Saturday, May 18, 2013

ధిక్కార పతాక కలేకూరి - కలేకూరి ప్రసాద్ ----పైడి తెరేష్ బాబు  'నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ
వేలఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను'
-కలేకూరి ప్రసాద్
తనెవరో, తన మూలాలేమిటో గుర్తించిన ఒక మూలవాసి చేసిన సాధికార ప్రకటన ఇది. పిడికెడు ఆత్మ గౌరవం కోసం, తనదైన జీవితం కోసం మరణం గొంతు మీద కాలేసి నిలదీసిన వైనమిది. ఒక విధంగా సాహసమే. ఔను కలేకూరి ప్రసాద్ నిజంగా సాహసి. చావు అతన్ని చూసి జడుసుకుంది తప్ప చావుకు అతనెప్పుడూ భయపడలేదు. పోయినట్టున్నాడేమో అని అనిపించడం, అంతలోనే బతికి ఉన్నాన్రా అని కబురు పెట్టడం అయిదారుసార్లు చేశాడు. అందుకే అతడు పోయాడని వార్త అందాక కూడా వెంటనే నమ్మబుద్ధి కాలేదు. అంబులెన్స్‌లో బాడీని ఒంగోలు నుంచి కంచికచర్ల తీసుకొస్తున్నారని తెలిశాక నమ్మక తప్పలేదు. గమ్మత్తేమిటంటే అతని శరీరంలో అతనెప్పుడూ లేడు. శరీరానికి అతీతుడు కలేకూరి ప్రసాద్. ఫార్మాలిటీస్‌తో పన్లేకుండా ప్రపంచాన్ని బిగియారా కౌగింలించుకున్న పిచ్చి ప్రేమికుడు. ఒకళ్ళ సంగతేమోగానీ నాకు అతడట్లాగే కనిపించాడు.
పుట్టింది కృష్ణా జిల్లా కంచికచర్లలో కావచ్చు. ఉద్యమరూపంలో దేశమంతా పరుచుకుపోయాడు. ఆత్మ గౌరవనినాదమై అంతర్జాతీయ వేదికపై (డర్బన్ సదస్సు) మారు మ్రోగాడు. కాలంతోపాటు ప్రవహిస్తూ, మలుపు మలుపునా కవిగా కార్యకర్తగా నాయకుడిగా, గాయకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, పాత్రికేయుడుగా, మధుపాత్రికేయుడుగా, ప్రేమికుడిగా, కాముకుడిగా, సాయుధుడుగా, నిరాయుధుడుగా ఒక కొత్త రూపాన్ని ఆవిష్కరించుకుంటూ పోయిన బహురూపి. సిద్ధాంతపరంగా విప్లవవాదిగా మొదలై దళితవాదిగా కొనసాగాడు. మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని రెండు కళ్ళు చేసుకుని దృష్టికోణాన్ని విస్తరించుకున్నాడు. విప్లవోద్యమంలోని అపసవ్యతల్ని ప్రశ్నించాడే తప్ప విప్లవ సిద్ధాంతాన్ని తప్పుపట్టలేదు. ఉద్యమాలను నిర్మించి పాలకుల డైనింగ్ టేబుళ్ళ మీద పరవడాన్ని నిలదీశాడు.
ఉద్యమ జీవితం ఆరంభించాక ప్రతి సంఘటనకు స్పందించాడు కలేకూరి. కారంచేడు దళితుల మారణకాండ తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమానికి అతడు మరికొందరి సాయంతో రాసి ప్రదర్శించిన ఒగ్గు కథ ఉద్యమానికి ముఖచిత్రం అయింది. ఆ తర్వాత చుండూరు, వేంపెంటలలో జరిగిన దళితుల నిరసనగా అక్షరాల్ని అగ్నిశరాలుగా చేసి సంధించాడు. చలపతి విజయవర్ధనంల ఉరిశిక్షలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అతని మాటలు పాటలు వీధి వీధినా మారుమ్రోగాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్ట్ డైరెక్టర్ (మహబూబ్‌నగర్)గా, సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ సంచాలకుడుగా, ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు సలహాదారుడుగా ఎన్నో పాత్రలు నిర్వహించాడు. ఎక్కడా కుదురుగా నిలవకపోవడం అతని ప్రత్యేకత. అందుక్కారణం ఉంది. ప్రధానంగా అతను స్వేచ్ఛావాది అరాచక వాది. ఒక మూసలో ఇమిడేరకం కాదు. బంధాలకు, అనుబంధాలకు, సంకెళ్ళకు, ప్రేమలకు, పెళ్లిళ్లకు, స్నేహాలకు, దేహాలకు చిక్కినట్టే చిక్కి లిప్తపాటులో తప్పించుకుపోగల అపర పాపియాన్. అందుకే ప్రపంచం అతన్ని ప్రేమగా కౌగిలించుకు మరీ వెలివేసింది. అయినాసరే ప్రపంచాన్ని సవాలు చేయడం ఆపలేదతను.
'మీకు చేతనైతే
నా శవాన్ని ఈ దేశం ముఖ చిత్రంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను
ఒక పెనుమంటల పెనుగులాటనై
మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను'
-పైడి తెరేష్ బాబు  


Andhra Jyothi Telugu News Paper Dated : 19/5/2013

No comments:

Post a Comment