అడుగడుగునా పడదోసే పాము పడగలే ఉన్నా, మునుముందుకే సాగిపోయిన వాడు భంగ్యా భూక్యా. తండాలో జన్మించి తిండికోసం విలవిల్లాడే స్థితి నుంచి ఇంటర్నేషనల్ ఫెలోషిప్‌తో లండన్‌లో పిహెచ్.డి చేసే దాకా ఆయన జీవితం ఒక అగ్ని సరస్సులాగే సాగింది. నిజాం పాలనలో లంబాడీల జీవితాలపౖౖెన ఆయన సమర్పించిన సిద్ధాంత గ్రంథం 'సబ్జుగేటెడ్ నోమాడ్స్' ఎన్నో యూనివర్సిటీల సిలబస్‌లో విధిగా చదవాల్సిన పుస్తకం అయ్యింది. ఆ పుస్తకం తెలుగుతో సహా పలు భాషల్లోకి అనువాదం కూడా అయ్యింది. ప్రస్తుతం 'ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ'లోని సోషల్ ఎక్స్‌క్లూషన్ స్టడీస్ విభాగపు అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ భంగ్యా భూక్యా జీవితంలోని కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.
నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్న. నేను చివరి వాణ్ని. నేను స్కూలుకు వెళ్లడమన్నది యాదృచ్ఛికమే. ఖమ్మం జిల్లాలోని బండమీది తండ మా ఊరు. మాకు ఓ పది గొర్రెలు, ఓ ఐదారు పశువులు ఉండేవి. నేనూ, మా అక్క కలిసి మా ఊరి పక్కనున్న ఒక చిన్న కుంటలో వాటిని మేపుతూ గడిపే వాళ్లం. నాకన్నా ముందు ఓ ముగ్గురు మా తండా నుంచి స్కూలుకు వె ళ్లే వారు. ఆ రోజుల్లో స్కూళ్లలో మధ్యాహ్నం వేళ ఉప్మా పెట్టేవాళ్లు. వీళ్లు అక్కడ తిని, ఇంటికీ కొంత తీసుకు వచ్చేవారు. నాకు కొంచెం పెట్టమని అడిగితే వాళ్లు పెట్టేవాళ్లు కాదు. నాకు కోపం వచ్చింది. అయినా వాళ్లు పెట్టేదేమిటి? నేనే స్కూల్లో చేరుతా అనుకున్నాను. అలా కేవలం ఉప్మా కోసమని నేను స్కూల్లో చేరాను. అయితే క్రమక్రమంగా చదువు మీద నాకు బాగా మక్కువ పెరుగుతూ వచ్చింది. ఆ రోజుల్లో మా ప్రాంతంలో మార్క్సిస్టు పార్టీ రాజకీయాలే బలంగా ఉండేవి. అందుకే ఆ రోజుల్లో నా మీద ఆ ప్రభావం కొంత ఉండేది.
నాలుగో తరగతి దాకా మా పక్క ఊళ్లలోనే నా చదువు సాగింది. ఆ తరువాత సుబ్లేడు గ్రామంలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌లో సీటు రావడంతో 5వ తరగతి నుంచి అక్కడ చేరిపోయా. అది మా ఊరి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే హాస్టలంటే ఒకటే హాల్. ఆ హాల్‌లో 120 మంది విద్యార్థులం ఉండేవాళ్లం. బాగా ఇరుకుగా ఉండడమే కాకుండా భోజనం చాలా దారుణంగా ఉండేది. అన్నంలోకి రోజూ చారు తప్ప మరేమీ ఉండేది కాదు. రెండు రూపాయల కిలో బియ్యమే హాస్టల్‌కు సరఫరా అయ్యేవి. అన్నంలో ఎప్పుడూ తెల్లతెల్లని పురుగులు ఉండేవి. చారు పోశాక ఆ పురుగులు పైకి తేలేవి. తేలిన పురుగుల్ని తీసేసి ఆ భోజనం తినేవాళ్లం. దీనికి తోడు దాదాపు అందరికీ నిలువెల్లా గజ్జి సమస్య ఉండేది. ఇవన్నీ కాక అక్కడ ఉండే సుబ్బారెడ్డి అనే టీచర్ నన్ను కులం పేరుతో చాలా అసహ్యంగా తిట్టేవాడు. భరించలేక ఇక చదువొద్దు ఏమీ వద్దనుకుని మా ఊరికి వెళ్లిపోవాలనుకున్నా. ఒకసారి వెళ్లిపోయాను కూడా. అయితే మా అమ్మ నచ్చచెప్పి మళ్లీ తీసుకు వచ్చి స్కూల్లో వదిలేసి పోయింది.
