Monday, May 13, 2013

బిసి కోటా చారిత్రక అవసరం ---కదిరె కృష్ణ,హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం హామీ 
కులాల ప్రాతినిధ్యం నిర్వీర్యం 
అగ్ర కులాల కుట్రే కారణం 
బీజాలు వేసింది గాంధీయే! 
రిజర్వేషన్లకోసం చందాపురి ర్యాలీ 
తమిళనాడులో పెరియార్‌ ఉద్యమం 
3 వేల బిసి కులాలను గుర్తించిన కలేల్కర్‌ 
కలేల్కర్‌ నివేదిక బుట్ట దాఖలు 
జనతా హయాంలో మండల్‌ కమిషన్‌ 
కోటాలు విద్య, ఉద్యోగ రంగాలకే పరిమితం 

ఇండియా బహుళ జాతుల/ కులాల సహజీవన సమ్మేళనం. 6,700 పైచిలుకు కులాలు మరెన్నో జాతులు ఇక్కడ ఉన్నాయి. ఈ జాతులు, కులాల హక్కుల పరిరక్షణకు భారత రాజ్యాంగం హామీ ఇచ్చింది. ప్రజా స్వామ్యం, మరీ ముఖ్యంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. కానీ భారత ప్రజాస్వామ్య, పాలక పక్షాలు, భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, కులాల ప్రాతినిధ్యాన్ని నిర్వీర్యం చేశాయి. వాటి అమలులో ఘోరంగా విఫలమైనాయి. 

ఇటు రాజ్యాంగాన్ని అటు ప్రజాస్వామ్యాన్ని వైఫల్యం చెందించడంలో అగ్ర కులాల పాత్ర చాలా కీలకమైనది. స్వార్ధ, కుట్ర పూరిత బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. భారత రాజ్యాంగానికి బదులు దేశంలో మనుధర్మ శాస్త్రం అమలౌతూంది. ప్రజాస్వామ్యానికి బదులు రాజరికం రాజ్యమేలు తోంది. అందుకు తాజా (63 సంవత్సరాల గణతంత్ర ప్రజాస్వామ్య చరిత్ర) ఉదాహరణగా భారత రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌ నిలిచింది. ఈ ఆర్టికల్‌ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించి వారిని ఆ వైకల్యం నుండి విముక్తి చేసేందుకు ఒక కమిషన్‌ వేయాల్సిందిగా ఉత్తర్వు (ఆర్డర్‌) జారీ చేసింది. వెనుకబడిన తరగతుల వెనుకబాటుతనాన్ని, పేదరికాన్ని పోగొట్టడం ద్వారా, అందుకు కారణమైన కుల నిర్మూలనకు పునాదులు వేయడమే దీని ఉద్దేశ్యం.

అందుకు రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన రూపకల్పన చేసేందుకు ఉద్దేశించినదే ఈ ఆర్టికల్‌. 63 సంవత్సరాలుగా ఈ ఆర్టికల్‌ నిస్తేజంగా, నిర్వీర్యంగా, వివాదాస్పదంగా మారి ఓ మూలన పడిఉంది. పాలకపక్షాల కుల స్వభావానికి, కుట్ర కుతంత్రాలకు నిదర్శనంగా నిలిచింది. 52 శాతంగా (ప్రభుత్వ లెక్కల ప్రకారం) ఉన్న బిసి కులాల అభివృద్ధిని, అధికారాన్ని తిరస్కరించి వారిని బానిసలుగా కొనసాగించేందుకు, ఈ ఆర్టికల్‌ను అమలు చేయకుండా వాయిదాల మీద వాయిదాలతో ప్రభుత్వాలు పబ్బం గడుపుతున్నాయి. 

వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి రాజ్యాంగంలో పొందుపరచవలసిన రిజర్వేషన్‌ హామీలను (నాటి పాలక కాంగ్రెస్‌ ఆర్టికల్‌ 340లో చెప్పిన బిసి కమిషన్‌ను నియమించకుండా, కొంతకాలం అమలు చేయకుండా, మరికొంతకాలం వాయిదా వేయడం ద్వారా) నీరు గార్చాలని నిర్ణయించుకుంది. నిజానికి బిసిలను వివిధ పార్టీలకు గులాంగిరి చేసే ఆట వస్తువులుగా మార్చేందుకు బీజాలు వేసింది జాతిపిత మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీయే. లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లు- అంబేడ్కర్‌ను అంటరాని కులాల ప్రతినిధిగా పరిమితం చేయడం, భారత రాజ్యాంగ పరిషత్‌లో ఒక్క బిసి సభ్యుడుకూడా నియామకం కాకుండా జాగ్రత్త పడడం, గాంధీ పన్నిన కుట్ర.

