Thursday, September 12, 2013

ఎన్ని ప్రణాళికలైనా ఎస్‌సి,ఎస్‌టిల నిధుల దారి మళ్లింపు By Dr K Asaiah IIS

గురువారం , సెప్టెంబర్ 12 ,2013


భారతదేశంలో పేదరికాన్ని, అవిద్య, వెనుకబాటు తనాన్ని తొలగించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నాయి. కాని ఆ నిధులు కేటాయించిన పనులకు, అంశాల కోసం వ్యయం చేయకుండా వేరే పనులకు మళ్లించడంతో ఎస్‌.సి. ఎస్‌.టిలలో అభివృద్ధిచెందక ఇంకా పేదరికంలోనే మగ్గుతు న్నారు. దీనికి ఎవరు బాధ్యులు? ఉద్యోగసామ్యం, రాజకీయ కార్యనిర్వహక వర్గం బాధ్యత వహించక తప్పదు. ఇప్పటికీ పదకొండు ప్రణాళికలు అమలయ్యాయి. కాని ఎస్‌.సి.ఎస్‌టిలలో 42శాతం మంది పేదరికం, అవిద్యతో మగ్గుతున్నారు. కారణం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించిన నిధులు వారి కోసం ఖర్చు చేయడంలేదు. వాటిని వేరే పనులకు ఖర్చు చేస్తున్నట్లు ఆదాయవ్యయ నివేదికలు తెలుపుతున్నాయి. పార్లమెంటులో ఎస్‌.సి.ఎస్‌.టిల అభివృద్ధిపై జరిగిన చర్చలో డిసెంబరు 20 12లో తెలిపిన వివరాల ప్రకారం ఆయా రాష్ట్రాలు ఎస్‌సి. ఎస్‌టిలకు కేటాయించిన నిధులు సుమారు 10వేల కోట్ల రూపా యలు ప్రతి సంవత్సరం ఖర్చు చేయడంలేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వమే ఎస్‌.సి.ఎస్‌టిలకు కేటాయించిన నిధులు ఆయా శాఖల అభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్నది సుస్పష్టం. అంతేగాక కొన్ని శాఖలు ఎస్‌సిపి, ఎస్‌టిపిలకు నిధులను కేటాయించడం లేదని జాతీయ దళిత మానవ హక్కుల సంఘం తన నివేదికలో తెలిపినట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం శాఖలు 25 ఎస్‌టి,ఎస్‌పిలకు నిధులే కేటాయించడంలేదని పేర్కొంది.
2012-13 బడ్జెట్‌లో కూడా ఎస్‌పి,ఎస్‌టి షెడ్యూలు కులాల ఉప ప్రణాళికగాని, షెడ్యూల్డు తరగతుల ఉపప్రణాళికలకు గాని నిధులు కేటాయించడం లేదు. ఇంకా అభివృద్ధి ఎక్కడ జరుగు తుంది. కేటాయింపులే లేక పథకాలు ఎలా అమలు చేస్తారు. ఎస్‌సి,ఎస్‌టిలకు రిజర్వేషన్లుండి ప్రయోజనం ఏమిటి? 2012- 13లో ఎస్‌సిలకు 16 శాతం, ఎస్‌టిలకు 8శాతం నైష్పత్తిక పద్ధతిలో బడ్జెట్‌ నిధులు కేటాయించాలి. కానీ ఎస్‌సిలకు నాలుగు శాతం, ఎస్‌టిలకు మూడు శాతం నిధులు కేటాయించి, ఎస్‌సి లకు రావాల్సిన 26,233 కోట్లు అభివృద్ధి నిధులు కేటాయించ లేదు. అదే విధంగా ఎస్‌టిలకు 9,572 నిధులు కూడా కేటా యించలేదని 2010లో జాదవ్‌కమిటీ పేర్కొంది. ప్రభుత్వ శాఖ లలో 25 శాఖలు ఎస్‌సి,ఎస్‌టిలను గురించి పట్టించుకోవడం లేదని పేర్కొంది. (పార్లమెంటరీ డిబేట్‌-2010ని చూడండి) ఎస్‌సి,ఎస్‌టిల అభివృద్ధికి ఎన్నో వాగ్దానాలు ప్రకటనలు చేసిన మంత్రులే వీరి పట్ల శ్రద్ధ చూపడంలేదు. ఇప్పుడిప్పుడే ఎదిగిన దళితులు వారివెనుకబాటుతనం కారణాలు ఎదుగుతుంటే బయటపడుతున్నాయి. రిజర్వేషన్లు ఎన్నోఏళ్ళనుండి పేపరుకు పరిమితమై నిధులు ఖర్చుచేయని స్థితి రిజర్వేషన్లు కొనసాగిన ప్రయోజనం ఉండదు.
