Saturday, September 28, 2013

ప్రాంతీయ ఫండమెంటలిజం.. - కంచ ఐలయ్య

ఈ రాష్ట్రం విడిపోవడమో, కలిసుండడమో నిర్ణయించాల్సింది దేశస్థాయి, కొంతమేరకు రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీలు. ఈ పార్టీలు ప్రభుత్వ నిబంధనలను బలంగా అమలుచేసయినా ఉద్యోగుల్ని తమ, తమ పనుల్లో ఉంచడం అవసరం. అది వ్యవస్థ కూలకుండా కాపాడడానికి ఉపయోగపడుతుంది. దేశ రాజకీయ పార్టీలు రాష్ట్రాల విభజనను సూత్రరీత్యా కాకుండా ఎన్నికల అవసరాలు రీత్యా చేస్తామంటే దాని పరిణామాలు ప్రజలపై ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ పరిస్థితి రుజువు చేస్తుంది.
ప్రాంతీయ ఫండమెంటలిజం మత ఫండమెంటలిజం కంటే ప్రమాదకరమైనది. అది ఒక ప్రాంత ప్రజలందరి చేత మరో ప్రాంతాన్ని ద్వేషించేదిగా చేస్తుంది. దీని అత్యున్నత రూపం మనం ఇజ్రాయెల్-పాలస్తీనాలో చూశాం, చూస్తున్నాం. క్రమంగా తెలంగాణ ఆంధ్ర సమస్యను ఆ రూపంలోకి మలుస్తున్నారు. ఇందులో ఒక్క రాజకీయ నాయకులే కాదు, మేధావులు, విద్యార్థులు, ముఖ్యంగా ఉద్యోగులు ముందు వరుసలో ఉంటున్నారు. నేను ఇంత కుముందే ఈ పత్రికలో ఉద్యమ-ఉద్యోగుల గురించి ఒక వ్యాసం రాశాను. 2009 డిసెంబర్ ప్రకటన తరువాత తెలంగాణ మంత్రులు, రాజకీయ పార్టీలు, తమ ఆధీనంలో ఉద్యోగులతో జేఏసీలను ఫామ్ చేసి ఇటు ప్రాంతం ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేసి, సంవత్సరాల తరబడి పాలనా యంత్రాంగాన్ని, విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు.
ఇప్పుడు ఆ 13 జిల్లాల ఉద్యోగుల్ని అటు మంత్రులు, ముఖ్యమంత్రితో సహా ఉద్యమ రంగంలోకి దింపారు. ఏ దేశంలోనైనా రాజకీయ ఉద్యమాలను ప్రభుత్వ ఉద్యోగులు నడపడం ద్వారా యంత్రాంగాన్ని మొత్తం సబోటేజ్ చెయ్యగలరు. ప్రాంతీయ ఉద్యమాలు సమాజాన్ని సంస్కరించే లక్షణం ఉన్నవి కావు. వీటిద్వారా ద్వేషాలను ఉన్మాదాలను రెచ్చగొట్టడం చాలా సులభం. ఇటువంటి ఉద్యమాల్లో కొంతమంది అకస్మాత్తుగా హీరోలైనట్లు కనిపిస్తారు. ముఖ్యంగా ప్రజలకు జవాబుదారీగా ఉండే రాజకీయ పార్టీలు ఉద్యమాలు నడిపితే కష్టనష్టాలకు ఎన్నికల్లో జవాబుదారీ తనం ఉంటుంది. కానీ పార్టీలే డబ్బును, జనాన్ని సమీకరించి ఉద్యోగులను ఉద్యమ వీరులుగా నడిపిస్తే రేపు జరిగే మంచి, చెడులకు వారి జవాబుదారీ తనం లేదు. ఒక పార్టీ ఉద్యమాన్ని నడిపితే ఆ పార్టీలోని ఒక నాయకుడు తప్పుచేసినా బాధ్యతా రహితంగా మాట్లాడినా ఆ పార్టీ అంతా జవాబుదారీ తనం వహించాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకూ, యూనివర్సిటీ టీచర్లకు అన్ని హంగులు, ఆర్భాటాలు కల్పించి ఉద్యమాలు నడుపండి అని పార్టీలు వారి వెనుక ఉండి నడిపిస్తుంటే వాళ్ళు రెచ్చగొట్టి, బాధ్యతా రహిత ప్రకటనలు చేసి, తాత్కాలికంగా మీడియా వెంట నడుస్తుంటే చిన్న పిల్లల కంటే హీనంగా తయారవుతారు. చాలాకాలంగా ఇది తెలంగాణలో జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇది 'సీమాంధ్ర' పేరుతో జరిగే ఉద్యమంలో జరుగుతున్నది.
