Wednesday, May 2, 2012

తెలంగాణ తిండిపై నిఘానా? - కంచ ఐలయ్య'అలలపై నిఘా / అలలు కనే కలలపై నిఘా' అని మహా విప్లవ కవి శివసాగర్ చెప్పినట్లు ఇప్పుడు తెలంగాణ తిండిపై నిఘా/ తిండి సంస్కృతిపై నిఘా మొదలైంది. నా తెలంగాణ చుట్టూ సముద్రపు అలలు లెవ్వు. తెలంగాణ నిండ చెరువు అలలున్నాయి. తెలంగాణ చెరువుల్ని నింపే బాధ్యత కట్టమైసమ్మది. సాలంత సంబురముండాలంటే చెరువు నిండాలి. అందుకే యాడాది కొకసారి కట్టమైసమ్మ దగ్గర బాగా బలిసిన దున్నపోతును కోసి కుంబరాసి అన్నంలో నెత్తురు కలిపి ఊరి పొలిమేర చుట్టూ పొలిచల్తారు. ఆ రోజు దున్న మాంసం (ఆ ఒక్కరోజే బలిసి, బతికున్న దున్న పోతును కోసి మాంసం మాదుగులకిస్తారు) మాదుగులకిస్తారు. 

అది వారి కానందమైన పండుగ రోజు. ఆరోజు సూదరోల్లంత మేకపోతుల్ని, గొర్రెపోతుల్ని కోసుకొని కల్లుతాగి నీసు తిని నిద్రపోవాల్సిందే. ఊరికోమట్లు బ్రహ్మాండ్లు ఆరోజు ఇంటి బయటికి కూడా రాకుండా శాకాహారం, దద్దోజనం తింటారు. పొలిమేరను కాపాడే పొలి పండుగతో గాని, పోతుకోతలో వారికి సంబంధముండదు. గ్రామస్తులు పెంచుకునే వందలాది దున్నపోతుల్లో ఒకదాన్ని మాత్రమే కోసుకుంటారు. ఆరోజు గొల్ల, కురుమలు పంచే వందలాది గొర్ల-మ్యాక్‌లో నాలుగైదింటిని మాత్రమే కోస్తారు. పంటకు నీరు ఎరువు వేసినపుడు అది పండాక కోస్తాడు. ఇది పంటకు, ప్రకృతికి, జంతువులకు మానవులకు ఉండే సంబంధం. 

ఈ సంబంధాన్ని శాస్త్రీయ అవగాహన అధ్యయన స్థాయికి ఎదిగించే సంఘర్షణలో భాగమే 'ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్'. తెలంగాణ బతుకమ్మ వెజిటేరియన్ పండుగ కాదు. దసరా పండుగ అంతకన్నా కాదు. సిద్ధాంతాల కతీతంగా తెలంగాణ సాధించే పేరుతో 'అగ్రకుల జె.ఎ.సి' ఒకటి పుట్టి ఆవు ప్రాణం ఐదు దళిత ప్రాణాలు సమానమనే బి.జె.పి. ప్రజా సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తామనే న్యూడెమోక్రసీ విప్లవకారులను ఐక్యవేదిక ఆవిర్భవింపజేస్తే అక్కడ గెలిసింది 'నాలుగుపడగల నాగరాజు'. పౌరహక్కును పక్కకు పెట్టి ప్రాణవాయువును కూడా బంధించి ఇక్కడి మైనార్టీలకు, దళితులకు గ్యాస్ ఛాంబర్లు తయారు చేసి హిందూత్వ రెడ్డిత్వం, అర్ధరాత్రి శవపూజలు చెయ్యడం మొదలెట్టాక తెలంగాణను కాపాడే బాధ్యత ఎవరు తీసుకోవాలి? 

మళ్ళీ ఉస్మానియా యూనివర్శిటీనే తీసుకోవాలి? మనుష మాంసం తినే స్థితి నుంచి మానవుల్ని కాపాడింది గొడ్డు మాంసం తినే సంస్కృతే. మార్కెట్‌లో శాకాహార అహింసావాదం అంటరానితనం గీతదాటితే మనుషుల్ని చంపే 'అమానుష మనుష మాంసం భక్షణ' సంస్కృతిని ఎవరు రూపొందించారు? అంటరానివాళ్ళుగా చూడడానికి వారి ఫుడ్ కల్చర్‌ని కూడా వాడుకున్నారు. ఈ విధానాన్ని ఒక మేరకైనా తెలంగాణలో వచ్చిన ఉద్యమాలు అడ్డుకుంటూ వచ్చాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో అన్ని కులాల ప్రజల తిండిని అన్ని కులాల కమ్యూనిస్టులు తిన్నారు. అందులో గొడ్డుకూర, పందికూర ఉన్నాయి. 