చంపేస్తాడనుకున్నా
ఎనిమిదో తరగతిలో దాదాపు అందరూ ప్యాంట్ వేసుకునేవారు. చెప్పులు కూడా ఉండేవి. నాకు మాత్రం ప్యాంట్లు గానీ, చెప్పులు గానీ లేవు. ఎంతో కోరికగా ఉన్నా వీలు కాక నిక్కర్ల మీదే స్కూలుకు వెళ్లేవాణ్ని. అప్పుడు దసరా సెలవులు వచ్చాయి. సెలవుల్లో ప్రతిసారీ పెసరకాయలు తెంపడానికి, వేరుశెనగ కాయలు పెరకడానికి వెళుతుండేవాణ్ని. ఈసారి కూడా ఆ పనుల్లోకి వెళ్లి ఎలాగైనా ప్యాంటు, షర్ట్ కొనుక్కోవాలని గట్టిగా అనుకున్నా. వాటికోసం ఆ రోజుల్లో 70 రూపాయలైనా కావాలి. అందుకోసం సెలవులు అయిపోయాక కూడా ఓ ఐదు రోజులు పని చేసి వచ్చిన డబ్బులతో ప్యాంట్ షర్ట్, స్లిప్పర్స్ కొనుక్కున్నాను. పది మైళ్ల దూరంలో ఉన్న సుబ్లేడుకు నడిచే వెళ్లాలి కాబట్టి, కొత్త బట్టలు వేసుకుని నేరుగా స్కూలుకు బయల్దేరాను. వెళ్లేసరికి ప్రార్థన అయిపోయింది. ఫస్ట్ పీరియడ్ సుబ్బారెడ్డిదే కాబట్టి ఆయన క్లాసు తీసుకుంటున్నాడు. మామూలుగానే హీనాతిహీనంగా తిడుతూ, అతి చిన్నకారణాలకే ఒళ్లు హూనమయ్యేలా కొట్టేవాడు. ఏనాడూ ఆయన నన్ను నా పేరుతో పిలవలేదు. 'అరే ఓ లంబాడి... కొడుకా' లాంటి బూతులే.
ఐదు రోజులు స్కూలుకు రాకపోవడం, ఆ వచ్చిన రోజు కూడా కాస్త ఆలస్యంగా రావడం అతని కోపానికి ఆజ్యం పోశాయేమో! క్లాసులోకి అడుగు పెట్టగానే కర్ర తీసుకుని కొట్టడం మొదలెట్టాడు. కొడుతూనే ఉన్నాడు. కొడుతూనే ఉన్నాడు. క్లాసులో అందరూ ఉన్నారు. నేను దెబ్బలు తప్పించుకోవడానికి బెంచీల మధ్యలోంచి అటూ ఇటూ పరుగులు తీస్తున్నాను. ఆయన నన్ను వెంటాడి వెంటాడి కొడుతూనే ఉన్నాడు. ఒక కర్ర విరిగిపోతే మరో కర్ర, అలా నాలుగు కర్రలు విరిగిపోయాయి. అరగంట పాటు ఆ దుర్మార్గం కొనసాగుతూనే ఉంది. ఆ రోజు నేను చనిపోతాననే అనుకున్నా. ఈ చదువింక మనతో కాదనుకుని మా ఊరికి వెళ్లిపోవాలనుకున్నా. ఆ మాట హాస్టల్ వార్డన్‌కు కూడా చెప్పేశా. కానీ, హాస్టల్ వర్కర్సంతా నామీద ప్రేమతో నన్ను వారించారు. ఎలాగో గుండె చిక్క బట్టుకుని ఉండిపోయాను. పాఠాలు చెప్పే పంతుళ్లు స్కూలుకు ఆవల విద్యార్థుల జీవితమేమిటన్నది కొంతైనా ఆలోచించాలి కదా! ఆనాడు నా ఒంటి మీద పడిన దెబ్బల బాధ ఈ నాటికీ తాజాగానే ఉంది. కుంగదీసే గాయాల్ని కూదా నిచ్చెనగా చేసుకుని పైకెక్కిపోవాలేమో మాలాంటివాళ్లం! ఇన్నిన్ని అవమానాల్ని భరించే శక్తి ఉంటే తప్ప ఒక పేద వాడు ముందుకు సాగడం సాధ్యం కాకపోతే ఎలా?
