Tuesday, September 17, 2013

బడుగుల మార్గదర్శి By Dr. కదిరె కృష్ణ


బ్రాహ్మణీయ ఆధిపత్య కులాల అరాచకం పెట్రేగిపోతున్న క్రమంలో ఆధునిక యుగంలో మహాత్మాజ్యోతిరావు పూలే దంపతులు సంస్కరణోద్యమాలు చేపట్టి సమర్థవంతంగా ఎదిరించగలిగారు. అణగారిన వర్గాల జీవితాల్లో ఎంతో కొంత మార్పును తీసుకురాగలిగారు. పూలే దంపతుల స్పూర్తి దేశమంతటా ప్రబలింది. చరిత్ర లోతుల్లోకి వెళ్లి తమ చరిత్రను పరిశోధించి స్వయం గౌరవాన్ని వెతుక్కోవడం శూద్రజాతుల్లో అంకురించింది. ఈ ప్రత్యామ్నాయ సంసృ్కతి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వారు ఛత్రపతి సాహు మహరాజ్‌, నారాయణ గురు పోరాటాల కొనసాగింపుగా ద్రావిడ దేశంలో పెరియార్‌ ఇ.వి. రామస్వామి బెబ్బులి లాగా గర్జించాడు.1879 సెప్టెంబర్‌ 17 న వెంకటప్పయ్య నాయకర్‌, చిన్న తాయమ్మాళ్‌ దంపతులకు తమిళనాడులోని ఈరోడ్‌ నగరంలో జన్మించాడు. 

పెరియార్‌ చిన్నతనం నుండే హేతువాద దృక్పథంతో మెలగసాగాడు. పండితమణి అయోతిదాస్‌, మరుదయ్య పిళ్లైయార్‌, కైవల్యస్వామి వంటి సంఘ సంస్కర్తల ప్రభావం ఆయనపై మెండుగా ఉంది. 1927లో ఈరోడు నగర పాలక సంస్థ చైర్మెన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి సామాజిక సేవ చేసిన ఘనత ఆయనది. కుల, మూఢాచారాల నిర్మూలన పట్ల సమగ్ర అవగాహన కలిగిన పెరియార్‌, మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ ప్రభావంతో 1919లో కాంగ్రెస్‌లో చేరారు. అనతికాలంలోనే తమిళనాడు కాంగ్రెస్‌లో కీలకమైన నేతగా ఎదిగిన ఆయన కుల నిర్మూలన దృక్పథం పట్ల మక్కువతో కాంగ్రెస్‌ మహాసభల్లో కులాల ప్రాతిపదికన విద్యాఉద్యోగ రంగాల్లో పీడిత కులాలకు రిజర్వేషన్ల కల్పన ప్రతిపాదననను ప్రస్తావించి విఫలమయ్యాడు. ఈ అన్ని మహాసభల్లోనూ బ్రాహ్మణ వర్గాల నుంచి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1923 నాటికి పెరియార్‌ తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉండికూడా రిజర్వేషన్లను, అంటరానితన నిర్మూలనను కనీసం కాంగ్రెస్‌తో అంగీకరింపజేయలేకపోయినందుకు విసిగి వేసారి కాంగ్రెస్‌ను వదలడానికి నిశ్చయించుకున్నాడు.

ఈ క్రమంలోనే వైక్కోం సత్యాగ్రహోద్యమాన్ని నడిపించాల్సి వచ్చింది. కేరళలోని వైక్కోం పట్టణంలో పులయ, పరయా (అతిశూద్రులు), ఈళవ, చేనేత, కంసాలి, వనియర్‌, ఒక్కలిగ కులస్థులు వీధుల్లో నడవరాదని తిరువాంకూర్‌ సంస్థానాధీశులు నిషేధం విధించడానికి వ్యతిరేకంగా నడిచిన సత్యాగ్రహంలో నాటి ప్రముఖ నాయకులు టి.కె.మాధవన్‌, నంబూద్రిపాద్‌, మన్నత్‌ పద్మనాభం, గోవిందదాస్‌ మొదలగు వారిని అరెస్ట్‌ చేసి జైళ్లో పెట్టారు. ఆ ఉద్యమాన్ని నడపడానికి సమర్థుడైన నాయకున్ని వెతకడం ప్రారంభించారు. ఈ దశలో అప్పటికే తమిళనాడులో గురుకులంలోని శూద్ర విద్యార్థుల పట్ల బ్రాహ్మణ వర్గాలు పాటిస్తున్న అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెరియార్‌పై వారి దృష్టి పడింది. నంబూద్రిపాద్‌ ఉత్తరం అందుకున్న పెరియార్‌ అనారోగ్యంతో ఉన్నప్పటికీ వైక్కోం సత్యా గ్రహానికి నాయకత్వం వహించడానికి కేరళ వెళ్లారు.

వైక్కోం సత్యాగ్రహం దేశమం తటా ఒక సంచలనాన్ని సృష్టించడమే కాక పాలక వర్గాలను గడగడలాడించింది. చివరికి 1925 మార్చి 9వ తేదీన గాంధీ వైక్కోం చేరుకొని సత్యాగ్రహం విరమిం చవలసిందిగా పెరియార్‌ను కోరవలసి వచ్చింది.కేవలం పోరాటాలకే తన ఉద్య మాన్ని పరిమితం చేయకుండా ప్రత్యా మ్నాయ సంసృ్కతికి పునాదులు వేశాడు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అణగారిన వర్గాల అభ్యున్నతిని స్వాభి మానాన్ని పునరుద్ధరించేందుకు జీవితాంతం తపనపడిన త్యాగశీలి. తమిళనాడులో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదంటే జస్టిస్‌ మూలాలు కలి గిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీ.ఎం.కే) వంటి నేటిపార్టీల పాలనే కారణం దానికి పెరియార్‌ పోరాటమే పునాది. ద్రవిడ సంస్కృతి, నాస్తిక/ తర్క/ హేతువాదానికి తాత్విక భూమికగా నిలిచింది పెరియార్‌ సిద్ధాంతం. పురోహితుడు, మంగళ సూత్రా లు, మంత్రాలు లేకుండా పూలే సత్యశోధక్‌ సమాజ్‌ పద్దతుల్లో వివాహాలు జరిపిన తిరుగుబాటుదారుడాయన. బహుజన విద్యావేత్తలు, నాయకులు పెరియార్‌ తర్కా న్ని హేతువాద దృక్పథాన్ని ప్రజల్లో ప్రచారం చేయవలసి ఉన్నది. అప్పుడే ఆయనకు నిజమైన నివాళి.

(సెప్టెంబర్‌ 17 పెరియార్‌ జయంతి)

Surya News Paper Dated : 17/09/2013 

No comments:

Post a Comment