Saturday, July 28, 2012

దళితుల అభివృద్ధిని ఓర్వలేని పెత్తదారులు--జి లకëణరావు


  • భూమిపై హక్కు అడిగితే హతమార్చారు
  • అధికారులు సకాలంలో స్పందిస్తే ఐదు ప్రాణాలు నిలిచేవి
  • లక్షింపేట దళితులకు అండగా నిలిచిన కెవిపిఎస్‌
బూరాడ సుందరరావు(40) బ్యాండు పార్టీ గాయకుడు. వీరఘట్టం మండలం కొట్టుగుమ్మడలో ఒక కార్యక్రమంలో పాల్గొని జూన్‌ 12న ఉదయం ఇంటికొచ్చాడు. చద్దన్నం తింటున్న సమయంలో కొంతమంది పెత్తందార్లు ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. తనను చంపొద్దని కాళ్లావేళ్లా పడినా.... వారు కనికరించలేదు. ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి పెద్ద బండరాయితో గుండెలపై మోది హతమార్చారు.
వృద్ధుడు నివర్తి వెంకట్‌(50) కూడా ఇంట్లో భోజనం చేస్తుండగా పెత్తందార్లుల మూకుమ్మడిగా వచ్చి దాడి చేశారు. ఇంటి నుంచి ప్రభుత్వ పాఠశాల సమీపం వరకూ లాక్కెళ్లి బళ్లాలతో పొడిచి చంపారు.
ప్రాణాలు కాపాడుకునేందుకు పక్క వీధిలోకి పరుగెడుతున్న నివర్తి సంగమేశు(45)ను తోడేళ్లలా వెంటాడి మరీ బరిసెలతో పొడిచి, గొడ్డళ్లతో నరికారు. తీవ్రంగా గాయపడిన ఆయనను రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
చిత్రి అప్పడు(45)ను భార్య, పిల్లల కళ్లెదుటే బండరాళ్లతో తలపై మోది అతి కిరాతకంగా హత్య చేశారు.
ఇంట్లో పడుకున్న బొద్దూరు పాపయ్యను బయటకు లాక్కెళ్లి కత్తులు, బరిసెలతో కసితీరా ఒంటి నిండా 30 పోట్లు పొడిచారు. రక్తపుమడుగులో పడి ఉన్న పాపయ్యను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆయన కెజిహెచ్‌లో మృతి చెందాడు.
మంత్రి కొండ్రు మురళీమోహన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం లక్షింపేట గ్రామంలో దళితులపై సాగిన ఊచకోత ఇది. వీరే కాదు మరో 31 మందికి కాళ్లు, చేతులు విరగ్గొట్టి, తలలు పగులగొట్టి చావబాదారు. పెత్తందార్లల హింసాకాండపై ఈ వారం ప్రజాశక్తి ప్రత్యేక కథనం....
ఆ రోజు ఏం జరిగింది..?
జూన్‌ 12న ఉదయం 7.30 గంటలు. అంతవరకూ ప్రశాంతంగా ఉన్న లక్షిం పేట గ్రామం పెత్తందారుల భూ దాహానికి భగ్గుమంది. పెత్తందారులు సృష్టించిన నరమేధంతో ఆ గ్రామం ఒక్కసారి ఉలిక్కి పడింది. దళితుల రుధిర ధారలతో లక్షింపేట తడిచి ముద్దయింది. బాంబులు... గొడ్డళ్లు... బళ్లేలు... రాళ్లు... కారంపొడులతో సుమారు 200 మంది పెత్తందారులు ఏకపక్షంగా దళితులపై మెరుపుదాడి చేశారు. దళితవాడకొచ్చే ముందు నాలుగు నాటు బాంబులు విసిరి భయానక వాతా వరణాన్ని సృష్టించారు. సుమారు మూడు గంటల పాటు మారణహోమం సృష్టించారు. పాశవికంగా మృత్యుకేళీ సాగించి ఐదుగురిని పొట్టన పెట్టుకున్నారు. 31 మందిని క్షతగాత్రులను చేశారు. వాళ్లు.. వీళ్లన్న బేధం లేదు. దళితవాడలోని ప్రతి ఇంటిపైనా దాడి చేశారు. వృద్ధులు, మహిళలు, పిల్లలనే మానవత్వం, కనికరం లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చావబాదారు. ఏ ఇంటి గోడకు చూసినా దళితుల రక్తపు చారలే. దళితుల ఇళ్లల్లో ఉన్న కొద్దిపాటి తిండిగింజలు, ఆస్తులను ధ్వంసం చేశారు. పెత్తందారులు కొట్టికొట్టీ అలసిపోతే వారి కుటుంబాలకు చెందిన మహిళలు విసనకర్రలతో విసిరి, నీరందించి దాడికి ప్రోత్సహించారు. కొంత మంది మహిళలూ దాడిలో పాల్గొని కర్రలతో దళితులను చావబాదారు. దళితులు తేరుకునే లోపే రక్తం ఏరులై పారింది. దళితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తెలియజేసి, రక్షణ కల్పించాలని ఫోన్లు చేస్తే, ఒక కానిస్టేబుల్‌ను పంపారు. మారణకాండను కళ్లారా చూసిన కానిస్టేబుల్‌ భయంతో పరుగులు తీశాడు. పాతకాలం సినిమాల్లోలా నరమేధం పూర్తయ్యాక పోలీసులు మెల్లగా చేరుకున్నారు.
