మార్క్స్ చెప్పేదేమంటే మానవ ఆలోచన వస్తుగత సత్యాన్ని ప్రతిబింబించిందా లేదా అనేది ఆచరణకు సంబంధించిన ప్రశ్న తప్ప సైద్ధాంతిక సమస్య కాదు. ఆచరణలోనే మానవుడు సత్యాన్ని నిరూపించాలి.
అధిభౌతిక వాస్తవికత నిశి రాత్రిలో పిల్లులన్నీ నల్లగానే కనపడతాయి -టెర్రి ఈగల్‌టన్
'మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పనికిరాదు' అంటూ డా.జిలుకర శ్రీనివాస్ కలగాపులగంగా రాసిన వ్యాసం (ఏప్రిల్ 1 వివిధ) ఎన్నో విషయాలను పైపైన తడిమింది. మార్క్సిస్టు తత్వశాస్త్రం, సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రం, మార్క్స్, లెనిన్, అంబేద్కర్ ఆలోచనలకు చెందిన విషయాలపై ప్రశ్నలు లేవనెత్తింది. తెలుగు సాహిత్యంలోని కొన్ని గ్రంథాలను ఉటంకించి మార్క్సిజంకు అనేకానేక అర్థాలను ఈ వ్యాసం ఆపాదించింది. కందుకూరి, గురజాడ లాంటి వారి రచనలు 'బ్రాహ్మణీయ వాస్తవికత' నిర్మాణాన్ని ఉద్దేశించి చేసినవనీ, ఈ ప్రక్రియ ఎదురునిలువకుండా 'కాల్పనికవాదం'లోకి పలాయనమైనదనీ, ఈ 'కాల్పనికవాదం'లో భావ కవిత్వం ఒక పాయ అనీ శ్రీని వాస్ పేర్కొన్నారు. అంతేకాకుండా 'కుల వాస్తవికతను సైద్ధాంతిక, రాజకీయ క్షేత్రంలో కింది కులాలు వ్యక్తీకరించడమే కాదు దాని తార్కికతనూ నిర్ణాయక వాదాన్నీ ప్రశ్నిస్తున్న 'కాలం'లో తెలుగు సాంస్కృతిక 'స్థలం' బ్రాహ్మణీకపు కాల్పనిక వాదంలోకి సచేతనంగా పాదం మోపింది. అదే నడక అభ్యుదయ, విప్లవ రంగాలను కూడా నియంత్రించింది. దానికి మార్క్సి స్టు జ్ఞాన సిద్ధాంతం పునాది' అని జిలుకర శ్రీనివాస్ ప్రకటించారు.
ఏమిటీ మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం? దీని శాస్త్రీయత ఏపాటిది? వివిధ రంగాలలో దాని అనువర్తన ఎలా ఉంది? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాం తం మార్క్సిస్టు గతితర్కంతో విడదీయరాని సంబంధంలో ఉంటుంది. నిజానికి మార్క్సిస్టు భౌతిక వాదాన్ని, గతితర్కాన్ని జ్ఞాన సిద్ధాంతాన్ని ఒకదాని నుండి మరొక దాన్ని విడదీయటం దుస్సాధ్యం. ఈ మార్క్సిస్టు భావనల మూలాలు జర్మన్ తత్వశాస్త్రం ముఖ్యంగా హెగెలియన్ తత్వ శాస్త్రం, ఫ్రెంచ్ భౌతిక వాదంలలో ఉన్నాయి. బ్రిటిష్ సంప్రదాయ అర్ధశాస్త్రంను కూడా జోడిస్తే మార్క్సిజం మానవ మేధో చరిత్రలోని అన్ని ప్రధాన విభాగాల అవిభాజ్య అత్యున్నత రూపం. ఇక్కడ మార్క్స్ రెండు ప్రధాన గ్రంథాలను ఉదహరించవలసి ఉంటుంది. మార్క్స్ 1844 ఏప్రిల్-ఆగస్టు కాలంలో పారిస్‌లో రాసిన 'ఆర్థిక, తాత్విక రాతప్రతులు' 1927లోగాని ప్రచురింపబడలేదు. దీని ఆంగ్లా నువాదం 1959 వరకు వెలువడలేదు. అలానే 'గ్రుండ్రిస్సే'గా పిలువబడే 'రాజకీయ అర్ధశాస్త్ర విమర్శ సంక్షేపవర్ణన' అనే పూర్తి కాని పెద్ద రాతప్రతిని మార్క్స్ 1858లో పక్కన పెట్టాడు. ఈ రాతప్రతి 1939 దాకా ప్రచురింపబడలేదు.
