Saturday, September 28, 2013

చర్చకు రాని భూ విప్లవం - డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి -


ఇరవయ్యో శతాబ్ది ఆరంభం నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో తరచూ ఒక సంఘర్షణ జరుగుతూనే వచ్చింది. అయితే అవి కొన్ని సంఘర్షణ రూపం తీసుకుంటే కొన్ని అంతర్గత అలజడులుగా మిగిలిపోయేవి. ఆర్య సమాజం ఏర్పాటు, దానికి జవాబుగా అన్నట్లు ఇత్తెహాదుల్ ఏర్పాటు, ఆంధ్ర మహాసభ ఆవిర్భావం, స్వాతంత్య్రోద్యమం, సాయుధ పోరాటం, మిలిటరీ చర్య, హైదరాబాద్ విభజన, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, 1969 జై తెలంగాణ ఉద్యమం, కొనసాగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, నిజాం పాలనా కాలం నాటి ముల్కీ ఉద్యమం ఈ ప్రాంతంలో చర్చకు వచ్చాయి. చర్చల సారాంశాలు, ఉద్యమ గమనాలు ఏ దిశగా వెళ్ళాయన్నది పెద్ద అంశమే. ఇలాంటి రాజకీయ అంశాల మీద జరిగిన చర్చ, మంచి చెడుల విశ్లేషణ నిజానికి ప్రజల జీవితాలలో నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చిన భూ సంస్కరణలలో జరగలేదు. 1970లలో వచ్చిన భూ సంస్కరణల చట్టం సాధించిన పాక్షిక విజయాల మీద కొంత చర్చ జరిగింది. అది కూడా కమ్యూనిస్టుల వల్లే. ఆ చట్టం విఫలమైనందువల్లే.
హైదరాబాద్ రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో 1948లో పెను విప్లవం సంభవించింది. అది జాగీర్ల రద్దు. హైదరాబాద్ జాగీర్ల రద్దు రెగ్యులేషన్, 1948 ప్రకారం రాష్ట్రంలోని జాగీర్లన్నీ రద్దయి దివానీ (ప్రభుత్వ భూమి)లో కలిసిపోయాయి. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి రాజ్యాధికారాన్ని స్వీకరించిన జనరల్ జె.ఎన్. చౌదరి ఆధ్వర్యంలోని మిలటరీ పాలనా కాలంలో జాగీర్లను రద్దు చేసి ఎల్.వి. గుప్తా ఆధ్వర్యంలో జాగీర్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేయబడింది.
ఏమిటీ జాగీర్లు : మహ్మదీయ పరిపాలనా విధానంలో జాగీరు ఒక పరిపాలనా యూనిట్ అంటారు మౌల్వీ చిరాగ్ అలీ. ప్రజల నుంచి నేరుగా పన్ను వసూలుకు జవాబుదారీగా ఉంటూ రాజ్యానికి నిర్ణీత పన్ను భాగాన్ని జాగీర్దార్ చెల్లించాలి. తన జాగీర్ యూనిట్‌కు రాజ్యం వేలుపెట్టనంత వరకు జాగీర్దారే సర్వాధికారి. అయితే జాగీర్దార్లకు పన్ను వసూలుపై వచ్చే ఆదాయం తప్ప భూమిపై ఎలాంటి హక్కులు లేవు. కానీ వాస్తవానికి వచ్చేసరికి భూమిపై సర్వాధికారాలు వారే అనుభవించడం జరిగింది. జాగీర్లు నిజానికి ఒక పరిమిత కాలానికి ఇవ్వబడేవి. రానూరానూ అవి జాగీర్దార్ల జీవితకాలం కొనసాగాయి. ఒకవేళ కాలపరిమితి పూర్తైనా, లేక జాగీర్దారు మరణించినా తిరిగి నజరానా సమర్పించగానే అది రెన్యూ చేయబడేది. సాధారణంగా నజరానా అంటే వజ్రాలు, బంగారు నాణేలు రాజుకు సమర్పించడం. నిజాం బంధువర్గం పెద్దది. వాళ్ళు నిజాం తప్ప మిగతా శ్రేణులందరి కంటే ఉన్నతులు. వాళ్ళకే జాగీర్లు ఇవ్వబడేవి. జాగీర్దార్లు తిరిగి తమ జాగీర్‌లో ఉప జాగీర్‌లు ఇచ్చేవారు. ఉప జాగీర్దార్లు చాలావరకు స్థానికులు.
