Tuesday, September 24, 2013

అమ్మా మీకు దండం.. కలిసుండలేం.. By -అల్లం నారాయణ


అమ్మా మీరు పెద్దలు. పూజ్యులు. గొప్పవాళ్లు.. సరిగ్గా మీరక్కడ రాష్ట్రపతి భవనం ముందర ‘ఫ్యాషన్ పరేడ్’లాగా పట్టువస్త్రాలు, వజ్రవైఢూర్యాలు ధరించి తిరుగాడుతున్నప్పుడే.. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మందకృష్ణ మాదిగ యుద్ధభేరి జరుగుతున్నది. అతను నల్లవస్త్రం ధరించి ఆర్ట్స్ కాలేజీ ముందర వేదిక మీద కిందకూచొని ఉన్నడు. పెద్ద వేదిక. విమలక్క పాటపాడుతున్నది. ఆడుదాం దప్పుల్లా దురు అంటూ ఆమె కదమ్ తాల్ చేస్తున్నది.

ఇది బతుకు వాస్తవం. మేమింకా యూనివర్సిటీ క్యాంపస్‌లల్లో ఉన్నాం. చెట్ల కింద, మైదానాలన్నింటా అల్లుకొని ఉన్నాం. మీరు దిగ్విజయ్‌సింగ్ వద్దకు వెళ్లిన సమయానికే ఇక్కడ గుంటూరు నుంచొచ్చిన బహుజన కెరటం పల్నాటి శ్రీరాములు బవిరిగడ్డం గల ముఖంలోనుంచి విస్ఫులింగాలు చిమ్ముతుండగా నరకబడిన దళితుల శవాల గురించి మాట్లాడుతూ ఉన్నడు. చేలల్లో, చెలకల్లో పంట కాల్వల్లో పారిన దళితుల నల్లనెత్తురు గురించీ, మీరు ముక్కలు చేసిన దేహాల గురించీ మాట్లాడుతూ ఉన్నడు. సాదాసీదా మనుషులు. వీధులు ఆవాసం చేసుకుని ఎత్తిన పిడికిళ్లు, ఎర్రబడిన కళ్లు అలంకారాలు చేసుకొని జీవితకాలమంతా రాష్ట్రపతి భవన్‌లకూ, డిగ్గీరాజాల కోటలకు వెలియై, బలియైన బతుకు పటాలు వీళ్లవి. 

మీ చెలకలు, పంట కాల్వలు నల్లని దళిత నెత్తురుతో ఉప్పెనలై ప్రవహించినప్పుడు మందకృష్ణ మాదిగ మంకెనపువ్వై పూచి ఆ ఖండ ఖండాలైన మృతదేహాలను మోసి, రక్తక్షేవూతాన్ని నిర్మించాడు. అతను తెలంగాణవాడు. అతను దళిత పతాకయై ఎగసినవాడు. అతనిప్పుడు ‘యూటీ అంటే యుద్ధమే’ అని నినదిస్తున్నవాడు. అమ్మా! తల్లులూ మీరు గొప్పవాళ్లు. మీ పట్టుచీరల పాటి కాదు మా బతు కు. అయినా ఈ చేదు సంగతులు మీకెందుకు గుర్తు చేస్తున్నానంటే ఫైసలా రాష్ట్రపతి భవన్‌లో జరగదు. తెలంగాణ పంచాది డిగ్గీరాజా గడీలో తెగదు. అది ఓయూ లో మొలకెత్తుతుంది. ‘ఓయుద్ధభేరి’ వేదిక మీద ప్రత్యేకంగా ఒక పేరును గురించి మీకు మరోసారి గుర్తు చెయ్యడానికే ఇదంతా. సిరిపురం యాదయ్య ఒక పిల్లవా డు. తెలంగాణ కోసం తల్లడిల్లినవాడు. మా ఓయు దివారావూతులూ వెలిగి, పీతిరిగద్దల అణచివేత దుఃఖాల్లో, గాయాల్లో, మున్నూటా అరవై దినాలు ఆరిద్ర పురుగులై వికసించిన విద్యుత్తేజాలైన మా విద్యార్థుల సరిహద్దు ఎన్‌సీసీ గేట్ దగ్గర దగ్ధమైన ఒక వీరుడు. ఆ వీరుడి పేరిట యుద్ధభేరి మోగుతున్నది.


