Thursday, September 5, 2013

అత్యాచార నేరానికి వివాహ కవచమా? By -సింహాద్రి సరోజిని


అమానుషంగా అత్యాచారం జరిపి ఆపై శిక్షను తప్పించుకునేందుకు పెళ్ళిని సాకుగా వాడుకోవడంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలనాత్మక తీర్పునిచ్చింది. తాను అత్యాచారానికి పాల్పడిన వ్యక్తినే సదరు వ్యక్తి వివాహం చేసుకున్నాడనే నెపంతో అతని శిక్ష తీవ్రతను తగ్గించడాన్ని తప్పుబట్టింది. ఈ తీర్పునివ్వడం ద్వారా సుప్రీంకోర్టు అత్యాచారం కేసులో కొన్ని మార్గదర్శకాలను జారీ చేసినట్లయింది. 'శిక్ష అనేది ఆ నేరం తీవ్రతకు అనుగుణంగానే ఉండాలి. అత్యాచారం అనేది రాజీకి వీలులేని నేరం. అది సమాజంపైననే నేరంగా పరిగణించాలి. ఇది అందులోని నేరస్తుడు, బాధితురాలు రాజీ కుదుర్చుకునే అంశం కాదు' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం, న్యాయమూర్తులు రంజనా పి దేశారు, రంజన్‌ గొగోరుతో కూడిన ధర్మాసనం సరిగానే చెప్పింది. అత్యాచారం జరిపిన వ్యక్తి, దానికి గురైన వ్యక్తి మధ్య జరిగిన రాజీ ఆ నేరం తీవ్రతను తగ్గించబోదని పేర్కొంది. బాధితురాలిని నేర స్తుడు వివాహమాడినంత మాత్రాన అతని పట్ల ఉదారంగా వ్యవహరించి కొన్ని కోర్టులు శిక్ష తీవ్రతను తగ్గించడాన్ని ధర్మా సనం తప్పుపట్టింది. అలాంటి రాజీ సందర్భంతో ఆ నేరానికి చట్టంలో నిర్దేశించిన శిక్షను విధించకుండా ఉదారంగా వ్యవహరించడమనేది అలాంటి కేసులను తేలికగా తీసుకుం టున్నట్లుగా భావించాల్సి ఉంటుందని పేర్కొంది. పైగా ఆ నేరానికి చట్టం ప్రకారం ఏ శిక్ష నిర్దేశించబడిందో దాన్ని ఆ నేరస్తుడు అనుభవించాల్సిందేనని కూడా స్పష్టం చేసింది. ఈ విధంగా వివాహం చేసుకున్నంత మాత్రాన చేసిన నేరం మాసిపోదని, దాని తీవ్రత తగ్గదని ధర్మాసనం ఉద్ఘాటించడం ద్వారా బాధితులకు న్యాయం చేసినట్లుగా భావించవచ్చు. చట్టం ఎప్పుడూ నేర తీవ్రతకు అనుగుణంగానే శిక్ష ఉండాలని నిర్దేశిస్తోంది. అందువల్ల దాన్ని అనుసరించి తీరాల్సిందేనని ధర్మాసనం పేర్కొంది. ఇలా అత్యాచార నేరస్తుడు, బాధితురాలి మధ్య రాజీ కుదిరినందున శిక్షను తగ్గించడం వల్ల రెండు నష్టాలున్నాయని తెలిపింది. దీనివల్ల నేరస్తులు రాజీ కుదుర్చుకోవాల్సిందిగా బాధితురాలిపై ఒత్తిడి తెచ్చే అవకాశముంటుంది. ఇక రెండవది అత్యాచారం అనేది కేవలం ఒక వ్యక్తిపై గాక సమాజంపైనే జరిపిన నేరమని ఉద్ఘాటించింది.
'నేరస్తుని లేదా బాధితుని మతం, జాతి, కులం, ఆర్థిక లేక సామాజిక హోదా లేదా నేర విచారణను దీర్ఘకాలం పాటు వాయిదా వేయడం లేదా అత్యాచార నేరస్తుడు బాధితురాలిని వివాహం చేసుకుంటాననడం లేదా బాధితురాలు వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడటం వంటివి చట్టంలో నిర్దేశించిన శిక్షను తగ్గించేందుకు ప్రత్యేక అంశాలుగా ఉండరాదు' అని ప్రధాన న్యాయమూర్తి తీర్పు రాస్తూ పేర్కొన్నారు. హర్యానాలో జరిగిన ఒక సామూహిక అత్యాచారం కేసులో తీర్పునిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తులకు పదేళ్ళ శిక్ష పడింది. అయితే తాము అంతకు ముందే జైలులో గడిపిన కాలాన్ని ఈ శిక్షా కాలం