ఈ గ్రంథం మార్టిన్ నికొలస్‌చే 1973లో ఆంగ్లంలోకి అనువదింపబడింది. 'ఆర్థిక, తాత్విక రాతప్రతులలో వేతన-బానిసత్యం నుండి విముక్తి, పరాయీకరణ నుండి స్వేచ్ఛ లాంటి భావనలు ప్రతిపాదించబడినాయి. మార్క్సిస్టు సిద్ధాంతంలో నూతనంగా వెలుగులోకి వచ్చిన ఈ భావనల గురించి మార్క్సిస్టు సాంప్రదాయంలో పెద్ద చర్చ జరిగింది. ఈ చర్చలో ఇస్తవాన్ మెస్ జిరోస్, బెర్టెల్ ఓల్‌మన్, నూతన వామపక్ష సిద్ధాంతవేత్తలు, ఆల్తూజర్ లాంటి మహమహులు పాల్గొని మార్క్సిజాన్ని సుసంపన్నం చేసారు. అలాగే 'గ్రుండ్రిస్సే' మార్క్స్ పరిశోధన లక్ష్యాలను రేఖామాత్రంగా వివరించిన పెద్ద వ్రాత ప్రతి. ఉత్పతి, పంపిణి, మారకం, పరాయీకరణ, విలువ సిద్ధాంతం, శ్రమ, పెట్టుబడి, అనూహ్యంగా పెరిగే సాంకేతిక పరిజ్ఞానం, స్వయం చాలకత (ఆటోమెషన్) పెట్టుబడిదారీ పూర్వ సామాజిక నిర్మాణాలు, కమ్యూనిస్టు విప్లవానికి కావలసిన పూర్వావసరాలు మొదలగు విషయాలు 'గ్రుండ్రిస్సే'లో పరిశోధనాంశాలుగా ఉన్నా యి. ఈ విషయాలన్నింటిలో ఒక్క 'పెట్టుబడి'ని గురించిన పరిశోధనకే మార్క్స్ తన జీవిత కాలాన్నంతా వినియోగించాడు.
మార్క్స్ జ్ఞాన సిద్ధాంతానికి సంబంధించి శ్రీనివాస్ విస్మరించిన ప్రధాన విషయం 'ఆచరణ'కు సంబంధించినది. మార్క్స్ ప్యూయల్ బా ని గురించి రాసిన రెండవ, పదకొండవ థీసిస్‌లను పరిగణలోకి తీసుకుని ఉండి ఉంటే పరావర్తన సిద్ధాంతం దగ్గరే ఆయన ఆగి ఉండేవాడు కాదు. మార్క్స్ చెప్పేదేమంటే మానవ ఆలోచన వస్తుగత సత్యాన్ని ప్రతిబింబించిందా లేదా అనేది ఆచరణకు సంబంధించిన ప్రశ్న తప్ప సైద్ధాంతిక సమస్య కాదు. ఆచరణలోనే మానవుడు సత్యాన్ని (వాస్తవికత, ప్రాబల్యాలకు చెందిన ఆలోచన యొక్క ఆచరణ) నిరూపించాలి.
(రెండవ థీసిస్) తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాలుగా వివరించారు. అసలు విషయమేమంటే దాన్ని మార్చటం (పదకొండవ థీసిస్). ఈ విషయాన్ని 'ఆచరణ గురించి' అనే గ్రంథంలో మావో మరింత వివరంగా వివరించాడు. 1914-15 కాలంలో లెనిన్ హెగెల్ 'తర్కం'ను అధ్యయనం చేసిన తరువాత పెట్టుబడిదారీ విధాన వైరుధ్యాలను మరింత లోతుగా అధ్యయనం చేసి 'సామ్రాజ్యవాద సిద్ధాంతం'ను ప్రతిపాదించి రెండవ ఇంటర్నేషనల్‌లో బెర్న్‌స్టిన్, కౌట్‌ష్కిలకు వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం చేసి విప్లవ కార్యాచరణను సుసంపన్నం చేయటం జరిగింది. ఇలా లెనిన్‌తో పాటు మార్క్సిస్టు విప్లవ సాంప్రదాయాన్ని రోజా లక్జెంబర్గ్, జార్జి లుకాస్, ఆంటోనియో గ్రాంసీలు తమ సైద్ధాంతిక రచనల ద్వారా ముందు పీఠిన ఉంచారు.
ప్రాచీన భారతీయ సామాజిక, ఆర్థిక తారతమ్యాలను అర్థం చేసుకోవటానికి 'కులం' మూలాలను కోశాంబి నిశితంగా పరిశీలించాడు. కోశాంబి 1954లో రచించిన 'భారతదేశ చరిత్రలో దశలు' అనే గ్రంథంలో హరప్పా నాగరకతను మొదటి దశగాను, ఆర్యనీకరణను రెండవ దశగాను పేర్కొన్నాడు. హరప్పా కంచు (బ్రోంజ్) నాగరికత ఆర్యుల రాకతో ఇనుప (ఐరన్) నాగరికతగా మారింది. రెండు కులాలుగా ఉన్న సంచార తెగలు నాలుగు కులాలుగా రూపాంతరం చెందాయి. జిలుకర శ్రీనివాస్ దృష్టిలో 'హరప్పా నాగరికతలో వర్గ అసమానతలు లేవు'. సామాజిక మిగులును కలిగి ఉన్న సమాజంలో ఆర్థిక అసమానతలు అనివార్యం. అవి లేకపోవటానికి ఏర్పాటు ఏమిటో వివరించగలగాలి.