వివాదానికి మూలం ఇదీ...
మడ్డువలస జలాశయం కోసం వంగర మండలంలోని 12 గ్రామాల్లోని 7,799 ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించింది. అందులో భాగంగానే లక్షింపేట గ్రామమంతా నిర్వాసిత గ్రామమైంది. లక్షిం పేటలో 77 దళిత, 77 తూర్పు కాపు, 11 ఇతర బిసి కుటుంబాలున్నాయి. ప్రభుత్వం నష్ట పరిహారాన్ని చెల్లించి గ్రామాన్ని ఖాళీ చేయించింది. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. దళితులు భూముల్లేని కూలీలైనందున వీరికి ఎలాంటి పరిహారమూ అందలేదు. వీరందరికీ పక్కపక్కనే ముత్యాలమ్మ చెరువు వద్ద ప్రభుత్వం పునరావాసం కల్పించింది. లక్షింపేట పరిసరాల్లోనే ముంపునకు గురికాని 250 ఎకరాల భూమి ప్రభుత్వ పరిధిలో ఉంది. ఆ మొత్తం భూమిని గత హక్కు దారులైన రైతుల నుంచి లక్షింపేటకు చెందిన పెత్తందారులు కౌలుకు తీసుకుని సాగు చేసేవారు. అవి ప్రభుత్వ భూములై నందున కొన్నేళ్ల తర్వాత కౌలు ఇవ్వకుండానే సాగుచేసుకుంటున్నారు. అందులో 60 ఎకరాల భూమిని గతంలో హక్కుదారులైన రైతులు సాగుచేసుకోమని దళితులకిచ్చారు. ఇది పెత్తందారులకు సహించలేదు. ఆ భూమినీ తమ వశం చేసు కునేందుకు పధకం వేశారు. చివరికి దళితులు సాగు చేయనీయకుండా అడ్డు పడ్డారు. కెవిపిఎస్‌ అండతో లక్షింపేట దళితులందరూ సంఘటితమై, ఆ 60 ఎకరాల భూమిని మళ్లీ సాగుచేయడం మొదలు పెట్టారు. సమాన బలం ఉండడంతో అడ్డుపడిన పెత్తం దారులనూ ప్రతిఘటిం చారు. ఇది బైండోవర్‌ కేసుల వరకూ వెళ్లింది. ఆరు నెలల పాటు గ్రామంలో పోలీస్‌ పికెట్‌ను ఏర్పాటు చేశారు. దళితులు ఆ భూమిని సాగు చేయడాన్ని సహించ లేదని పెత్తందారులు మాజీ ఎంపిపి, కాంగ్రెస్‌ నాయకుడు బొత్స వాసుదేవరావు నాయుడును సంప్రదించారు. తనకున్న పలుకుబడితో వాసుదేవరావు నాయుడు పికెట్‌ను ఎత్తివేయించాడు. ఆ మరుసటిరోజే దళితులపై పెత్తందారులు దాడి చేసి చిత్రి అప్పడు కాళ్లు విరగ్గొట్టారు. కామేష్‌ తల పగులగొట్టారు. భూమి కావాలో... ప్రాణాలు కావాలో తేల్చుకోవాలని పెత్తందారులు దళితులను హెచ్చరించారు. ఇది ఆరు నెలల కిందటి సంఘటన. ఈ దాడిపై కెవిపిఎస్‌ పోరాట ఫలితంగా నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనా, 'పెద్దల' అండతో బెయిల్‌పై మూడు రోజుల్లోనే బయట కొచ్చారు. దాడి తర్వాత గ్రామంలో మళ్లీ పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. వివాదానికి కారణమైన ఆ భూమిని ఎవరూ సాగు చేయరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దళితులు మంత్రి కొండ్రు మురళీమోహన్‌ను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నా ప్రయోజనం లేక పోయింది. మంత్రిని కలిసొచ్చిన దళితులను వాసు దేవరావు నాయుడు పిలిపించి భూముల గురించి ఆలోచిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దళితులను భయపెట్టారు. భూమిని తిరిగి సాగుచేసుకోవ డానికి అను మతిం చాలని దళితులు అధికారులను ఎప్పటి కప్పుడు కోరుతున్నా వాయిదా వేస్తూ వచ్చారు. భూ సమస్య రెండేళ్లుగా నలుగు తున్నా మంత్రి మురళీమోహన్‌, అధికారులు పరిష్కారానికి ప్రయత్నించిన దాఖలాల్లేవు. దీంతో సమస్య రోజురోజుకూ జఠిలమై, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పధకం ప్రకారం దాడి
ఇంతలో నరసన్నపేట నియోజక వర్గ ఉప ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల బందోబస్తు పేరిట గ్రామంలో పికెట్‌ను ఎత్తేయించారు. ఇదే అదునుగా భావించి దళితులపై దాడికి ప్రణాళికను రూ పొందించారు. దళితులు, గ్రామంలోని పెత్తం దారులు సమాన బలమైనందున ఆ భూములకు గతంలో హక్కుదారులైన కొంతమంది పెత్తందారులను పోగేశారు. మార ణాయుధాలతో దాడికి బయలుదేరారు. ఇందుకు అధికార పార్టీ 'పెద్దల' ప్రోత్సాహముందన్న విమర్శలున్నాయి.
