Monday, September 9, 2013

సబ్‌ప్లాన్‌తో సామాజిక న్యాయం జరిగేనా? By జాన్‌వెస్లీ


  • ప్రచారం ఘనం - ఆచరణ అధ్వాన్నం - 42 ప్రభుత్వ శాఖల్లో నామమాత్రపు ప్రచారం
షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు న్యాయం చేయడం కోసం అనేక పోరాటాల ఫలితంగా సబ్‌ప్లాన్‌ చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. రాష్ట్రమంతటా ఆర్భాటంగా ప్రచారం చేసింది. ప్రచారం చేసినంత వేగంగా ఆచరణలో అమలు చేయడం లేదు. 42 ప్రభుత్వ శాఖల ద్వారా అనేక రకాల అభివృద్ధి పథకాలను అమలు చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మినహా మిగతావి నత్తనడకన సాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల ఉన్నత విద్యకు సంబంధించి వెబ్‌సైట్‌లో పెట్టిన అడ్రస్‌ ఓపెన్‌ కావడం లేదు. 42 ప్రభుత్వ శాఖలలో కదలిక ఉందని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజాశక్తితో తెలిపారు. కాని ఆచరణలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఒక పక్క ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు ఇటీవల సమైక్య , ప్రత్యేక రాష్ట్ర ఆందోళనలతో ఎక్కడి ఫైళ్లు అక్కడ పెండింగులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం... ద్వారా ఉన్నత చదువులకు తోడ్పాటు అంశాన్ని ఈవారం పరిశీలిద్దాం....
అంబేద్కర్‌ ఓవర్సీన్‌ విద్యానిధికి సబ్‌ప్లాన్‌ చట్టంకింద 10లక్షల ప్రభుత్వ సాయం
ఇందిరమ్మ కలలు పేరుతో ప్రభుత్వం రూపొందించిన ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం దళిత విద్యార్థులకు సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. విద్య కోసం ఈ చట్టంలో నిధుల కేటాయింపుకు పెద్దపీట వేశారు. ప్రత్యేకించి విదేశీ చదువులకూ అవకాశం కల్పించారు.'అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి' పేరుతో ప్రత్యేకంగా ఒక పథకానికి రూపకల్పన చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌ వరకూ విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఒక్కో విద్యార్థికి పది లక్షల వరకూ సబ్‌ప్లాన్‌ చట్టం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తాయి. ఒక్కో విద్యార్థికి పది లక్షల ఖర్చు చేస్తారు. మరో ఐదు లక్షల వరకూ బ్యాంకు రుణ సౌకర్యం కల్పిస్తారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌ దేశాల్లో ఉన్నత చదువులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇక్కడ ఏదయినా గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన విద్యార్థులకు ఎంఎస్‌, డాక్టరేట్‌, ఇతర ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ 15మందిని ఎంపిక చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. తలిదండ్రుల వార్షికాదాయం 2.5లక్షల రూపాయలుగా పరిమితి విధించారు. విదేశీ చదువులంటే మాటలా? అది మా వల్ల అయ్యే పనేనా? అంబేద్కర్‌ లాంటి మహానుభావుడికే అది సాధ్యం కాలేదు. ఆయనే బరోడా మహారాజా వారి సహాయం తీసుకున్నారు. అని విద్యారంగంపై అవగాహన కలిగిన దళితులు అనుకునే మాటఇది. కానీ ఇదంతా మొన్నటి మాట. దళిత, ప్రజాసంఘాల పోరాట ఫలితంగా దేశంలోనే మొదటి సారిగా సబ్‌ప్లాన్‌ నిధుల ఖర్చుకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. చట్టం అమలులో భాగంగా అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధికి రూపకల్పన చేశారు.