దాని పర్యవసారమే నేటికి సంచారజాతులుగా భిక్షుక వృత్తిలో కొట్టు మిట్టాడుతున్న బిసి కులాల దైన్య స్థితి. ఈ వైపరీత్యాలన్నీ బిసిలు గాంధీని తమ నాయకుడిగా, విముక్తి దాతగా ఎన్నుకోవడం వల్లనే జరిగాయి. తదనంతరం డా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగ బద్ధం చేసిన తర్వాత బిసి రిజర్వేషన్ల ముసాయిదా బిల్లును రాజ్యాంగ పరిషత్‌ ముందుకు తెచ్చినప్పుడు వల్లభ భాయ్‌ పటేల్‌ (ఉక్కు మనిషి) ‘ఎస్సీ, ఎస్టీలకు వెనుకబడిన వర్గాల ప్రాతిపదికనే రిజర్వేషన్లు (ప్రాతినిధ్యం) కల్పించాం. మళ్ళా ఈ వెనుకబడిన తరగతులు (బిసిలు) ఎవ్వరు?’ అంటూ ప్రశ్నించాడు.

దానికి అంబేడ్కర్‌ అగ్రకులాల కుట్రలో భాగంగా సంధించిన ఆ ప్రశ్నలోని అంతరార్ధం గ్రహించి- ఎస్సీ, ఎస్టీలు కాక మిగిలిన వెనుకబడిన వారిని ఒబిసి లుగా గుర్తించాడు. ఆ ఒబిసిలు ఏఏ కులాలో గుర్తించడానికి 340 ఆర్టికల్‌ను రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఆనాడు పటేల్‌ వేసిన కొర్రీ నేటికీ బిసి రిజర్వేషన్లను సాధించ కుండా అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నది. ఈ సమస్య నాటి నుండి నేటి వరకు కాష్ఠంలా కాలుతూనే ఉంది. 

తదనంతరం న్యాయశాఖా మంత్రిగా డా అంబేడ్కర్‌ రాజీనామా చేస్తూ, తన రాజీనామాకు కారణాలు నాలుగింటిని పేర్కొంటూ- అందులో బిసిలను గుర్తించడానికి కమిషన్‌ను వేయడం లేదనే కారణాన్ని బలంగా ఎత్తి చూపాడు. ఈ క్రమంలో మళ్ళీ బిసి రిజర్వేషన్ల అంశం వెలుగు లోకివచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బిసి నాయకుడు ఆర్‌.ఎల్‌. చందాపురి నాయకత్వంలో డా అంబేడ్కర్‌ సహా పాట్నా నుండి ఢిల్లీ వరకు బిసి రిజర్వేషన్లు కోరుతూ పెద్ద ఎత్తున ఒక ప్రదర్శన (ర్యాలీ) నిర్వహించారు. అటు తమిళనాడులో పెరియార్‌ రామస్వామి నాయకర్‌ బిసి రిజర్వేషన్ల కోసం పాలక పక్షాల కళ్ళు బయర్లుకమ్మేలా వేలాది మందితో ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు.

ఈ నేపథ్యంలో ఊపిరాడని పాలక కాంగ్రెస్‌ నెహ్రూ ప్రభుత్వం 29 జూలై 1953లో కాకా కలేల్కర్‌ అనే బ్రాహ్మణుడి అధ్యక్షతన బిసి కమిషన్‌ వేసింది. దేశ వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేసిన కాకా కలేల్కర్‌ కమిషన్‌ దాదాపు 3,000 కులాలను బిసి కులాలుగా గుర్తించి. వారి తరతరాల వెనుకబాటు తనానికి అంటరాని తనం, కుల వివక్ష (సామాజిక వెనుకబాటుతనం) కారణమని తేల్చి చెప్పింది. ఈ వెనుకబాటు తనాన్ని తుడిచివేసేందుకు అన్ని రంగాలలో రిజర్వేషన్ల కల్పనను ప్రతిపాదించింది. 1955 మార్చి 30వ తేదీన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 
తాము అనుకున్న అంచనాలను తారుమారు చేసిన బిసి కులాల వాస్తవ జీవన దౌర్బల్యం అగ్ర కుల పాలక పక్షాల మనస్సును కదిలించలేకపోయింది.

