Monday, May 21, 2012

వివేకం కోల్పోయిన భారత్! - యాన్ మిర్డాల్విదేశాంగ మంత్రి కారల్ బిల్ట్‌కు,
ఇది వ్యక్తిగత లేఖ కాదు; స్వీడన్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్న మీకు ఈ లేఖ రాస్తున్నాను. ఇటువంటి లేఖలు 'సమాచార స్వేచ్ఛా చట్టం'అనే ఆంగ్ల భాషా అభివ్యక్తి పరిధిలోకి రావు. అయితే బహిరంగంగా ఉన్న లేదా ఉండాల్సిన సమాచారమే ఈ లేఖలో ఉన్నందున, దీన్ని భారత్‌లో ప్రచురింప చేస్తున్నాను. ఇటువంటి సందర్భాలలో గున్నార్ మిర్డాల్ చేసినట్టే నేనూ చేస్తున్నాను; ఈ లేఖను నేరుగా ఇంగ్లీష్‌లో రాస్తున్నాను. 

భారత పార్లమెంటు ఎగువ సభలో హోంశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ నా గురించి చేసిన ప్రసంగం పూర్తి పాఠం ప్రతిని న్యూఢిల్లీలోని మన రాయబారి కార్యాలయం సంపాదించి ఉంటుందని భావిస్తున్నాను. కేవలం వార్తా పత్రికలలో వెలువడిన వార్తలు, వ్యాసాలపైనే పూర్తిగా ఆధారపడకుండా ఉండేందుకై నాకు ఆ ప్రసంగానికి సంబంధించిన యథాతథ పాఠం అవసరమున్నది. మన రాయబారి కార్యాలయం ఆ ప్రసంగ పాఠం ప్రతిని నాకు పంపగలదని ఆశిస్తున్నాను. ఆ ప్రసంగంపై వెలువడిన వార్త చివరి వాక్యంలో మంత్రి జితేంద్ర సింగ్ ఇలా చెప్పినట్టు ఉటంకించారు: 'పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నది. అటువంటి విషయాలను సంబంధిత దేశాలతో యథావిధిగా దౌత్యస్థాయిలో చర్చిస్తాము'. అంటే దీనర్థం భారత ప్రభుత్వం నా విషయమై మన రాయబారి కార్యాలయంతో సంప్రదించిందనేనా? 

భారత్‌లో నా కొత్త పుస్తకం 'రెడ్ స్టార్ ఓవర్ ఇండియా' (భారత్‌పై అరుణతార) విడుదల సందర్భంగా ఆ దేశానికి వెళ్ళేందుకు నేను వీసాకు దరఖాస్తు చేశాను; (చాలా వ్యయభరితమైన) వీసా ఒక నెలరోజుల పాటు ఉండేందుకు గాను జారీ అయింది. వీసా కోసం చేసిన దరఖాస్తుకు, నా స్వీడిష్ ప్రచురణ కర్త (స్టాక్‌హోమ్‌లోని లియోపార్డ్) లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆర్థిక పరమైన హామీని, కోల్‌కతాలోని నా భారతీయ ప్రచురణ కర్త (సేతు ప్రకాశన్), ది కోల్‌కతా బుక్ ఫెయిర్ నిర్వాహకులు పంపిన ఆహ్వాన పత్రాలను కూడా జత పరిచాను. 

