Friday, October 25, 2013

పేదల పక్షపాతి (ఎస్‌.ఆర్‌. శంకరన్‌) --హరినాథ్ సిలువేరు


ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది. లక్షలాది మంది కదిలిక సమాజాన్ని సమూలంగా మారుస్తుంది- అన్న పేదల పక్షపాతి, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి దివంగత మాజీ ఐ.ఎ.ఎస్‌. అధికారి ఎస్‌.ఆర్‌. శంకరన్‌ మాటలు అక్షరసత్యాలు. తన మంచి ఆలోచనలతో ఒక ఐ.ఎ.ఎస్‌. అధికారిగా ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర రాష్ట్రాల్లో పేదల కోసం సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి వాటిని అమలు చేయడం ద్వారా రెండు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలు సంక్షేమఫలాలు సద్వినియోగం చేసుకున్నారు. తమ జీవితాలను వెలుగు దారిలో ప్రయాణింపచేస్తున్నారు. 
శంకరన్‌ తమిళనాడులో ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో 1934 అక్టోబర్‌ 22న జన్మించి మద్రాస్‌ లయోలా కళాశాలలో హైయర్‌ సెకండరీ పూర్తి చేసి 1954లో అదే కళాశాలో డిగ్రీ పొంది 1957లో ఇండియన్‌ అడిమినిస్ట్రేటివ్‌ సర్వీస్‌కి ఎంపిక అయ్యారు. 1992 అక్టోబర్‌లో పదవీ విరమణచేసి 2010 అక్టోబర్‌ 7న కోట్లాది మంది పేదలకు దూరమయ్యారు. తన 76 సంవత్సారాల జీవితకాలంలో దాదాపు 43 సంవత్సరాల పాటు పేదల సంక్షేమం కోసమే పాటు పడ్డారు. 

1959లో కర్నూలు జిల్లా నంద్యాలలో సబ్‌ కలెక్టర్‌గా అధికారిక జీవితాన్ని ప్రారంభించిన శంకరన్‌ నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, తదుపరి అదే జిల్లాకు కలెక్టర్‌గా, రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ సెక్రెటరిగా, ప్రిన్సిపల్‌ సెక్రెటరిగా, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. దేశ చరిత్రలో బహుశా శంకరన్‌ వంటి అధికారిని అరుదుగానే చూడగలం. ఒక అగ్రవర్ణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి బడుగు, బలహీన వర్గాల ప్రజలకోసం పరితపించారంటే, అందుకు కారణం ఉన్నతధికారిగా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి గ్రామాల్లో దుర్భర జీవితాలు గడపుతున్న ప్రజల కష్టాలే కావచ్చు. శంకరన్‌ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు, 1970 లో ఊరురా తిరుగుతూ దొరల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర అనేక సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తున్న దళిత, గిరిజన ప్రజలను కలిసి వారి హక్కుల గురించి వివరించి చైతన్యపరచారు. వెట్టిచాకిరి వ్యవస్థ నుండి తమను విడిపించాలని ప్రభుత్వంపై నిరుపేద ప్రజల చేత దండయాత్ర చేయించిన వ్యక్తి శంకరన్‌. 

నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్న శంకరన్‌ వంటి అధికారులకు తన ప్రభుత్వంలో అధికారిగా కొనపాగే హక్కు లేదని- తన అహంకారాన్ని బయట పెట్టారు. కాని శంకరన్‌ తన దైన శైలిలో, పేదల పక్షాన నిలబడలేని ఈ ప్రభుత్వంలో ఉద్యోగానికి కొన్ని నెలలపాటు దీర్ఘకాలిక సెలవు పెట్టారు. అప్పటికే శంకరన్‌ పేరు దేశం నాలుగుమూలల వ్యాపించింది. నాటి త్రిపుర ముఖ్యమంత్రి నృపేన్‌ చక్రవర్తి, పేదల సంక్షేమం పోరాటం చేస్తున్న శంకరన్‌ను తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు. ఇద్దరు పేదల సంక్షేమం వైవు ఆలోచించే వ్యక్తులు కావడం వల్ల త్రిపుర రాష్ట్ర అభివృద్ధికి ఢోకా లేకుండా పోయింది. దాదాపు 6 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పేదల సంక్షేమం వైపు నడిపించగలిగారు. ఇద్దరూ అనేక గిరిజన గ్రామాలల్లో ప్రవేశించి అక్కడి ప్రజల బాగోగులు తెలుసుకున్న వ్యక్తులు. ప్రజల కష్టాలను రూపు మాపేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశట్టారు. 
ఆంధ్రప్రదేశ్‌లో 1984లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు యన్‌.టి. రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత, శంకరన్‌ను ఆహ్వానించి తన ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించుకున్నారు. త్రిపుర రాష్ట్రంలో తన అనుభవాల దృష్ట్యా నాటి నుండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. 

రాజ్యంగంలోని అర్టికల్‌ 14 ప్రకారం, ప్రతి పౌరునికి తిండి, బట్ట, ఇల్లు- ప్రతి విద్యార్ధికి విద్య అందిచాల్సిన భాధ్యత ప్రభుత్వాలది. పేదవర్గాల పిల్లలు సరైన పోషకాహారం, తిండి లేక పిట్టల్లా రాలిపోతున్న రోజులవి. దానిని గమనించి శంకరన్‌ సంక్షేమ విద్యాలయాల స్థాపనకు శ్రీకారంట్టారు. దళిత గిరిజన విద్యార్ధులకు1984లో సంక్షేమ పాఠశాలలు ఏర్పాటుచేశారు. ఫలితంగా నేడు రాష్ట్రంలో 292 సాంఘిక సంక్షేమ బాల బాలికల పాఠశాలలు, కళాశాలలు ఉండగా, వాటిలో సుమారు లక్ష డెబె్భై వేల మంది విద్యార్ధులు, 5 వేల మంది టీచర్లు, వెయ్యి మందికి పైగా సిబ్బందితో అవి కళకళాలాడతున్నాయంటే అది శంకరన్‌ కృషే. విద్యార్ధులకు వసతి గృహాలతో పాటు సిబ్బందికికూడా వసతి గృహలను ఏర్పాటు చేయించారు. నేడు సంక్షేమ విద్యాలయాలు, కార్పొరేట్ల స్థాయిలో ఇంగ్లీష్‌ మీడియం విద్యను అందిస్తున్నాయి. సంక్షేమ, గిరిజన విద్యాలయాల్లో చదివిన విద్యార్ధులు ఎంతో మంది ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖలో అధికారులుగా ఉన్నారు. 
శంకరన్‌ తన కార్యలయానికే పరిమితం కాలేదు. ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజలకు అందుతున్నాయో స్వయంగా చూసి తెలుసుకునేవారు. 

తన అధికారులతో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని గుర్తేడు గ్రామంలో గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించడానికి వెళ్ళిన సందర్భంలో శంకరన్‌తో సహా దాదాపు 11 మంది అధికారులను మావోయిస్టులు నిర్బంధించారు. ఆ తరువాత 12 రోజులకు విడుదల చేశారు. అయినా ఏనాడూ శంకరన్‌ వెనుకంజ వేయలేదు. ఇప్పటికీ రాష్రంలో అమలవుతున్న నిరుపేదలకు భూపంపిణి, ఇల్లు లేని వారికి ఇల్లు, బ్యాంకుల రుణాలు, కూలీలకు కనీస వేతనాలు, అణగారిన వర్గాల పిల్లలకు ఉచిత విద్య, వితంతు పెన్షన్లు, ఎస్‌.సి, ఎస్‌.టి సబ్‌ ప్లాన్‌ అమలు, ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వంటి సంక్షేమ పథకాలకు పునాది శంకరన్‌ కృషే. శంకరన్‌ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు, వెట్టిచాకిరి వ్యవస్థలో మగ్గుతున్న దళిత గిరిజనులను విముక్తి చేయాలని, ఎస్‌.సి లపై జరుగుతున్న దాడులను అత్యాచారాలుగా చూడాలని ప్రతిపాదించారు. ఆ ఫలితంగానే 1985లో కారంచేడు సంఘటనలో దళితులపై దాడిచేసిన వారిపై అట్రాసిటి కేసు నమోదు అయ్యింది. 