పాయెగాలు, జాగీర్‌లు, సంస్థానాలు, ఎస్టేట్లు, మక్తాలు, అగ్రహారాలు, ఉమ్లీలు, ముకాసాలు అన్నీ జాగీర్ల కిందే లెక్క. ఈ జాగీర్‌లలో మినహాయించబడిన జాగీర్లు (Exempted Jagirs) ప్రత్యేకమైనవి. మినహాయించబడిన జాగీర్లలో సాధారణ పరిపాలనతో పాటు పోలీసు, న్యాయవ్యవస్థ ప్రత్యేకంగా ఉండేది. దివానీతో దానికి ఏ సంబంధం ఉండేది కాదు. మూడు పాయెగాలు; నాలుగు ఎస్టేట్లు; గద్వాల, జటప్రోలు, అమరచింత సంస్థానాలు; ధరమ్ కరమ్ బహద్దూర్, శ్యాంరాజ్ బహద్దూర్, కళ్యాణి, సూర్యజంగ్, మెహదీ జంగ్ ఎస్టేట్లు మినహాయించబడిన జాగీర్‌లు. మిగతా జాగీర్లు పరిమిత అధికారాలతో పరిపాలన చేసేవి.
ప్రత్యేక హోదాలు : సామాన్య ప్రజల దృష్టిలో జాగీర్లన్నీ ఒక్కటే. ఫర్మానాల ప్రకారం జాగీర్దార్లకు పరిమితమైన అధికారాలే ఉన్నా వాస్తవం వేరుగా ఉండేది. శాంతి భద్రతలు, న్యాయం, పన్ను వసూళ్ళు, వివాదాల పరిష్కారం అంతా జాగీర్దార్ల కనుసన్నల్లోనే నడిచేవి. మినహాయించబడని జాగీర్లలోనూ దివనీ వ్యవహారాలన్నీ జాగీర్దార్లే నిర్వహించేవారు. నవాబు దృష్టిలో మాత్రం పాయోగాలకు, ప్రముఖుల ఎస్టేట్‌లకు చాలా గౌరవం ఉండేది. సంస్థానాలు హిందూ రాజుల ఆధీనంలో ఉండడం వల్ల వాటి నిర్వహణను దివాని జాగరూకతతో వ్యవహరించేది. మిగతావి సాధారణ జాగీర్లు. ఈ జాగీర్దార్లనే తరచూ నవాబు మార్చుతూ ఉండేవాడని అంటారు.
అస్మాన్ జా, కుర్షీద్ జా, వికారుల్ ఉమ్రాలు విలీనం నాటి పాయోగాలు. ఇది నిజాం వ్యక్తిగత భద్రత చూసుకునే కుటుంబానిది. నిజాం తర్వాత వీళ్ళే అత్యున్నతులు. పాయోగాల తర్వాత స్థానం ఇలాకాదార్లది. వారు నలుగురు - నవాబ్ సలార్ జంగ్ బహద్దూర్, మహరాజా కిషన్ పెర్షాద్ బహద్దూర్, నవాబ్ ఖాన్ ఖానమ్, నవాబ్ ఫక్రుల్ ముల్క్. తర్వాత స్థానం సంస్థానాధిపతులది. గద్వాల, వనపర్తి, జటప్రోలు, అమరచింత, పాల్వంచ, దోమకొండ, గోపాల్‌పేట, ఆనెగొంది, రాజపేట, దుబ్బాక, నారాయణపూర్, పాపన్నపేట, గుర్గుంలు, సిర్నాపల్లి అప్పటి ప్రధాన సంస్థానాలు. మిగిలినవి చిన్న జాగీర్లు. విశేషమేమంటే సంస్థానాలు, చిన్న జాగీర్లు ఒకే భూభాగం (Compact) కలిగి ఉండగా పాయోగాలు, ప్రముఖుల ఎస్టేట్లు మాత్రం దూరదూరంగా, అనేక చోట్ల Non-Compact) విస్తరించి ఉండేవి.
హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమయ్యే నాటికి సంస్థానంలో అంతర్గత పాలన ప్రజానుకూలంగా లేదు. జాగీర్దార్లు ప్రజలను పన్నుల కోసం పీడించిన ఆధారాలున్నాయి. నిజానికి నవాబు దివానీ ఏరియా రైతులతో పాటు జాగీర్ ఏరియాలోను రైతులకు పన్ను మాఫీ చేసినప్పటికీ జాగీర్దార్లు బేఖాతరు చేసేవారు. ప్రజల నుంచి వసూలైన పన్నులో చాలా తక్కువ భాగం దివానీకి చేరేదన్నదీ నిజమే. దానికే జాగీర్దార్లు పేష్‌కాష్, నజరానా, హక్-ఇ-మాలికానాం, మక్తాపన్, చౌత్, మనాకా, ఉమ్లి, కహదానా, జాగీర్ కాలేజ్ సెసస్, లోకల్ సెసస్, సెటిల్మెంట్ చార్జీలు, ఖానుంగోయి, దడుపత్తి లాంటి పేర్లతో జాగీర్దార్లు ఖజానాకు నిధులు సమర్పించేవారు.

జాగీర్ కానిదెంత? : నిజాం రాష్ట్రం పరిపాలనా పరంగా జాగీర్లు, సర్ఫెఖాస్, దివానీగా విభజించబడి ఉండేది. సర్ఫెకాస్ నిజాం స్వంత ఆస్తి. జాగీర్ వసూళ్ళు కొంత భాగమే ప్రభుత్వానికి వచ్చేవి. దివానీ ఒక్కటే నేరుగా ప్రభుత్వ భూభాగం. మిలటరీ చర్య నాటికి మొత్తం సంస్థానం విస్తీర్ణం 82,700 చ.మైళ్ళుంటే అందులో 33,000 చ.మైళ్ళు జాగీర్లే. జాగీర్ల రద్దు నాటికి సంస్థానపు జనాభా కోటి ఎనభై లక్షలుంటే అందులో 37.2 శాతం జనాభా జాగీర్లదే. కాబట్టి ఏ రకంగా చూసినా జాగీర్ల మీద పట్టు సాధించడం పౌరపాలనలో అత్యవసరమైంది. అప్పటికే జాగీర్ల నిర్వహణ, అందులో ప్రజా వ్యతిరేక కోణంపై ఒక అవగాహనతో ఉన్న కేంద్ర ప్రభుత్వం నిజాం నుంచి పగ్గాలు స్వీకరించగానే జాగీర్లపై దృష్టి పెట్టింది. పరిపాలనా పరంగా చూసినా జాగీర్లు ఒకదానికొకటి ఏమాత్రం సారూప్యత లేని యూనిట్లు. కొన్ని తాలూకాల కంటే చిన్నవి కాగా కొన్ని జాగీర్లు జిల్లాల విస్తీర్ణం కన్నా పెద్దవి. కొన్ని అనేక చోట్ల విస్తరించబడి (Scatter ఉన్నవి. ఆదాయ వ్యయాలలోనూ చాలా తేడాలున్నాయి. ఉదాహరణకు వికారుల్ ఉమ్రా వార్షికాదాయం రూ. 27,83,033 ఉండగా కళ్యాణి జాగీర్ ఆదాయం కేవలం రూ. 2,43,316 మాత్రమే ఉండేది. జాగీర్ పాలనలో సమర్థులైన అధికారులు లేరు. ఉన్నా వాళ్ళ జీతాలు చాలా తక్కువ. స్వల్ప ఆదాయాలు, అసంగత వ్యయాలు, సర్వే సెటిల్మెంటు సరిగ్గా లేకపోవడం, రైతులతో మంచి సంబంధాలు లేకపోవడం జాగీర్లలో పాలు.
ఈ కారణాల వల్ల రైతులకు భూమి మీద హక్కులు సరిగ్గా రికార్డు చేయబడలేదు. కరువు కాటకాల్లోనూ బలవంతంగా పన్నులు వసూలు చేయడం వల్ల రైతులు కుదేలయ్యారు. పన్నులు కట్టలేక భూముల్ని వదిలేసుకున్న రైతులు కోకొల్లలు. ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో 'కారిజ్ కాతా' (ఓఓ) కింద నమోదైన ప్రభుత్వ భూములన్నీ అప్పటి రైతులు అలా వదిలేసినవే. స్థానిక అధికారుల, గ్రామాధికారుల అలసత్వం, అవినీతి జాగీర్లను రద్దు చేయవలసిన అగత్యాన్ని కల్పించింది.