పార్టీలు ప్రాంతాల కోసం పుట్టడమో, లేదా ఒక ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందడమో జరిగితే (టీఆర్ఎస్, వైసీపీ ఇప్పుడు అలా రూపొందినవే) టీఆర్ఎస్ ఎక్కడా లేని విధంగా ఒకే ఎజెండాతో పుట్టిన పార్టీ, ఇప్పుడు వైసీపీ ఆ పదమూడు జిల్లాల్లో ఆ రూపాంతరం చెందుతోంది. ఉద్యమ ఉద్యోగుల నేతృత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రోడ్లమీద ధూంధాం చేయిస్తే ఆ ప్రాంతంలో ఇప్పుడు రోజూ రోడ్లమీద పౌరాణిక నాటకాల్ని వేస్తున్నారు. రెండు ప్రాంతాల మధ్య కల్చరల్ తేడా ఇంతకంటే పెద్దగా ఏం ఉండదు. కానీ ప్రాంతీయ తత్వాలని రెచ్చగొట్టాలనుకున్నప్పుడు ఇక్కడ రోజూ రోడ్లమీద అర్ధనగ్నంగా పాటలు పాడితే అక్కడ కిరీటాలు పెట్టుకొని పద్యాలు పాడుతారు. ఉద్యోగులు మేధావుల అవతారమెత్తి ఇది గొప్ప అంటే అది గొప్ప అని వీధివాదాలకు దిగుతారు.
రాష్ట్ర విభజనగానీ కలిసి ఉండడంగానీ ఇటువంటి ఉద్యమాల ప్రభావంతో జరిగితే ఇక్కడ ప్రజాస్వామ్యం పిండరూపంలో ఉందనే అర్థం. రాష్ట్రాలు విడిపోవడానికిగానీ, కలిసుండడానికిగానీ ఉద్యోగుల ప్రయోజనాలకు మించిన బలమైన కారణాలుండాలి. అటువంటి కారణాలు ఉన్నాయా లేవా అని తేల్చేది కమిషన్లు, సుదీర్ఘ అధ్యయనాలు గానీ ఉద్యోగులు కాదు. తెలంగాణను చిన్న రాష్ట్రం చేస్తామని పార్టీ నిర్ణయాన్ని చాలా కాలం కింద ప్రకటించిన బీజేపీకి ఆ పదమూడు జిల్లాల్లో ఓట్లు ఉంటే ఆ ప్రకటన ఇచ్చేది కాదు. ఆ నిర్ణయం అది తెలంగాణ జిల్లాల్లో తమకు ఓట్లు ఉన్నాయనే సీటు ఆశతోనే. టీడీపీ తెలంగాణ కోసం లేఖ ఇచ్చింది పొత్తుద్వారా 2009లో అధికారంలోకి వచ్చి సమస్యకు భిన్నమైన పరిష్కారం చూపవచ్చని భావించి మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఆ పదమూడు జిల్లాల్లో ఓట్లు రావని తేలాకే. ఈ మొత్తం ప్రక్రియలో విడిపోవాలా, వద్దా అనే అంశంపై హానెస్ట్ స్టడీ ఎవరికీ లేదు. ఇప్పుడు రెండు (నిజానికి మూడు) ప్రాంతాల్లో ఉద్యోగులను దింపి డబ్బులు గుప్పి ఉద్యమాలను నడపుతున్నారు. అకస్మాత్ హీరోలను సృష్టిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. రెండు ప్రాంతాల్లో ఉపాధ్యాయులు చదువు చెప్పడానికి పోటీపడనోళ్ళు