బహుశా మీరు తల్లులు కూడా.. కన్నబిడ్డలు బలైపోతే అనుభవమయ్యే వేదన ఒక అలుగెల్లిన చెరువులాగా ఎంత నరకయాతనగా ఉంటుందో? మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదనుకుంటా.. పాలసేపుల తీపి దుక్కం సంగతి మీకు చెప్పేంత గొప్పవాణ్ణీ కాను. కన్నబిడ్డలు పాలకేడుస్తున్నప్పటి బాధ, చెట్టెత్తు కొడుకు మంట ల్లో మాడిపోయినప్పటి రంపెపు కోత వివరించలేను. దుక్కానికి భాష లేదు. దుక్కానికి వర్ణనా లేదు.

ఆ మాటకొస్తే దుక్కానికి ప్రాంతమూ లేదనే నమ్ముతూ... తల్లులారా! ఆ యాదయ్య మంటల్లో ఎగురుతూ ఎగురుతూ, కాలిపోతూ, కూలిపోతూ, శ్రీకాంతచారి మంటల్లోంచి జై తెలంగాణ అంటూ... అవి తెలంగాణ సబ్బండ వర్ణాలకు, సకల జనులకు జీవితకాలపు పీడకలైనట్టు... కానీ ఆ పిలగాండ్ల బలిదానాల ఫలితంగా వచ్చిన తెలంగాణను అడ్డుకోవడానికి మీరు చతురంగ బలాలతో ఢిల్లీలో ‘ఫ్యాషన్ పరేడ్’లు జరుపుతున్నప్పుడు.. ‘ఓయు’ద్ధభేరి వేదిక ఒక ప్రశ్న అడుగుతున్నది. ఎన్నడన్నా.. ఈ మంటల్లో మాడిపోయిన మా పిల్లగాండ్ల కోసం ఒక్కనాడన్నా మీ కండ్లల్ల నుంచి ఒక్క కన్నీటి చుక్క విడిచారా! తల్లులారా! మంత్రుల, ఎంపీల, ఎమ్మెల్యేల సతీమణులారా! మీరు గొప్పవాళ్లు. సౌధాల్లో బతికే వాళ్లు. అద్దాల మేడల్లో కొలువుదీరేవాళ్లు. సంసారాల కడుపులు చల్లగా, శీతలమైన జీవితాలు గడిపేవాళ్లు. కానీ సత్యం కటిక చేదుగా ఉంటుంది. అది అద్దాల సౌధాల మీద విసిరినప్పుడు భళ్ళున పగిలి చెల్లాచెదురయిన గాజు ముక్క మీది ప్రతిబింబంలా మెరుస్తూ ఉంటుంది. కొంచెం నాటుగా ఉంటుంది. మీరు తల్లులే కదా! మా పిల్లల చావులూ పట్టని మీతో కలిసి ఉండాలని ఎట్లా కోరుకుంటారు.
అంతెందుకు.. మీరు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్నప్పుడో, వస్తున్నప్పుడో, పార్లమెంట్ స్ట్రీట్‌లో, శాస్త్రి భవన్ ఒకటి ఉంటుంది. శవాలు అంతటా పరివ్యాప్తమై ఉంటాయి.