నుంచి తగ్గించాలని నేరస్తులు కోరగా కోర్టు అందుకు తిరస్కరించింది. సామూహిక అత్యాచారం కేసుల్లో నిందితులు, బాధితురాలు రాజీ పడ్డారు గనుక శిక్షను తగ్గిస్తున్నామనడం చెల్లదని పేర్కొంది. నేరస్తులతో తనకు రాజీ కుదిరినట్లు బాధితురాలు చెప్పిందంటే అది సరైన ఆమోదంగా స్వీకరించరాదు. అలా ఆమోదం తెలిపేలా ఆమెపై ఒత్తిడి వచ్చి ఉండవచ్చు లేదా నిందితులు ఆమెను బెదిరించి ఉండవచ్చు. కోర్టు ఈ అంశాలను కూడా గమనంలోకి తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. తనపై జరిగిన నేరం వల్ల బాధితురాలు తీవ్ర మనోవేదనలో ఉంటుంది గనుక తనకు ఏమీ అర్థం కాని స్థితిలో కూడా ఆమె సమ్మతి తెలిపి ఉండవచ్చు అని కూడా కోర్టు పేర్కొంది.
ఇలాంటి అత్యాచారం కేసుల్లో గ్రామాల్లో కుల పెద్దల పంచాయితీల్లో బాధితురాలిని అత్యాచారం జరిపిన వ్యక్తిని వివాహం చేసుకోవాల్సిందిగా తీర్పులిస్తున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. గత ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్‌ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక బాలికను తనపై అత్యాచారం జరిపిన వ్యక్తిని వివాహం చేసుకోవాల్సిందిగా పంచాయితీ ఆదేశించింది. అయితే దానికి అభ్యంతరం తెలుపుతూ ఆ బాలిక కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కానీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు తిరస్కరించారు. ఆ విషయంలో మీడియా జోక్యం చేసుకున్న అనంతరం మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా కొన్ని కేసుల్లో కొంత డబ్బుతో ఆ నేరాన్ని మాఫీ చేయడాన్ని కూడా మనం చూడవచ్చు. 2009లో అలహాబాద్‌లోని ఫక్రీనా గ్రామంలో 25 ఏళ్ళ వయస్సున్న ఒక కార్పెంటర్‌ 21 ఏళ్ళ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడ పంచాయితీ ఇచ్చిన తీర్పు చూస్తే ఎవరికైనా ఆగ్రహం, ఆవేదన కలగక మానదు. ఆ యువతిని వివాహం చేసుకోవాలని, లేనిపక్షంలో రూ.15 వేలు జరిమానా, సంఘం నుంచి వెలికి గురికావాలని పంచాయితీ తీర్పునిచ్చింది. ఆ వ్యక్తి పెళ్ళి చేసుకున్న అనంతరం ఆమెకు భార్యగా లభించాల్సినవన్నీ ఇవ్వకపోతే తిరిగి పంచాయితీకి ఫిర్యాదు చేయాలని చెప్పింది. ఈ తీర్పుపై ఉత్తరప్రదేశ్‌లో మహిళాసంఘ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇలాంటి తీర్పులు అమానవీయమైనవి, అవమానకరమైనవి.
అత్యాచారాలకు గురైన మహిళలు నేరస్తులనే పెళ్ళి చేసుకుంటున్న సంఘటనలు మన దేశంలో చాలా పెద్ద సంఖ్యలోనే సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా జరగడానికి అత్యాచార బాధితులను సమాజం కళంకితులుగా చూడటం కూడా ఒక కారణం. ఫలితంగా తనకు ఇష్టమున్నా లేకున్నా తనపై నేరానికి పాల్పడిన వ్యక్తితో వివాహానికి అంగీకరిస్తున్నారు. సమాజంలో అవమానాల నుంచి తప్పించుకునేందుకు అదే మంచి పరిష్కారంగా భావిస్తున్నారు. వీటన్నింటితో పాటు కుటుంబ పరువు ప్రతిష్టల కోసం కూడా బాధితులు, వారి తల్లిదండ్రులు ఇలాంటి పరిష్కారాన్ని అంగీకరిస్తున్న దాఖలాలున్నాయి. అలా వివాహం చేసుకోవడం ద్వారా నేరస్తులు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. పైగా పంచాయితీల ద్వారా ఇలాంటి వివాహాలు జరిపించడం అరాచకత్వమే అవుతుంది.
