రాష్ట్ర విభజనకు సంబంధించి రాజకీయ విషయాలు చెప్పే వ్యాసం కాదిది. రాష్ట్ర విభజన చేసిన తర్వాత వచ్చే చిక్కుముళ్ళలో చాలా గట్టిచిక్కుముడి విశ్వవిద్యాలయాలకు చెందిన పరిపాలనకు సంబంధించినది. ప్రభుత్వోద్యోగులు రెండు ప్రాంతాలలో ఉండేవారు వారి వారి స్వంత ప్రాంతాలకు వెళ్ళడానికి వారికి అవకాశాలు కల్పిస్తుంది ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రవిభజన ఉద్యమానికి ఉన్న చాలా గట్టి కారణాలలో ఉద్యోగాల అవకాశాలు తెలంగాణలో ఉన్న ఉద్యోగులకు రావలసిన వాటిని కూడా ఇతర ప్రాంతాల వారు తన్నుకుపోయారనేది ఒకటి. అంతే కాదు ఇక్కడ ఉన్న ఖాళీ పోస్టులకు వాటికి అవసరమైన క్రమపద్ధతిలో భర్తీ చేయకుండా డెప్యుటేషన్ పైనే వేరే ప్రాంతాలవారిని తీసుకువచ్చి పనిచేయిస్తున్నారనే విషయం మరొకటి. వీరి భర్తీ గురించి లేదా ఉద్యోగాల నియామకాలలో జరిగిన అన్యాయాల గురించి చర్చ ఇక్కడ ఉద్దేశం కాదు. దానికి వేరే వేదికలున్నాయి.
కానీ ఇక్కడ చర్చించవలసిన ముఖ్యవిషయాలు వేరే ఉన్నాయి. ఉమ్మడిగా ఉన్న ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని విభజన తర్వాత వాటిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీర్చవచ్చు. కానీ విశ్వవిద్యాలయాలు ప్రత్యక్షంగా ప్రభుత్వ పరిపాలనలో కాక స్వతంత్ర ప్రతిపత్తి కలిగి పరిపాలన సాగిస్తున్నాయి. నిధులు ఇవ్వడం ఉపాధ్యక్షులను నియమించడం తప్ప ప్రభుత్వం విశ్వవిద్యాలయ పరిపాలనలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోదు. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో ఇరు ప్రాంతాలలో ఉన్న ఉద్యోగులు ఆయా ప్రాంతాలకు చెందినవారు కాక వేరేప్రాంతాల వారి పరిస్థితి ఏమిటి. వారు స్వంత ప్రాంతాలకు పోవాలంటే ఎలాంటి నిర్ణయాలు ఉమ్మడి ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్రం విడిపోయాక ఇరు ప్రాంతాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల ఉద్యోగులు వారి ప్రాంతం వెళ్ళి అక్కడున్న విశ్వవిద్యాలయాల్లో పనిచేయడానికి ప్రత్యేక నిర్ణయాలు తీసుకొని చట్టాలు చేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విశ్వవిద్యాలయాల చట్టం ఒకటి ఉంది. అంతే కాదు ద్రావిడ విశ్వవిద్యాలయం మరికొన్ని ఇతర విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక చట్టాలున్నాయి. వీటి దృష్ట్యా ఉమ్మడి రాష్ట్రం స్థాయిలోనే వాటి వాటి ఉద్యోగుల ప్రాంతాల మార్పిడికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
మన రాష్ట్రం మొత్తంలో 35 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 27 విశ్వవిద్యాలయాలు ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నాయి. కాగా 3 విశ్వవిద్యాలయాలు (హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇఫ్లూ విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం) కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందినవి కాబట్టి మన రాష్ట్రానికొచ్చిన ఇబ్బంది లేదు. ఇక ఈ 30 కాక 5 డీమ్డ్ విశ్వవిద్యాలయాలున్నాయి. (ఇవి. సత్యసాయి ఉన్నత విద్యాసంస్థ, ఎన్.ఐ.టి. వరంగల్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి, ట్రిపుల్ ఐటి హైదరాబాద్, గీతమ్ విశ్వవిద్యాలయం) వీటి ఉద్యోగుల పరిస్థితిని కూడా ఆయా సంస్థలు పరిష్కరించుకోవచ్చు.ప్రైవేటువి కాక మిగతావాటిలో ఎన్.ఐ.టి. కేంద్ర ప్రభుత్వానికి చెందినది కాబట్టి దానితోనూ సమస్య లేదు.