కోల్‌కతాకు వెళ్ళిన తరువాత, నేను ఎక్కడ బస చేసేది, భారత్‌లో ఎక్కడెక్కడ బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నదీ అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలని నా ప్రచురణకర్తను ఆదేశించారు. ఆయన ఆ ఆదేశాన్ని పాటించారు. కోల్‌కతా, హైదరాబాద్, లూధియానా, ఢిల్లీలలో వివిధ సంస్థలు నిర్వహించిన వివిధ సమావేశాలలో నా పుస్తకావిష్కరణ జరిగింది. ఆ సభలలో నేను చెప్పిన మాటలన్నీ మీడియాలో ప్రచురితమయ్యాయి; ఇంటర్నెట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఈ ఏడాది జనవరి/ ఫిబ్రవరిలో భారత్‌లో నా పర్యటన గురించి రాజ్యసభలో హోం శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ చెప్పిన విషయాలు, మే 20న హోంశాఖ ప్రతినిధి ఇరా జోషి చెప్పిన విషయాలు యథార్థాలు కావు. మరో విధంగా చెప్పాలంటే అవి, రాజకీయ కారణాలతో 'నేను చెప్పని విషయాలు'. మరి భారత ప్రభుత్వ ప్రతినిధులు ఇలా అవాస్తవాలు చెప్పడం వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఏమిటి? ఆ కారణాలను అర్థం చేసుకోవడానికి కోల్‌కతా నుంచి వెలువడే 'ద టెలిగ్రాఫ్' ఆంగ్ల దినపత్రిక మే 18 సంచికను చదవాలి. 

పిసి మెయిల్ బాక్స్‌లో మావోయిస్ట్ స్పామ్
నిషిత్ ధోలాభాయి

న్యూఢిల్లీ, మే 17 : ఫ్యాక్స్‌లు పనిచేయనప్పుడు విదేశాల నుంచి హోం మంత్రి ఇ-మెయిల్‌పై మెరుపు యుద్ధం చేయాలి. ఒక క్రియాశీల కార్యకర్త, మావోయిస్టు సానుభూతిపరుడిని విడుదల చేయాలని కోరుతూ పి. చిదంబరం ఇ-మెయిల్‌కు పాశ్చాత్య దేశాల నుంచి పెద్ద ఎత్తున మెసేజ్‌లు వస్తున్నాయి. పూర్తిగా 'స్థానిక'మైన ఒక అంశంపై విదేశీయుల్లో ఇంత ఆసక్తి ఏమిటనే కుతూహలాన్ని రెచ్చగొట్టింది'. భారతీయ వ్యవహారాలపై అంతర్జాతీయ సమాజంలో పెరుగుతోన్న శ్రద్ధ, అవగాహన భారత ప్రభుత్వాన్ని అంతకంతకూ కలవరపరుస్తుందనేది స్పష్టం. 

భారత ప్రజలతో అంతర్జాతీయ సంఘీభావం అవసరం గురించి గత ఏడాది జూన్ 12న లండన్‌లో అరుంధతీ రాయ్, నేనూ మాట్లాడాము. భారతదేశానికి సంబంధించిన వార్తలను అడ్డుకోవడంపై మేమిరువురమూ మాట్లాడాము. భారత్‌లో చా లా తీవ్ర స్థాయిలో జరుగుతోన్న చర్చలూ, సంవాదాలూ మన పాశ్చాత్య దేశాలలోని మీడియాలో ప్రతిబింబించడం లేదు. ఇలా జరగడం (రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ వలస పాలకులు అమలు పరచినట్టుగా) భారత ప్రభుత్వం అధికారికంగా అమలుపరుస్తోన్న సెన్సార్‌షిప్ కారణంగా కాదు. ఇది మన మీడియాలోని ఎడిటోరియల్ సిబ్బంది అనుసరిస్తున్న సెన్సార్ విధానం, భారత్‌లోని మన కరస్పాండెంట్స్ సొంత సెన్పార్‌షిప్ వల్లే భారత్ గురించిన వార్తలు ఇక్కడ నిరోధింపబడుతున్నాయి. 

ఇందులో కొత్త విషయమేమీ లేదు. భారత్ గురించిన ('క్విట్ ఇండియా' ఉద్యమం, జాతి మేధంతో సమానమైన బెంగాల్ కరువు, 'భారత జాతీయ సైన్యం' గురించి కూడా) వార్తలను తటస్థ స్వీడన్‌లో ఎలా అణగదొక్కారనే విషయమై ఇటీవల 'ఓరియెంటల్ సొసైటీ' (స్వీడన్) వార్షిక సంచికలో రాశాను. అప్పటి విషయాలను గుర్తుచేసుకొనేందుకు మీరు వయస్సులో చాలా చిన్న వారు కనుక రాబోయే ఆ వార్షిక సంచికలో నేను రాసిన విషయాలను చదవండి (జూలై 20 కుట్ర గురించి స్వీడన్‌లోని అమెరికా, సోవియట్ యూనియన్ సైనిక ప్రతినిధులకు తెలియజేసే బాధ్యతను మా నాన్నగారికి అప్పగించేందుకు ఆదమ్ వాన్ ట్రాట్ జు సోల్జ్ మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా తలుపులు తెరిచిందీ కూడా రాశాను. 