దేశంలో ప్రతి పది అత్యాచారం కేసుల్లో కేవలం నాలుగు మాత్రమే పోలీసు స్టేషన్‌ వరకూ వెళ్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా ఉభయుల కుటుంబాల మధ్య రాజీలు కుదర్చడం చూస్తున్నాం. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌, షహరాన్‌పూర్‌ వంటి చోట్ల, హర్యానా, పంజాబ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కుల, ఖాప్‌ పంచాయితీలు ఈ రకమైన తీర్పులిస్తున్నాయి. ఇలాంటి రాజీలు కూడా నేరస్తుడు, బాధితురాలు ఇద్దరూ ఒకే కులానికి చెందినవారైతే సాధారణంగా జరుగు తున్నాయి. అదే వేరువేరు కులాలకు చెందినవారైతే ఇలా పెళ్ళిళ్ళు జరగడం అరుదుగా ఉంది. ఇటువంటి వివాహాల్లో బాధితురాలు మరింతగా హింసకు గురికావలసి రావచ్చు. అయినా అలాంటి గృహ హింస చాలా అరుదుగానే బయటికి వస్తుంది. కొన్ని సందర్భాల్లో బాధితురాలు మైనర్‌ అయి ఉండి, పంచాయితీ పెళ్ళి చేసుకోవాల్సిందిగా తీర్పునిస్తే కోర్టులు కూడా అలాంటి వాటిని తరచుగా సమర్థిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా 2007లో నాగపూర్‌లో జరిగిన ఒక కేసును చూడవచ్చు. ఇది ఒక మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచారానికి సంబంధించింది. తనపై ఉన్న అభియోగాలను వదులుకుంటే ఆమెను పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమేనని నిందితుడు చెప్పారు. తన కూతురు జీవితం నాశనం కాకుండా అతడు కాపాడాడని తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ కేసులో ఆ బాలికను పెళ్ళి చేసుకునేందుకు కోర్టు నిందితునికి బెయిలు కూడా మంజూరు చేసింది. 'ఆ బాలిక మైనరు. కోర్టు సామాజిక న్యాయ ప్రయోజనం కాపా డేందుకు సానుభూతిగా వ్యవహరించింది' అని అడ్వకేట్‌ వ్యాఖ్యా నించడం కొసమెరుపు. కోర్టులు ఇలా ఉదారంగా వ్యవహిస్తున్న తరుణంలో సుప్రీంతీర్పు స్వాగతించదగింది.
'శిక్ష అనేది ఆ నేరం తీవ్రతకు అనుగుణంగానే ఉండాలి. అత్యాచారం అనేది రాజీకి వీలులేని నేరం. అది సమాజంపైననే నేరంగా పరిగణించాలి. ఇది అందులోని నేరస్తుడు, బాధితురాలు రాజీ కుదుర్చుకునే అంశం కాదు' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం, న్యాయమూర్తులు రంజనా పి దేశారు, రంజన్‌ గొగోరుతో కూడిన ధర్మాసనం సరిగానే చెప్పింది.


చట్టం ఎప్పుడూ నేర తీవ్రతకు అనుగుణంగానే శిక్ష ఉండాలని నిర్దేశిస్తోంది. అందువల్ల దాన్ని అనుసరించి తీరాల్సిందేనని ధర్మాసనం పేర్కొంది. ఇలా అత్యాచార నేరస్తుడు, బాధితురాలి మధ్య రాజీ కుదిరినందున శిక్షను తగ్గించడం వల్ల రెండు నష్టాలున్నాయని తెలిపింది. దీనివల్ల నేరస్తులు రాజీ కుదుర్చుకోవాల్సిందిగా బాధితురాలిపై ఒత్తిడి తెచ్చే అవకాశముంటుంది. ఇక రెండవది అత్యాచారం అనేది కేవలం ఒక వ్యక్తిపై గాక సమాజంపైనే జరిపిన నేరమని ఉద్ఘాటించింది. 
-సింహాద్రి సరోజిని

Prajashakti Telugu News Paper Dated : 05/09/2013 

No comments:

Post a Comment