన్ని చేకూర్చి అనేక సలహాలు సూచనలు ఇచ్చి ప్రోత్సహించేవాడు. దళిత రాజ్యం, దళిత కిరణాలు,అరుణాతార,ఏకలవ్య,చూపు,బహుజన కెరటాలు వంటి పత్రికల్లో వర్తమాన కాలం లోదళితుల పై  జరుగుతున్న ప్రతి విషయం పై స్పందించి అనేక వ్యాసాలు రాసి ఎందరో మేధావుల మెదళ్ళకు పదును పెట్టెవాడు.ముఖ్యంగా అంబేద్కర్ ఆలోచన విధానాలను ఎక్కువగా చెప్పేవాడు. “దళిత ఉద్యమాలకి,దళిత సాహిత్యానికీ అంబేడ్కరిజమే అసలైన మార్గం అంటూ అంబేద్కర్ ని అటు దళిత ఉద్యమాలకి,దళిత సాహిత్యానికి నాయకుడంటాడు”.(డా.పి కేశవకుమార్  బహుజన కెరటాలు డిసెంబర్ 2012 పేజి నెంబర్ 33 ) డర్బన్ లో జాతి వివక్ష పై  జరిగిన అంతర్జాతీయ సదస్సు లో పాల్గొని భారత దేశంలో కుల సమస్యలు ఎలా ఉన్నాయి అనే అంశం పై మాట్లాడి అనేక మంది గొప్ప వారిచే ప్రశంసలు అందుకున్నారు.


                                          మన రాష్ట్రం లో ముఖ్యంగా దళితుల్లో మాదిగ దండోరా,మాల మహానాడు ద్వారా  కొంత అనైక్యత  ఏర్పడింది.దండోరా ఉద్యమాన్ని సమర్దిస్తూ ,ఒక మాల వ్యక్తి గా కవి గా,రచయితగా ,ఒక మేథావి గా మాల కులస్థులు దండోరా ఉధ్యమాన్ని సమర్దించాలని తన భాద్యతగా  గుర్తిస్తూ, అలాగే మాదిగ దండోరా న్యాయకత్వం కూడా మాలల వల్లనే తమకు అన్యాయం జరిగిందని మాల కులస్తులే కారణమన్న అభిప్రాయం సరైంది కాదని చెప్పే ప్రయత్నం చేశాడు.అగ్రకులాల వారు దళితులైన మాల,మాదిగలను ఆధారం చేసుకొని మాల వారిపై మాదిగ వారిని రెచ్చగొట్టి,మాదిగ వారిపై మాల వారిని రెచ్చగోట్టి వారి అవసరాలను తీర్చుకొని దళితులను చీల్చే ప్రయత్నం చేస్తారు అని,ఆఫ్రిక దేశాల్లో ఈస్థితిని పాలక వర్గాలు ఇప్పటికి కొనసాగిస్తున్నాయి అని ఇది అందరు గమనించగలరు అని చెప్పి ఇరువురికి సూచనలు చేసిన వ్యక్తి కలేకూరి ప్రసాద్.   ఈ రోజు (17-05-2013)  మాన నుండి దూరం కావడం మన దురదృష్టం .
                                                                                            
                      

                                                                                                                         గిన్నారపు ఆదినారాయణ
                                                                                                                                 పరిశోధక విద్యార్ధి
                                                                                                                  హైదరాబాదు విశ్వవిద్యాలయం 
                                                                                                                                     గచ్చిబౌలి 

                                                                                                                                     9949532456 
SURYA TELUGU NEWS PAPER DATED : 27/5/2013

No comments:

Post a Comment