చరిత్ర పరిశోధనలలో శ్రీనివాస్ చెప్పి విషయం ఎక్కడా లేదు. 'కుల వ్యవస్థ' భారత దేశ చరిత్రలోని వివిధ దశలలో ఎలా పరిణామం చెందిందో కులం, వర్గం ఎలా ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయాయో తెలియజెప్పే రచనలను కోశాంబితో పాటు, ఆర్.ఎస్.శర్మ, ఇర్ఫాన్ హబీబ్, జి.ఎస్.ఘుర్వే ఐ.పి. దేశాయి, రామకృష్ణ ముఖర్జీ, దీపంకర్ గుప్తా మొదలగు వారు చేసారు. వీరికి ప్రత్యామ్నాయంగా 'కులం వ్యవస్థ' హేతువును తెలియజెప్పే రచనలు మాక్స్ వెబర్, లూయీ డూమాంట్, ఎమ్.ఎన్. శ్రీనివాస్, ఆద్రే బెట్టెల్ లాంటి వారి ద్వారా వచ్చాయి.
గత రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచీకరణ ప్రభావంతో భారతీయ సమాజంలో ప్రతికులంలో తారతమ్యాలు పెరిగి వర్గాలు రూపుదిద్దుకున్నాయి. కులాలు సామాజిక పెట్టుబడికి నెలవులుగా మారుతున్నాయి. హరీష్ దామోదరన్ రచించిన 'కులం-నూతన పెట్టుబడిదారులు' గ్రంథం దేశంలోని వివిధ కులాల నుండి నూతన పెట్టుబడిదారులు ఎలా ఆవిర్భవిస్తున్నారో విశదీకరించింది. దళిత కులాల నుండి కూడా తక్కువ సంఖ్యలోనైనా పెట్టుబదారులు తయారవుతున్నారు.
ఈ వాస్తవాల వెలుగులో కనపడే ప్రత్యామ్నాయాలేమిటి? కులం-వర్గం దాదాపు ఒకటిగా ఉన్న దళిత వర్గం, భారతీయ కుల వ్యవస్థలో దానికి ఉన్న ప్రత్యేకత, అలానే దొంతరలుగా ఉన్న కుల వ్యవస్థ, దాని లో ఆవిర్భవించిన వర్గాలు, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న ఈ వర్గాల మూలాలు ఒక విషయా న్ని స్పష్టం చేస్తున్నాయి. అదేమంటే అంబేద్కర్ ప్రవచించిన 'కుల నిర్మూలన' ఆవశ్యకతని (ఇక్కడ అంబేద్కర్ 'జ్ఞాన సిద్ధాంతం' గురించిన చర్చ అవసరం లేదు). అయితే, 'కుల నిర్మూలన' మతం (బౌద్ధం) చట్రంలోనో, పెట్టుబడిదారీ వ్యవస్థలోనో జరగదు.
ఎందుకంటే 'కులం' మూలాలు ఈ వ్యవస్థలలో ఉన్నాయి. మౌలిక వర్గంగా ఉన్న దళితుల 'కుల సమస్య'ను అంబేద్కర్ ఆలోచనలను అంతర్లీనం చేసుకోవటం ద్వారా కమ్యూనిస్టులు దళిత ప్రతి భావాధిపత్యం (కౌంటర్ హెజిమెని) నిర్మాణాన్ని తమ ఉద్యమంలో భాగం చెయ్యటం అవసరం. 'కమ్యూనిస్టు మానిఫెస్టో', 'ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ (కుల సంహారం)'లను కలిపి చదువుకోవటం నేటి చారిత్రక కర్తవ్యం. దళితులను కమ్యూనిస్టుల నుండి వేరు చేసే ప్రతి ప్రయత్నం పాలకవర్గ కుయుక్తిగా భావించవలసి ఉంటుంది. వారి పరస్పర మమేకతకు చేసే ప్రతి ప్రయత్నం నిరాశామయ జీవితాలతో కొట్టుమిట్టాడుతున్న భారతీయ బడుగుల విమోచనా మహాప్రస్థానంలో ఒక ముందడుగవుతుంది. దీనికి డా.జిలుకర శ్రీనివాస్ అంగీకరిస్తారని ఆశిద్దాం.
- నెల్లూరు నరసింహారావు
88863 96999
Andhra Jyothi Telugu News Paper Dated : 6/5/2013
No comments:
Post a Comment