ఎన్టీరామారావు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక, మొదటిసారి అమెరికా వెళ్ళినపుడు పాత్రికేయులు అడిగారట - శ్రీమతి ప్రధాని ఇందిరాగాంధీతో విభేదాలున్నాయి గదా, మరి ఎలా నెగ్గుకొస్తున్నారని! రామారావు గారు ఏమి చెప్పి ఉంటారు? ఊహించగలరా? అయితే, మీ ఊహ తప్పు. భారతదేశంలో ఒక రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని. ఆవిడ మొత్తం దేశానికి ప్రధాని. మా మధ్య కొన్ని అంశాలలో విభిన్నమైన ఆలోచనలుండవచ్చు, కానీ దేశ ప్రయోజనాలు మాకు ప్రధానం - అని చెప్పారట. ఫలితంగా సంచలనాలు లేకుండా పాత్రికేయ గోష్ఠి ముగిసిందట. మరి రామారావు ఇలాంటి జవాబు చెప్పడానికి కారణం - ఒక శాస్త్రవేత్త అని తెలుసుకోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది. చర్మ సంబంధమైన శాస్త్ర సాంకేతిక అంశాల మేధావి డా. వై. నాయుడమ్మ (1922-1985) గారి ఆలోచన అది అని చాలా కొద్దిమందికే తెలుసు!
గుంటూరు జిల్లా యలవర్రులో చాలా సాధారణ కుటుంబంలో జన్మించిన నాయుడమ్మ 34 ఏళ్ళకే సెంట్రల్ లెదర్ రీసర్చి ఇన్‌స్టిట్యూట్ (సి.ఎల్.ఆర్.ఐ.) డైరెక్టర్ కావడం, 49 సంవత్సరాలకే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చి (సి.ఎస్.ఐ.ఆర్.)కు డైరెక్టరు జనరల్ కావడం అనేది రికార్డు. అతి పిన్న వయసులో శాస్త్ర సాంకేతిక పరిశోధనలో; శాస్త్ర సంబంధమైన పరిపాలనా విభాగంలో గొప్పగా రాణించడం అద్భుతమైన విషయం. ప్రయోగశాలకూ, పరిశోధనా పత్రాల ప్రచురణకూ మాత్రమే పరిమితమైనది పూర్తి స్థాయి శాస్త్ర విజ్ఞానం కాదని; టెక్నాలజీ పేదల కన్నీళ్ళు తుడవాలని ప్రయత్నించిన పెద్ద మనసుగల శాస్త్రవేత్త నాయుడమ్మ. పుట్టుకతో రైతు బిడ్డను, వృత్తితో అస్పృశ్యుడునని ఆయన అనేవారట. చర్మాలు శుభ్రం చేయడం, మెరుగుచేయడం, చర్మాల ఎగుమతి, ఆకర్షణీయమైన వస్తువుల తయారీకి సంబంధించి నాయుడమ్మ సి.ఎల్.ఆర్.ఐ. ద్వారా చేసిన కృషి విశేషమైనది. నాయుడమ్మ జీవితాన్ని వివరించే జీవిత చరిత్రను ప్రజల శాస్త్రవేత్త పేరుతో ఇన్‌కమ్‌టాక్స్ శాఖలో చీఫ్ కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన కె. చంద్రహాస్ ఇటీవల ఆంగ్లంలో రాశారు.
నాయుడమ్మ జీవన పుటలు తిరగేస్తూపోతే - తండ్రి అంజయ్య, కాట్రగడ్డ శేషాచలం చౌదరి, పి.వి. కృష్ణయ్య, విజయలక్ష్మీ పండిట్, శాంతిస్వరూప్ భట్నాగర్, లక్ష్మణ మొదలియార్, జవహర్‌లాల్ నెహ్రూ, విక్రం సారాభాయి, ఇందిరాగాంధీ, ఎన్.టి.ఆర్. - ఇలా చాలామందితో సన్నిహితంగా మెలగడం చాలా ఆశ్చర్యం కల్గిస్తుంది. వీరి సాయంతో ఎదిగారని కూడా అనిపిస్తుంది. అదే సమయంలో సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్ పదవి స్వీకరించడానికి ప్రధాని ఇందిరాగాంధీకే షరతులు పెట్టడం; కులమడిగిన గవర్నర్ శ్రీ ప్రకాశ గారికి గట్టిగా, మృదువుగా తప్పు తెలుసుకునేలా చేయడం; ఒక అప్పాయింట్ మెంట్ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్జీయార్ కోరిక తిరస్కరించి, యోగ్యుడికే ఉద్యోగం వచ్చేలా చేయడం; విభూతి కాదు గడ్డి పోచను చేతి నుంచి మొలిపించమని సాయిబాబాకు నేరుగా సూచించడం - చిన్న విషయాలు కాదు. అందుకే నాయుడమ్మ విశేష వ్యక్తి.
మన శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు మన భాషలలోనే కాదు ఇంగ్లీషులో కూడా తక్కువే! నిజానికి నాయుడమ్మ అద్భుత విజయాల గురించి, విలక్షణ వ్యక్తిత్వం గురించి, విభిన్న వైఖరి గురించి అడపాదడపా ప్రస్తావ వస్తోంది కానీ, సరైన పుస్తకం ఉండేది కాదు. ఈ మధ్య తెలుగులో నాయుడమ్మ జీవిత చరిత్ర ఒకటి వచ్చింది కానీ ఆయన గురించి కొంత అవగాహన ఉన్నవారికి అసలు తృప్తి కల్గించలేకపోయింది. ఈ నేపథ్యంలో 172 పేజీలతో సరళమైన భాషలో, చక్కగా వర్గీకరించబడిన ప్రణాళికతో కె. చంద్రహాస్ నాయుడమ్మ జీవిత చరిత్ర ఇంగ్లీషులో రాయడం అభినందనీయం. చక్కని ఫోటోలు, అపురూపమైన చేతివ్రాత ఆధారాలు కూడా పొందుపరచిన 24 అధ్యాయాల పుస్తకం - నిలకడగా చేసిన అధ్యయనం. మామూలుగా జీవిత చరిత్ర రాసేవారు కీర్తించే పద్ధతిలో రాయడం మనకు తెలుగులో చాలా బాగా తెలిసిన విషయం. దీని వల్ల మంచిని ఎంచి చూపడంలో విజయం సాధించవచ్చు కానీ, వారి పొరపాట్లు, లోటుపాట్లు ఎత్తిచూపడంలో విఫలులవుతారు. కానీ ప్రస్తుత ఆంగ్ల రచనలో కె. చంద్రహాస్ పాటించిన 'న్యూట్రాలటి' విశేషమైనది. వ్యాఖ్య పెద్దగా చేయకుండా, పరిమితులను కూడా ప్రస్తావించడం సంపూర్ణ చిత్రణే అవుతుంది.
పరిశోధన చేయడం, చేయించడంలోనే కాకుండా; అలాంటి పరిశోధన ప్రజలకు దోహదపడాలనే వాస్తవిక ప్రజా దృక్పథం గల నాయుడమ్మ తెలుగు వారికే కాదు - మొత్తం భారతదేశానికే గర్వకారణం - అలాంటి వ్యక్తి తెలుగు వాడు కావడం; తర్వాత అలాంటి శాస్త్రవేత్త ఎవరూ తెలుగునాట రాకపోవడం నాయుడమ్మ కీర్తిని పెంచుతోంది.
- డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
Andhra Jyothi Telugu News Paper Dated : 4/10/2013
No comments:
Post a Comment