సబ్‌ప్లాన్‌లో విద్యారంగానికి పెద్దపీట
సబ్‌ప్లాన్‌ చట్టంలో అభివృద్ధి పథకాలతో పాటూ విద్యారంగానికి పెద్దపీట వేశారు. సాంఘిక సంక్షేమశాఖకు కేటాయించిన నిధుల్లో 80శాతం నిధులను విద్యకు కేటాయించారు. సాదారణంగా ఖర్చుచేసే నిధులతో పాటూ కొత్త అవకాశాలు కల్పించారు. స్కాలర్‌షిప్స్‌, ట్యూషన్‌ ఫీజులు, మెస్‌ఛార్జీలు, రియంబర్స్‌ మెంట్‌, ప్రొఫెషనల్‌ కోర్సులు, ఫారిన్‌ ఎడ్యుకేషన్‌, స్టడీ అబ్రాడర్‌, సెల్ప్‌ ఫైనాన్స్‌ వంటి కోర్సులకు అవకాశాలు కల్పించారు.
సాంఘిక సంక్షేమశాఖకు 3077కోట్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా సాంఘిక సంక్షేమ శాఖకు 3077కోట్లా 85లక్షలా 52వేల రూపాయలు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం 907కోట్లా 57లక్షలా 67వేల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 2170కోట్లా 27లక్షలా 85వేల రూపాయలు ఈ శాఖ ఆధ్వర్యంలో సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చు చేయ నున్నారు. వసతి గృహ విద్యార్థులకు వసతులను మెరుగుపర్చడం, కొత్త హాస్టల్‌ భవనాల నిర్మాణం, రాజీవ్‌ విద్యామిషన్‌ పాఠశాల భవనాల నిర్మాణం, కెజిబివి పాఠశాలల నిర్మాణం, పౌష్టికాహారం వంటి వంటి వాటికి భారీగా నిధులు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం సబ్‌ప్లాన్‌ చట్టం కింద దళిత సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ వాటాగా 1259కోట్లా 97లక్షలా 3వేలు ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 9844కోట్లా 54లక్షలా 40వేల రూపాయలు ఖర్చు చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం నుండి నిధుల ఖర్చు ప్రారంభం కావాల్సింది. ఎస్సీ, ఎస్టీ నిధులను ప్రత్యేకంగా ఖర్చు చేయగల అవకాశం ఉన్న 42శాఖలతో పాటూ ప్రభుత్వ ఖాతా పరంగా అవిభాజిత శాఖలుగా ఉన్న మేజర్‌ ఇరిగేషన్‌, మీడియం ఇరిగేషన్‌, నీటిపారుదల అభివృద్ధి అథారిటీ, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ఫ్రా వంటి ఏడు రంగాల్లో కేంద్ర ప్రభుత్వం 1008కోట్లా 55లక్షలా 51వేలు కేటాయించింది. ఈ నిధులనూ ఖర్చు చేసే అవకాశం ఉంది. కాని సబ్‌ప్లాన్‌ చట్టం చేశాక ఆచరణలో నత్తనడక సాగడం విచారకరం. ఇప్పటికైనా వేగంగా అమలు చేయడానికి పాలకులు నడుంబిగించాలని ఆశిద్ధాం. 
సబ్‌ప్లాన్‌ అమలుకు మానిటరింగ్‌ కమిటీలు వేయాలి
కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ
సబ్‌ప్లాన్‌ చట్టం చేశారు. రూల్స్‌ ఇంకా ప్రేమ్‌ చేయలేదు. నిధులను ఖర్చు చేయడానికి మానిటరింగ్‌ కమిటీ వేయాలి. అందులో దళిత , గిరిజన సంఘాలుండాలి. జిల్లా స్థాయినుంచి మండల స్థాయి వరకు ప్రత్యేక అవగాహన కల్పించాలి. దళిత, గిరిజన సంఘాలతో ఈ అంశంపై చర్చ పెట్టాలి. దేనికి ఎంత నిధులు ఖర్చు చేయాలనే ప్రణాళిక ఉండాలి. ఎస్సీ కార్పోరేషన్‌కు ప్రత్యేకంగా తక్షణం వెయ్యికోట్లు కేటాయించాలి. ప్రధానంగా లబ్ధిదారులైన దళితులను సబ్‌ప్లాన్‌ పట్ల చైతన్య పరచాలి. ఇవన్ని చేయకపోతే నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది సబ్‌ప్లాన్‌చట్టాన్ని అమలు చేస్తామన్నారు. కిందిస్థాయి అధికారులకు కావల్సిన ఆదేశాలు ఇంకాపూర్తిస్థాయిలో చేరాలి.
వై.నరసింహులు, హైదరాబాద్‌ 

Prajashakti Telugu News Paper Dated : 09/09/2013 

No comments:

Post a Comment