బిసిల రిజర్వేషన్ల ఆవశ్యకతను చాటిచెప్తున్న కలేల్కర్‌ కమిషన్‌ రిపోర్టును బుట్టదాఖలు చేసే కుట్రను నెహ్రూ తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. అనుకున్నదే తడవుగా కాకా కలేల్కర్‌ను పార్లమెంటులోని సెంట్రల్‌ హాలుకు పిలిపించి తీవ్రంగా మందలించడమేకాక, తను సమర్పించిన నివేదక పట్ల తనకే విశ్వాసం లేదని ఒక రిపోర్టు ఇవ్వవలసిందిగా ఆదేశించాడు. దీనితో కథ మొదటికి వచ్చింది. ఇంత జరుగుతున్నా ప్రశ్నించగలిగే బిసి నాయకత్వం నాటి పార్లమెంటులో లేకపోవడం విచారకరం.

50 శాతానికి పైగా ఉన్న బిసి కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం అంటే చట్ట సభలలో రిజర్వేషన్‌ కల్పిస్తే ఇంకెప్పటికీ అగ్రకులాలు పాలక పక్షంగా ఉండలేవన్న నిజాన్ని నెహ్రూ భరించలేకే ఇంతటి పనికి పూనుకున్నాడు. బిసి రిజర్వేషన్లను అమలు చేయవద్దని, కలేల్కర్‌ కమిషన్‌ను పెడచెవిన పెట్టాలంటూ కాంగ్రెస్‌ పాలిత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రు లకు రహస్య ఉత్తరాలు (ఆర్డర్‌) రాసి మరోసారి మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా బిసి రిజర్వేషన్ల చరిత్రను తల్లక్రిందులు చేశాడు. 

ఆ తరువాత 1979జనవరి 1న జనతా ప్రభుత్వం ప్రముఖ పార్లమెంటేరియన్‌ బి.పి. మండల్‌ అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించింది. డిసెంబర్‌ 1989 లో ఆ కమిషన్‌ తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో బిసి వెనుకబాటు తనాన్ని, రిజర్వేషన్ల ప్రాముఖ్యతను మరొక్కసారి బలపరిచింది. కానీ పార్లమెంటులో చట్టం చేసే ధైర్యం నాటి జనతా ప్రభుత్వానికి లేకపోయింది. అందుకు కారణం, పాలక పక్షాలుగా, ప్రభుత్వాధి నేతలుగా బ్రాహ్మణ- అగ్రకులాలు ఉండడమేనని ఇప్పటికీ బహుజన వర్గాలు గ్రహించలేకపోతున్నాయి.

అగ్రకులాల కుట్రలకు బలవుతూ, వారికి ఓటు బ్యాంకుగా మారిన దుస్థితిని మార్చేందుకు ప్రయత్నించకపోవడం చైతన్య రాహిత్యమే అవుతుంది. బిసి రిజర్వేషన్ల డిమాండ్‌ను మరొక్కసారి బి.ఎస్‌.పి. పార్టీ ముందుకు తెచ్చింది. ‘గద్దె దిగుతావా? మండల్‌ రిపోర్టు అమలు చేస్తావా? అన్న కాన్షిరామ్‌ నినాదం దేశమంతటా ప్రతిధ్వనించింది. మండల్‌ కమిషన్‌ రిపోర్టును అమలు చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన వి.పి. సింగ్‌ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాలలో మాత్రమే రిజర్వేషన్లను అమలు చేయగలిగింది. కానీ రాజ్యాధికారానికి వ్యవస్థా నిర్మాణానికి, ధర్మ పరివర్తనకు, కుల నిర్మూలనకు దారులు వేసే చట్టసభలలో రిజర్వేషన్ల గురించిన అంశాన్ని మాత్రం మరుగున పడేసింది. ఈ ప్రభుత్వాల పరిస్థితి చూస్తే నోటితో హర్షించి నొసటితో వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది.