పైన చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న 27 విశ్వవిద్యాలయాలు కొన్ని తెలంగాణ ప్రాంతంలోనూ కొన్ని కోస్తా ప్రాంతంలో మరికొన్ని రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. ఈ 27 విశ్వవిద్యాలయాల్లో ఎక్కువ ఆయా ప్రాంతమే లోకల్ హోదా ఉండే విశ్వవిద్యాలయాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధి దాని చుట్టూ ఉన్న జిల్లాలు అక్కడి విద్యార్థులే దానికి లోకల్ అవుతారు. మిగతా వారు దానికి నాన్ లోకల్ అవుతారు. అలాగే ఆంధ్రా యూనివర్సిటీకి రాయలసీమ ప్రాంత యూనివర్సిటీలకు లోకల్ నాన్ లోకల్ ఉంటుంది. ఇక్కడి ఉద్యోగుల నియామకం ఈ ప్రాంతాల వారికే ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. కానీ వేరు వేరు కారణాల రీత్యా ఈ విశ్వవిద్యాలయాల్లో వేరే ప్రాంతాల వారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా కాక రాష్ట్రం మొత్తం లోకల్‌గా ఉండే రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు కొన్ని ఉన్నాయి.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇవి 5 రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలు. వీటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం లోకల్ అవుతుంది. విద్యార్థుల ప్రవేశాలలో రాష్ట్రం మొత్తం లోకల్ అవుతుంది. ఆరు సూత్రాల పథకం ప్రకారం రాష్ట్రస్థాయి కార్యాలయాలు ప్రభుత్వ సంస్థలు అన్నింటిలో ఉద్యోగాలలో 48 శాతం తెలంగాణ ప్రాంతం వారికి మిగతా 52 శాతం సీమాంధ్ర ప్రాంతాల వారికి ఇవ్వవలసి ఉంది. కానీ అలా జరగలేదు. తెలుగు విశ్వవిద్యాలయంలో (హైదరాబాదులో ఉన్నదానితో సహా) సుమారు 15 నుంచి 20 శాతం వరకే తెలంగాణ వారుండగా 80 శాతం పైగా సీమాంధ్ర ప్రాంతాల వారున్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఎనిమిది శాతంలోపే బోధన, బోధనేతర సిబ్బంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. ఇక మిగతా విశ్వవిద్యాలయాల్లో ఇంతకన్నా తక్కువమంది తెలంగాణ ప్రాంతం వారుండడాన్ని గమనించవచ్చు. రాష్ట్ర విభజన దాకా తెచ్చిన సమస్యలలో ఈ సమస్య చాలా గట్టిది. ఆరు సూత్రాల పథకం, 610 జీవో చిత్తశుద్ధితో సరిగ్గా అమలు చేసి ఉంటే బహుశా ఈ సమస్య వచ్చి ఉండేది కాదు.
కాగా రాష్ట్ర విభజన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఉన్న వారు వారి స్వంత ప్రాంతాలలోని విశ్వవిద్యాలయాలకు వెళ్ళడానికి ఉమ్మడి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్లుగా ఈ విశ్వవిద్యాలయాల్లోని ఉద్యోగులకు వర్తించదు. విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం తిరిగి ప్రత్యేకంగా చట్టం చేసుకోవలసి ఉంటుంది. అంతేకాదు విడిపోయిన రాష్ట్రాలు రెండూ అవగాహన ఒప్పందాలు చేసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కొంత మంది ఆంధ్ర ప్రాంత విశ్వవిద్యాలయానికి పోవాలన్నా, ఎస్.వి. యూనివర్సిటీ తిరుపతి నుంచి ఉస్మానియాకు రావాలన్నా ఆ ప్రాంతాల విశ్వవిద్యాలయాల వారు వారికి ఉద్యోగకల్పన చేయవలసి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా చట్టాలు చేయాలి. యూనివర్సిటీ ఆక్టులు ప్రత్యేకంగా చేసుకొని వాటిలో ఈ ఉద్యోగకల్పన గురించి అవసరమైన అధికరణాలు చేసుకోవాలి. అంతేకాదు దీనికన్నా గట్టి చిక్కుసమస్య ఏమిటంటే, కొన్ని ప్రాంతాల విశ్వవిద్యాలయాల్లో ఉండే కొన్ని శాఖలు ఇతర ప్రాంతాల విశ్వవిద్యాలయంలో ఉండకపోవచ్చు. ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం రష్యన్ డిపార్ట్‌మెంట్ ఉంది. అక్కడి ఉద్యోగి రాయలసీమకు వెళ్ళాలనుకుంటాడు. అక్కడి విశ్వవిద్యాలయంలో ఈ డిపార్ట్‌మెంట్ ఉండదు. అప్పుడు ఆ ఉద్యోగి పరిస్థితి ఏమిటి? అతనికి అవసరమైన పోస్టును ఎలా కల్పించాలి? దీనికోసం ఉమ్మడి రాష్ట్రమే ఆ సంఖ్యలో వారి వారి పోస్టులను ఒక ప్రత్యేక చట్టం ద్వారా వేరే ప్రాంతాల్లో ఉన్న విశ్వవిద్యాలయానికి బదిలీ చేయవలసి ఉంటుంది.
