Thursday, January 24, 2013

ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన నవలే- అన్‌టచబుల్ గాడ్ (అంటరాని దైవం)





మన దేశంలో సామాజిక సమానత్వం ఉందా? బ్రాహ్మణ ఆధిపత్య భావనే కొనసాగుతోందా? అగ్ర, నిమ్న వర్ణాల మధ్య తారతమ్యాలు ఇంకా ఉన్నాయా?- ఈ ప్రశ్నలకు సమాధానంగా ప్రముఖ సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన నవలే- అన్‌టచబుల్ గాడ్ (అంటరాని దైవం). దేవుడి గురించి ఆలోచించటం మొదలుపెట్టిన పేరయ్య అనే ఒక దళితుడిని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు బ్రాహ్మణ పెద్దలు హత్య చేయిస్తారు. ఆ ఆరుగురి భావాలు, గుణగణాలను పరిహాసాస్పదంగా విశ్లేషిస్తూ రచయిత ఈ నవలను ముందుకు నడిపిస్తాడు. ఈ నెల 27న జైపూర్ లిటరరీ ఫెస్టివల్‌లో విడుదలకానున్న ఈ నవలలోని కొన్ని ఆసక్తికర భాగాలు..



కుక్కలతోను, కుక్కలలాంటి వారితోను ఎటువంటి సంబంధం లేకుండా ఉండటం కోసం బ్రాహ్మణులు దూరంగా నివసిస్తారు. వారు నివసించే ప్రాంతాలను అగ్రహారాలు అంటారు. శ్రమను నమ్ముకొని బతికే మనుషులు, వారికి నమ్మకంగా ఉండే కుక్కలు, చాకిరీ చేసే గాడిదలకు దూరంగా బతకటం కోసం దేవుళ్లు వారికి అగ్రహారాలలో భూములను ఇచ్చారు. బ్రాహ్మలు తమ కులం వారితోను, తమకు లాభం చేకూర్చే దేవుళ్లతో మాత్రమే సంబంధబాం«ధవ్యాలు పెట్టుకుంటారు. హిందు దేవుళ్లు చంఢాలురని, పేరయ్యలాంటి శ్రామిక జీవులను, కుక్కలను సృష్టించే స్థాయికి దిగజారలేదనేది వారి భావన. 



కాని అలాంటి వారు కూడా ఈ సృష్టిలో ఉన్నారు కాబట్టి- వారిని చూసినప్పుడల్లా బ్రాహ్మణులకు తీవ్రమైన ద్వేషభావం కలుగుతుంది. (అలాంటి అగ్రహారం వైపు వెళ్లే రోడ్డుపై పేరయ్య నడుస్తున్నాడు).. పేరయ్య మనసు అల్లకల్లోలంగా ఉంది. అతని మనసులో రకరకాల ఆలోచనలు బోనులో ఎలకల్లా పరిగెడుతున్నాయి. పేరయ్య తన పిల్లల గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. తన పిల్లలు కూడా బ్రాహ్మణులు పూజించే దేవుళ్లిచ్చిన వర ప్రసాదాలే. అయినా వారి భవిష్యత్తు అంధకారంగానే కనిపిస్తోంది. 



ఎప్పుడైనా కుక్కలు తమ పిల్లల గురించి ఆలోచిస్తాయా అనుకున్నాడు పేరయ్య. పిల్లలకు ఆకలి వేసినా, దెబ్బలు తగిలినా- తల్లి కుక్క వెంటనే పరిగెట్టుకుంటూ వస్తుంది. మగ కుక్క ఎప్పుడూ పిల్లలను సాకదు. నేను కూడా పిల్లలను సాకాల్సిన అవసరం లేదు అనుకున్నాడు పేరయ్య... ఇంతలో ఇంకో ఆలోచన వచ్చింది. అసలు దేవుడు తనను ఎందుకు పుట్టించాడు? అనుకున్నాడు పేరయ్య. బహుశా హిందు దేవుళ్లకు నాలాంటి వాళ్ల పుట్టుకతో సంబంధం ఉండి ఉండదు. పెద్ద దేవుళ్లకు శత్రువులైన చిన్న దేవుళ్లు నాలాంటి వాళ్లను పుట్టించి ఉంటారు. అలాంటి చిన్న దేవుళ్లు ఇప్పుడు ఏమయ్యారు? వారు తమ బాధ్యతలను ఎందుకు నిర్వర్తించటం లేదు? బ్రాహ్మణ దేవుళ్లు తమ వాళ్లకు భూములు, ధాన్యం, డబ్బు, హోదా అన్నీ ఇచ్చారు. 



