September 03, 2013
ఆహార భద్రతా చట్టం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ ఆమోదానికి మార్కెట్లు మోదం చూపలేదు. ఇదలావుంచితే ఆహార భద్రతా చట్టం అర్థవంతమైన శాసనమనడంలో సందేహం లేదు. అయితే ఆ చట్టాన్ని అమలుపరచడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుకోవల్సివుంది. ఒక సగటు దుకాణదారు మూలధనం సహజంగానే పరిమితంగా ఉంటుంది. మరి ఆ పరిమిత ధనంతో దాన ధర్మాలు చేస్తూ వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించుకోగలడా? సమాధానం స్పష్టమే. మరి ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితిలో ఉన్నది. ఆహా ర భద్రతా చట్టాన్ని అమలుపరచేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ప్రభుత్వానికి లేవు. ఈ అవరోధాన్ని అధిగమించడం ఎలా? ప్రస్తుత సంక్షేమ వ్యయాలను అధికం చేయడానికి బదులు ఆ వ్యయాల నాణ్యతను మరింతగా మెరుగుపరచడం ద్వారా పేదలకు ఆహార భద్రత సమకూర్చవచ్చు.
పేదలకు సహాయపడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నాలుగు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అవి : రైతులకు కనీస మద్దతు ధర లభించేలా భారత ఆహార సంస్థకు సబ్సిడీ నివ్వడం, విద్యా వైద్యసదుపాయాలు సమకూర్చడం, ఉపాధి హామీ పథకం అమలు, ఎరువుల సబ్సిడీలు. ఆ కార్యక్రమాల లక్ష్యమేమిటి? తన ఫలసాయానికి ధరలు తగ్గిపోయినప్పుడు రైతులు నష్టపోకుండా ఉండేందుకై భారత ఆహార సంస్థకు సబ్సిడీనిస్తోంది. ఆవశ్యక సేవలైన విద్యా వైద్యాలు సామాన్య ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు అడిగిన ప్రతి ఒక్కరికీ సంవత్సరంలో కనీసం వంద రోజులు పాటు ఉపాధి కల్పించడానికి ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం కట్టుబడివుంది. రైతుల ఉత్పాదక ఖర్చులను తగ్గించేందుకై ఎరువులపై ప్రభుత్వం భారీ సబ్సిడీని ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.2.92,000 లక్షల కోట్లను ఎరువుల సబ్సిడీగా నిచ్చింది. ఈ మొత్తం 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.3.60,000 కోట్లకు పెరగవచ్చని ఒక అంచనా.
పేదల సంక్షేమానికి ఉద్దేశించిన ఈ పథకాల వల్ల పేదలు నిజంగా లబ్ధిపొందుతున్నారా? లేదు. వారికి దక్కుతున్న లబ్ధి స్వల్పాతి స్వల్పం మాత్రమే. ఆహార సంస్థకు సమకూరుస్తున్న ఆర్థిక సహాయం ఆ సంస్థలో అవినీతిని పెంచుతోంది. సిబ్బంది అసమర్థతకు ఊతమిస్తోంది. సంపన్న రైతులు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే మిగులు ధాన్యం ఉండేది వారి వద్దే కదా. విద్యా వైద్యరంగాలకే కేటాయిస్తున్న నిధులు ప్రభుత్వ సిబ్బంది, పట్టణ ప్రాంతాల ప్రజలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఉపాధి హమీ పథకం అమలు అవినీతిమయమై పోయింది. సంబంధిత నిధులలో 25 నుంచి 75 శాతం మేరకు ప్రభుత్వ సిబ్బంది, సర్పంచ్‌లు స్వాహా చేస్తున్నారు.
ఈ సంక్షేమ కార్యక్రమాల నుంచి పేదలు నిజంగా లబ్ధి పొందాలంటే వాటిని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అప్పుడు మాత్రమే సంబంధిత సొమ్ము నిర్దేశిత లబ్ధిదారులకు చేరుతుంది. ఈ కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయడమే శ్రేయస్కరమని నేను గట్టిగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాల రద్దు వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏటా 3,60,000 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ఇలా ఆదా అయిన సొమ్మును దారిద్య్రరేఖకు దిగువున జీవిస్తున్న వారందరికి నేరుగా నగదు రూపేణా పంచవచ్చు. ఈ పేదల సంఖ్య 80 కోట్లు అయితే ప్రతి ఒక్కరూ నెలకు రూ.4500 పొందే అవకాశముంది. అంటే దారిద్య్రరేఖకు దిగువున జీవిస్తున్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.22,500 ఆర్థిక సహాయమందుతుంది. ఇంకా ఇతర పనులు చేసుకోవడం ద్వారా అదనంగా సంపాదించుకోవచ్చు. ఇలా అదనంగా రూ.12,500 సంపాదించుకునే అవకాశముంటుంది.
అంటే దారిద్య్రరేఖకు దిగువున నివశిస్తున్న ప్రతి కుటుంబమూ సంవత్సరానికి రూ.35 వేలు లేదా నెలకు రూ.3000 ఆర్జించుకునే అవకాశముంది. ఈ సొమ్ముతో వారు తమ ఆహార, విద్యా, వైద్య అవసరాలను మార్కెట్ రేట్ల ప్రకారం కొనుగోలు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయవల్సిన అవసరముండదు. అలా ఆదా అయిన సొమ్ము కూడా ప్రజలకు అందుతుంది. అయితే ఇందుకు ప్రభుత్వ సిబ్బందికి, సంపన్నులకు కల్పిస్తున్న ప్రయోజనాల్లో కోత విధించి, తద్వారా ఆదా అయిన సొమ్మును పేదల సంక్షేమానికి మళ్ళించవలసివుంది.
కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యా వైద్య సేవలకు ఏటా రూ. 3,60,000 కోట్లను వ్యయం చేస్తున్నాయి. ఈ సంక్షేమ సేవలను కూడా రద్దు చేస్తే దారిద్య్రరేఖకు దిగువున నివశిస్తున్న కుటుంబానికి నెలకు రూ.5000 మేరకు నేరుగా ఆర్థిక సహాయం అందించవచ్చు. దారిద్య్ర రేఖకు దిగువున నివశిస్తున్న కుటుంబాలు ప్రస్తుతం నెలసరిన ఆర్జిస్తున్న మొత్తం కూడా రూ. 5000 లేనన్నది గమనార్హం. చెప్పవచ్చినదేమిటంటే పేదల కోసం ఉద్దేశించి, వాస్తవంగా సంపన్నులకు లబ్ధి చేకూర్చుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను రద్దుచేసి, దారిద్య్రరేఖకు దిగువున నివశిస్తున్న కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం ద్వారానే ప్రస్తుత సంక్షోభం పరిష్కారమవుతుంది. సుస్థిర ఆర్థికాభివృద్ధికి గట్టి పునాది అవుతుంది. పేదలు ఖచ్చితంగా అభ్యున్నతి సాధిస్తారు.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)
Andhra Jyothi Telugu News Paper Dated : 3/09/2013
No comments:
Post a Comment