కొన్ని వేలమంది కాకపోయినా ఇలా రెండు రాష్ట్రాల్లో ఉన్న బోధనా ఉద్యోగులు బోధనేతర ఉద్యోగులు కొన్ని వందలమందైనా వేరు వేరు ప్రాంతాల వారున్నారు. ఉమ్మడి ప్రభుత్వ స్థాయిలోనే వారి వారి వివరాలు సేకరించి వారి మార్పిడిపైన ఆయా ఉద్యోగుల అంగీకారాన్ని నిర్ణయాలను తీసుకోవాలి. పైన చెప్పిన పద్ధతిలో ఉమ్మడి ప్రభుత్వ స్థాయిలోనే కొన్ని నిర్ణయాలు జరగాలి. విభజించిన రెండు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు, ఉద్యోగుల మార్పిడి తర్వాత పెన్షన్ చెల్లింపు విషయాల్లో చట్టాలు చేసుకోవలసి ఉంటుంది. లేకుంటే కొన్ని వందల మంది విశ్వవిద్యాలయాల బోధన బోధనేతర ఉద్యోగులు కుటుంబాలు ప్రాంతాలు మారాలనుకున్నా మారినా వచ్చే చిక్కు సమస్యలు చాలా దారుణంగా ఉంటాయి. పెన్షన్ల విషయాలు తేలకుంటే కుటుంబాలు రోడ్డున పడవలసి ఉంటుంది.
ఈ దృష్ట్యా ఉమ్మడి రాష్ట్రంలోని అత్యున్నత అధికారులు, ఆయా విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి దీనికి అవసరమైన చర్యలు ఇప్పుడే తీసుకోవాలి. విస్తృతంగా చర్చలు చేసి చాలా ముందు చూపుతో వ్యవహరించాలి. అందుకోసం ఒక అత్యున్నత స్థాయి కమిటీ వేసి విభజన ప్రక్రియ సందర్భంలోనే విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సమస్య పరిష్కరించాలి.
- పులికొండ సుబ్బాచారి
(రచయిత ద్రావిడ విశ్వవిద్యాలయంలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్. హెడ్‌గా, సోషల్ సైన్స్ డీన్‌గా, డీన్ అకడమిక్ అఫైర్స్‌గా, చీఫ్ వార్డెన్‌గా పనిచేసిన విస్తృత పరిపాలనానుభవం ఉన్న ఆచార్యుడు, ప్రముఖ పరిశోధకుడు, రచయిత)
ఈ దృష్ట్యా ఉమ్మడి రాష్ట్రంలోని అత్యున్నత అధికారులు, ఆయా విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి దీనికి అవసరమైన చర్యలు ఇప్పుడే తీసుకోవాలి. విస్తృతంగా చర్చలు చేసి చాలా ముందు చూపుతో వ్యవహరించాలి. అందుకోసం ఒక అత్యున్నత స్థాయి కమిటీ వేసి విభజన ప్రక్రియ సందర్భంలోనే విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సమస్య పరిష్కరించాలి.
- పులికొండ సుబ్బాచారి
(రచయిత ద్రావిడ విశ్వవిద్యాలయంలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్. హెడ్‌గా, సోషల్ సైన్స్ డీన్‌గా, డీన్ అకడమిక్ అఫైర్స్‌గా, చీఫ్ వార్డెన్‌గా పనిచేసిన విస్తృత పరిపాలనానుభవం ఉన్న ఆచార్యుడు, ప్రముఖ పరిశోధకుడు, రచయిత)
Andhra Jyothi Telugu News Paper Dated: 31/10/2013
No comments:
Post a Comment