Wednesday, October 9, 2013

తెలంగాణ: మావోయిస్టు రాజకీయాలు By పొఫెసర్ జి. హరగోపాల్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కేంద్ర హోంమంవూతిత్వ శాఖ అంతర్గతంగా మావోయిస్టు ప్రభావాన్ని గురించి తప్పకుండా చర్చిస్తుంటుంది. పెట్టుబడిదారులు, భూకబ్జాదారులు ఆ ప్రచారాన్ని చేస్తూనే ఉన్నారు. మావోయిస్టులు అంటే భూస్వాములు, పెట్టుబడిదారులు భయపడడం సరే. సాధారణ మధ్యతరగతి కూడా భయపడేలా రాజ్యం మీడియా ద్వారా ప్రజాభివూపాయాన్ని మలచగలిగింది. దానికి తోడు పార్టీ మాటలు, డాక్యుమెంట్లలోని వ్యాఖ్యలు ఈ ధోరణికి తోడ్పడేలా ఉంటున్నాయి. ఈ మధ్య పత్రికల్లో కిడ్నాప్ సందర్భాల్లో మధ్యవర్తులను పిలవవద్దని, శత్రువు దొరికితే వదిలిపెట్టకూడదన్న నిర్ణయం తీసుకున్నట్లు వచ్చింది. ఉద్యమాన్ని గౌరవిస్తున్న మా లాంటి వాళ్లకు కూడా ఇన్ని త్యాగాలు చేస్తున్న పోరాటం నూతన సమాజం కోసం, నూతన మనిషి కోసం అన్వేషిస్తున్న ఉద్యమం ఈ భాష ఇలా ఎందుకు మాట్లాడవలసి వస్తుందో అర్థం కాదు. నేను ఒక లిబరల్ డెమోక్షికట్ (పార్టీ అన్నట్లుగా) కావడం వల్ల కావచ్చు. ఇది నా మానసిక స్థితి కావచ్చు. కానీ పార్టీ మాలాంటి వాళ్లను మధ్యవర్తులుగా పిలిచి చాలా గౌరవించింది అని నేను అనుకుంటున్నాను. మధ్యవర్తిత్వం ద్వారా గిరిజనులకు మేలు జరగలేదని మేము పత్రికా ముఖంగానే చెప్పాము. కానీ ఉద్యమానికి కొంత మంచి కూడా జరిగింది.

నేను ఇద్దరు కలెక్టర్ల ‘అపహరణ’ సందర్భంలో ముందుకు వచ్చిన అంశాలను, ఉద్యమ కన్‌సర్న్‌ను చర్చకు పెట్టాం. దేశవ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకులు అలాగే హక్కుల కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున ఈ ప్రసంగాలకు వచ్చారు. ఉద్యమాలను గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. ఛత్తీస్‌గఢ్, ఒడిషా గిరిజనుల సమస్యల మీద చాలా విస్తృత చర్చ సాధ్యమైంది. అంతేగాక మావోయిస్టు పార్టీ ఆర్.ఎస్.రావు, బి.డి.శర్మ లాంటి వాళ్లను మధ్యవర్తులుగా ఎన్నుకోవడం, వాళ్లు దానికి అంగీకరించడం ప్రజలు హర్షించారు. తాము పెట్టిన డిమాండ్లు అంగీకరించకపోయినా ఇద్దరు కలెక్టర్లను క్షేమంగా వదలడం కూడా అంతే హర్షించారు. ఈ సంఘటనలు మధ్యతరగతిలో హింస గురించి లోతుగా పాతుకపోయిన అభివూపాయాలను పునఃపరిశీలించడానికి ఒక అవకాశమిచ్చాయి. ఈ ఉద్యమం కేవలం హింసా రాజకీయమనే వాదన తప్పు అని, ఢిల్లీలోని ఒక మహిళా కళాశాలలో చాలా మంది అమ్మాయిలు మాట్లాడారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఒడిషా అపహరణ గురించి వినడానికి హాలు అంతా అధ్యాపకులు, విద్యార్థులతో నిండిపోయింది. అలాగే బనారస్ హిందూ యూనివర్సిటీలో, అలహాబాద్ యూనివర్సిటీలో చర్చ జరిగింది. జార్ఖండ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదిపన్నెండు మంది మావోయిస్టు ఉద్యమం మీద పరిశోధనా వ్యాసాలు రాశారు. బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. కిడ్నాప్‌ల సందర్భంలో మధ్యవర్తులను పిలవవద్దు అనే నిర్ణయం ఈ మొత్తం ప్రజాస్వామ్య చర్చను విస్మరించినట్లవుతుంది. మావోయిస్టులవి హత్యారాజకీయాలు అని జరిగిన విస్తృత రాజ్య ప్రచారాన్ని ఎలా తట్టుకోవాలో, ఎలా ఎదుర్కొవాలో ఉద్యమం చాలా సీరియస్‌గా ఆలోచించవలసి ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ ‘భయాలు’ పనిచేస్తున్నాయి.
శాంతి చర్చల సందర్భంలో ఒక దశలో తెలుగుదేశం పార్టీ ఉస్మానియా విశ్వవిద్యాలయ సోషియాలజి ప్రొఫెసర్, తెలుగుదేశం పార్టీ సభ్యుడు లక్ష్మన్న గారితో సంప్రదించమన్నారు. శంకరన్ గారు నేను హబ్సీగూడలోని ఆయన నివాసానికి వెళ్లాం. అంతకుముందు ఎంతో స్నేహపూరితంగా మాట్లాడిన లక్ష్మన్న ఈసారి చాలా అసహనంగా చర్చల గురించి ఏం మాట్లాడుతాం, ఇప్పుడు పీపుల్స్‌వార్ వాళ్లు తమ ఎజెండాలో ‘తెలంగాణ’ చేర్చారు అన్నాడు. ఇక చర్చల ప్రసక్తి కష్టం అని కూడా అన్నాడు. బయటికి వచ్చిన తర్వాత శంకరన్ గారు అంతే అసహనంతో ముందు తెలంగాణ ప్రకటన వస్తే బావుండేది అన్నాడు. (శంకరన్ గారికి తెలంగాణ ఉద్యమం పట్ల కొన్ని రిజర్వేషన్స్ ఉండేవి.) తెలుగుదేశం పార్టీ తెలంగాణను వ్యతిరేకించడానికి ఇదొక సాకుగా తీసుకుంది. తెలంగాణ ఉద్యమం మరింత ముందుకు పోయింది. ఈభయాలన్నీ దాటే ప్రయత్నం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఒక నిజం కానున్న దశలో మావోయిస్టుల ప్రస్తావన కేంద్ర హోంమినిస్ట్రీ చేయడం తెలంగాణ వాళ్లకేం నచ్చడం లేదు.