అదే విధంగా2013-14 బడ్జెట్‌లో ఎస్‌సి,ఎస్‌టిలకు నిధులు కేటాయించాల్సినవి ఎస్‌సిపిలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం (16.2శాతం 2001) ఎస్‌టిపిలకు 7.5 శాతం (8.4శాతం 2001) కేటాయించాలి. 2013-14 జనరల్‌ బడ్జెట్‌ నిధులు 5,55,322 కోట్లు కాగా ఎస్‌సిపి కింద ఎస్‌సిపిలకు 15శాతం చొప్పున,ఎస్‌సిలకు 83,298.3 కోట్లు కేటాయిం చాలి. కాని 2013-14 బడ్జెట్‌లో 41,561 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అంటే 41,737 కోట్లు అసలు బడ్జె ట్‌లో కేటాయించలేదు. అదే విధంగా షెడ్యూల్డు తరగతులకు వారి జనాభానిష్పత్తి ప్రకారం (8.4శాతం) 7.5శాతం కేటా యించాలి. కాని 24,598 కోట్లు కేటాయించగా ఇంఆకా 17, 051 కోట్లు కేటాయించలేదు. ఇది చాలా దారుణం. ఒక పక్క బడుగులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ నిధులే కేటాయించకపోతే అసలు డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి. ఇది స్కామ్‌ అందామా? మోసం అందామా. ఇలా 1994లో ఇందిరాగాంధీ ప్రత్యేక ప్రణాళికలు ప్రకటించిన నుండి ఎన్ని కోట్లు ఎస్‌సి,ఎస్‌టిల నిధులు దారిమళ్ళించారో చూస్తే కడుపు తరుక్కుపోతుంది.ఒకపక్క ఆకలితో జనం చనిపోతుంటే ఎస్‌సి, ఎస్‌టి పట్ల ఎస్‌టిపి కింద 2013-14లో 41,649.15 కోట్లు కేటాయించాల్సింది. కాని 24,598 కోట్లు కేటాయించి సర్ది పెట్టుకున్నారు. ఒక విధంగా ఇది కేవలం కంటితుడుపు చర్య. నోరులేని మనుషులపట్లఈ విధంగా ప్రవర్తించడం నేరం. కేంద్ర ప్రభుత్వ శాఖలు, రక్షణశాఖ, శాస్త్రసాంకేతికరంగం, న్యాయ శాఖ, అణుఇంధన శాఖ, పర్యావరణశాఖ ఇలా చాలా శాఖలు ఎస్‌సి,ఎస్‌టిలకు బడ్జెట్‌ కేటాయించడం లేదని తేలింది. ఇంత అన్యాయం జరుగుతుంటే ఎస్‌.సిలు 79 మంది, ఎస్‌.టిలు 38 మంది లోక్‌సభలో ప్రతినిధులున్నారు. వీరు నిధులపై ఆరా తీసిన దాఖలాలు లేవు. మరి వీరు లోక్‌సభకు ఎస్‌సి,ఎస్‌టిల నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహిస్తూ ఏమి చేస్తున్నట్లు కనీసం నిధులైన కేటాయించలేకపోతే ఎందుకు?
కేంద్ర ప్రభుత్వమే ఈ తీరుగా వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభు త్వాలు మరింత దారుణంగా వ్యవహరిస్తున్నాయి.దానితో ఎస్‌సి ఎస్‌టిలు పేదరికంలో మగ్గుతున్నారు. విద్యావకాశాలు లేవు, ఆరోగ్యసౌకర్యాలు అంతంతమాత్రమే. తక్కువజీతాలొచ్చే ఉద్యో గాలతో  ఎస్‌సిఎస్‌టిలలో ఏవిధంగా ఎదుగుదల ఉంటుందో విజ్ఞులు ఆలోచించాలి. వీరిపట్ల వేధింపులు, పీడింపులు, దోపి డీలు, దౌర్జన్యాలు, హత్యలు, రేప్‌లు జరుగుతుంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర వహిస్తుండటం శోచనీయం. ఈ విధంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ధిక్కరించడం నేరమే అవుతుందని ఢిల్లీలోని హక్కుల సంస్థలు పేర్కొన్నాయి.
ఇదేరీతిలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తున్నాయి. వాటిలో బీహార్‌,రాజస్థాన్‌ ప్రభుత్వాలు కూడా బడ్జెట్‌ కేటాయింపులు చేయడం లేదు. బీహార్‌లో ఎస్‌సిల జనాభా 15.7 శాతం కాని బడ్జెట్‌లో 16.9 శాతంఎస్‌సిపి కింద 2010-11లో కేటాయించినట్లు పేర్కొనగా, వాస్తవంగా 1.2 శాతం నిధులు మాత్రమేనని వారి లెక్కలు తెలుపుతున్నాయి. రాజస్థాన్‌లో కూడా 17 శాతం ఎస్‌సిలు జనాభా, వార్షిక బడ్జె ట్‌లో ఎస్‌సిఎస్‌పి కింద 16.4 శాతం కేటాయించాల్సి ఉండగా కేవలం 3.9 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. ఇదే రీతిలో షెడ్యూల్డు జాతులు ఎస్‌సిటిపి కూడా ఇదే రీతిలో ఉండ టం గమనార్హం.అదేరీతిలో ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో కూడా నిధులు ఎస్‌సి,ఎస్‌టిలకు కేటాయించగా ఆ నిధులను ఇతర ఖర్చులకు వ్యయం చేయడం గమనించాల్సిన అవసరం ఉంది. మధ్యప్రదేశ్‌లో ఎస్‌సి,ఎస్‌టిలకు కేటాయించిన నిధులు ఆఫీసు కుర్చీలు, సోఫాలు కొనేందుకు ఆయుర్వేద, హోమియోపతి మందులు కొనేందుకు వ్యయం చేసారు. మరి కొన్ని నిధులు వ్యవసాయ కాలువల నిర్మాణానికి ఖర్చు చేసారు. 236 కోట్లు బ్రిడ్జ్‌ నిర్మాణానికి ఉపయోగించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌సిఎస్‌పి నిధులు గ్రాంట్స్‌ఇన్‌ఎయిడ్‌ కింద లెక్కలు చూప నేలేదు. 17 శాతం వరకు నిధులను యుపి ఉద్యోగులు జీతాలు చెల్లించేందుకు ఉపయోగిస్తారు. కాని ఎస్‌సిఎస్‌పి నిధులు జీతా లకు వాడరాదని స్పష్టంగా చట్టాలు, బడ్జెట్‌ పేర్కొంటున్నాయి. ఎంతగానో రాజ్యాంగ వ్యతిరేకతకు పాల్పడుతున్నాయి.
గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎస్‌సిఎస్‌టిలకు కేటా యించాల్సిన నిధులను దారి మళ్లించి ఆ ప్రభుత్వ కార్యక్రమా లకు ఖర్చుచేస్తున్నారు. పాతవే అనే ఎన్‌జిఒ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్‌సిఎస్‌టి బడ్జెట్‌ నిధులను గుజరాత్‌లో ఐదు కోట్ల రూపాయలు స్వామి వివేకానంద 150 జన్మదినానికి ఖర్చు చేసారు. 170 కోట్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణానికి ఉపయో గించారు. టాయిలెట్లు, మార్కెట్ల నిర్మాణానికి ఉపయోగించారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌సి,ఎస్‌టిల నిధులను తమ సొంత పనులకు కేటాయించి వేరే పనులకు కేటాయించినట్లు రికార్డులు సృష్టించాయి. కేంద్ర ప్రభుత్వమే తప్పుడు విధంగా ఎస్‌సి, ఎస్‌టిల నిధులు ఖర్చు చేస్తుంటే రాష్ట్రాలు ఆగుతాయా? గత 60 సవత్సరాల నుండి ఇదేస్థితి అయితే వీరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకివస్తుంది. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఎస్‌సి,ఎస్‌టి నిధులు అవి నీతి మార్గంలో తరలివెళ్లుతున్నాయి. ఎస్‌సి,ఎస్‌టిలు మాత్రం ఎవరో వస్తారని ఏదోచేస్తారని ఎదురుచూస్తూ కరిగిపోతున్నారు. ఇదేనా మానవత్వం. వారి శ్రమను దోచుకోవడమేకాక ప్రభు త్వాలే ఈ విధంగా ప్రవర్తించడం ఎస్‌సి,ఎస్‌టిల పట్ల కంచెచేను మేసినట్లుంది. కులాన్ని ప్రభుత్వాలు అధికారికంగా పోషిస్తున్నా యని ఇటీవల ప్రొఫెసర్లు ఘోషిస్తున్నారు. కాని ఎస్‌సి,ఎస్‌ట ిలను గూర్చి పట్టించుకునే వారులేరు. మనదేశం అభివృద్ధిపట్ల ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారో విదితమవుతుంది.
కాని మనరాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 1994లో ఎస్‌స ిఎస్‌పి,ఎస్‌టిఎస్‌పిల చట్టాన్ని తెచ్చి అన్ని రాష్ట్రాలకు ఆదర్శ మైందని చెప్పకతప్పదు. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఎస్‌సి,ఎస్‌టి లకు మొత్తం బడ్జెట్‌లో 16,65,297 కోట్లు 2013-14లో కేటాయించగా అందులో 16.2 శాతం ఎస్‌సిలకు, 7.4 శాతం ఎస్‌టిలకు ఎస్‌సిపి,ఎస్‌టిపిల కింద కేటాయించడం గమనార్హం. గతంలో మన రాష్ట్రంలో 2002-03 కాలంలో ఎస్‌సిపి నిధు లను సెక్రటరియేట్‌లో బిల్డింగ్‌లు కట్టేందుకు ఉపయోగించినట్లు సిఎజి నివేదికలో పేర్కొన్నారు. ఇదేనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బడుగుల అభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్పుకొంటూ ఇం తగా ఎస్‌సిఎస్‌టిల మోసపుచ్చడం నీతి బాహ్యమైన చర్యగా చెప్పకతప్పదు.ఢిల్లీలోని రాష్ట్రప్రభుత్వం ఎస్‌సి,ఎస్‌టిల నిధులు కామన్‌వెల్త్‌ క్రీడలకు కేటాయించి రోడ్లు, భవన నిర్మాణాలకు 350కోట్లు, ఎస్‌సి,ఎస్‌టిల నిధులు ఖర్చుచేసారు. ఈ సిడబ్ల్యు ఎస్‌ కేసులు సిబిఐ ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది. ఢిల్లీలో మురికి కాలువల ఒడ్డున నివసిస్తున్న అభాగ్య ఎస్‌సి,ఎస్‌టిలకు కేటాయించిన నిధులు వారికి కాకుండా వేరే కార్యక్రమాలకు ఖర్చుచేయడం క్షమించరాని విషయం. అందుకే ఎస్‌సి,ఎస్‌టి వాచ్‌డాగ్‌ను ఏర్పరచి నిధులు వారికే ఖర్చు చేసేలా చట్ట నిర్దేశన చేస్తూ రాజ్యాంగ విధులు నిర్వహించే విధంగాచూడాలి. ఎస్‌సి, ఎస్‌టిల బ్రతుకుల్లో వెలుగునింపాలి.

Vaartha Telugu News Paper Dated : 12/09/2013 

No comments:

Post a Comment