కాని తనను పుట్టించిన దేవుళ్లు మాత్రం తనకేమీ ఇవ్వలేదు. వాళ్లు ఒక్కసారి తనకు కనిపిస్తే- వాళ్ల గురించి తానేమనుకుంటున్నానో చెప్పాలనుకున్నాడు పేరయ్య.. అతను నడుస్తుంటే గోడలపై- 'మనం లేవాలి.. తిరగబడాలి..' అనే వాక్యాలు కనిపించాయి. కాని ఎవరు లేవాలి? ఎందుకు లేవాలి? తనొక్కడే నిద్రపోతున్నాడా? మిగిలిన వాళ్ల సంగతేమిటి? ఇలాంటి ఆలోచనలు అనేకం పేరయ్యను చుట్టుముట్టాయి. పేరయ్య తలవంచుకు నడవటం మొదలుపెట్టాడు. ఇంతలో ఎవరో అతని తల మీద వెనకనుంచి కొట్టారు. పేరయ్యకు ఒక క్షణం ఏ జరుగుతోందో అర్థం కాలేదు. 'దేవుడా.. చచ్చిపోతున్నా..' అని అరవటం మొదలుపెట్టాడు. వెనక నుంచి దెబ్బల వర్షం కురుస్తూనే ఉంది. పేరయ్య నేల మీద పడిపోయాడు.



'లం.... ఆత్మ గురించి, దేవుడి గురించి, కులం గురించి ఆలోచించటానికి ఎంత ధైర్యంరా నీకు... నువ్వు కూడా సమానత్వం గురించి ఆలోచిస్తున్నావా?' అని గుర్తుతెలియని ఒక స్వరం గట్టిగా అరిచింది. పేరయ్య తనపై దాడి చేసిన వారిని వేడుకోవటం మొదలుపెట్టాడు. 'దొరా..నన్ను కొట్టొద్దు. నేను మీ బానిసను. కాదు కాదు.. మీ బానిసలకు బానిసను. నన్ను చంపొద్దు దొరా...నేను మీ పాదాల దగ్గర పడి బతుకుతాను.. నా తల కన్నా మీ పాదాలే గొప్పవి. నేనే కాదు. మా పిల్లలు, వాళ్ల పిల్లలు కూడా మీ పాదాల దగ్గర బతుకుతారు. నా తల మీ పాదాల దగ్గర పెట్టి బతుకుతా..నేను అందుకే బతుకుతున్నా...' అని పేరయ్య దీనంగా అర్థించటం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్న తర్వాత దెబ్బలు ఆగిపోయాయి.



'నన్ను ఎవరు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? నేను వాళ్లకు చేసిన హాని ఏమిటి'- ఇలా రకరకాల ఆలోచనలు పేరయ్యను కమ్ముకున్నాయి. అతని ఆలోచనలకు సమాధానం చెబుతున్నట్లు- 'లం.. దేవుడి గురించి ఆలోచించటం మానేయండి. దేవుడి గురించి ఆలోచించటం మొదలుపెడితే ఆత్మ గురించి కూడా ఆలోచిస్తారు. ఆ తర్వాత సమానత్వమంటారు. . నీ మొహంలో అలాంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. నీకు ఎదురుగా ఎవరు వస్తున్నారనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా నడుస్తున్నావు. 



నీలాంటి పేరయ్యలందరూ ఆలోచించటం మొదలుపెడితే- స్వర్గంలోను, ఈ భూమిపైన ఉన్న మా దేవుళ్లందరూ ఆలోచించటం మానేయాలి. స్వర్గం కూలిపోతుంది. భూమి నరకం అయిపోతుంది. అలాంటి సంఘటన జరుగుతుందని మేం కలలో కూడా ఊహించలేం.....' అని ఒక స్వరం పేరయ్యను హెచ్చరించింది. ఇంతలో మరో స్వరం- 'కులంలో బతుకు. కాని దాని గురించి ఆలోచించవద్దు. కులం కులమే. మీరు ఆలోచించకూడదనే దాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో ఉన్న నీలాంటి పేరయ్యలందరూ ఆలోచిస్తే- వినాశనమే. ఈ గ్రామానికే కాదు.. ఈ దేశానికే కాదు.. మొత్తం ఈ ప్రపంచానికే కీడు జరుగుతుంది..' అని మరో స్వరం కోపంగా అరిచింది.



