Monday, September 16, 2013

ఆసఫ్‌జాహీల ఆఖరి ఘట్టం - డాక్టర్ ఫజులుల్లా ఖాన్


September 17, 2013
భారత్‌లోని 600 సంస్థానాలలో అతి పెద్దదైన హైదరాబాద్ సంస్థానాన్ని ఉస్మాన్ అలీఖాన్ మూడున్నర దశాబ్దాలు పాలించాడు. ప్రపంచంలోనే సర్వ సంపన్నులలో ఒకడైన నిజాం బ్రిటిష్ వారికి సన్నిహితంగా వ్యవహరించాడు. కోటిన్నర ప్రజలకు పాలకుడైన నిజాం కొలువులో 2600 మంది జమిందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు వుండేవారు. పదివేలకు పైగా గ్రామాలలో లక్షలాది ఎకరాల భూములు భూస్వాముల స్వాధీనంలో వుండేవి.
1947 ఆగస్టులో దేశమంతటికీ స్వాతంత్య్రం వచ్చింది. అయితే భారత ప్రభుత్వంలో చేరడానికి నిజాం అంగీకరించలేదు. నిజాం స్వాతంత్య్రాన్ని భారత ప్రభుత్వం అంగీకరించలేదు.

ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి నిజాం నవాబు -భారత ప్రభుత్వం మధ్య ఒక తాత్కాలిక ఒడంబడిక కుదిరింది. దీన్ని యథాతథ ఒడంబడిక అన్నారు. ఈ పత్రం మీద భారత ప్రభుత్వం తరఫున గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్, హైదరాబాద్ తరఫున హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ ది నిజాం ఆఫ్ హైదరాబాద్ అండ్ బేరార్ సంతకాలు చేశారు. ఆ ఒడంబడికపై సంతకం చేయడం అంటే ఒక రకం గా హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించినట్టే. ఉత్తర, దక్షిణ భారతదేశానికి మధ్య రోడ్డు, రైల్వే రవాణాకు హైదరాబాద్ అనుమతించింది.


సంతకాలు జరిగిన మరుక్షణం నుంచి హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాలను భారత ప్రభుత్వం ముమ్మరం చేసింది. 1948 ఏప్రిల్ 16న బొంబాయిలో జరిగిన ఏఐసీసీ రహస్య సమావేశంలో హైదరాబాద్ పరిణామాలను చూస్తూ ఊరుకోమని, సమయం కోసం చూస్తున్నామని నెహ్రూ చెప్పారు. ఇదే విషయాన్ని నెహ్రూ, సర్దార్ పటేల్‌కు రాసిన ఉత్తరంలో కూడా పేర్కొన్నారు. 1948 జూన్ 2న ఊటీలో బహిరంగ సభలో నెహ్రూ తన అంతరంగాన్ని బయటపెట్టారు. హైదరాబాద్ పరిణామాలను గమనిస్తున్నాం. ఇక ఆ ప్రభుత్వానికి మాతో విలీనమైపోవడం తప్ప మార్గాంతరం లేదని హెచ్చరించారు. అప్పటికే దేశ విభజన, మత హింసాకాండ కారణంగా బద్నాం అయి ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని నెహ్రూ, పటేల్‌కు పదే పదే సూచించారు.

నెహ్రూ-పటేల్ ఉత్తరాల పేర ప్రచురితమైన పుస్తకంలో హైదరాబాద్‌తో ఎలా వ్యవహరించాలో నెహ్రూ రాశారు. భారత యూనియన్‌లో భాగంగా హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం స్థాపించాలనే ఆశయంతో స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం ప్రారంభించింది. సర్వస్వతంత్రుడిగా ఉండిపోవాలన్న ఉద్దేశంతో నిజాం, రైతు-కూలీ రాజ్యం స్థాపించాలని కమ్యూనిస్టులు ఎవరి ప్రయత్నాలలో వారుండిపోయారు. 1948 జూలై 19న మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి సారథ్యంలో దాడుల ప్రణాళిక సిద్ధమైంది. భారత ప్రభు త్వం హైదరాబాద్ ముట్టడికి ముందే సరుకుల రవాణా నిలిపివేయాలని, పొరుగు నుంచి ఎలాంటి సహకారం అందకుండా చర్యలు తీసుకోవాలని సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని ఆదేశించింది.


ఇది తెలుసుకున్న నిజాం భారత సైన్యం దాడి చేస్తే ఎదుర్కోవడానికి కావలసిన ఆయుధాలను కొనడానికి తన సైనిక కమాండర్ మేజర్ జనరల్ ఎండ్రూస్‌ను లండన్‌కు పంపాడు. కానీ బ్రిటన్ ఆయుధాలు అమ్మకుండా భారత్ మేనేజ్ చేయగలిగింది. కొంతవరకు సమకూర్చుకున్నా అవి హైదరాబాద్‌కు చేరకుండా అన్ని పోర్టులు, విమానాశ్రయాలలోనే నిలిపేసేలా ఆదేశాలిచ్చింది. హైదరాబాద్‌కు ఏది చేరాలన్నా భారత నౌకాశ్రయాలు, బొంబాయి, మద్రాసు విమానాశ్రయాల నుంచే రావాలి. అది సాధ్యం కాలేదు. హైదరాబాద్ సంస్థానాన్ని రెండు వైపుల నుంచి ముట్టడించాలన్నది పథకం. పశ్చిమాన ఉన్న షోలాపూర్ నుంచీ తూర్పున ఉన్న విజయవాడ నుంచి ముట్టడి మొదలు పెట్టాలని నిర్ణయించారు.

1947 ఆగస్టు 17, హైదరాబాద్ సంస్థానానికీ, భారత ప్రభుత్వానికీ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా కోరుతూ తమ ప్రభుత్వం ఐరాస భద్రతా మండలిని ఆశ్రయిస్తోందంటూ నైజాం సంస్థా నం ప్రధాని లాయక్ అలీ భారత ప్రధాని నెహ్రూకు వర్తమానం పంపారు. హైదరాబాద్ ప్రతినిధుల విమాన ప్రయాణానికి నెహ్రూ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నిజాం విదేశాంగమంత్రి నవాబ్ మోయిన్ నవాజ్‌జంగ్ సారథ్యంలో హైదరాబాద్ బృందం పాకిస్థాన్ వెళ్ళి; అక్కడి నుంచి విమానమెక్కి ప్యారిస్ చేరుకుంది. నిజాం ప్రభుత్వ ప్రతినిధి బృందం సెప్టెంబర్ 10న ఐక్యరాజ్యసమితికి ఈ విషయాన్ని నివేదించింది.


అదే రోజు 'మేం సికింద్రాబాద్‌ను మా ఆధీనంలోకి తీసుకోక తప్పడం లేదని' నెహ్రూ ప్రకటించారు. మరుక్షణమే అప్పటిదాకా ఒప్పందంలో భాగంగా నిజాంకు సేవలందిస్తూ వచ్చిన బ్రిటిష్ సైనికాధికారులంతా రాజీనామా చేశారు. సెప్టెంబర్ 11న పాకిస్తాన్ నేత మహమ్మద్ అలీ జిన్నా మరణించారు. నెహ్రూ చేసిన ప్రకటనను హైదరాబాద్ ప్రతినిధులు సెప్టెంబర్ 12న ఐక్యరాజ్యసమితి దృష్టికి తెచ్చారు. భారత్ ఒక స్వతంత్ర రాజ్యం మీద దురాక్రమణకు పూనుకుంది. ఆ దేశ ప్రధాని ప్రకటనే అందుకు నిదర్శనమని వారు నివేదించారు. వీలైనంత తొందరగా దీనిని చర్చకు తీసుకోవాలని కోరారు. భద్రతామండలి సెప్టెంబర్ 15న చర్చించడానికి ఎజెండాలో చేర్చింది. ఆ తరువాత నెహ్రూ హైదరాబాద్‌పై సైనిక చర్యకు ఆదేశాలిచ్చారు. సెప్టెంబర్ 13న భారత సైన్యం మూడు దిక్కుల నుంచి హైదరాబాద్‌ను ముట్టడించింది.

నిజాం సైన్యం మూడు వారాలు ప్రతిఘటించవచ్చని భారత సైన్యం అంచనా వేసుకుంది. పశ్చిమదిక్కు ముట్టడి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సరిహద్దులోపల నాల్‌దుర్గ్ దగ్గర నిజాం సైన్యం ప్రతిఘటిస్తుందేమో, ఆ ఇరుకు దారిలో బ్రిడ్జిని కూలగొట్టి అవరోధాలు సృష్టిస్తుందేమోనని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా అక్కడెవరూ లేరు. భారత సైన్యం హైదరాబాద్ మీద చేసిన దాడి భయంకరమైనది. ఈ దాడుల్లో అనేక అకృత్యాలు కూడా జరిగాయి. చెట్టుకొక్కరు, పుట్టకొక్కరు అయ్యారు. పాకిస్తాన్‌లో హిందువులపై జరిగిన దాడికి ఇక్కడి ముస్లింలపై దాడి చేయడమే సమాధానమని భావించిన ఉన్మాదులు కొందరు హైదరాబాద్ స్టేట్‌లోని మరఠ్వాడా ప్రాంతపు గ్రామాలలో యథేచ్ఛగా హింసాకాండకు పాల్పడ్డారు.

మరఠ్వాడా ప్రాంతంలో పరిస్థితి అది కాగా, తెలంగాణలోది భిన్నమైన స్థితి. నిజాం స్టేట్‌లోని దొరల ఆస్తుల్ని కాపాడడానికి ఏర్పాటైన కిరాయి గుండాలు రజాకార్లుగా పాపులర్ అయ్యారు. ఆదిలాబాద్, కరీంగనర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, నాందేడ్, జాల్నా, ఫర్‌బణి, లాతూర్, బీజాపూర్, రాయచూర్‌కు చెందిన జమిందారులంతా హిందువులే. చరిత్రకారులు చెబుతున్నట్టు రజాకార్లు హిందువుల్ని ఊచకోత కోసి దోచుకుని వుంటే ఈ జమిందారుల వద్ద సెంటు భూమి మిగిలేదా అనే ప్రశ్న వస్తుంది. రజాకార్లను అదుపు చేసే సాకుతో ప్రవేశించిన భారత సైన్యం సాయుధపోరాటంలో రైతులు ఆక్రమించిన 10లక్షల ఎకరాల భూమి లాక్కొని తిరిగి భూస్వాములకు అప్పగించింది.


మేజర్ ధనరాజులు నాయుడు సారథ్యంలో తూర్పు దిక్కు నుంచి వస్తున్న భారత సైన్యం ఎటువంటి ప్రతిఘటనా లేకపోవడంతో సూర్యా పేట వరకు వచ్చేసింది. అక్కడ మాత్రం 'అల్లాహో అక్బర్, ఉస్మాన్ జిం దాబాద్' అని అరుస్తూ కొద్ది మంది కుర్రాళ్లు ఎదురయ్యారు. ఒక్క రౌండు తుపాకీ గుళ్ల వర్షానికి ముగ్గురు కూలబడ్డారు. మిగిలిన వారు చెల్లాచెదురయ్యారు. సైన్యం ముందుకు కదిలింది. ఔరంగాబాద్ భారత్ వశమైనదంటూ 'ఆకాశవాణి ఔరంగాబాద్' చేసిన ప్రకటన దక్కన్‌రేడియోలో కలవరం రేపింది. స్టేషన్ డైరెక్టర్ జఫరుల్ హసన్ మెల్లగా స్టేషన్ నుంచి బయటకొచ్చారు. సెప్టెంబర్ 16 ఉదయం, డైరెక్టర్ జనరల్ దీన్‌యార్ జంగ్ రేడియో స్టేషన్ డైరెక్టర్ జఫరుల్ హసన్‌ను పిలిచి మీ ప్రకటనలూ, ప్రసంగాలన్నీ ఆపేసి విరామ సంగీతం వెయ్యండి అని ఆదేశించారు.