మావోయిస్టు పార్టీ ప్రభావం తెలంగాణ ప్రజల మీద, చైతన్యం మీద, సృజనాత్మకత మీద, మేధస్సు మీద చాలా లోతైంది. రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు దాదాపు అన్ని రంగాలలో ఈ రోజు ప్రతిభావంతంగా, నిజాయితీగా పనిచేస్తున్న చాలామంది ఆ ఉద్యమ ప్రభావం నుంచే వచ్చారు. ఒక ఉద్యమం ఇంతమందిని, ఇన్ని రంగాలను తన ఆచరణతో, తన త్యాగాలతో, తమ ప్రమాణాలతో ప్రభావితం చేయగలిగింది. చాలామంది యువకులు ప్రజల జీవనాల్ని త్వరగా మార్చాలని ప్రాణాలనిచ్చారు. ఇదంతా హింసేనా, ఈ సామాజిక అభివృద్ధిని విస్మరించి, మొత్తం ఉద్యమాన్ని హింసకు కుదించడం మీడియాకు అవసరం కావచ్చు, పాలకులకు, రాజ్యానికి కావచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. మావోయిస్టు పార్టీని చర్చలకు ఆహ్వానించిన అనుభవం ఉంది. దేశానికంతా కొత్త విశ్వాసాన్ని కలిగించిన చర్చలకు సానుకూల వాతావరణం కల్పించిన ప్రాంతం తెలంగాణ. ఒక అరుదైన ప్రయోగం చేసిన ప్రాంతమని మనం మరువకూడదు.


మావోయిస్టు వాళ్లు సాయుధ పోరాటాన్ని గురించే మాట్లాడవలసిన అత్యవసరం లేదు. పోరాటమంతా సమాజ నిర్మాణమే కదా. విప్లవాలు ఒక్కొక్కసారి అనూహ్యరీతిలో జరగవచ్చు. ఒక్కొక్కసారి చాలాదీర్ఘకాలం పట్టవచ్చు. మానవ చైతన్యాన్ని పెంచడం, మనిషిని మనిషి అని గుర్తించే ఒక సామాజిక ప్రక్రియే విప్లవ పరిణామం. ఈ మార్పు అంత సహజంగా, సునాయసంగా, త్యాగాలు లేకుండా వస్తాయని ఎవరూ అనుకోకూడదు. కానీ మానవ ప్రవృత్తిని సామాజిక సంబంధాలను మౌలికంగా మార్చడానికి సమాజంలోని అన్ని రంగాలలో ప్రయోగాలు జరగాలి. ప్రతి రంగంలో పనిచేస్తున్న వాళ్లు విప్లవ సంస్కృతి వెలుగులో నిరంతరంగా పోరాటం చేయవలసి ఉంటుంది. జగన్మోహన్‌రావు రాసిన ‘భూదేవి’ నవలలో కరీంనగర్‌లో జరుగుతున్న గుట్టల విధ్వంసానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో, ప్రజలు అన్నలు లేరన్న లోటును గుర్తు చేసుకుంటారు. అన్నలు లేకున్నా అన్నల స్ఫూర్తితో పోరాడాలని నిర్ణయించుకుంటారు. ఇది శాంతియుతంగానే చేస్తున్నారు. అన్ని రంగాల్లో ఒక ప్రాపంచిక దృక్పథం ఉన్నవాళ్లు ఆయా రంగాల్లో అది విద్యా రంగమే కావచ్చు, వైద్య రంగమే కావచ్చు, విద్యార్థి ఉద్యమాలే కావచ్చు, పర్యావరణ పరిరక్షణే కావచ్చు. లేదా రైతాంగమే కావచ్చు, పరిక్షిశమలలో శ్రామికులే కావచ్చు, ప్రభుత్వోద్యోగులే కావచ్చు అందరూ తమ తమ రంగాలలో ఉద్యమాలను నిర్మించాలి. ఒక్క రంగం అని కాదు సామ్రాజ్యవాదం ఏ రంగాన్ని కూడా వదలలేదు. అన్ని రంగాలలో కలిసి పోరాడే చారివూతక సందర్భాన్ని ప్రపంచీకరణే సృష్టిస్తున్నది. సమష్టి ఉద్యమాల ఆవశ్యకతని, పోరాట సంస్కృతిని పెంపొందించడం చారివూతక అవసరం.