'ఆ రోజు రాత్రి వేదశాస్త్రి ఇంట్లో సమావేశం జరిగింది. బెంగాల్‌కు చెందిన బెనర్జీ, మహారాష్ట్రకు చెందిన తిలక్, కర్ణాటకకు చెందిన కృష్ణమూర్తి, కేరళకు చెందిన నంబూద్రి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అప్పారావు ఆ సమావేశానికి హాజరయ్యారు. వంటింట్లో ఆడవాళ్లు 33 రకాల వంటలు వండుతున్నారు. అవన్నీ దేవుడికి పెట్టే ఆరగింపులు. వంటింట్లో ఉన్న ఆడవాళ్లందరూ తడి చీరలు కట్టుకొని ఉన్నారు.



ఆ తడికి వణుకుతున్నారు. తడి బట్టల్లో వంట వండితే దేవుళ్లకు చాలా సంతృప్తి కలుగుతుందనేది వారి నమ్మకం. 'రామా..కృష్ణా..శంకరా..' అని వంటింట్లో ముసలావిడ గొణిగింది. ఆమె మాటలకు కూరగాయలు కోస్తున్న ఒక యువతి తలెత్తి చూసింది. 'ఈ తడి జీవితమంటే అసహ్యమేస్తోంది..' అంది. 'పగలంతా ఈ చీకటి గుయ్యారంలో పడి వంటలు వండటమే సరిపోతోంది. వాటిని ఎప్పుడూ మనం తిని ఎరగం. మగవాళ్లు తిని చెబితేనే అవి ఎంత రుచిగా ఉన్నాయో తెలుస్తుంది. ఛండాల, శూద్ర మహిళల జీవితం మన కన్నా మెరుగనిపిస్తోంది..' అని గట్టిగా అంది. 



'అలా మాట్లాడకు. ఇంట్లో మగాడు వాసన చూడకుండా మనం తిండి గురించి ఆలోచించకూడదు. ఆలోచిస్తే విధవరాలివి అయిపోతావు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు నేను వేరే చెప్పక్కరలేదు. మగవాళ్లు లేని ఇల్లు ఎద్దు లేని బండిలాంటిది. ఆ బండి కాల్చటానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు.. ' అని హెచ్చరించింది. ముసలావిడ మాటలకు యువతి మొహం మాడిపోయింది. ఆమెకు ఒకడే కొడుకు. భర్త చనిపోయి విధవ అయితే తన జీవితం ఎలా ఉంటుందనే ఆలోచన ఆమెను విపరీతంగా భయపెట్టింది.



'ఈ రోజు శుభ దినం. పేరయ్య నశించాడు' అన్నాడు వేదశాస్త్రి. బెనర్జీ కాస్త ఇబ్బందిగా కదిలాడు. అతను మాటల మనిషే కాని చేతల మనిషి కాదు. అతను పసందైన విందు భోజనం కోసం ఎదురుచూస్తున్నాడు. తాను తినబోతున్న విందు పేరయ్య రక్తంతో తడిసిందన్న భావనే అతనికి ఇబ్బందిగా ఉంది. కృష్ణమూర్తి అతని ఇబ్బంది గ్రహించినట్లు చిన్నగా నవ్వాడు. 'దేవుళ్లకు 33 రకాల వంటలతో ఆరగింపు చేస్తారనుకుంటా. వాళ్లు కూడా మనలాంటివాళ్లే కదా..' అన్నాడు. ' దేవుళ్లు మన ప్రతిరూపాలే. 



వాళ్లను మనమే తయారుచేశాం'
అన్నాడు అప్పారావు... తిలక్ మాత్రం వీరి మాటలను పట్టించుకోకుండా వంటింట్లో నుంచి వచ్చే వాసనలను ఆస్వాదిస్తున్నాడు. అందరూ మాట్లాడుతుంటే ఇక తప్పదన్నట్లు- అతను కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు. "స్వచ్ఛమైన జాతిని రూపొందించటానికి అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను మనం అన్వేషించాలి. మీకు నల మహారాజు గురించి తెలుసుకదా. అతని తండ్రి వేరే పురుషుడితో కలిసినప్పుడు- అతని కడుపు నుంచి నల మహారాజు ఉద్భవించాడు. పురుషులకు రొమ్ములు ఉంటాయి. వారికి కడుపు కూడా ఉంటుంది. 



పురుషుల మధ్య సంపర్కాన్ని ప్రోత్సహిస్తే మన జీవితాల్లో ఉన్న కాలుష్యాన్ని తొలగించవచ్చు... ఈ మహిళల కంపుతో బతకలేకపోతున్నాం. వారు తమ రుతుస్రావాల ద్వారా మన ధ్యానాలను కలుషితం చేస్తున్నారు. వారి కడుపులు విషతుల్యాలు.. మన అంతిమ లక్ష్యం ఏమిటనే విషయాన్ని వేదాలు ఎప్పుడో నిర్దేశించాయి. పురుష సూక్తంలో పురుషులందరూ ప్రథమ పురుషుడి నుంచి పుట్టినట్లు ఉంది. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే మన పూర్వీకులు అందించిన విజ్ఞానాన్ని మళ్లీ సముపార్జించాలి' అని ప్రసంగించాడు. 



