Monday, September 2, 2013

తెలంగాణను స్వాగతిద్దాం ---కృపాకర్ మాదిగ

 

September 03, 2013
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం పట్ల కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలకు ఉన్న అపోహలు, దురభిప్రాయాలను తొలగించడంలో నాలాంటి వారి శక్తి యుక్తులు సరిపోకపోవడం పట్ల తీవ్రంగా విచారిస్తున్నాను. ఈ పరిస్థితికి కారకులెవరు? ఆర్థిక, సామాజిక, రాజకీయ నియంత్రణా శక్తులతో పాటు ప్రసార, ప్రచార మాధ్యమాల్ని గుప్పిటబట్టి, తమ స్వార్థ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు అనువుగా దురభిమానాన్ని వండి, తప్పుడు చైతన్యంతో సాధారణ ప్రజల్ని తెలంగాణకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న రెండు, మూడు సీమాంధ్ర ఆధిపత్య కులాల వారే ఇందుకు బాధ్యులు.
ఆంటోనీ కమిటీ, కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో తలెత్తిన ముఖ్యమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలి. అందుకు, అణచివేతలకు, వెనుకబాటుతనాలకు గురైన తెలంగాణ, రాయలసీమ కోణాల నుంచి, అణగారిన సామాజిక వర్గాలు, జెండర్, మైనారిటీల వైపు నుంచి ప్రాధాన్యతలతో కూడిన సానుకూల దృక్పథాన్ని అనుసరించాలి. ఈ విధానంతో ఎటువంటి సమస్యకైనా న్యాయబద్ధ రాజకీయ పరిష్కారం దొరుకుతుంది. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపిణీ, సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు, నిధులు, ఉద్యోగాలు, విధులు మొదలగు అనేక పంపకాల సమస్యల సందర్భాల్లో పనిచేసే అత్యున్నత ప్రభుత్వాధికార సంస్థలు, వ్యవస్థలు అణచివేతలు, వెనుకబాటుతనంను ప్రాతిపదికలు చేసుకోవాలి.

హైదరాబాద్‌ని తెలంగాణ రాష్ట్రానికి మిగల్చనీయకుండా సీమాంధ్ర రాజకీయ పార్టీలు లేదా సీమాంధ్ర ఆధిపత్య కులాలు చేస్తున్న ప్రతిపాదనలు అర్థం లేనివి, స్వార్థపూరితమైనవి. దేశానికి రెండో రాజధానిగానో, సీమాంధ్రకి కూడా రాజధానిగానో, కేంద్ర పాలిత ప్రాంతంగానో హైదరాబాద్‌ని మార్చమని అడుగుతున్న వీరు సినిమా స్టూడియోలు, వ్యవసాయ క్షేత్రాలు, ఎస్టేట్లు, కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటళ్లు, క్లబ్బులు, పార్కులు, హోటళ్ళు ఇంకా రకరకాల సంస్థల నిర్వహణ పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీమాంధ్ర ఆధిపత్య కులాలకి చెందిన కొద్దిమంది వెనకేసుకున్న వేలాది ఎకరాల విలువైన భూములను ఇళ్ళువాకిళ్ళు లేకుండా కూలీనాలీ చేసుకుంటున్న లక్షలాది మంది హైదరాబాద్ పేద వర్గాలకు ఇళ్ళ స్థలాల కింద కేటాయించమని డిమాండ్ చేస్తే బాగుంటుంది. హైదరాబాదులోని బీదవారి కమ్యూనిటీ అవసరాల కోసం వీటిని కేటాయించమని సీమాంధ్ర రాజకీయ పార్టీలు ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేపడితే హర్షిస్తాం.

తమ పరిశ్రమలు, వ్యాపారాలు, ఇతర సంస్థల్లో గల ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో అణగారిన సామాజిక వర్గాలు, ప్రాంతాలకి ఏమాత్రం ప్రాధాన్యత, రిజర్వేషన్లు కల్పించకుండా అమానవీయంగా వ్యవహరిస్తున్న సీమాంధ్ర పెట్టుబడిదార్లు, సం పన్న వర్గాలు ఈ రోజు రాజకీయ పార్టీలను అడ్డంపెట్టుకొని తమ గొంతెమ్మ కోర్కెలను సామాన్యుల కోర్కెలుగా చిత్రం చబూనుకుంటున్నాయి. మీ దుర్నీతి, అసాంఘిక, అన్యాయ రాజకీయాలను ఇకనైనా ఆపేస్తే అందరికీ క్షేమం కలుగుతుందని సీమాంధ్ర రాజకీయ పార్టీలకు సూచిస్తున్నాను.