ఏమిటా బంధం?
మా ప్రాంతంలో బలంగా ఉన్న లెఫ్టిస్ట్ పార్టీల ప్రభావం నా మీద బాగానే ఉందని చెప్పా కదా. ఇది సామాజిక విషయాల మీదికి నా దృష్టి మళ్లేలా చేసింది. నేను మంచి మార్కులతో పాసైనా సామాజిక శాస్త్రాలు చదవాలన్న నిర్ణయానికి రావడానికి ఆ ప్రభావమే కారణం. ఖమ్మంలోని సిద్దారెడ్డి కాలేజ్‌లో హెచ్.ఇ.సి. గ్రూపుతో ఇంటర్‌లో జాయినయ్యాను. ఆ ఈ రెండేళ్ల కాలం నా జీవితంలో చాలా కీలకమైనది. మా ఊరికి ఖమ్మం 30 కి.మీ. మా ఊరి నుంచి ఒకే ఒక్క ట్రిప్ బస్సు వెళ్లేది. దానివ్లల ఖమ్మంలోనే ఉండటం తప్పనిసరి అయ్యింది. అందుకే ముగ్గురు మిత్రులం కలిసి ఒక రూము తీసుకున్నాం. నెలకు ఒక్కొకరికీ తక్కువలో తక్కువ 100 రూపాయల ఖర్చు వచ్చేది. అయితే మా కాలేజీ లెక్చరర్‌లు పూనాటి వెంకటేశ్వరరావు గారు, సీతారాంగారు ఆర్థికంగా మేమందరం ఇబ్బందుల్లో ఉన్నామన్న విషయాన్ని పసిగట్టారు. ఇద్దరూ కలిసి ఒక రోజు మా రూముకు వచ్చి, మా పరిస్థితుల్ని మరింత క్షుణ్ణంగా తెలుసుకుని, ఇక నుంచి ఆర్థికంగా ఎంతో కొంత సాయం చేస్తాం అంటూ హామీ ఇచ్చారు.
