October 7, 2013
హైటెక్ జీవితానికి అలవాటు పడుతున్న ఈ రోజులలో గిరిజన వ్యవస్థలోకూడా మార్పులు రావాలని కొందరు కోరుకుంటున్నారు. తమకు ఇష్టం లేకున్నా తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని కొందరంటారు. అయితే ఈనాడు గిరిజన వివాహవ్యవస్థ తారుమారు అవుతోందని, ఈనాడు వరుణ్ణి కొనుక్కోవాల్సి వస్తోందని, ఈ పరిణామం కొంత బాధగా ఉందని ఇంకొందరి వాదన. పాత సంప్రదాయం ఉంటేనే స్త్రీకి ఒక గౌరవ ప్రదమైన మర్యాద ఉంటుందని, తద్వారా ఒక స్థాయి ఉంటుందని, స్త్రీని గౌరవించని సమాజం తమకు వద్దని, ఆ సంప్రదాయం కనుమరుగై పోవటం తమకు ఇష్టం లేదని కొందరు అంటున్నారు.
ఉత్పత్తి కులాల వృత్తిపరమైన జాబితాను పరిశీలిస్తే- గిరిజనుల్లో కూడా ఉత్పత్తి చేసేవారు, పెట్టుబడిదారులు, కూలీలు, రోజువారి కూలీలు, సంచారులు ఉన్నారు. వీరిలో పేదవారు, మధ్యతరగతి వారు ఉన్నారు కానీ ధనికులు లేరు. అత్యంత ధనికులు అసలే లేరు. అయితే వీరిలో మార్వాడి తెగనుండి విడిపోయి, వలస వచ్చిన కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్నారు. వీరు గొప్ప వ్యాపారులుగా సుస్థిరతను ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నారు. ఈ కులాలలో ఉత్పత్తే ప్రధానం. నిజామాబాద్ జిల్లాలోని గాంధారిలో కోటీశ్వరులు ఉన్నారు. లంబాడ, అజుమెర, రవి, ధర్మ, గోత్రం, కొయ్యవాళ్లు ఎక్కువగా ఉన్నారు. నేడు 300 తాండాలున్నాయి. లుకా, లుడా, బాడా గోడా, అజ్జుమెర కులాలు ఉన్నాయి. లంబాడీలు ఎక్కువ మంది శాఖాహారులు. ఎందుకంటే వీరు మార్వాడీలనుండి వచ్చి మార్వాడి సంతతి కింద ఉన్నారు.
వీరికి కొన్ని ఆశ్రీత కులాలు ఉన్నాయి. ఆశ్రీత కులాలు కూడా ఆహార పరంగా మాంసాహారులు, శాఖాహారులు ఉన్నారు. డా బి. ఆర్. అంబేడ్కర్ ఊళ్లలో ఉన్న వారిని- వారి వారి స్థితిని బట్టి, కులాన్ని బట్టి, వృత్తినిబట్టి అన్ని రకాల బేరీజు వేసిన తర్వాత ఎవరిని ఏ జాబితాలో పెట్టాలో ఆలోచించారు. ఆనాడు ఈ కులాల మీద వేసిన కమిటీలు, ఆయా కులాల వారికి స్వేచ్ఛను ఇచ్చాయి. ఎవరికి ఏ కులంలో ఇష్టమైతే ఆ కులంలో చేరుమనే స్వేచ్ఛకూడా ఇచ్చారు. కోరుకున్న కొన్ని ఆయా కులాల ఇష్ట ప్రకారం సంబంధిత జాబితాలో చేర్చారు. గిరిజన తెగలలో నేడు హైందవ మతంలో ఎన్ని వృత్తులు ఉన్నాయో దాదాపు అన్ని కులాలు ఉన్నాయి. అన్ని వృత్తులు కూడా ఉన్నాయి. కొయ్యలు - కోయదొరలు - నేటి హైందవ జాతిలో ఉన్న కాపులలాగా పరిగణన పొందుతున్నారు. వీరిని గిరిజన తెగల్లో పెద్ద కులస్థులుగా పరిగణిస్తారు. వీరు మిగతా కులాలను తక్కువ కులాలుగా లెక్కగడతారు.