జాగీర్ల రద్దు రెగ్యులేషన్ : వందల సంవత్సరాల చరిత్రగలిగిన జాగీర్లు, సంస్థానాలు, ఇలాకాలు, ఎస్టేట్లు, పాయెగాలు హైదరాబాద్ జాగీర్ల రద్దు రెగ్యులేషన్, 1358 ఫస్లీ ప్రకారం రద్దయ్యాయి. ఈ రెగ్యులేషన్ 1949 స్వాతంత్య్రదినోత్సవం నుంచి అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. జాగీర్దార్లు తమ జాగీరు లెక్కలను చెప్పడం కోసం నిర్దాక్షిణ్యంగా బలవంతపు తేదీలిచ్చారు. రెండు వారాలలో జాగీర్ల అవశేషాలను పరిసమాప్తం చేశాడు జాగీర్ పరిపాలకుడిగా నియమించబడ్డ ఎల్.ఎన్. గుప్తా. మిగిలిపోయిన వ్యవహారాలను చక్కదిద్దడానికి ఫస్టుతాలూక్‌దార్ (కలెక్టర్)లను అసిస్టెంట్ జాగీర్ అడ్మినిస్ట్రేటర్‌గా నియామకం చేసారు. ఇదొక భూమి విప్లవం. కేవలం 14 రోజుల్లో ఫ్యూడల్ వ్యవస్థ పునాదులనే పెకలించిన విప్లవం.
జాగీర్లు రద్దయ్యాక జాగీరు గ్రామాల రెవెన్యూ రికార్డుల్లో జాగీర్దార్ల పేర్లకు బదులు రైతుల పేర్లు రాయమని ఆదేశాలిచ్చారు. జాగీర్దార్లవి కానీ, వారి బంధువులవి కానీ పేర్లు రాయకూడదని, ఫౌతీమార్పులు చేయకూడదని ఆదేశాలున్నాయి. అందుకు బదులుగా వాస్తవంగా సాగుచేస్తున్న వారి పేర్లు రికార్డులలో రాయాలనీ స్పష్టంగా ఆదేశించడం జరిగింది. 'జాగీర్ గ్రామాల రైతులందరినీ వారు కాస్తు చేస్తున్న భూముల పట్టెదార్లుగా గుర్తించాలి. అందుకు ఎలాంటి పత్రాలు అవసరం లేదు. జాగీర్దార్ల నుంచి రాతపూర్వకమైన అనుమతి అవసరం లేదు. ఒకవేళ జాగీర్దారు స్వయంగా వ్యవసాయం చేసుకున్నట్లయితే ఆ భూమిపై జాగీర్దారు వ్యక్తిగత పేరు నమోదు చేయాలి' అని సర్క్యులర్ నెం. 2, తేదీ 18 అజుర్, 1359 ఫస్లి (18.10.1949) ద్వారా సహాయ రెవెన్యూ కార్యదర్శి అందరు పౌర పాలకులకు తెలియజేసాడు.
అయినా అక్కడ కూడా ఈ సర్కుల్యర్ సూచనలు అమలు పరచబడలేదు. తిరిగి 1954-55లో తెలంగాణ ప్రాంతపు విశిష్ట రెవెన్యూ రికార్డు ఖాస్రాపహాణి తయారైన సందర్భంలో ప్రభుత్వం మరింత స్పష్టమైన సూచనలిచ్చింది. ఆ సూచన ప్రకారం ఖాస్రా పహాణిలో వాస్తవంగా కాస్తు చేస్తున్న వ్యక్తిని తర్వాత సంవత్సరం నుంచి ఎలాంటి పత్రాలు అడగకుండా పట్టాదారుగా నమోదు చేయాలి.
భూస్వామ్య అవశేషాల్ని కూడా లేకుండా పెకిలించిన జాగీర్ల రద్దు రెగ్యులేషన్, సంపూర్ణ విజయవంతమవడం నిజంగా భూ విప్లవమే!
- డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి
డిప్యూటీ కలెక్టర్

Andhra Jyothi Telugu News Paper Dated : 29/09/2013 

No comments:

Post a Comment