లెక్కకు వెయ్యికి మించి. అక్కడ శాస్త్రి భవన్ వద్ద, పార్లమెంటుకు కూతవేటు దూరంలో, రంగాడ్డి జిల్లా నుంచి రైలెక్కి వెళ్లిన యాదిడ్డి తెలంగాణ కోసం ఉరిపోసుకుని చనిపోయిన ఒక చెట్టు ఉంటుంది. ఇదంతా అవాస్తవాల పునాదుల మీద నిర్మితమయిన ఇటీవలి చరిత్ర కానేకాదు. వెయ్యి అబద్ధాలకు తోడు వెయ్యినొక్క అబద్ధమూ కాదు. అమ్మలారా! మీరు ఆ పచ్చని చెట్టును దర్శించండి. వీలైతే ఆ చెట్టు చెప్పే రహస్య సంభాషణలని వినండి. అప్పుడు చెప్పండి. ఒక పచ్చని చెట్టు చెప్పిన ఒక వీరుని మృత్యురహస్యం. బహుశా రాష్ట్రపతికి, బహుశా పార్లమెంటులో కూచున్న తెల్లబట్టల ఏ హృదయునికీ ఆ మృత్యు రహస్యం అర్థం కానేలేదు. మా యూనివర్సిటీ ఇప్పుడలాంటి ప్రశ్నలు అడుగుతున్నది. డప్పుకొట్టి మోగించి న యుద్ధభేరి మిమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతున్నది. దేహాలను ముక్కలు చేసిన మీరు, ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా ఇంకెన్ని ఖండిత శిరస్సులను మాకు కానుకలుగా ఇస్తారని, ఈ దాష్టీకం ఇంకెన్నాళ్లని, కమ్మ సమాజపు, సీమాంధ్ర రెడ్డి సమాజపు తెలుగుతల్లిని అడుగుతున్నడు మందకృష్ణ.

ప్రశ్నలు కొంచెం చేదుగా ఉంటాయి. రాష్ట్రపతి భవన్ దాకా వెళ్లొచ్చిన మీకు, మా బలిదానాల మీదుగా సమాధుల మీదుగా తొక్కుకుంటూ ఢిల్లీలో ఫ్యాషన్ పరేడ్‌లు చేస్తున్న మీరు కొంచెం జవాబులు చెప్పుకోవాల్సే ఉన్నది. ఎందుకంటే అమ్మా మీతో కలిసి ఉండ డం కల్ల అని ఈ చేదు నిజాలు మీకు జ్ఞానోదయం కలిగించాలనే ఇదంతా.. ఇవన్నీ యాధృచ్ఛికం కాదు. మీరక్కడ ఢిల్లీలో ఊరేగుతున్నప్పుడయినా, రాజ్‌భవన్‌లో సంచరిస్తూ మీమీ టీవీ గొట్టాల ముందు వచ్చీరాని మాటలు మాట్లాడినప్పుడయినా ఈ చేదు నిజాలని వినాల్సియే ఉంటుంది. తప్పదు.
‘మా పచ్చని పంట పొలాల్లో బిల్డింగులు కట్టుకుంటామా’? అంటారు మీరు.


అవును పచ్చని పంట పొలాల్లో కారంచేడు శవాలను విసిరేస్తారు. పంట కాల్వల్లో ఖండిత దేహాలను విసిరేస్తారు మీరు. బిల్డింగులన్నీ మంది జాగల కట్టి, పంట పొలాలకు నెత్తురు మళ్లించుకుంటారు మీరు. కవి అన్నట్టు పిట్టలేమైనా కానీ, పిల్లపూట్లన్నా పోనీ, మీరు మేఘాల దిక్కు చూడండి, మేం నదులు తన్నుక పోతాం. మనం కలిసుందాం అంటారు మీరు.. సాధ్యమా. తల్లులారా! మా ఓయూ దివారావూతులు, మున్నూటా అరవై ఐదు దినాలు, వేదికలతో, దద్దరిల్లుతున్నన్ని రోజు లూ అట్లా సాధ్యమేనా? అమ్మా... అ‘సత్యవాణి’ లెందరో మా మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లను కొల్లగొట్టి ఉల్టా భారత, రామయణాలు, పవిత్ర భాషణలు పలుకుతుంటే.. కలిసుందమని యాసిడ్ సీసాలతో కమ్ముకొచ్చి బెదిరిస్తుంటే.. కనబడితే కబ్జా పెట్టినప్పుడు తిప్పిన యంత్రమూ మీదే.. యంత్రాంగమూ మీదే. మీభర్తలు..