భూమి విషయంలో కానరాని స్పష్టత
ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి రాఘవులు సహా పలువురు రాష్ట్రస్థాయి నేతలు లక్షింపేట బాధితులను పరామర్శించారు. ఈ ఘటన సంచలనం సృష్టించినా, అప్పటి జిల్లా కలెక్టర్‌ జి వెంకట్రామిరెడ్డి మాత్రం మూడు రోజుల వరకూ ఘటనాస్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించలేదు. 'ఓపిక లేని ఘటన'గా దీన్ని ముఖ్యమంత్రి అభివర్ణించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షలు, పింఛను, పిల్లల చదువులు, ఒకరికి ఉద్యోగం వంటి హామీలనిచ్చారు. అయితే ఘటనకు కారణమైన భూమిని మాత్రం ఇస్తామని చెప్పలేదు. భూకొనుగోలు పథకం కింద భూములు కొనుగోలు చేసి దళితులకు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. లక్షింపేట దళితులందరికీ ఒకేచోట ఇచ్చేంత భూమి లక్షింపేటలో లేదు. రెవెన్యూ, పో లీసుల వైఫల్యం వల్లే ఘటన చోటు చేసు కుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యులను చేస్తూ కిందిస్థాయి అధికారులను బదిలీ చేశారు. ఘటనకు ప్రధాన సూత్రధారి అయిన బొత్స వాసు దేవరావునాయుడుతో పాటు 76 మందిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.
ఉపాధి కరువు
లక్షింపేట దళితులకు భూమి లేదు. అందరూ కూలీలే. పని ఉంటేనే నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్తాయి. లేదంటే ఆ పూట పస్తులే. దళితులు పెత్తందారుల పొలాల్లో పని చేస్తుండేవారు. ఈ ఘటన చోటుచేసుకున్నాక దళితులకు పనిలేకుండా పోయింది. మడ్డువలస జలాశయ మిగులు భూములిస్తే సాగు చేసుకుని తాము బతకగలమని దళితులు చెప్తున్నారు. ఏ భూమి కోసమైతే దళితులు రక్తతర్పణం చేశారో ఆ భూములను వారికి పంచడం, ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తేనే దళితులకు సరైన న్యాయం చేకూరినట్లు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలి
ఆరు మాసాల్లో కేసు విచారణను పూర్తి చేసి దోషులను శిక్షించాలి. దాడి చేసిన వారిని నిర్ణీత సమయంలోగా శిక్షించాలి. లక్షింపేట దాడిని గ్రామం మీద జరిగిన దాడిగా పరిగణించాలి. వివాదానికి కారణమైన భూములను దళితులకు పంచాలి. చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలి.
డి గణేష్‌, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి
కాళ్లు పట్టుకున్నా వదల్లేదు
గునపాలతో ఇంటి తలుపును పగులగొట్టి, రాతిబండతో నా భర్తను చంపారు. కాళ్లు పట్టుకుని బతిమాలినా వదల్లేదు. తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పోయినోళ్లను తిరిగి తీసుకొస్తుందా..? నా భర్తను చంపినోళ్లకు శిక్ష పడాలి.
బూరాడ కాశాలు (మృతుడు సుందరరావు భార్య)
గ్రామంలో 'ఉపాధి' కల్పించాలి
ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా గ్రామంలో ఉపాధి పనులు కల్పిస్తున్నా, మాకు మాత్రం కల్పించలేదు. ఇప్పుడు గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని తలగాం గ్రామంలో ఉపాధి పనులు కల్పిస్తామంటున్నారు. అంతదూరం వెళ్లే పరిస్థితుల్లో ప్రస్తుతం మేం లేము. గ్రామంలోనే 'ఉపాధి' కల్పించాలి. నివర్తి రాములమ్మ (మృతుడు సంగమేశు భార్య)
ఇప్పటికీ భయంగానే ఉంది
కొట్టారని గతంలో కేసు పెట్టాం. ఎవరూ పట్టించుకోలేదు. దాన్ని మనసులో ఉంచుకుని నా భర్తను బళ్లాలతో నరికి చంపారు. మమ్మల్ని ఏం చేస్తారోనన్న భయం ఇప్పటికీ ఉంది.
చిత్రి శ్రీదేవి (మృతుడు అప్పడు భార్య)
జి లకëణరావు, శ్రీకాకుళం,/font>
Prajashakti News Paper Dated : 22/07/2012 

No comments:

Post a Comment