అక్కడ అక్కడ తక్కువ కులాలను అణచివేయడాలు కూడా ఉన్నాయి. మామూలుగా ఇక్కడి తెలుగు జాతిలో ఏ విధమైన మానవసంబంధాలున్నాయో గిరిజనతెగల్లో కూడా అవి అలాగే కొనసాగు తున్నాయి. అయితే వివాహ వ్యవస్థ మాత్రం హైందవ జాతికి విభిన్నంగా ఉండటం విశేషం.ఒక పెళ్లి ఒక ఇంటిలో జరగాలంటే వరుడు అనేక ఇబ్బందులు పడాలి. ఇబ్బందులను అధిగమించి ఎదురు కట్నంగా వధువు తల్లిదండ్రులకు రూ. 520 కట్నంగా ఇచ్చి పిల్లను తెచ్చుకోవాలి. వీరి వివాహ వ్యవస్థ ప్రకారం- వరుడు అత్తవారింటికి పిల్లను అడగటానికి వస్తాడు. అక్కడ మొదలవుతుంది పెండ్లి తంతు. అతన్ని ఎనిమిది రోజుల తర్వాత రమ్మంటారు. వరుడు తిరిగి ఎనిమిది రోజులకు వధువు ఇంటికి వస్తాడు. అతనికి ఇంటి ముందర ఒక కుర్చీ లాంటిది ఏదైనా కూర్చోవటానికి వేస్తారు. దానిమీద కూర్చుండమంటారు. కానీ ఎవరు వచ్చినా చూసి, లేచి నిలబడాలి. చేతులు కట్టుకొని నిలబడాలి.
మామూలుగా కాదు, వరుడు దబాలున లేచి నిలబడాలి. చివరకు కుక్క, పిల్లి, కోడిపిల్ల, మేకపిల్ల వచ్చినా లేచి నిలబడాలి. మళ్లీ ఇంటి వాళ్లు కూర్చోమంటేనే కూర్చోవాలి. లేకపోతే మర్యాద తగ్గిపోయినట్టే. ఏదైనా కింద పడితే వంగి తీసి ఇవ్వాలి. రోజంతా గడిచిన తర్వాత ఆ సాయంత్రానికి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. మంచి షడ్రుచులతో అమృత ప్రాయమైన భోజనం పెడతారు. తిన్న తర్వాత పోకలు ఇస్తారు. వాటిని దవడకు వేసుకొని నమలాలి. తర్వాత తాగడం అలవాటు ఉంటే బీడీలు చుట్టలు ఇస్తారు. ఉదయాన్నే ఐదు గంటలకు లేపుతారు. చేయి పెడితే కొరుకుడు పడే చలి నీళ్లతో స్నానం చేయమంటారు. ఆ నీళ్లను ఏడు రోజుల కింద తెచ్చి పెడతారు. ఏడు కుండల్లో నీళ్లు పోసి పెడతారు. అవి చల్లగా మంచులాగా తయారు అవుతాయి. ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇట్లా - సుమారు వారికి నచ్చే వరకు రోజు ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. కొరుకుడు పడే చలిని తట్టుకుంటేనే పిల్లనివ్వాలనే ఆచారం ఈ నాటికీ లంబాడ తెగలో ఉంది. అలాగే ఆ కుండల మీద మూతగా పెట్టి ఉంచిన చిప్పలను పాదంతో తొక్కి పగల గొట్టాలి. ఒక చిప్పను మధ్యలో పెట్టి చుట్టూ నిలబడతారు.
