Monday, May 27, 2013

పేదల ఆకలి కేకలకు అంతమెప్పుడు? ----సుంచు అశోకే


రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం, వామపక్షాలన్నీ రైతుల పక్షమేనని చెబుతుంటాయి. కానీ రైతు సమస్యలపై ఏ పక్షం చిత్తశుద్ధిగా పనిచేసిన, ఉద్యమించిన దాఖలాలు లేవు. రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమవుతున్నా మొక్కుబడి ఖండనలే తప్పా ఆచరణాత్మకంగా చేసింది శూన్యం. మరోవైపు చుక్కలంటుతున్న ధరలతో పేద ప్రజల పక్షం తాము ఉన్నామని ఏ రాజకీయ పార్టీ ముందుకు రావడంలేదు. రైతు ప్రయోజనాలు కాపాడటం ఎంత ముఖ్యమో.. ఒక్కపూట కూడా కడుపు నిండా తిండిలేని పేద జనం బాధలుకూడా అంతే ముఖ్యమని రాజకీయ పార్టీలు గుర్తెరగాల్సిన బాధ్యత ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. ‘పాడి పంట లు పొంగిపొర్లే దారిలో నువు పాటు పడవోయి, తిండి కలిగితేనే కండకలదోయి- కండ కల వాడే మనిషోయి’అని గురజాడ అప్పారావు వంద సంవత్సరాల క్రితమే చెప్పాడు. కానీ మన పాలకులకు మాత్రం పేద ప్రజల ఆకలి కేకలు ఏ మాత్రం పట్ట వు. పౌరులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత ఆహారం తీసుకోవాలనే దానిపై ప్రభు త్వం ఏర్పాటు చేసిన ‘జాతీయ పోషక ఆహార సంస్థ’ ఒక నివేదికను విడుదల చేసిం ది. ఒక మోస్తరు కష్టం చేసే పురుషుడు రోజుకు 480 గ్రాములు, స్త్రీ అయితే 360 గ్రాముల ఆహారం తీసుకోవాలని సూచించింది. ఈ లెక్కన ఇద్దరు వ్యక్తులకు కలిపి నెలకు 25 కిలోల 200 గ్రాముల బియ్యం అవసరం అవుతాయి. అదే కాయకష్టం చేసే వారికి పురుషునికి 690 గ్రాములు, స్త్రీకి 480 గ్రామలు చొప్పున తీసుకోవాలి. అంటే నెలకు 35 కిలోల 100 గ్రాముల బియ్యం అవసరం పడుతుంది. అయితే మన ప్రభుత్వాలు ఒక్కో మనిషికి రేషన్‌షాపు ద్వారా ఒక్కొక్కరికి నాలుగు కిలోల బియ్యాన్ని మాత్రమే ఇస్తున్నది. నాలుగు కిలోల బియ్యం ఒక్క మనిషికి నెలంతా సరిపోను గాసం అవుతుందా? అంటే ఒక వ్యక్తికి నెలంతా సరిపోను గాసం కావాలంటే దాదాపు 15 కిలోల బియ్యం అవసరమవుతాయి. ప్రభుత్వం మాత్రం నాలుగు కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. మిగతా బియ్యం కోసం పేద ప్రజలకు 30 నుంచి 40 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. రేషన్‌షాపు ద్వారా దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు భూమిలేని పేదవాడికి నాలుగు కిలోల బియ్యం ఇచ్చి మీ బతుకు ఇంతేనని సరిపెట్టుకోమని చెబుతున్న ది.అదే వందలాది ఎకరాల భూములున్న ధనవంతులకు మాత్రం బ్యాంక్ రుణాల మాఫీతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే మన రాష్ట్రంలో వామ పక్షాలు అధికారంలోకి రాకున్నా.. ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావడానికి మాత్రం వాటి శక్తియుక్తులను ఉపయోగిస్తుంటాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. టీడీపీ ప్రతిపక్ష పాత్ర పొషిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చుంటున్నది. కుర్చీల స్థానాలు మాత్రమే మారుతున్నాయి. ప్రభుత్వ విధానాల్లో ఏ మార్పు ఉండటం లేదు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాయి. అందులో ఎన్ని అమలు అవుతాయంటే చెప్పడం కష్టమే. అధికార పీఠాన్ని ఎక్కడమే లక్ష్యంగా చేసిన వాగ్దానాలన్నీ నీటి మీది రాతలుగానే మిగిలిపోతున్న తీరు నేటి రాజకీయాలది. 