రాజ్యం చక్రాలు తిప్పుతూ కొల్లగొట్టిన భూముల జాడల్లో మళ్లీ మా కవే చెప్పిన ట్టు ‘‘నా జానీ జిగర్ నగర సుందరి కళ్లూ, ముక్కూ, చెవులూ, చెంపల్ని చెక్కేసి నామ రూపాలు లేని అనామికను చేస్తున్న హైదరాబాద్ తాలిబన్లు, ఎకరాలుగా, గజాలుగా, లెక్కలేస్తున్న నయా వలస పాలకులు..’’ మీరయి.. ‘‘మా ఇంట్లో మేము పరాయిలమై , కాందిశీకులమై, అపరిచితులమై, ఒంటరి బాటసారులమై, మక్కా మసీదులో రెక్కలు విరిగి, నెత్తురు కక్కుకుంటూ, నేలకు ఒరిగిన ఒక చిన్న తెల్ల కబూతర్‌ల లెక్క తిరుగుతున్నం.. ఎగురుతున్నం.. వేదికలయి మెరుస్తు న్నం..’’ అమ్మా మమ్మల్ని కబళించిన వారే.. మీరే.. కలిసుండమంటే ఎట్లా నమ్మా... అమ్మా! నిజంగానే నిండు ‘బంగారు’ తల్లులారా!
మనుషుల్ని ముక్కలు చేసే సంస్కృతి గురించి మా నల్ల సూర్యుళ్లు, మంద కృష్ణలు, వంగపల్లి శ్రీనివాస్, పల్నాటి శ్రీరాములు, అద్దంకి దయాకర్‌లు పోరు నగారా వినిపిస్తున్నప్పుడు, గుండెలు కట్టిన డప్పుల దండోరా వినిపిస్తున్నప్పుడు మీ పక్కన నిలబడిన ఒక తల్లి..

అదే మీ ప్రాంతపు ఒక నల్ల సూరీని అర్థాంగి.. మోక్షవూపసన్న ఉస్మానియా మెడికల్ కాలేజీలో అడ్డగోలు పోస్టింగులూ, పదోన్నతులు పొంది అప్పుడు గవర్నర్‌కు, ఇప్పుడు రాష్ట్రపతికీ కలిసుండాలి ఖబర్దార్ అని వినిపిస్తే తల్లులారా! అమ్మా మోక్ష ప్రసన్నా... మాకు ఎట్లా ఉంటుంది. నిజంగానే ఇదొక ఆధిపత్యం సమస్య. ఇదొక వలసాధిపత్యం సమస్య. 
అమ్మా మోక్ష ప్రసన్నా.. మీ మీద నిండు గౌరవంతోనే .. చెబుతున్నాం. ఇది కులాలు, మతాల సమస్య కాదు. మా ప్రాంతం మీ ఏలుబడిలో కునారిల్లి ఇప్పుడు మేల్కొని ఒక్కటిగా ఒకే ఒక్క గొంతుకగా, వెయ్యి బలిదానాలుగా, తల్లుల ఆగర్భ శోకాల మీదుగా పోరాడుతున్నాం. మీరు మా ఉద్యోగాలూ, మా ప్రమోషన్లూ తన్నుకుపోయి, మా భూములూ కబళించి, మా జాగలూ కబళించి, మా ఆత్మల నూ కొల్లగొట్టి, మా భాషను, చరివూతను, సంస్కృతిని కొల్లగొట్టి కలిసుండమంటే మేడమ్.. ఎట్లా కుదురుతుంది. ఇది న్యాయమా?