ఆ చిప్పను వరుడు తన పాదంతో ఒకేసారి తొక్కి పగల గొట్టాలి. పగిలితే వరుడు నచ్చుతాడు, లేకపోతే లేదు. అతడు ఇలా రోజుకొక పరీక్షలో నెగ్గాల్సిందే. ‘పెండ్లి బర్చికావడి’ అనే ఒక తంతు ఉంది. ఒక మొద్దును కావడిలాగా కట్టాలి. ఒకవైపు మంచి బలిష్టులైన ఇద్దరు మనుషులు, మరోవైపు బలవంతులైన ఇద్దరు మనుషులు కూర్చుంటారు. ఆ కావడిని భుజంమీద పెట్టుకొని వరుడు మోయాలి. ఏ మాత్రం వంగినా, కూలబడ్డా, లేక మోయలేక పోయినా పిల్ల దక్కదు. దీనిని పెండ్లి బర్చి కావడి అంటారు. ఈ కావడిని మోస్తుంటే జిల్లేడు కొమ్మతో కొడుతారు. ఈ తంతు అయిపోయిన తర్వాత ఇదివరకు ఎప్పుడో వేసిన పాత తాడు ముడులను, దందెడ ముడులను అనగా కఠినం అనుకున్న, లేదా ఆ వూరిలో ఎవరూ విప్పలేని ముడులను విప్పాలి. అలాగే బావమరుదులు మరీ ఇబ్బంది పెడతారు. పలుగు రాళ్లను తెచ్చి, రెండు రాళ్ల మధ్యలో చెవిని పెట్టి బాగా ఒత్తుతారు. పెళ్లి కూతురును బాగాచూసుకోవాలని బుద్ధిచెబుతారు. అలాగే కుటుంబాన్ని సక్రమంగా నడిపించు కోవాలని ఆజ్ఞాపిస్తారు.
ఒక్కోసారి ఈ పలుగు రాళ్లు కోసుకుని చెవి అంచుల నుండి నెత్తురు కూడా వస్తుంది. ఇట్లా ఈనేక సార్లు బావమరుదులు బావలకు చెవి చివరి అంచులో రాళ్లు పెట్టి ఒత్తి బాధకు గురిచేస్తారు. ఈ రాళ్లు ఒత్తటానికి కారణం, భార్యా భర్తల మధ్య గొడవలు వచ్చినపుడు, తమకు జన్మనిచ్చిన పవిత్రమైన అమ్మను బావ ఏనాడు తిట్టకూడదని బావమరుదులు హామీ తీసుకుంటారు. ఇలా బాధకు గురి చేసి వాగ్దానం తీసుకోటం ఒక విచిత్రమైన విశేషంగా భావించవచ్చు.
వరుడు నీళ్లు తెచ్చివ్వాలి. సెలిమె సుమారు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. ఆ సెలిమె దగ్గరకు వెళ్లి నీళ్లు తీసుకొని రావాలి. దీని వలన వరునికి ఎంత ఓపిక ఉందనేది తెలుసుకుంటారు. సహనం పాటిస్తాడా లేదా అనేది తేలి పోతుంది. విసురు రాయి విసిరి పెండ్లికి సరిపడా జొన్నలు విసరాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పిల్లను ఇవ్వుమని అత్తామామలను బతిమిలాడటం ఇంకొక ఎత్తు. పిల్లను తన భార్యగా తీసుకొని రావాలంటే ఇంటిల్లిపాదిని వరుడు బతిమిలాడు కుంటాడు.
అనేక ధాన ధర్మాలను చేస్తాడు. అనేక వాగ్దానాలను చేస్తాడు. ఇంటిల్లిపాదికి నచ్చే వరకు ఇలా ఎన్నో పరీక్షలు నెగ్గాల్సి ఉంటుంది. ఒకమాటలో చెప్పాలంటే వధువు కోసం ఏమైనా చేయాల్సిందే. అయితే ఇన్ని పరీక్షలు ఒకవైపు నడిపిస్తూనే అత్తమామలు వరునికి తగిన పుష్ఠికరమైన భోజనాన్ని ప్రతీ రోజు ఏర్పాటు చేస్తారు. బాగా పచ్చెడలు పెడతారు. నెయ్యి విరివిగా వాడుతారు. ఇవన్నీ వరుని కోసమే. అత్తవారు చూపెట్టిన మర్యాదతో సుమారు తాను అత్తవారింటికి వచ్చినప్పుడు ఉన్న మొలతాడు తెగిపోవాలి. వరుడు బలంగా, దొడ్డుగా అయిన తర్వాత అతడికి వివాహం చేయటానికి ఇష్ట పడతారు. ఎన్నో పరీక్షలు నెగ్గిన అనంతరం, వరుడు తన తల్లి దండ్రులకు కబురు చేస్తాడు. వారు పెళ్లి మేళంతో వస్తారు. వారికి కబురు పంపక ముందే ఇయ్యంపుల కోసం ఒక కల్లు బట్టిని తయారు చేసుకోటం పరిపాటి. మధ్యపానం ఉంది గానీ మాంసాహారం అందరికీ లేదు. మందు తాగటం కొంతమందికే అలవాటు.