ఈ క్రమంలో ఎవరి వర్గం ప్రయోజనాలు వారు నెరవేర్చుకుంటున్నారు. రాజకీ య పార్టీలు ఇచ్చే హామీలు ఏ వర్గం ప్రయోజనాలను కాపాడటానికి ఇస్తున్నాయనేది గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎవరు అధికారంలోకి వచ్చినా ధనవంతుల ప్రయోజనాల కోసమే హామీలు ఇస్తున్నాయి. కానీ సెంటు భూమిలేని పేద, దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ప్రజలను విస్మరిస్తున్నాయి. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి కిరణ్‌కుమార్‌డ్డి వరకు పేద ప్రజలకు నెలంతా సరిపోను గాసం ఇవ్వాలనే ఆలోచన రాకపోవడం దురదృష్టకరం. అయితే ఎన్టీఆర్ రేషన్‌షాపుల ద్వారా ఇచ్చే బియ్యాన్ని రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి కొంత వరకు మేలు చేశాడని చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రభుత్వం కూడా నెలంతా సరిపోను గాసం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా నేటి వరకు పేద ప్రజల ఆహారం విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని పెంచలేకపోయారు. ఇప్పటి వరకు రాజ్యమేలుతున్న పాలకులు పేద ప్రజల తిండి గురించి ఆలోచించకపోవడం విచారకరం. నాయకులు తమ, తమ వర్గం కడుపులు నింపుకోవడానికే ప్రయత్నిస్తున్నారు కానీ, ఆర్థకాలితో పేద ప్రజలు జీవిస్తుంటే పట్టించుకునే వారే కరువయ్యారు.మట్టిలో మట్టయి, భూమి కడుపును చీల్చి బంగారు పంటలు తీసిన శ్రమ జీవులు బుక్క బువ్వకు దూరమవుతున్నారు. ఆకలి, దు:ఖంతో కోట్లాదిమంది పేద ప్రజలు జీవిస్తున్నారు. పేద ప్రజలకు కడుపు నిండా తిండిపెట్టలేని పాలకులు చరివూతలో కొట్టుకుపోయా రు. నాలుగు మెతుకులు కంచంలో రాలి, ఐదు వేళ్లు నోట్లోకి పోయిననాడే పేదవాడి కంట్లో వెలుగు రేఖ పొడుస్తుంది. లేదంటే బతుకంతా దినదిన గండంగా గడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని 2004 ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఉచి త కరెంటు ఫైల్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇపుడొక నాయకుడు అధికారాంలోకి రాగానే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తామని అంటున్నాడు. అదే భూమిలేని పేదలకు.. ఒక్కరికి రేషన్ ద్వారా ఇస్తున్న నాలుగు కిలోల బియ్యాన్ని పెంచుతామని, నెలకు సరిపడా 15 కిలోల బియ్యం ఇస్తామని మాత్రం ఎవరూ చెప్పడంలేదు. అయితే ఇక్కడ వామపక్షాల కోసం కూడా కొంత చెప్పుకోవాలి. ఎర్రజెండా పార్టీలు కూడా భూస్వాముల ప్రయోజనాల కోసమే ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఎరువుల ధరలు పెంచవద్దని ఆందోళనలు చెపడుతాయి. ఇక్కడ చిత్రమేమిటంటే ఎర్రజెండా పార్టీలు చేసే ఆందోళనకు జెండాలు పట్టి జై కొట్టేది భూములులేని పేద ప్రజలే. ఈ వామపక్షాలు మాత్రం పేద వూపజలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని ఒక్కొక్కరికి 15 కిలోల వరకు పెంచాలని ధర్నాలు, ఆందోళనలు చేసిన పాపాన పోలేదు. 