ఈ విషయాలన్నీ విదేశాంగ శాఖ ఫైళ్లలో ఉన్నాయి. జూలై 20 కుట్రకు అవసరమైన సహాయాన్ని అందించడానికి మిత్రరాజ్యాలు ఎందుకు తిరస్కరించాయో మీకు తెలుసు. అయితే ఆదమ్ వాన్ ట్రాట్ జు సోల్జ్ ఆ పనిలో సఫలమై వుంటే అతనిపై (సుభాష్ చంద్ర బోస్ ఇండియా నుంచి పరారైనప్పుడు భారత్‌లో బ్రిటిష్ వలసపాలకులు చేసినట్టుగానే) బ్రిటిష్ గూఢచార సంస్థ ఎమ్ 16 ఒక 'కాంట్రాక్ట్ 'ను ఎందుకు కుదుర్చుకుందన్న విషయాన్ని మీరు ఆలోచించి ఉండివుండకపోవచ్చు). 

మన పాశ్చాత్య దేశాలన్నిటిలోను భారత ప్రజల పోరాటాల పట్ల సంఘీభావం పెరుగుతుండడంతో ఆ దేశాన్ని గూర్చిన సమాచార ప్రవాహం కూడా పెరుగుతోంది. మీరు, కాకపోతే కనీసం మన రాయబారి కార్యాలయమైనా indiensolidaritet.orgను ఫాలో అవుతుండాలని సూచిస్తున్నాను. ఒక విశాల ప్రాతిపదికన, భావజాలాల పరంగాగాని, మరే దురభిమానాలకుగానీ తావు లేకుండా భారత్ గురించి వార్తలను (అంతర్జాతీయ స్థాయిలో కూడా అటువంటి దృక్పథం అవసరంపై వివిధ సభ్యుల మధ్య నిష్పాక్షికంగా జరుగుతున్న చర్చలను కూడా) నివేదిస్తున్న వెబ్‌సైట్ అది. 

యాభై సంవత్సరాల క్రితం వియత్నాం ప్రజల పోరాటానికి సంఘీభావం తెలుపడానికి జరిగిన కృషి, 1950ల్లో అధికారిక మీడియాలో ప్రబలంగా ఉన్న అమెరికా అనుకూల వైఖరిని, ఇరవై సంవత్సరాల తరువాత నిష్పాక్షిక, ఉదారవాద విధానాలకు అనుకూలంగా ఎలా మార్చివేసిందో అది మీకు గుర్తుకు తెస్తుంది (బాగా ప్రాచుర్యమున్నdsgens nyheter లాంటి దినపత్రికల వైఖరి ఎలా మారిందో గుర్తుకు తెచ్చుకోండి. వియత్నాం ప్రజల పోరాటాలకు సంబంధించిన సమాచారాన్ని పరివ్యాప్తం చేసే కృషి, ఆ సమాచారాన్ని అందించే 'బులెటిన్'లను ప్రభుత్వ ఆధ్వర్యంలోని సారా దుకాణాల వెలుపల విక్రయించడం మొదలైన చైతన్యశీల కార్యకలాపాలు అంతిమంగా స్వీడిష్ విదేశాంగ విధానాన్ని కూడా మార్చివేసిన వైనాన్ని గుర్తు తెచ్చుకోండి). 

న్యూఢిల్లీలోని మన రాయబారి కార్యాలయంలోని ఉద్యోగులెవరూ నాకు తెలియదు. నేను చాలా వృద్ధుడిని; ఆ దౌత్య సిబ్బంది తమ తాతయ్యగా భావించదగ్గ వయస్సులో ఉన్న వ్యక్తిని. అయితే వారూ స్వీడిష్ మీడియా కరస్పాండెంట్స్ వైఖరులలో చాలావరకు పాలు పంచుకొంటున్న వారేనన్నది నా భయం. అలా కాకుండా మన దౌత్య సిబ్బంది ఒక విశాల, దూరదృష్టితో కూడిన వైఖరిని అనుసరిస్తే మన దేశానికి చాలా మేలు జరుగుతుంది. భారతదేశంలో, ఆ దేశ ప్రజల పోరాటాల గురించిన సమాచారం చాలా వుంది. 

నియంతృత్వ కాలంలో చిలీ లేదా సోవియట్ యూనియన్ వంటిది కాదు భారత్! నాకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వ ప్రస్తుత ప్రతిస్పందన సాధారణమైనదే అయినా నిర్హేతుకమైనది. తమ చర్యల, నిర్ణయాల పూర్వాపరాల పట్ల సమగ్ర అవగాహనతో అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నప్పుడు జాతీయ ప్రభుత్వాల ప్రతిస్పందన ఎలా ఉంటుందో ప్రస్తుత సందర్భంలో నా విషయమై భారత ప్రభుత్వ ప్రతిస్పందన కూడా అలానే ఉన్నది. అయితే ఒక విధంగా తీవ్ర కలవరపాటును సూచిస్తున్న భారత ప్రభుత్వ ప్రవర్తనకు మరో కారణం కూడా ఉంది. 

దీన్ని మన రాయబారి కార్యాలయం జాగ్రత్తగా గమనించగలదని ఆశిస్తున్నాను. ముప్పై సంవత్సరాల క్రితం నేను రాసిన దాన్ని మీరు చదివితే అప్పటికి, ఇప్పటికి భారత ప్రజల పోరాటం తీరుతెన్నులు మారిపోతున్నాయని మీకు అర్థమవుతుంది. మూడు దశాబ్దాల క్రితం నక్సల్ బరి, తెలంగాణ పోరాటాలు, ఇతర ప్రజా తిరుగుబాట్లతో స్ఫూర్తి పొందిన 'వామపక్ష' రాజకీయ ఉద్యమాలు పూర్తిగా చీలిపోయివున్నాయి. మరిన్ని చీలికలతో వాటి మధ్య అనైక్యత మరింతగా పెరిగిపోయేట్టుగా కన్పించేది. 

మరి ఇప్పటి పరిస్థితి పూర్తిగా భిన్న మైనది. ప్రధాన 'మావోయిస్ట్' పార్టీలు, గ్రూపులు సమై క్య అఖిల భారత పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) నేర్పాటు చేశాయి. అంతేకాదు సైద్ధాంతిక విభేదాలు, వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఇతర విప్లవ గ్రూపులు కూడా మావోయిస్ట్ పార్టీతో భారత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఏకీభావం కలిగివున్నాయి. సామాజిక వైరుధ్యాలకు అతీతంగా విద్యార్థులలో అత్యధిక వర్గాలవారు, 'మధ్యతరగతి ప్రజలు' ప్రజాస్వామిక, సామాజిక మార్పులను డిమాండ్ చేస్తున్నారు. 

ఒక నిర్దిష్ట ఉదాహరణ చెపుతాను. హైదరాబాద్‌లో 1980 నుంచి తెలిసిన పాత స్నేహితులను కలుసుకున్నాను. అప్పట్లో మేము ఆంధ్రప్రదేశ్‌లో సాయుధ దళాలను అనుసరిస్తూ అజ్ఞాత జీవితంలోకి వెళ్లినప్పుడు 'ఆంక్షలు విధించిన ప్రాంతాలలో' ఆ విప్లవ కార్యకర్తల ఇళ్ళలో నివసించాము. ఇప్పుడా ప్రాంతాలు చట్టబద్ధమైనవి. ఇప్పుడు వారు ఎన్నికలలో పాల్గొంటున్నారు. వారికీ, మావోయిస్ట్ పార్టీ వారికీ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి; ఇరు వర్గాల మధ్య గొప్ప సైద్ధాంతిక చర్చ జరుగుతుంది. 