తిలక్ మాటలకు అప్పారావు ఇబ్బందిగా అటూ ఇటూ కదిలాడు..పురుషులు పిల్లలను కనడమనే భావన అతనికి నచ్చలేదు. గొంతు సవరించుకొని- 'మన ఆడవాళ్లు తడిబట్టలతో ఎందుకు వండుతారు? గతంలో మన దేవుళ్లు పురుషుల వంటనే ఆస్వాదించేవారు కదా..!' అన్నాడు. వేదశాస్త్రి అతని వైపు తిరిగి నవ్వాడు. 'ఆర్యవంతంలో నలుడే గొప్ప వంటవాడు. అతను ఎప్పుడూ తడి బట్టలతోనే వండేవాడు. అందువల్ల అందరూ తడిబట్టలతోనే వండుతారు. భీముడు కూడా మంచి నైపుణ్యమున్న వంటవాడే. భీముడికి ఊహాజనితమైన తండ్రి మాత్రమే ఉన్నాడు. అతని అసలు తండ్రి వంధ్యుడు లేదా యోగి. అందువల్లే మన వంట పుస్తకాలలో నలుడిని, భీముడిని ముందుగా ప్రస్తుతిస్తారు..' అని వేదశాస్త్రి వివరించాడు.



అన్‌టచబుల్ గాడ్
రచయిత: కంచె ఐలయ్య
ప్రచురణ: సామ్య
ధర: రూ. 350
పేజీలు: 248

Andhra Jyothi Telugu News Paper Dated: 24/1/2013 (Navya )


2 comments:

  1. ప్రియమైన సోదరులారా , అందరు ఎవరికీ తోచింది వారు చాల బాగా చెప్పారు. "రామాయణం" కాని "నేను హిందువునెట్లయిత?" కాని రెండు కుడా గ్రంధాలే . ఒకటి వాల్మికి గారు వ్రాసారు ,రెండవది కంచ ఐలయ్య గారు వ్రాసారు. మనం చదివే పద్ధతి మీద అర్థం తెలుస్తుంది రచయిత యొక్క భావం. నమ్మకంతో చదివితే అ పుస్తకాలలో ఏముందో అదే నిజం అనిపిస్తుంది కాని కారణంతో కాని నీ మనసు వేశ్లేసనత్మకంగా చదివితే ఏది నిజం ఏది అబద్దం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది . రెండు పుస్తకాలు ఒకే ధోరణిలో చదవాలి కాని చాలామంది అల చెయ్యరు . రామయనంను కారణంతో కాని నీ మనసు వేశ్లేసనత్మకంగా చదివితే రావణుడు అహింస వాది గాను రాముడు హింస వాది కనిపిస్తాడు. ఎలాగంటే రాముడు మరియు లక్ష్మణుడు కలిసి సుర్పనఖ యొక్క ముక్కు కోసి ఒక ఆడవారి మీద హింస ప్రవృత్తి అని చెప్పవచు , అదే ఈరోజు అయితే మహిళాలోకం రాముని కటకటాల పలు చేసే వారు. అదే రావణుడు చిసింది చుస్తే , సీతా ని అపహరించినాడు (kidnap ) చేసాడు తన చెల్లె కి చేసిన అపమానానికి , కాని సీతా మీద ఎలాంటి మాన , ప్రాణాలను , శారీరక హింసలు కాని పెట్టలేదు , రావణుడు ఒక ప్రజాసామ్య పాలనను పాలించాడు కాబట్టి మహిళలకు ఉద్యగాలు ఇచ్చినాడు ఆరోజులలో , లంకిణి ఒక security officer , ఆమెను చంపి లంక కాలు పెట్టినారు , అంటే మహిళలను హిమ్చ్సించే నాటే .
    ఫై విధనగా ఎవరికీ తోచింది వారు చెప్పడానికి ఒక కారణం వుంది నీను ఎవరిని తప్పు పట్టాను ఎందుకంటే మనం చదేవే చదువు మీద బ్రాహ్మన్ వాదాం రుద్దబడి వుంది . మనిషి మనిషి గ బతకండి , ఎ పుస్తకమైన నమ్మకం తో చదవకండి , మీ మనసు తో వేశ్లేసనత్మకంగా చదివితే ఏది నిజం ఏది అబద్దం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది . జై భీమ

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete