అణచివేయబడ్డ కుల, వర్గాలకు అంబేద్కరిజం - మార్క్సిజం అనేవి రెండు ఆయుధాలు. ఆ ఆయుధాల్ని ఈ దేశంలోని దళిత జాతులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో తేల్చుకోవాల్సిన కీలకమైన అంశం. అంబేద్కరిజం వద్దనే మూస మార్క్సిస్టులకు, మార్క్సిజం వద్దనే అవకాశవాదులకు రంగనాయకమ్మ లాంటి వారి దగ్గరే ఆశ్రయం దొరుకుతుంది.
"All that I know is that I am not a Marxist." - Karl Henrich Marx మహనీయులకు, మహోన్నత తత్వవేత్తలకు తమ పరిమితుల్ని వినయంగా ఒప్పుకోవటం అనేది ఒక సలక్షణం. తను ప్రతిపాదించిన సిద్ధాంతం 'సమగ్రమైన ప్రాపంచిక దృక్పథం' అని కూడా మార్క్స్ చెప్పుకోలేదు. కానీ మార్క్సిజాన్ని ఒక సైన్స్‌గా కాకుండా మతగ్రంథంగా భావించే నకిలీ మార్క్సిస్టులు కొందరు అన్నీ వేదాల్లోనే ఉన్నాయంటున్న మత మౌఢ్యుల వలె అన్నీ మార్క్సిజంలోనే ఉన్నాయంటున్నారు. ఆ కోవకు చెందినవారు రంగనాయకమ్మ. సింపుల్ లాజిక్ ఏమిటంటే మార్క్సిజంలోనే అన్నీ ఉంటే, లెనినిజం ఎందుకు? మార్క్సిజమ్-లెనినిజంలోనే అంతా ఉంటే మావోయిజం ఎందుకు? మార్క్సిజం- లెనినిజం- మావోయిజం అనే ప్రాపంచిక దృక్పథాలు సర్వవేళలా, సర్వావ్యవస్థల్లో సకల దేశాలకు సమగ్ర సిద్ధాంతాలైౖతే అవి బైబిల్/ఖురాన్/భగవద్గీత మాత్రమే అవుతాయి. సైన్స్ కాదు.
'అస్తవ్యస్త సంస్కర్తలు' (ఆంధ్రజ్యోతి, మే 15) వ్యాసంలో బుద్ధుడిని, అంబేద్కర్‌ని, సత్యమూర్తిని దేనికీ పనికిరానివాళ్లుగా మన ముందు నిలబెట్టే ప్రయత్నం చేశారు రంగనాయకమ్మ. కె.జి.సత్యమూర్తి మరణం తర్వాత ఆ మహా విప్లవకవి పట్ల తెలుగునాట సామాజిక విప్లవశ్రేణుల స్పందన చూసి ఆమె అలా స్పందించారు. తాను రాసిన 'దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి' అనే పుస్తకంలోని చర్చను చీల్చి చెండాడిన సత్యమూర్తిని 'తెలివిలేనివాడిగా' నిలబెట్టాలనుకున్నారు. ఈ వృత్తి విప్లవ రచయిత్రి ఆ విధంగా స్పందించకుంటేనే ఆశ్చర్యపోవాలి. రంగనాయకమ్మకు వ్యంగ్యం, వెటకారం పట్ల ఉన్న ప్రేమ, గురి సిద్ధాంత చర్చపట్ల ఉండదు.
ఈ విషయాన్ని ఆమె రాసిన 'రామాయణ విషవృక్షం' నుంచి మొన్నటి 'అస్తవ్యస్త సంస్కర్తలు' వరకు ఒకే మూస పద్ధతిలో అదే బాణిలో కొనసాగించారు. పిల్లలకు చెప్పే పొడుపు కథల్లా ఆమె రచనల్లో (అంధకారంలో.... తప్ప) వ్యంగ్యం, వెటకారం మిటకరిస్తూ ఉంటాయి. ఆమె దృష్టిలో సిపిఐ నుంచి మావోయిస్టుల వరకూ ఎవ్వరూ మార్క్సిజాన్ని తనలాగా అర్థం చేసుకోలేదు. ఇక చేసుకోలేరని కూడా ఆమె దృఢంగా నమ్ముతారు. నమ్మకాలకు, విశ్వాసాలకు మార్క్సిజం అనే సైన్స్ వ్యతిరేకమని వారు ఊహించరు. వర్తమాన మార్క్సిజానికి తానే సోల్ డిస్ట్రిబ్యూటర్‌గా, పేటెంట్ హక్కుదారుగా ఉండాలని ఆ విధంగా గుర్తించబడాలని, పోరాట రహిత మార్క్సిస్టుగా మిగిలిపోవాలని కోరుకుంటూ ఉంటారు.
అదొక మానసిక పరిస్థితి. పడక్కుర్చీ పాండిత్యం. ప్రజా ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొన్న అనుభవం ఉంటే రంగనాయకమ్మకు ఇలాంటి మానసిక స్థితి దాపురించేది కాదు. మొండి వైఖరిని ప్రదర్శించేవారు కాదు. 2010 అక్టోబర్, నవంబర్ మాసాల్లో నేను రాసిన 'దళిత మేధావులు - వామపక్ష మేధావులు' వ్యాసంలో నేను, ఇప్పటి వరకు చేతబడి, బాణామతి తదితర క్షుద్ర విద్యలకు ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు కారణమని హేతువాదుల నిజనిర్ధారణ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కాని చేతబడి అనేది అక్షరం, మంత్రం స్వచ్ఛంగా పలకలేని నిరక్షరాస్యులైన శ్రామిక కులాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు) ఎలా చేస్తారు? అధర్వణ వేదం చదువుకున్న పురోహితులు కదా మంత్రాలు స్వచ్ఛంగా పలకగలిగేది? కానీ ఈ దేశ చరిత్రలో ఏ ఒక్క పురోహితుడినైనా చేతబడి చేశారని పళ్లూడగొట్టిన దాఖలాలు ఉన్నాయా? చేతబడికి ఆస్తి తగాదాలకు అధికార ధిక్కారాలకు అవినాభావ సంబంధం ఉన్నాయని రాశాను.
ఖైతాపూర్‌లో మాదిగ వెంకటయ్య తన భూమిని ఆర్టీసీ డ్రైవర్ రెడ్డి కబ్జా చేయబోగా అడ్డుకున్నాడు. అందుకు ఆగ్రహించిన రెడ్డి మాదిగ వెంకటయ్యను, అతని మిత్రుణ్ణి చేతబడి చేశారని పుకారు పుట్టించి, ఆ ఇద్దరినీ సజీవ దహనం చేయించాడు. ఈ విషయాన్నే నేను ఉదహరించినప్పుడు రంగనాయకమ్మ 'సజీవ దహనం చేసినవాళ్లు మీ ఎస్సీ, బీసీలే కదా!' అని రాశారు. ఏ మార్క్సిజమ్ ప్రకారం ఆమె అలా స్పందంచారో ఆమెకే తెలియాలి. అత్తలు కోడళ్లను హింసిస్తారన్నప్పుడు, కిరోసిన్ పోసి, గ్యాస్ లీక్ చేసి తగలపెడతారన్నప్పుడు సాధారణ ప్రజలు అనుకునే స్త్రీకి స్త్రీయే శత్రువు అని కూడా రంగనాయకమ్మ సెలవిస్తారా? లేదా పురుషాధిక్య సమాజం వేసే వెర్రివేషాలను హిందూ విషసంస్కృతిలో భాగంగా చూస్తారా?
తన 'అస్తవ్యస్త' వ్యాసంలో రంగనాయకమ్మ ఇలా రాశారు.
1. మార్క్సిజాన్ని ఎవరికిష్టమైనట్లు మార్చేసి దాన్ని దేశీయ మార్క్సిజంగానో జాతీయ మార్క్సిజంగానో చేయాలని ప్రయత్నించే... అని రాశారు. పెట్టుబడిదారీ దేశాల్లోని వర్గ సంబంధాలకు, వైరుధ్యాలకు వ్యవసాయక దేశమైన చైనాలోని వర్గ సంబంధాలకు, వైరుధ్యాలకు తేడా గమనించే, మావో చైనా సమాజాన్ని 5 కేటగిరీల కింద విభజించి ఏఏ సమూహాలు విప్లవానుకూలం? ఏయే సమూహాలు విప్లవ వ్యతిరేకులు? ఏయే సమూహాలు తటస్తులు? అని విశ్లేషించి, మార్క్సిజాన్ని చైనా నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి విప్లవ పోరాటాన్ని జయప్రదంగా నడిపించారు. అదే విధంగా ఇండియాలోని దోపిడీ కులాలు ఏవి? దోపిడీకి గురయ్యే కులాలు ఏవి? అని విశ్లేషించటం మార్క్సిజం ప్రకారం నేరమౌతుందా? కులాల పుట్టుక, కొనసాగింపుకు గల కారణాలను మొట్టమొదట డా.బి.ఆర్. అంబేద్కర్ వెలికి తీసి ప్రపంచంలో ఎక్కడా లేని ఈ సంక్లిష్ట సామాజిక వ్యవస్థకు కారణం బ్రాహ్మణిజం, హిందూ మత గ్రంథాలు అని తేల్చారు. బ్రాహ్మణిజాన్ని, ఈ హిందూ మత గ్రంథాలను నిషేధిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదన్నారు. ఇందులో రంగనాయకమ్మకు అభ్యంతరం ఎందుకుండాలి?
2. అంబేద్కర్ ప్రతిపాదించిన కుల నిర్మూలనా సిద్ధాంతం వర్గ నిర్మూలనా సిద్ధాంతానికి వ్యతిరేకమైందా? కుల నిర్మూలనా సిద్ధాంతం కుల నిర్మూలనకు ఉపయోగపడదని, దానికి ప్రత్యామ్నాయంగా కులాంతర వివాహాల్ని పరిష్కార మార్గాలుగా చూపుతున్నారు రంగనాయకమ్మ అండ్ కో. అందుకుగాను "100 కులాంతర వివాహాల్ని పరిశీలించి అవి ఏ కారణాల వల్ల జరిగాయో ఆ కారణాల్ని పట్టుకోవాలి. కులాంతర వివాహాలు నిరభ్యంతరంగా జరగటానికి ఏ పరిస్థితులు అవసరమో వాటిని సమాజం నిండా ఏర్పరిచే మార్గమే కులాల రద్దుకు శాశ్వత పరిష్కారం అవదూ?'' అని రాసి "కుల నిర్మూలనకు ఒక మహత్తర చికిత్సను ప్రతిపాదిస్తున్నారు.'' కులాల పుట్టుకకు శ్రమ విభజనే కారణమని చెప్తూ, శ్రమదోపిడీ పోతే 'కులసమస్య' తీరుతుందని ఇప్పటి వరకూ చెప్తున్న మనువాద మార్క్సిస్టు మాయావాదానికి వంతగా రంగనాయకమ్మ కొత్త సిద్ధాంతంతో తానే రాసిన 'బలిపీఠాన్ని' బద్దలు కొట్ట ప్రయత్నిస్తున్నారు. కులాంతర వివాహాల మంత్రాలతో 'కులం' చింతకాయలు రాల్తాయని ఉపదేశిస్తున్నారు రంగనాయకమ్మ.
3. "భారతదేశపు శ్రామిక వర్గంలో ప్రధాన భాగమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర బృందాల్ని శ్రమ దోపిడీ నుంచి బయటపడమని ప్రేమతో చెప్పే సిద్ధాంతం వైపు మొహాలు తిప్పకపోవడమే అసలైన ఆశ్చర్యం.'' - శహబాష్! ఈనాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీలు శ్రామికవర్గంలో ప్రధాన భాగం అని ఒప్పుకుంటున్నారు రంగనాయకమ్మ! ఈ కులాల సమూహాలు 'మొహం' తిప్పకపోతేనే మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం నడిచిందా? 1969 వసంత మేఘ గర్జన ఉరిమిందా? ఈనాటి దండకారణ్య ఉద్యమాన్ని ఈ కుల సమూహాలు లేకుండా కేవలం నూటికి 10 మంది కూడా లేని దోపిడీ కులాలు నిర్మిస్తున్నాయా? ఈ పోరాటాల్ని రంగనాయకమ్మ లేక వారు రాసుకుంటూ పోతూ, అమ్ముకుంటూ పోయిన పుస్తకాలు చేసాయా?
ఇక బుద్ధుణ్ణి తీసుకుంటే - "అది అష్టాంగ మార్గం. అది అన్నిటికీ నిరుపయోగం'' అని సెలవిచ్చారు. కానీ త్రిపిటకాల సారాంశంలో టూకీగా 1. మానవ సమాజంలో దు:ఖానికి కారణం భిన్న ప్రయోజనాల మధ్య ఘర్షణ.
2. సంపద మీద వ్యక్తిగత ఆధిపత్యం మరో వర్గానికి దు:ఖాన్ని (దోపిడీకి గురవటం) కల్గిస్తుంది.
3. ఈ దు:ఖానికి గల కారణాన్ని నిర్మూలించడం ద్వారా దు:ఖాన్ని పోగొట్టడం సంఘ శ్రేయస్సుకు అవసరం.
4. మనుష్యులందరూ సమానులే!
5. మతానికి దేవు ణ్ణి కేంద్రంగా చేయటం తప్పు.
6. సత్యం కోసం, న్యాయం కోసం కాకపోతే యుద్ధం చేయటం తప్పు.
7. ఏదీ శాశ్వతం కాదు. ప్రతిదీ మా ర్పుకు లోనవుతుంది.
8. మనిషిని కొలవటానికి ప్రతిభ తప్ప పుట్టుక ప్రమాణం కాదు.
9. ముఖ్యమైనది ఉన్నత ఆదర్శాలు తప్ప ఉన్నత కులం కాదు. ఇవీ 2500 సంవత్సరాలకు పూర్వం బుద్ధుడు బోధించిన విషయాలు. పైన పేర్కొన్న బుద్ధుని బోధనల్లో ఆక్షేపించవలసింది ఏముంది? హింస ఒక 'క్రీడ్'గా కాకుండా ఒక 'నీడ్'గా మాత్రమే ఉం డాలన్నాడు బుద్ధుడు. రాజ్యం ఉంటే హింస అనివార్యం. మాక్స్ స్టిన్న ర్ అన్నట్లు ప్రజాస్వామ్యంలో నేరస్తుణ్ణి రాజ్యం ఉరితీస్తే అది చట్టం. అదే పని వ్యక్తి చేస్తే నేరమౌతుంది. అందుకే హింసారహిత మానవ సమాజాన్ని బుద్ధుడు ఆకాంక్షించాడు. రాజ్యమే అంతరించిపోవాలన్నాడు మార్క్స్. మరి బుద్ధుడికి, మార్క్స్‌కు వైరుధ్యమెక్కడ? శ్రామిక వర్గ నియంతృత్వం శాశ్వతంగా ఉండటం క్షేమం కాదన్నాడు అంబేద్కర్. శ్రామికవర్గ నియంతృత్వమే కాదు ఏ నియంతృత్వమూ రాజ్యమూలేని సమాజాన్ని ఆకాంక్షించాడు మార్క్స్. ఈవిషయాల్ని రంగనాయకమ్మ గమనిస్తే అనవసరమైన వివాదాల్లోకి పోనక్కరలేదు.
1930-40 సంవత్సరాల్లో రంగనాయకమ్మ మేధోపూర్వీకులు (ఇ.ఎం.ఎస్., డాంగే) సమకాలీకులు (బిపిన్‌చంద్ర, అరుణ్‌శౌరి) అం బేద్కర్‌ను చీలిక ఉద్యమకారుడని, డేంజరస్ బ్రిటిష్ ఏజెంటనీ ఆడిపోసుకున్నారు. కానీ ఆనాడే అంబేద్కర్ సోషలిస్టులకు ఇచ్చిన సలహా ఏమంటే ఈ దేశంలో మీరు ఏ దిక్కుకు నిలబడి చూసినా మీకెదురుగా కులభూతం దారికడ్డంగా నిలబడి ఉంటుంది. అట్టి కులభూతాన్ని సం హరించకుండా సోషలిజాన్ని నిర్మించలేరన్నారు.
ఈ సలహా ఇచ్చి ఇప్పటికి 77 సంవత్సరాలు. ఈ 77 సంవత్సరాల్లో సోషలిజం స్థాపన లో ఎంత దూరం వచ్చారు? సెలిన్ హారిసన్ అనే రాజకీయ విశ్లేషకు డు (మోస్ట్ డేంజరస్ డికేడ్స్ పుస్తక రచయిత) 1960ల్లోనే 'భారతీ య వాస్తవాలకు వ్యతిరేక దిశలో దేశ కమ్యూనిస్టు నాయకత్వం శరవేగంతో పరుగెత్తుతుంది'' అన్నారు. అందుకే 1920ల్లో ప్రారంభమైన చైనా క మ్యూనిస్టు పార్టీ అక్కడి సామాజిక వాస్తవాలకు అనుగుణంగా మార్క్సి జాన్ని ఉపయోగించుకుని 27 సంవత్సరాల్లో విప్లవాన్ని జయప్రదం చేస్తే, మనదేశంలో ఇప్పటికీ ఎక్కడున్నామో అందరికీ తెలిసిన విషయమే.