బడులు మూసెయ్యడానికి పోటీపడుతున్నారు. ప్రాంతాల జిల్లాల అభివృద్ధి ఆ ప్రాంతంలోని విద్యారంగం అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ విద్యారంగంలో ఆ విలువలు ఎక్కడా పెరుగలేదు. ప్రభుత్వ స్కూ ళ్ళలో విద్యా ప్రమాణాలు పెరగాలని ఉపాధ్యాయ నేతలు పోటీపడ్డ దాఖలాల్లేవు. కానీ రాష్ట్రం చీలిపోవాలనో, కలిసుండాలనో నెలల తరబడి బడులు మూసేస్తున్నారు. ఇప్పుడు చదువును కోల్పోతున్న చిన్న పిల్లలు విడిపోతే బాగుపడతారో, కలిసుంటే బాగుపడతారో ఎవరు చెప్పగలరు.
ఇప్పుడు మూడు ప్రాంతాల్లో బడులు మూసెయ్యడంద్వారా భవిష్యత్ తరాలను బాగుచెయ్యగలమని ఎలాచెబుతారు? మనుషుల పౌరహక్కుల గురించి మాట్లాడాల్సిన మేధావులు కూడా ఇప్పుడు ప్రాంతాల పౌరహక్కుల గురించి మాట్లాడుతున్నారు? ఒక ప్రాంతంలో భూస్వాముల పాల నా హక్కును కాపాడే మేధావులు తయారైతే మరో ప్రాంతంలో పెట్టుబడిదారుల పౌరహక్కుల్ని కాపాడే మేధావి వర్గం సహజంగానే తయారౌతుంది.
అన్ని ప్రాంతాల్లో సాధారణ ప్రజల జీవితం ఇప్పుడున్న స్థితి కంటే వెనక్కి నెట్టి విభజన సాధించినా, సమైక్యత సాధించినా ఫలితమేంటి. రాష్ట్రాల్లోని ప్రాంతీయ తత్వం దేశాల మధ్య యుద్ధంలా తయారైతే వచ్చే సమస్యలేంటో ఊహించారా? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి సంఘం ఇతర ప్రాంతంలోని ప్రజలపై యుద్ధం ప్రకటించి ఏం సాధిద్దామనుకుంటున్నారు. గత కొంత కాలంగా రిజర్వేషన్ హక్కు కోసం అన్ని జిల్లాల ప్రజల్ని కూడగట్టి కొన్ని హక్కుల్ని సాధించిన సంఘాలు నిలువునా చీలిపోయాయి. అంటే ప్రాంతీయ ఫండమెంటలిజం అణిచివేయబడ్డ కులాలను కూడా చాలా ఆనందంగా చీల్చిందన్నమాట. ఇప్పుడు మొత్తం 23 జిల్లాల్లో దేశ పౌరుడనే వ్యక్తి కనిపించడం లేదు. అంతా ప్రాంతీయ యుద్ధ వీరులే. నేనొక దేశ పౌరున్ని, లేదా ప్రపంచ పౌరున్ని అంటే పరిహాసం చేసే పరిస్థితి వచ్చింది. దీనికి మౌలిక బాధ్యత మేధావి వర్గానిది అని చెప్పకతప్పదు. నేనొక ప్రాంత వాదినంటే, నేనొక మార్క్సిస్టును, లేదా సోషలిస్టును అని చెప్పుకోవడం కన్నా గొప్పగా ఫీలౌతున్న రోజులివి. ఈ వాతావరణాన్ని ఛేదించకుండా ఆలోచన అంటూ ఏ ప్రాంతంలో కూడా మిగిలి ఉంటుందని భావించలేం.
ఉద్యోగ గుంపులు రాజకీయ నిర్ణయాలను తాము నిర్దేశిస్తాం వాటి కోసం ఉద్యమాలు చేస్తామంటే ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలన్నీ తీసి 'అవుట్‌సోర్స్' చెయ్యడమో లేక చాలా రంగాల్ని ప్రయివేటీకరించడమో జరిగే ప్రమాదం లేకపోలేదు. తెలంగాణ, సమైక్యాంధ్ర సమ్మెలను సాకుగా అమెరికా వంటి కాంట్రాక్ట్ వ్యవస్థను ఇక్కడ కూడా ప్రవేశపెట్టాలని వాదించే వారూ ఉన్నారు. రఘురామ్ రాజన్ వంటి ఆర్థిక శాస్త్రవేత్తలు అందుకు కావలసిన ప్రణాళికలను తయారుచేస్తారు.

ఆఫీసులు నడపాల్సిన ఉద్యోగులు రాజకీయ నాయకుల కాన్వాయిల్లో కనబడే సరుకైతే దేశంలో ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది. చాలా విచిత్రమైన ఘటనలు ఇప్పుడు మనం చూస్తున్నాం. పార్లమెంటుకు ఎన్నికైన నాయకుడు అసలు పార్లమెంటుకు పోవడం లేదు. ఎప్పుడో ఒకసారి పోతే ఆయన్ని ఎయిర్‌పోర్టులో దింపడానికి 5వేల మంది, తిరిగి వెనక్కి వచ్చినప్పుడు జైకొట్టి రిసీవ్ చేసుకోవడానికి 10 వేల మంది కాన్వాయిలో కదిలిపోతున్నారు. చివరికి జైలు నుంచి ఇంటికి పోవడానికి వేల మంది రోడ్లపై కవాతులు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నాయకుల్లో ఈ ప్రక్రియ హద్దులు మీరి సాగుతోంది. దీన్ని మనం డెమోక్రసీ అనలేం, దీన్ని ఖచ్చితంగా 'మాబోక్రసీ' అనాల్సిందే.
ఉద్యమాలు నడిపే ఉద్యోగ నాయకులు కాన్వాయిల్లో తిరిగితే ఇక వ్యవస్థ ఎలా నడుస్తుంది. రాష్ట్రంలో ఇప్పుడు మూడు ప్రాంతీయ పార్టీలున్నాయి. అవి డబ్బున్న కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అవి రాజకీయ సంస్కరణ, సాంఘిక సంస్కరణ కోసం పుట్టినవి కావు. అవి ఆయా కులాల అధికారాన్ని బలోపేతం చెయ్యడానికి పుట్టాయి. అవి అధికారంలోకొచ్చినా, రాకున్నా కొన్ని ఓట్లు, కొన్ని సీట్లు తమ వెంట ఉంచుకుంటే తమ కాంట్రాక్టులు, తమ భూముల ఆక్రమణ కార్యక్రమాలకు అడ్డంకి లేకుండా నడుపుకోవచ్చు. ఈ పార్టీలన్నీ ప్రపంచ ప్రజాస్వామిక విలువల్లో ఇమడగలిగే ఏ సిద్ధాంతం పునాదిగా పుట్టినవి కావు. ఇవి కుటుంబాల, కులాల, ఆస్తుల్ని, అధికారాన్ని పంచుకోవడంకోసం పుట్టినవి. వీరికి అంబేద్కర్, గాంధీ వంటి తాత్వికులు అసలు లెక్కలోని వారే కాదు. ఈ రాజకీయ వాతావరణం ప్రజాస్వామిక సంస్థల్లో పనిచేసేవారిని విచ్చలవిడిగా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. ఈ పార్టీల నాయకులే తమ ఏజంట్లను ఉద్యోగ, ఉపాధ్యాయ రంగం నుంచి కొత్త కొత్త తోలుబొమ్మల్లాగా మనముందుకు తెచ్చి ఆడిస్తున్నారు.