మొదట తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగంగా, నిరాఘాటంగా కొనసాగాలి. ప్రతి దశలో తెలంగాణ వారికి అనుకూలమైన పరిష్కారం లభించాలి. ఈ ప్రక్రియ సాగతీతకు ఆస్కారం లేని విధంగా వీలైనంత త్వరగా ముగియాలి. హైదరాబాదు రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. ఇందుకు సీమాంధ్ర ప్రజలు గానీ, సీమాంధ్ర రాజకీయ పార్టీలు గానీ సహకరించినందువలన వారికి కలిగే నష్టమూ, కష్టమూ ఏమీ లేదు. ముప్పై కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో యాభై రాష్ట్రాలు ఉన్నాయి. నూట ఇరవై కోట్ల మంది జనాభా కలిగిన భారతదేశానికి ఇంకా ఎన్నో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు కావలసిన అవసరం ఉంది. దేశంలో హిందీ మాట్లాడే ప్రజలున్న రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. ఇలాంటపుడు దేశం లోపలా వెలుపలా రెండో అతిపెద్ద భాషా జనాభాగా ఉన్న తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా ఏర్పడటాన్ని అందరూ సంతోషంతో స్వాగతించాలి.

రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న యీ చారిత్రక సందర్భంలో సీమాంధ్రలోని బహుజన కులాల ప్రజలు ఆధిపత్య కులాల రాజకీయ ఉచ్చుల్లో చిక్కుకోరాదు. తెలంగాణ ప్రజల పట్ల తమ సౌహార్ద్రత, సంఘీభావం, సహోదరత్వాలను సదా నిలుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరాదు. ఒకవేళ వదులుకుంటే బాధలకు గురైన ప్రాం తంలోని బాధితులైన ప్రజల పట్ల చారిత్రక తప్పిదం చేసినవాళ్ళ మౌతాం. డాక్టర్ అంబేద్కర్ నుంచి మాయావతి వరకు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుసరిస్తున్న సానుకూల దృక్పథాన్ని సీమాంధ్రలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ంతా అనుసరించాలని, బలపరచాలని అప్పుడే సరైన అంబేద్కర్, కాన్షీరామ్ వారసులం కాగలమని ప్రజలుగుర్తించాలి.

తెలంగాణ రాష్ట్ర సాధనా రాజకీయ సంస్థల్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా సీమాంధ్ర రాజకీయ శక్తులు తెలంగాణ ప్రాంతానికి చెందిన కొద్దిమంది దళిత బహుజన నాయకుల చేత నూతన రాజకీయ పార్టీలను పెట్టించే అవకాశం ఉంది. రాబోయే సాధారణ ఎన్నికల్లో ఇలాంటి ప్రాయోజిత పార్టీల అభ్యర్థుల్ని ఎన్నికల పోటీలోకి దింపి, తెలంగాణ ఓట్లను చీల్చి, తెలంగాణ రాష్ట్రోద్యమ వాదాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రాయోజిత శక్తుల పట్ల దళిత బహుజనులంతా అప్రమత్తంగా ఉండాలి.

డెబ్బయ్యేళ్ళ ఆధిపత్య కులాల అణచివేతల పాలనలో దళిత బహుజనులకు విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ, సాంస్కృతిక తదితర రంగాలన్నింటిలో పూడ్చలేని, తీరని అన్యాయమే జరిగింది. అదే మిగిలింది. మనం (దళిత బహుజనులం) కోల్పోయిన మానవ గౌరవాన్ని, హక్కుల్ని, అధికారాన్ని, జేష్ఠత్వాన్ని ఉద్యమించి సాధించుకోవాల్సిన విపత్కర పరిస్థితుల్లో వున్నాం. ఇందుకోసం మనకున్న శక్తియుక్తుల్ని, వనరుల్ని రాజ్యాధికార ఎజెండాగా మలుద్దాం. మహాశక్తిగా విజృంభిద్దాం. అంతేకానీ, సీమాంధ్ర పాలక కులాల రాజకీయ స్వార్థపు ఆటలో పాచికలుగా మనం మారొద్దు. బర్చరీకులుగా బలికావొద్దు.

No comments:

Post a Comment