Saturday, July 28, 2012

వికలాంగులపై పెరిగిన వివక్ష ---- Former EFL-University Participent పవన్ ముంతా


"వైకల్యం ఒక శాపం కాదు. జన్మతః వచ్చిన ఒక లోపం. దీనిని అర్థం చేసుకొని సహకరించకపోవటం వల్ల ఈ రోజు సమాజంలో వికలాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగం కూడా వీరి పట్ల వివక్ష చూపుతోంది..'' అంటారు పవన్ ముంతా. వికలాంగుల సమస్యల పరిష్కారానికి సామాజిక పోరాటమే పరిష్కారమనే పవన్ గత రెండు దశాబ్దాలుగా వికలాంగుల పక్షాన నిలిచి వారి గళాన్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం మన సమాజంలోని వికలాంగుల స్థితిగతులపై పవన్‌తో ఈ వారం ముఖాముఖి..

ఒకప్పుడు మన సమాజంలో వికలాంగుల పట్ల వివక్ష ఎక్కువ ఉండేది కాదు. వారిని సమాజంలో ఒక భాగంగానే పరిగణించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది కదా..
మీరు చెప్పింది వాస్తవమే. ఒకప్పుడు అంధులు, ఇతర వికలాంగులకు సమాజంలో ఏదో ఒక వృత్తి దొరికేది. ఆ సమయంలో వివక్ష ఉండేది కాని సానుభూతి కూడా ఉండేది. అనేక గ్రామాల్లో అంధులను గుళ్లలో గాయకులుగా నియమించేవారు. వారికి ఎంతో కొంత ముట్టచెప్పేవారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఈ పద్ధతి కొనసాగుతూనే ఉంది. అదే విధంగా పాఠశాలలో వికలాంగులు కూడా చదువుకోవటానికి వీలుండేది. నన్నే ఉదాహరణగా తీసుకుందాం. నాకు కంటి చూపు లేదు. కాని నేను ప్రభుత్వ పాఠశాలలోను, కాలేజీలోను చదివాను. నాకు ఎవరూ సీటు ఇవ్వనని అనలేదు. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో వికలాంగులకు సీట్లు ఇవ్వటం లేదు. ఎవరైనా గట్టిగా డిమాండ్ చేస్తే - "మా దగ్గర వారికి తగిన మౌలిక సౌకర్యాలు లేవు. వారికి చదువు చెప్పటానికి తగిన సిబ్బంది లేరు'' అని సాకులు చెబుతారు.

గతంలో కూడా వివక్ష ఉండేదన్నారు కదా.. దీని వెనకున్న అసలు కారణాలేమిటి?
ఒకప్పుడు బ్రిటన్‌లో పూర్‌లాస్ అని ఉండేవి. పేద ప్రజల కోసం ఉద్దేశించిన చట్టాలవి. వీటి ప్రకారం వికలాంగులను ముష్టివాళ్లుగా పరిగణించేవారు. మన దేశంలోని అన్ని వ్యవస్థలపై బ్రిటిష్ వారి పరిపాలనా ప్రభావం గాఢంగా పడింది. వాళ్లు వదిలివెళ్లిన పరిపాలనా విధానాన్ని, చట్టాలను మనం పాటిస్తూ వస్తున్నాం. మన రాజ్యాంగంపై కూడా వీటి ప్రభావం ఉంది. మన దేశంలో ప్రస్తుతం 26 రకాల చట్టాలు వికలాంగుల పట్ల వివక్ష చూపుతున్నాయి. ఉదాహరణకు మన చట్టాల ప్రకారం- అన్‌సౌండ్ మైండ్ (మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవటం) అనే స్థితి ఉంటే ఒక వ్యక్తికి చాలా హక్కులు ఉండవు.

అతనికి ఆస్తి రాదు. ఓటు హక్కు ఉండదు. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వరు. కాని అన్‌సౌండ్ మైండ్ అనేది అనేక రకాలుగా ఉంటుంది. అందరిని ఒకే గాటన కట్టడం సరికాదు. వికలాంగులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవటం వల్ల వచ్చే వివక్ష మరో రకం. మీకు ప్రతి రోజు చూసే ఒక ఉదాహరణ చెబుతాను. చాలా అపార్ట్‌మెంట్‌లలో మెట్లు కడతారు. నడవలేని వారి కోసం ర్యాంపులు కట్టరు. అంటే మౌలిక సదుపాయాల రూపకల్పనలో కూడా ఈ వివక్ష స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా కాలంగా మన సమాజంలో పాతుకుపోయింది. దీని ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

అప్పటికి ఇప్పటికి పరిస్థితిలో ఏ మాత్రం మార్పు ఉంది? ప్రభుత్వం ప్రారంభిస్తున్న పథకాల ప్రభావమేమీ కనిపించటం లేదా?
మార్పు పెద్దగా లేదు. వికలాంగుల పట్ల వివక్ష ఇంకా చాలా బలంగా ఉంది. ఇలాంటి కేసులు గురించి నేను రోజూ వింటూనే ఉంటా. కాని ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని విధానాలు ప్రవేశపెట్టింది. ఉదాహరణకు ఇందిరా క్రాంతి పథం వంటి పథకాలలో వికలాంగుల కోసం ప్రత్యేకమైన కోటాలను ప్రవేశపెట్టింది.

అయితే ఇది ఎన్ని మండలాలలో అమలు అవుతోంది? అనే విషయం సందేహాస్పదమే. అదే విధంగా వికలాంగుల పథకాల కోసం ఆర్థిక వనరుల కేటాయింపు, వారికి అదనపు అవకాశాలు కల్పించటం అనే విషయాలలో కూడా ప్రభుత్వం చురుకుగా వ్యవహరించాలి. అన్ని రాష్ట్రాలలోను వికలాంగుల కోసం రూపొందించిన చట్టాలు అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.

ఈ పరిస్థితిని మార్చటంలో సామాజిక ఉద్యమాల పాత్ర ఏమిటి? ఉద్యమకారులు ఎలాంటి పాత్ర పోషించాలి?
వైకల్యం ఉన్న వారికి కూడా సమాన హక్కులు ఉండాలనే భావన అందరిలోను వచ్చినప్పుడు వికలాంగులకు అస్సలు సమస్యలే ఉండవు. అయితే వికలాంగుల పట్ల వివక్ష పాతుకుపోయింది కాబట్టి దానిని మార్చాలంటే సామాజిక ఉద్యమాల అవసరం ఎంతైనా ఉంది. ఈ ఉద్యమాలలో వికలాంగ సంఘాలు ఒక కీలకమైన పాత్ర పోషించాలి. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముందు పోరాటం చేయాలి. మీకో ఉదాహరణ చెబుతాను.

వైకల్యం ఉన్న వారిని గుర్తించి వారికి సర్టిఫికేట్లు ఇచ్చే అధికారం ప్రభుత్వ డాక్టర్లకు ఉంటుంది. కాని చాలా జిల్లాల్లో ఈ ప్రభుత్వ డాక్టర్లు ఉండరు. ఇక గ్రామ స్థాయిలో పరిస్థితిని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వికలాంగుల సమస్యలపై పోరాడేవారు ముందు ఇలాంటి సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారమార్గాలను వెతకాలి. దీనితో పాటుగా వైకల్యంపై మన సమాజంలో పాతుకుపోయిన భావనలను మార్చటానికి కృషి చేయాలి.

- ఇంటర్వ్యూ: సి.వి.ఎల్. ఎన్. ప్రసాద్ 
Andhra Pradesh News Paper Dated : 29/07/2012

No comments:

Post a Comment