క్రోనీ క్యాపిటల్‌కు పుట్టుకొచ్చే మీడియాకు ఈ తోలుబొమ్మలు కొంత ఆదాయాన్ని, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. తమ కెమెరాలను, కాలాలను వాటి చుట్టూ తిప్పడం ప్రాంతీయ ఫండమెంటలిజానికి చాలా అవసరం. మూడు వేల ఏండ్లు 'నువ్వు ఏ కులంలో పుట్టావనేది నీ స్థాయిని' నిర్ణయించేది. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏ ప్రాంతంలో పుట్టావనేది కీలకంగా మారింది. పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో నువ్వు ఏ మతంలో పుట్టావనేది వారి జీవిత స్థితిగతుల్ని నిర్ణయిస్తుంది. ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే ఇక్కడ మానవ విలువలు ఇంకా అడుగంటుతాయి.
ఈ రాష్ట్రం విడిపోవడమో, కలిసుండడమో నిర్ణయించాల్సింది దేశస్థాయి, కొంతమేరకు రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీలు. ఈ పార్టీలు ప్రభుత్వ నిబంధనలను బలంగా అమలుచేసయినా ఉద్యోగుల్ని తమ, తమ పనుల్లో ఉంచడం అవసరం. అది వ్యవస్థ కూలకుండా కాపాడడానికి ఉపయోగపడుతుంది. దేశ రాజకీయ పార్టీలు రాష్ట్రాల విభజనను సూత్రరీత్యా కాకుండా ఎన్నికల అవసరాల రీత్యా చేస్తామంటే దాని పరిణామాలు ప్రజలపై ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ పరిస్థితి రుజువు చేస్తుంది. దీనికి పరిష్కారం రాజ్యాంగం ఏం చెబుతుందో 'స్కూలు పిల్లల్లా' చదివితే కుదరదు. ఆ రాజ్యాంగ నిబంధనలను అమలు చెయ్యడానికి ఒక జాతీయ 'కన్‌సెన్‌సస్'ని రూపొందించగలగాలి. అందుకు కొంత ఎక్కువ కాలం పడితే పట్టొచ్చు. కానీ ఈ క్రమంలో సాధారణ ప్రజా జీవనాన్ని ఇప్పుడున్న స్థితి కంటే వెనక్కి తీసుకుపోకూడదు. ప్రతి ఉద్యమ కర్తవ్యం ఉద్యమ దశలో కూడా అందులోని సాధారణ ప్రజల జీవితాన్ని కాస్త మెరుగపర్చాలి గానీ, ఇంకా నాశనం చెయ్యకూడదు.
ప్రతి ఉద్యోగుల సమ్మెలో కూడా అతి తక్కువ జీతం తీసుకొని బతికేవారు, ముఖ్యంగా ఆ కుటుంబాల్లోని స్త్రీలు ఏం చెబుతారో దాన్నిబట్టి నిర్ణయం తీసుకోవాలి. వారు వద్దంటే సమ్మెను ఒక్క రోజు నడిపినా అది అప్రజాస్వామికం, వినాశనకరం.
- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi Telugu News Paper Dated : 29/09/2013 

1 comment:

  1. goppa medhavi asalu pen etu pothe atu rasukuntaa pothadu ... anna motham gaa emi cheppina last ku cheppedhi okate KCR down down anna gari rachanlu chusthe okka vishyam vunadhu nijayeethi asalu vunadhu ..... ilati pitchi maa lokale kavali andhra jyothi ki endhukunte iddaru poddun lesthe KCR meedha edichevalle

    ReplyDelete