మావోయిస్టు పార్టీ తమ రాజకీయాలని ప్రజల మధ్య చర్చకు పెట్టాలి. ప్రజల నుంచి వచ్చే స్పందనలను విశ్లేషించాలి. శాంతిచర్చల సందర్భంగా ఏర్పడ్డ వాతావరణంలో, ఏ అసహజ మరణం లేకుండా ఒక పది నెలలు ప్రజలు ఈ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. వేలమంది తమ సమస్యలను వాళ్ల దృష్టికి తీసుకెళ్లారు. భిన్న ప్రజాసంఘాలు చర్చకు ముందుకు వచ్చాయి. మహిళా సంఘాలు ఉద్యమం మీద చాలా విమర్శలు పెట్టారు. చర్చల తర్వాత వాళ్లు తిరిగి వెళ్లేముందు ఆర్.కె. తో మొత్తం అనుభం ఎలా ఉంది అని అడిగితే, మహిళా సంఘాలతో చర్చలు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి అంటూ, మా మీద ఎక్కువ భారం పడింది అని అన్నా డు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త ప్రభుత్వం (అది గుణాత్మకంగా భిన్నంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు) చర్చలను మళ్లీ ప్రారంభించవచ్చు. ఆరోజు ప్రభుత్వం ముందు పెట్టిన అంశాలలో ప్రజాస్వామిక హక్కుల విస్తరణ ఒకటి. తెలంగాణ ప్రజలు తమ ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించుకున్నారు. కనుక ఉద్యమ విలువ సమాజానికి మరింత స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది. తెలంగాణలో దళితులు, గిరిజనులు, నిరుద్యోగులు, ప్రభుత్వోద్యోగులు, మైనారిటీలు తమ హక్కుల కోసం డిమాండ్ పెట్టవచ్చు. వాటి కోసం పోరాడవచ్చు. అలాగే భూసంస్కరణల గురించి చర్చ జరిగింది. దాని ఫలితంగా కోనేరు రంగారావు కమిటీ వేశారు. ఈ కమిటీ ఐదు లక్షల ఎకరాల దాకా భూమిలేని నిరుపేదలకు ఇచ్చే అవకాశముందని పేర్కొన్నది. తెలంగాణ కొత్త ప్రభుత్వం కోనేరు రంగారావు కమిటీ వంటిది వేయవచ్చు.

అప్పుడు మావోయిస్టు పార్టీ దాదాపు ముప్ఫైమంది సామాజికశాస్త్రవేత్తలు, ప్రజాస్వామికవాదుల పేర్లు సూచించింది. వాళ్లందరినీ సంప్రదించవచ్చుపపంచీకరణ ప్రేరేపిత అభివృద్ధి నమూనా మూలాలను చూడాలి. వేలమంది రైతుల ఆత్మహత్యలకు కారణాలను వెతికి తెలంగాణలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోని ఒక ఆర్థిక వాతావరణాన్ని కలిగించాలి. అంటే ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాన్ని తెలంగాణ విస్తృతంగా చర్చించాలి. నిజానికి తెలంగాణ తన అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాల వెలుగులో మొత్తం అభివృద్ధి నమూనాని మౌలికంగా ప్రశ్నించగలగాలి. అలా ప్రశ్నించగలిగితే మావోయిస్టులు కూడా దానికి సహకరించవచ్చు. తెలంగాణ మావోయిస్టు రాజకీయాలని నిష్కర్షగా చర్చించే సంస్కృతి పెంపొందించుకోవాలి. ఉద్యమం నిరంతరంగా ప్రజలతో సంభాషించే ప్రక్రియను అభివృద్ధి చేసుకోవాలి. ఇదంతా జరగాలంటే మావోయిస్టు ఉద్యమం గురించి మాట్లాడే ధైర్యాన్ని పెంచుకోవాలి. మావోయిస్టు పార్టీ కూడా నిజాయితీ కూడిన చర్చను సీరియస్‌గా తీసుకోవాలి. చర్చ హింస ప్రతిహింస వలయంలో నుంచి బయటపడాలి. ఇది ప్రజా ఉద్యమాల కేంద్రంగా జరగాలి.


Namasete Telangana Telugu News Paper Dated: 10/10/2013 

No comments:

Post a Comment