సీతారాం గారు ఆర్థిక సహాయం అందించలేకపోయినా గొప్ప నైతిక బలాన్ని నాలో నింపేవారు. ఇచ్చిన మాట మేరకు ఎప్పుడూ ఏదో రకంగా సాయం అందచేస్తూ వచ్చారు. వీటి వల్ల మాకొక మానసిక స్థిమితత్వం ఏర్పడింది. వారు ఆ సాయానికి పూనుకోకపోతే, నిజంగా చదువుకు సంబంధించి మా అధ్యాయం అక్కడితో ముగిసిపోయేది. ఇంటర్ అయిపోగానే డిగ్రీ కోసం రెసిడెన్షియల్ కాలేజ్‌లో చేరడం మేలని ఆయనే దరఖాస్తులు తెప్పించారు. ఎంట్రన్స్ రాశాను. కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ రెసిడెన్షియల్ కాలేజ్‌లో బి.ఏ.లో సీటు వచ్చింది. సీతారాంగారు నాతో పాటే కర్నూలు వచ్చి, కాలేజ్ అడ్మిషన్, హాస్టల్ అడ్మిషన్ అయ్యాకే వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోతుంటే పైకి కనిపించని నా కన్నీళ్లు నా నిలువెల్లా ప్రవహించడం మొదలెట్టాయి. నేనెవరు? వీళ్లెవరు? నాకోసం ఇంత చేయడం ఏమిటి? కళ్లల్లో కారం చల్లే సుబ్బారెడ్డి లాంటి టీచర్లు ఉన్న ఈ సమాజంలో వెంకటేశ్వరరావు గారు, సీతారాం గారి లాంటి వాళ్లు లేకపోతే సమాజం మీద నమ్మకమేముంటుంది? నా నె త్తిన పాలు పోసి, నా జీవితంలో అమృతం నింపిన వాళ్లు వారు. ఆ రోజుల్ని, వారు చేసిన సాయాన్ని తలుచుకుంటే ఈ రోజుక్కూడా నా కళ్లు చెమ్మగిల్లుతాయి.
వర్గం కాదు కులమే
ఎం.ఏ (చరిత్ర) కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుంటే నాకు సీటు వచ్చింది. కాకపోతే, డిగ్రీ దాకా తెలుగు మాధ్యమమే చదువుకున్న మాకు ఇంగ్లీషు సంభాషణ కష్టంగా ఉండేది. అదో ఇబ్బంది. దీనికి తోడు మేమంతా పాత దుస్తులు, స్లిప్పర్స్ వేసుకుని తిరుగుతుంటే చూసేవాళ్లంతా మా భాష మీద, మా దుస్తుల మీద జోకులు వేసేవారు. ఎంత పట్టించుకోకుండా ఉందామనుకున్నా వారి మాటలు ఎంతో కొంత ఆత్మన్యూనతా భావానికి గురిచేసేవి. ప్రారంభంలో ట్రైబల్ స్టూడెంట్స్ ఆరుగురు ఉన్నా ఈ పరిస్థితులు తట్టుకోలేక వాళ్లల్లో ముగ్గురు వెళ్లిపోయారు. మెల్లమెల్లగా ఎస్‌సి, ఎస్‌టి వాళ్లంతా ఒక గ్రూపుగా, అగ్రకులాల వారంతా ఒక గ్రూపుగా విడిపోవడం జరిగింది. కుల ప్రాతిపదికన స్నేహాలు ఏర్పడటం అన్నది బాధాకరంగా ఉండేది. ఆంధ్రాప్రాంతం నుంచి వచ్చిన దళిత విద్యార్థులు తాము దళితులమని చెప్పుకునే వాళ్లు. ఒకసారి బాపట్ల నుంచి సుధాకర్, నాగభూషణం అనే ఇద్దరు దళిత విద్యార్థులు వచ్చి పి.జి.లో చేరితే వారిని కూడా ఇతరులు అలాగే అవమానించడం మొదలెట్టారు. వీళ్లు తిరగబడటంతో విషయం పరస్పర భౌతిక దాడుల దాకా వెళ్లింది. ఆ తరువాత దళిత విద్యార్థులంతా సంఘటితం కావడం మొదలెట్టారు. అప్పటిదాకా మార్క్సిజం భావజాలంతో ఉన్న నేను అంబేద్కరిజం వైపు మొగ్గు చూపాను. సమాజంలో ఉన్నవి వర్గ సమస్యలు కాదు, కుల సమస్యలేనన్న భావన నాలో బలపడింది. ఈ స్థితిలోనే యూనివర్సిటీలో తొలిసారిగా అంబేద్కర్ అసోసియేషన్ ఊపిరిపోసుకుంది. దాని సంస్థాపక సభ్యుల్లో నేనొకడ్ని. అప్పటిదాకా చౌదర్లమని చెప్పుకుంటూ బతికిన విద్యార్థులంతా తాము దళితులమనే నిజాన్ని బహిర్గతం చేశారు.
తరాలు మారితేనేమిటి?