అయితే వారు పరస్పర శత్రువులు కారు. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతితో నేను చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలన్నిటినీ ఎలా చర్చించాడో మీరు చూడవచ్చు. (నా భారతీయ స్నేహితులకు నేను ఏదో ఒక విషయమై 'సలహా' ఇచ్చానన్న భావన చాలా అజ్ఞానపూరితమైనది; అంతే కాదు అది ఏ మాత్రం'ఫన్నీ'గా కూడా లేదు!) (సిపిఐకి చెందిన అత్యధిక వర్గాల వారిలో కూడా ఇదే పరిస్థితి. 

నా పుస్తకం గురించి, భారత్‌తో నా పని గురించి బాగా ఎక్కువగా రాసింది యూరోప్‌లో అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోయే దినపత్రిక"neues deutschland' కావడం యాదృచ్ఛికమేమీ కాదు) ఎందుకని? గతంలో, అంటే సోవియట్ యూనియన్ అంతిమ కాలంలో నేను ఆ దినపత్రికలో పనిచేశాను. అప్పుడు భారత్‌తో నా సంబంధాల గురించి మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు యూరోప్‌లో ఆ పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం"neues deutschland'తో సన్నిహిత సంబంధాలు ఉన్న జర్మనీలోని "linkeకు సిపిఐతో పార్టీ సంబంధాలు ఉన్నాయి. 

భారత్‌లో నేను పర్యటించకుండా నిషేధం విధించాలని భారత ప్రభు త్వం యోచించడం గొప్ప ప్రాధాన్యమున్న విషయం కాదు. ఇంతకు ముం దు ఇతర ప్రభుత్వాలు కూడా నాపై నిషేధం విధించాయి (మాస్కో నన్ను ఏమిని పిలిచేదో గుర్తు చేసుకోండి!). మీరు విదేశాంగ శాఖ ఫైళ్ళను చూసినట్టయితే అమెరికా 1944 (వైసిఎల్ కాంగ్రెస్‌లో ప్రసంగించడంతో అమెరి కాలో ప్రవేశించకుండా నాపై ఆంక్షలు విధించారు) నుంచి నాపై అప్పుడప్పుడూ నిషేధం విధిస్తూనే వుందని అర్థమవుతుంది. నిషేధం విధించినప్పుడు నన్ను అధికారికంగా ఆహ్వానించింది కూడా. ఇప్పుడు నా వయస్సు 85 సంవత్సరాలు. 

భారత ప్రభుత్వం నాపై నిషేధం విధిస్తే దాన్ని ఎత్తి వేయడానికి నా మిగిలివున్న జీవితకాలం కంటే ఎక్కువ వ్యవధినే తీసుకోవచ్చు. అయితే అదేమంత గొప్ప ప్రాధాన్యమున్న విషయం కాదు. ముఖ్యమైన విషయమేమిటంటే విదేశాంగ శాఖలోని దక్షిణాసియా విభాగంలో పనిచేసే మీ అధికారులు స్వీడిష్ మీడియా ప్రస్తుతం అనుసరిస్తోన్నటు వం టి సంకుచిత వైఖరితో కాకుండా విశాల దృక్పథంతో భారత ప్రజల పోరాటాన్ని చూసేలా చేయడం. స్వీడన్ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దౌత్యఅధికారుల దృక్పథంలో మార్పువచ్చేలా మీరు చూడాలి. 

- యాన్ మిర్డాల్
మే 20, 2012
భారత్‌లో ప్రవేశించకుండా తనపై నిషేధం విధించాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రముఖ స్వీడిష్ రచయిత, పాత్రికేయుడు, సామ్యవాద చింతకుడు, భారత మిత్రుడు యాన్ మిర్డాల్ తమ దేశ విదేశాంగ మంత్రికి రాసిన లేఖ పూర్తి పాఠమిది.
Andhra Jyothi News Paper Dated : 22/05/2012 

No comments:

Post a Comment