రాష్ట్రంలో 32 లక్షల రైతుల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 7 వేల 117 కోట్లు ఖర్చు చేస్తున్నది. అదే 7 కోట్ల 50 లక్షలున్న పేద ప్రజ ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా ఇస్తున్నా రూపాయి కిలో బియ్యాని కి ఖర్చు చేస్తున్నది కేవలం 3వేల 231 కోట్లు మాత్రమే. భూములున్న రైతుల పట్ల ఉన్న ప్రేమ, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేద ప్రజల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంగా అర్థమవుతున్నది. 7 కోట్ల 50 లక్షలున్న పేద ప్రజల కోసం రేషను షాపుల ద్వారా అందిస్తున్న బియ్యానికి పౌర సరఫరాల శాఖకు ప్రభుత్వం బడ్జెట్‌లో ఇంకో 10వేల కోట్లు అదనంగా కేటాయిస్తే ఇద్దరున్న కుటుంబానికి 30 కిలోల బియ్యం, 4గురు ఉన్న కుటుంబానికి 60 కిలోల బియ్యం ఇవ్వడానికి సాధ్యపడుతుందని సామాజిక ఉద్యమ నేతలు అంటున్నారు. 32 లక్షల రైతుల పంపుసెట్లకు అందిస్తున్న ఉచిత విద్యుత్ కోసం 7 వేల 117 కోట్లు సబ్సిడీ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, 7కోట్ల 50 లక్షల మందికి కోసం అందిస్తున్న బియ్యం కోసం 14వేల కోట్లు కేటాయించడం ఎందుకు సాధ్యం కాదు? దీంతో పేద ల పట్ల ప్రభుత్వానిది కేవలం సవతి తల్లి ప్రేమ అనే అర్థమవుతున్నది. పాలకులు ఏ వర్గాల నుంచి వస్తారో.. ఆ వర్గ ప్రయోజనాలను నేరవేర్చుకుంటారని, మిగిలిన పేద వర్గాలను పట్టించుకోరని అర్థమవుతున్నది.రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఈ రాజకీయ పక్షాలు ఎవరి ప్రయోజనాల కోసమున్నాయో గుర్తించాలి. జాతీయ పోషక ఆహార సంస్థ ( ఎన్‌ఐఎన్) ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి వ్యక్తికి కడుపు నిండా తిండి కోసం పేదలంతా ఉద్యమించాలి. ప్రతి కుంటుంబానికి కనీసం 40 కిలోల బియ్యం ఇవ్వాలనే డిమాండ్‌తో ఉద్యమించాలి. జాతీయ పోషకాహార సంస్థ చెప్పిన దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమే. ఆ దిశగా అడుగులు వేసే క్రమంలోనే ‘ఆ కలి కేకల పోరుయాత్ర’ సాగుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అణగారిన సామాజిక వర్గాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఏ వర్గానికి ఆ వర్గం తమ సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం, ఆత్మగౌరవం కోసం,రాజ్యాధికారంలో వాటా కోసం పోరాడుతూనే ఉమ్మడి సమస్యల కోసం ఐక్యంగా ఉద్యమించాలి. రేషన్ బియ్యం పెంపు మొదలు, వృద్ధాప్య ఫించన్లు, వికలాంగుల ఫించన్లు, నిరుద్యోగ భృతి లాంటి సామాజిక ప్రయోజన పథకాలను పోరాడి సాధించుకోవాలి. వీటి సాధన కోసం కుల, మతాలకతీతంగా అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలన్నీ ఏకమై ముందుకు సాగాలి. పాలక వర్గాల మెడలు వంచి ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవాలి. తద్వారా మరో అడుగు ముందుకేసి రాజ్యాధికారం సాధించే దిశగా సాగిపోవాలి. 

-సుంచు అశోకే

Namasete Telangana Telugu News Paper Dated : 27/5/2013

No comments:

Post a Comment