భారత ప్రభుత్వం అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంది. హైదరాబాద్ సంస్థానంలో తమ ప్రతినిధి అయిన కె.ఎం. మున్షీని కంటోన్మెంట్ నుంచి ప్రధాని నివాసం షా మంజిల్ (ఇప్పటి రాజ్‌భవన్) పక్కనే ఉన్న లేక్ వ్యూ అతిథి గృహానికి తరలించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. మున్షీ అప్పటికే కీలకమైన రికార్డులన్నింటినీ రక్షణ శాఖకు తరలించారు. సెప్టెంబర్17 మధ్నాహ్నం 12 గంటల ప్రాంతంలో నిజాం వ్యక్తిగతంగా మున్షీకి వర్తమానం పంపారు. నాలుగు గంటలకు రమ్మని ఆహ్వానం.

ఆ సాయం త్రం మున్షీ కింగ్ కోఠీ వెళ్ళే సరికి ప్రధాని లాయక్ అలీ రాజీనామా లేఖను మున్షీ చేతికిచ్చారు. జనరల్ చౌదరి రావటానికి ఇంకా ఒక రోజు పట్టొచ్చు. నగరంలో అల్లర్లు చెలరేగకుండా ముందు ఎల్ ఎడ్రూస్‌ను జాగ్రత్తలు తీసుకోమనండి అని మున్షీ అనునయించారు. మీరు వచ్చి పోలీసు చర్యను స్వాగతిస్తూ రేడియో ప్రకటన చెయ్యండని నిజాంను మున్షీ కోరారు. మొదటిసారిగా నిజాం రేడియో స్టేషన్‌లో అడుగుపెట్టారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేదు. కనీసం ఆయన ఇంగ్లీషు ప్రకటనను ఉర్దూలోకి అనువదించినవారు లేరు. ఆ ప్రకటనతో ఒక శకం ముగిసింది.


బాగా బతికిన వారు, ఉన్నత హోదాల్లో వున్న ముస్లింలు పరిస్థితులు సవ్యంగా లేకపోవడంతో తమ ఆస్తులు తక్కువ ధరకు అమ్ముకుని ఇంగ్లండ్, పాకిస్థాన్‌లకు వెళ్ళిపోయారు. నిజాం నీడలో తెలంగాణప్రజల్ని దోచుకున్న దొరలు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు తమ షేర్వాణీలు విడిచి ఖద్దరు ధోవతీలు, కాంగ్రెస్ కండువాలు, టోపీలు ధరించి అనంతర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ అనేక రాజకీయ స్థానాల్లో వారి వారసులే వెలిగిపోతున్నారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ద్వారా హైదరాబాద్ స్టేట్‌లో జరుగుతున్న మారణహోమం గురించి తెలుసుకున్న ప్రధాని నెహ్రూ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పండిట్ సుందర్‌లాల్ నేతృత్వంలో ఖాజీ మొహమ్మద్ అబ్దుల్ గఫార్ సభ్యునిగా ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. గుడ్ విల్ మిషన్ అనే పేరుతో సుందర్‌లాల్, గఫార్ బృందం హైదరాబాద్ ప్రాంతమంతా విస్తృతంగా పర్యటించింది. గ్రామాల్లో, ముఖ్యంగా మరఠ్వాడా ప్రాంతంలో అమాయక ముస్లింలను ఊచకోత కోసిన సంఘటనలను ఈ కమిషన్ వెలుగులోకి తెచ్చింది. గ్రామాల్లో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్లు వివరించిన ఈ బృందం నివేదిక భారత ప్రభుత్వాన్ని కలవరపరిచింది. ఈ నివేదిక అధికారికంగా వెలుగు చూడలేదు.

No comments:

Post a Comment