మా స్త్రీలు.. మా కవయిత్రి చెప్పినట్టు... గాజుల గలగల వెనుక ఒట్టిపోయిన వెట్టి జీవితాన్ని, వంటి మీద రైకగుడ్డకు గతిలేని తల్లి చనుబాల చేవలో, ఆకలి పేగు ల్ని నూలుపోగులుగా, అతికి చీరెల్నిచ్చిన సిరిసిల్ల సంస్కృతినీ కోల్పోయినం. అదొ క శవాల దిబ్బ.. పోగుకు ఉరిపడ్డ ఉరిశాల. మరో కవి అన్నట్టు.. ‘మా తెలంగాణ ‘ఎన్నో పసుపు కుంకుమలు చెల్లిపోయి తెగిన మొండాలపై నీ హస్తసామువూదికాన్ని చదువుకొంటాం మేము.. ఓ తెలంగాణ’ అని అమ్మా, తల్లులారా! మదొక తరతరాల పోరాటం. మేము మీరెక్కిన మెట్లు ఎక్కలేము. మీరు తొక్కిన గడపలూ తొక్కలేము. రాష్ట్రపతి భవన్‌లూ, రాజ్‌భవన్‌లూ, డిగ్గీరాజా గడీలకూ రాలేము. సామాన్యులం. వేదికలమీద ఉంటాం, కోపానికి , శోకానికి, సంబురానికి కవిత్వాలు చెప్పుకుంటాం. పాటలు కైగట్టి పాడుకుంటాం. ధూమ్ ధామ్‌లై వెన్నెల రాత్రులను వెలిగిస్తాం. దివారావూతులు పోరాడుతూనే ఉంటాం. విశ్రమించం.


అయినా మీరు అడగాల్సింది మీ భర్తలని.. కుళ్లుమోతు అబద్ధాల చక్రవర్తులను, ఏడేండ్ల కింద ఢిల్లీ కెళ్లి జై ఆంధ్ర అని ఇప్పుడు అడ్డగోలు వజ్రాల కథలు చెబుతున్న మేతావి శ్రీనివాసులను, మీ ముఖ్యమంవూతిని.. మీ ముఖ్యమంత్రి హయాంలో పనిచేసిన మీ భర్తలను..ఇస్తే అభ్యంతరం లేదని, అధిష్ఠానానికి కట్టుబడి వుంటామని, ఇప్పుడు అడ్డం తిరిగి తెలుగు జాతి భవిష్యత్తును చీకటి మయం చేస్తున్న మీ భర్తలను నిలదీయండి. అయినా దిగ్విజయ్‌సింగ్ చెప్పినట్లుగానే.. ప్రజల మధ్య విద్వేషం నింపుతున్న మీ భర్తలను, సీమాంధ్ర ప్రయోజనాలను కాలరాస్తున్న మీమీ నాయకులను నిలదీయండి. మాట తప్పి, నైతికత కోల్పోయి, ఏ విలువలూ, ప్రమాణాలూ లేకుండా గాలివాటపు, కృత్రిమ ఉద్యమాలు నిడిపిస్తున్న మీకు దండం. వందనం. శణార్థి. మీతో కలిసి ఉండలేం.. ఉండలేం.

స్త్రీ మూర్తులుగా మీమీద గౌరవంతో, చెబుతున్నాం. సత్యం చేదుగా ఉంటుంది. కఠినంగా ఉంటుంది. అటున్న పొద్దు ఇటు పొడిసినా ‘ఓయుద్ధ భేరి’ సాక్షిగా, మంద కృష్ణ ప్రకటిస్తున్నాడు. వినం డి.. యూటీ అంటే యుద్ధమే. రేపు కోదండరాం ప్రకటిస్తడు చూడండి. తెలంగాణ వెనక్కి వెళితే అంతర్యుద్ధమే. కేసీఆర్ చెప్తున్నడు బాగా వినండి. ఆరునూరయినా తెలంగాణ తథ్యం. మేమందరం చెబుతున్నం తల్లులారా! మమ్మల్ని బతకనివ్వం డి.. మేం విడిపోయినం. ఇక కలిసి ఉండలేం. ఉండలేం. ఉండలేం. మళ్లీ మా కవి చెప్పినట్టే ‘‘వెయ్యి వసంతాలు పూసి రాలిపోతయి, వంద శరద్‌రావూతులు తూలిపోతాయి, తెలంగాణ/ నా తెలంగాణ’’ అదొక్కటే మా మంత్రం. 
జై తెలంగాణ




narayana.allam@gmail.com
Namsete Telangana Telugu News Paper Dated : 22/09/2013 

No comments:

Post a Comment