ఈ రకంగా బిసిలకు రాజకీయ రిజర్వేషన్‌లు లేకపోవడం మూలంగా అధికారం, వనరులు, డబ్బుపైన ఆధిపత్యం అగ్ర కులాలను శాశ్వత పాలక పక్షాలుగా మార్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క దామోదరం సంజీవయ్య (2 సంవత్సరాలు) తప్ప మిగిలిన పాలకులంతా మైనారిటీ జనాభా కలిగిన రెడ్డి (10), కమ్మ (3), బ్రాహ్మణ (1), వైశ్య (1) కులస్థులే. ఈ రాష్ట్రాన్ని సుమారు 40 సంవత్సరాలు రెడ్లు, 20 సంవత్సరాలు కమ్మ- ఇతర అగ్రకులాలు పరిపాలించాయి. కేంద్రంలో గత 63 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న కులాలు అగ్రకుల బ్రాహ్మణ వర్గాలే.

50 శాతంగా ఉన్న బిసి కులస్థులలో ఏ ఒక్కరినీ, ఏ పార్టీకి చెందినవారైనా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా చేసే అవకాశం దరిదాపుల్లో కనిపించడం లేదు. ఈ పరిస్థితికి కారణం బిసివర్గాల్లో చైతన్యం లోపించడమే. మైనారీటీ జనాభా కలిగిన కులాలకి/ జాతులకి చట్ట సభలలో ప్రాతినిధ్యాన్ని కల్పించేందుకు జర్మనీ, బొలీవియా, వెనుజుల, న్యూజిలాండ్‌, స్కాటిష్‌, హంగరీ, అమెరికా వంటి దేశాల్లో ప్రత్యేక ఎన్నికల విధానం అమలులో ఉంది. యూరప్‌లోని 21 దేశాలలో కనీస జనాభా కలిగిన జాతులకు కూడా చట్ట సభలలో ప్రాతినిధ్యం కల్పించే ఎన్నికల విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కానీ భారతదేశ ఎన్నికల విధానంలో అలాంటి వెసులుబాటు ఏదీ లేకపోవడం వల్ల బిసిల్లో, ఎస్సీల్లో అనేక కులాలు నేటికీ అసెంబ్లీ లేదా పార్లమెంటు గుమ్మం ఎక్క లేకపోతున్నాయి.

‘రాజ్యాధికారం పొందలేని జాతులు/ కులాలు చరిత్రలో అంతరిస్తా’యని మాన్యశ్రీ కాన్షీ రామ్‌ చెప్పినట్టు, బిసిల రాజ్యాధికారం అసాధ్యమైనప్పుడు అది తప్పక జరిగి తీరుతుంది. ఒకవైపు బిసిలకు చట్ట సభలలో ప్రాతినిధ్యం లేకుండా చేయడం, చట్ట సభలలో ఎస్సీ కులాలకు ఉన్న ప్రాతినిధ్య సౌకర్యం- ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగేంతగా లేకుండా పోవడం- అగ్ర కులాల విజయానికి దోహదం చేస్తుంది. 5 శాతం మించిన రెడ్లు 90 కి మందికిపైగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 52 శాతానికి మించిన బిసి కులాల ఎమ్మెల్యేలు 50 శాతానికి మించిలేరు.

ఇది ఆధిపత్య వర్గాల రాజకీయ దోపిడీ కాక మరేమవుతుంది? అగ్ర కులాల ఆధిపత్యం ధ్వంసం కావాలంటే బిసి కులాల చైతన్యం వారిని రాజ్యాధికారం వైపు నడిపించాలి. బిసి కులాల్లో చైతన్యం- ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా రూపాంతరం చెందకపోతే అగ్రకులాల అరాచకం కలకాలం కొససాగుతుంది.
కుల నిర్మూలనకు కిటికీలను, తలుపులను మూసేస్తుంది. మహాత్మా జ్యోతిరావ్‌ పూలే, రాజశ్రీ సాహూజీ మహరాజ్‌, పెరియార్‌, డా అంబేడ్కర్‌ కలలుగన్న- అణగారిన వర్గాలకు రాజ్యాధికారం, ప్రబుద్ధ భారత్‌ నిర్మాణం సాకారం కావాలి. బిసిలను చైతన్యవంతం చేసి, ఐకమత్యంగా పోరాడి రాజ్యాధికారానికి స్వయంగా దారులు వేసుకోవాలి.


Surya Telugu News Paper Dated : 13/5/2013

No comments:

Post a Comment