అయితే ఇప్పపూవు సారా తాగడం అందరికీ అలవాటు. ఎందుకంటే అది ఆరోగ్యానికి రక్ష అని వీరు భావిస్తారు. వివాహ సమయాల్లో కొన్ని చోట్ల, ఒక మేకను కోసి పంచడం ఉంది. దాన్ని మాంసాహారంగా భుజించటం ఉంది. వీరి కులంలో బెల్లంతో స్వాగతం పలకాలి. కోటీశ్వ రుడైనా కూడా బెల్లంతో స్వాగతం పలకాల్సిందే. వధువు పెళ్లి కూతురు అవుతుంది. బలియా గాజులు వేసుకోటం పరిపాటి. వివాహ సందర్భంలో కాంస్లీ- జాకెట్, అద్దాల రవికెలు, చీరెలు వాడడం పరిపాటి. వివాహం కోసం ప్రత్యేక వస్త్రాలు ఉంటాయి. ‘చూడో తీపెరు’ ఫంక్షన్ వంటిది వీరి సంప్రదాయం. పచ్చపచ్చగా కొమ్మలు రెమ్మలు విరుసుకొచ్చి వేసుకున్న పెళ్లి పందిరులు పెళ్లికళను చేకూరుస్తాయి. మూడేసి మట్టి కుండలతో చేసిన దొంతులను, నాలుగు మూలలు పెట్టి వాటిమధ్య కూర్చుంటారు. అన్ని గింజలతో కూడిన పోలు పట్నం పోస్తారు. వైభవోపేతంగా వివాహం జరుగుతుంది. వీరికి పెండ్లి చేసే బ్రాహ్మణవర్గం ఉంది. వీరికి కర్మలు చేసే పూజారులున్నారు. తాళి కట్టే సంప్రదాయం ఉంది.
రోలు, రోకలి వాడకం ఉంది. పెళ్లి ప్రారంభంలోనే కూరళ్లు పట్టడం ఉంది. వీరు అత్యంత ఇష్టంగా భావించే దేవుడు సేవాలాల్ మహారాజు. రామ్ రావు మహారాజ్, బ్రహ్మచారి. ఈ ముగ్గురికీ పవిత్రంగా అందరూ మొక్కుకుంటారు. దేవుని ముందర రూ. 520 వధువు తండ్రి చేతిలో పెడితే, వధువు తల్లిదండ్రులు పిల్లను వరుని చేతిలో పెడతారు. వీరు వివాహానికి పల్లకీగా ఎద్దును వాడతారు. ఎద్దుమీద కూర్చొని అరుంధతి నక్షత్రాన్ని చూడాలి. ఎద్దుమీద వధువు ఎక్కి వరుని ఇంటికి పోవాలి. ఇలా ప్రత్యేకమైన వాహనాలు వాడుతారు. దీంతో వివాహ తంతు అయిపోతుంది. హైటెక్ జీవితానికి అలవాటు పడుతున్న ఈ రోజులలో గిరిజన వ్యవస్థలోకూడా మార్పులు రావాలని కొందరు కోరుకుంటున్నారు. తమకు ఇష్టం లేకున్నా తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని కొందరంటారు. అయితే ఈనాడు గిరిజన వివాహవ్యవస్థ తారుమారు అవుతోందని, ఈనాడు వరుణ్ణి కొనుక్కోవాల్సి వస్తోందని, ఈ పరిణామం కొంత బాధగా ఉందని ఇంకొందరి వాదన. పాత సంప్రదాయం ఉంటేనే స్త్రీకి ఒక గౌరవ ప్రదమైన మర్యాద ఉంటుందని, తద్వారా ఒక స్థాయి ఉంటుందని, స్త్రీని గౌరవించని సమాజం తమకు వద్దని, ఆ సంప్రదాయం కనుమరుగై పోవటం తమకు ఇష్టం లేదని కొందరు అంటున్నారు.
Suryaa Telugu News Paper Dated: 07/10/2013
No comments:
Post a Comment