ఈ సంఘటనతో యన్‌.టి. రామారావు చిక్కుల్లో పడి, శంకరన్‌ను పదవికి దూరం పెట్టి కొన్ని నెలలపాటు పోస్టింగ్‌ ఇవ్వలేదు. 1990లో శంకరన్‌ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా నియమితులయ్యారు. అక్కడ కూడా అణగారిన వర్గాల కోసమే శ్రమించారు. పంచాయతి, మున్సిపాలిటి ఎన్నికలల్లో ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి రిజర్వేషన్లు అమలయ్యే విధంగా శ్రమించారు. దాని ఫలితమే 1992 లో 73 వ సవరణను అమలు చేయడం ద్వారా నేడు అణగారిన వర్గాల ప్రజలు ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. శంకరన్‌ 1992 అక్టోబర్‌లో ప్రభుత్వ అధికారిగా పదవీ విరమణ చేసినా, తన కృషిని విడిచి పెట్టలేదు. హైదరాబద్‌ నగరం నడిబోడ్డులోని పంజాగుట్టలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఆయన ఇల్లు ఎంతో సాదా సీదాగా ఉండేది. సాఫాయి కర్మచారి ఉద్యమానికి ముఖ్య నాయకుల్లో ఒకరుగా, వారి హక్కుల సాధనకోసం దేశ వాప్తంగా ఉద్యమాన్ని వ్యాపింపచేసిన వ్యక్తి. తనకు వచ్చే పెన్షన్‌ డబ్బును దళిత విద్యార్ధుల పైచదువుల కోసం వెచ్చించేవారు. వీధిబాలలు, వికలాంగులకు ఆశ్రమాలు నడిపే స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేసేవారు.

హైద్రాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ల్లో ఎస్‌.సి, ఎస్‌.టి.లకు చదువుకునే అవకాశం లేకపోతే, కేంద్ర సామాజికన్యాయ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడి రిజర్వేషన్లు అమలు చేయించారు. శంకరన్‌ అటు మావోయిస్టులకు, ఇటు ప్రభుత్వానికి మధ్య 2004లో జరిగిన శాంతిచర్చల్లో ప్రధాన సమన్యయకర్తగా వ్యవహించారు. చర్చలు సఫలం కాకాపోవడంతో మానసికంగా కృంగిపోయారు. 
శంకరన్‌ నిరంతరం పేదప్రజల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్డుకు ఎంపికచేసింది. కాని సన్మానాలకు దూరంగా ఉండే శంకరన్‌ సున్నితంగా తిరస్కరించారు. ఆయన మరణించిన తరువాత ప్రభుత్వమే అధికారికంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేసింది. ఈనాటి ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌, ఐ.ఎస్‌.ఎస్‌ అధికారులకు ఆయన ఒక ఆదర్శం కావాలి. శంకరన్‌ చేయించిన సంక్షేమ పథకాలను విద్యార్ధులు సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేయగలగాలి. వ్యక్తి గత అభివృద్ధిని కోరుకుంటూ తన చుట్టు ఉన్న పదిమందికి లబ్ధి చేకుర్చేలా వ్యవహరించినప్పుడే శంకరన్‌ ఆశయాలను కొనసాగించినవారమవుతాము. సాంఘిక సంక్షేమ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన శంకరన్‌ జయంతి వేడుకలను ప్రస్తుత సాంఘిక సంక్షేమ కార్యదర్శి డా ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ స్వారోస్‌ అధ్వర్యంలో అక్టోబర్‌ 25న నిర్వహించడం, ఆయన ఆశయాలను కొనసాగించడమే.

Suryaa Telugu News Paper Dated: 26/10/2013 

No comments:

Post a Comment