ఆధునిక ప్రపంచ చరిత్రలో 19వ శతాబ్దంలోను, అంతకు ముందు కూడా వచ్చిన వివిధ సంస్కరణోద్యమాల గర్భం నుంచే 20వ శతాబ్దపు విప్లవాలు పుట్టాయనడానికి అనేక చారిత్రక రుజువులున్నాయి. మనదేశానికి సంబంధించినంతవరకు అణచివేయబడ్డ కులాల చైతన్య ఉద్యమాలు, దోపిడీ కుల వ్యతిరేక ఉద్యమాలు, విప్లవ రాజకీయ సిద్ధాంత ప్రాతిపదికన ఏర్పడలేదనేది వాస్తవం. అయినప్పటికీ వర్గ స్పృహగల రాజకీయ ఉద్యమాలను నిర్మించటానికి కుల నిర్మూలనోద్యమాలు ఆటంకం కాకపోగా పునాదిగా ఉపయోగపడతాయనటానికి అనేక ఉదాహరణలున్నాయి.
వాటిని అర్థం చేసుకోవటానికి ఆ ప్రజా సమూహాన్ని వర్గ పోరాటాల్లోకి ఆహ్వానించటానికి కులాల అస్తిత్వాన్ని గుర్తించ నిరాకరించే మనువాద విధేయులైన మార్క్సిస్టుల దగ్గర ఎజెండా ఏది? దీన్నే అదునుగా తీసుకున్న దళిత మేధావులు కొందరు రంగనాయకమ్మలాగే మాకు మార్క్సిజం వద్దు, అంబేద్కరిజం చాలు - అంటున్నారు. వీళ్లెందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? కమ్యూనిస్టు పార్టీల్లో పనిచేసి, ఆ పార్టీల్లోని అగ్రకుల నాయకత్వం యొక్క దాష్టీకాన్ని ఎదుర్కోలేక బయటకు వచ్చిన వీళ్లు మార్క్సిజానికి - ఆయా పార్టీల నాయకత్వానికి మధ్య ఉన్న తేడాను గుర్తించలేకపోతున్నారు. మార్క్సిజం అనేది పీడిత జాతుల విముక్తి కొరకు రూపొందించబడ్డ తాత్విక సిద్ధాంతం అన్న విషయం గ్రహించలేకపోతున్నారు. కారణాలు అనేకం. కానీ వాస్తవం ఏమంటే... దగ్గర దారిలో వర్గ రాజకీయాలకు దూరంగా, ఉన్న వ్యవస్థలోనే జూనియర్ పార్టనర్స్‌గా కుదురుకుందామనే ఆలోచన వీళ్లల్లో ప్రబలంగా ఉంది.
అందుకే అంబేద్కర్‌ను అడ్డంగా పెట్టుకుంటున్నారు. వీళ్లు ఆచరణాత్మక రాజకీయాల పేరిట వర్గేతర రాజకీయాల్ని, కులసంకర రాజకీయాల్ని ఆశ్రయిస్తున్నారు. ఇది గాంధీ వారసత్వమేగాని అంబేద్కరిజం కాదు. అణచివేయబడ్డ కుల, వర్గాలకు అంబేద్కరిజం-మార్క్సిజం అనేవి రెండు ఆయుధాలు. ఆ ఆయుధాల్ని ఈ దేశంలోని దళిత జాతులు ఏ విధం గా ఉపయోగించుకోవాలో తేల్చుకోవాల్సిన కీలకమైన అంశం. అంబేద్కరిజం వద్దనే మూసమార్క్సిస్టులకు, మార్క్సిజం వద్దనే అవకాశవాదులకు రంగనాయకమ్మ లాంటి వారి దగ్గరే ఆశ్రయం దొరుకుతుంది.
- డా. ఎం.ఎఫ్. గోపీనాథ్
మేనేజింగ్ డైరెక్టర్,
ఫూలే- అంబేద్కర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్
Andhra Jyothi News Paper Dated : 01.06.2012