ఎం.ఏ అయిపోగానే ఎం.ఫిల్‌లో చేరాను. ఎం.ఫిల్ థీసిస్ సమర్పించక ముందే నాకు ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పుడే దసరా సెలవులు రావడంతో నేను మా ఊరికి వెళ్లాను. మాతో మొదట్నించి ఎంతో సాన్నిహిత్యం ఉన్న ప్రభాకర రెడ్డి అనే ఆయనతో ఈ శుభవార్త చెబుదామని మా కజిన్‌తో క లిసి వారింటికి వెళ్లాను. అతను పది ఫెయిలవడంతో చదువు అంతటితో ఆపేసి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ ఉండేవాడు. వాళ్లదో పెద్ద బంగళా. నేను వాళ్ల ఇంటికి వెళ్లడం అదే మొదటిసారి. నేను వెళ్లినప్పుడు ప్రభాకరరెడ్డ్ది ఇంట్లోనే మంచం మీద కూర్చుని ఉన్నాడు. వాళ్ల అమ్మానాన్నా అక్కడే ఉన్నారు. వెళ్లి విషయం చెప్పాను. 20 నిమిషాల పాటు నన్ను నిలబెట్టి మాట్లాడాడే తప్ప కూర్చోమనలేదు. ఇంక ఉండలేక తిరిగి వచ్చేశాను. బయట ఎంతో ఆత్మీయంగా ఉండే అతను ఆ సమయాన అలా ఎందుకు చేశాడా? అన్న ఆలోచనల్లో పడ్డాను. ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు. ఉద్యోగం వచ్చిన సంతోషమే లేకుండా పోయింది నాకు. ఏమీ చదువుకోని మా నాన్న పట్ల వ్యవహరించిన తీరుకు, చదువుకుని ఒక స్థాయికి వచ్చిన నా పట్ల వ్యవహరించిన తీరుకు పెద్ద తేడా లేదనిపించింది. సమాజంలో ఉన్నది కుల సమస్యే అని అంతకు ముందే ఏర్పడిన భావన ఆ సంఘటనతో మరింత బలపడింది. క్లాసు లేదు. కులమే ఉంది అనే భావన నాలో పాదుకుపోవడానికి ఈ అనుభవం బాగా దోహదం చేసింది.
వచ్చిన దారిని మర్చిపోతామా?
పి.హెచ్‌డి కోసం నేను లండన్ వెళ్లాను. అక్కడే ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి, చేస్తావా అని మా గైడ్ అడిగారు. కాని నేను నా దేశానికి తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పాను. నా శక్తి మేరకు మా గిరిజనులకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను, అందుకే ఏం చేసినా ఇండియాలోనే చేస్తానని చెప్పాను. ఆయన ఎంతో సంతోషించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా దాటి వచ్చిన లోయల్ని మరిచిపోకూడదని నేన నుకుంటాను. ఈనాటికీ అడుగడుగునా ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటూ దుర్భరమైన జీవితం గడుపుతున్న వారికి ఆసరా అందించడం కన్నా గొప్ప పని ఏముంటుంది? నా కృషి వెనుక ఒక ఉన్నత స్థానాన్ని అందుకోవాలన్న ఆశ కన్నా, లంబాడాలకు ఎదురవుతున్న అవమానాలకు అడ్డుకట్ట వేయాలన్న కసి ఉంది. పాజిటివ్ కసి సమాజానికి మంచే చేస్తుందన్న సత్యాన్ని నా జీవితమే నాకు నేర్పింది.
హీనాతిహీనంగా తిడుతూ, అతి చిన్నకారణాలకే ఒళ్లు హూనమయ్యేలా కొట్టేవాడు. ఏనాడూ ఆయన నన్ను నా పేరుతో పిలవలేదు. 'అరే ఓ లంబాడి... కొడుకా' లాంటి బూతులే తిట్టేవాడు.
-బమ్మెర
ఫోటోలు: నవీన్
Navya, Andhra Jyothi Telugu News Paper Dated: 1/11/2013