ఇక్కడ ముస్లిం, దళిత బహుజన సంస్కృతి బిర్యానీలో అలాయి బలాయి తీసుకున్నది. ఆకు, అలంకాయ గడ్డలు ఈ సంస్కృతిలో అంతర్లీనంగా ఉంది. బ్రాహ్మణీయ ఆహార సంస్కృతి ఆధిక్యతలోకి రాకుండా కాపాడింది ఈ పోరాటాలే. అందుకే హైదరాబాద్ బిర్యానీకి ప్రసిద్ధి, గోంగూరకు ఇడ్లీ సాంబారుకు కాదు. ఇడ్లీ-సాంబార్ గోబ్యాక్ అన్నప్పుడు, చాయ్-బన్ జిందాబాద్ అనే నినాదం కూడా ఉంది. హైదరాబాద్‌లోని మదీనా హోటల్, సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ కూడా తెలంగాణ ఫుడ్ సంస్కృతికి సంకేతాలు. బ్రాహ్మణ భోజన హోటళ్ళు తెలంగాణ సంస్కృతికి సంకేతాలు కావు. అది ఆత్మగౌవరం హైదరాబాద్ బిర్యానీలో ఉంది. 

ఈ తెలంగాణను మార్చి, దీన్నొక గుజరాత్‌గా తయారు చెయ్యాలనేది బి.జె.పి. ఆలోచన. ఈ ఆలోచనకు ప్రస్తుత నాయకుడు కిషన్‌రెడ్డి. దీనికి జె.ఎ.సి. రెడ్డి సంతతి సాంస్కృతిక సంబంధాన్ని కుదుర్చుకున్నది. తెలంగాణలోని కోయలు, గోండులు గొడ్డుమాంసం యథేచ్ఛగా తింటారు. మాదిగలు దీన్నొక మహా సంస్కృతిగా, ఆది జాంబవంతుని వారసులుగా కాపాడుకున్నారు. 

ఆర్.యస్.యస్, బి.జె.పి. తెలంగాణ అంతా వ్యాపించి నేడు గుజరాత్‌లో ఉన్నట్లు 'అందరూ శాకాహారులవ్వాలని' అనిగాని, అన్నాహజారే రాలేగావ్ సిద్ధి చేసినట్లు మనుషుల్ని చెట్లకు కట్టేసి కొడితే ఈ ప్రాంతంలో బి.జె.పి పెంచి పోషించిన జె.ఎ.సి సంస్కృతికి అండగా నిలిచినట్లు. లేదా సాంస్కృతిక విప్లవాలకు వారసురాలుగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం శాకాహార సంస్కృతిని ప్రచారం చేస్తుందా? తెలంగాణ మాదిగ, మాల, చాకలి, మంగళి, గొల్ల-కురుమ, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, లంబాడీలు, గోండులు, కోయలు, నాయకపులు, ముస్లింలు, క్రైస్తవులు - తెలంగాణ సబ్బండ జాతులు తినే ప్రతి కూరకు సమాన గౌరవమిచ్చే తెలంగాణ, హిందూత్వ, బ్రాహ్మణేయ తెలంగాణ తేల్చుకోవలసిన సమయమొచ్చింది. ఇక్కడి రెడ్లు, వెలమలు కూడా దీన్ని గుజరాత్‌గా మార్చి ఆవు మాంసాన్ని గుడిలోవేసి, పంది మాంసాన్ని మసీదులో వేసి మనుషుల రక్తం చిందించే తెలంగాణగా మార్చడానికి అంగీకరిస్తారా తేలాల్సి ఉంది. 

తెలంగాణలో వందలాది మందిని ఒకవైపు చంపుతూ మరోవైపు పట్టుబట్టలు కట్టుకొని యజ్ఞయాగాదులు చెయ్యొచ్చు. నెయ్యంతా మంటల్లో పోసి, పాలన్నీ పుట్టల్లో పోసి పసిపిల్లల ఆహారాన్ని అగ్నికి, ఆహుతి ఇవ్వవచ్చు. మనుషులు మంటల్లో చస్తుంటే వేలకోట్ల గణపతి విగ్రహాలు కొని వాటి చుట్టూ మనుషులు తినే శాకాహారాన్ని ఎదజల్లి తొక్కి ఆఖరికి వేల కోట్ల రూపాయల విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో పడెయ్యవచ్చు. ఆదివాసీ, దళిత బహుజనులు 'బీఫ్ ఫెస్టివల్' చేసుకొని 'బీఫ్ ఈజ్ ఎనర్జీ' పాట పాడితే తెలంగాణ ఉద్యమం ఆగిపోద్దా! ఆగితే ఏ తెలంగాణ ఉద్యమం ఆగుద్ది! తెలంగాణను గుజరాత్‌గా మార్చే ఉద్యమం ఆగుతుంది. అది కావాలని కోరుకునే వారు 'అవును మేం తెలంగాణను గుజరాత్‌ను చేస్తాం' అని చెప్పమనండి. జె.ఎ.సి.ని కూడా చెప్పమనండి. 

తెలంగాణ ఉద్యమం అన్ని రాజకీయాలకతీతంగా, అన్ని సిద్ధాంతాలకతీతంగా జరగాలనే జెఎసి తెలంగాణ మీటింగులో కూడా ఎవరికి నచ్చే ఫుడ్ వారు తినొచ్చు అని ఎందుకు చెప్పడం లేదు. బీఫ్ ఫెస్టివల్‌లో మీడియా వాహనాల్ని, ప్రభుత్వ బస్సుల్ని తగులబెట్టడం తప్పని ఎందుకు చెప్పడం లేదు. వాళ్ళ ఇష్టమైన తిండిని తింటే వారిపైబడి బొక్కలు ఇరగ్గొట్టడం తప్పని ఎందుకు చెప్పడం లేదు. 

తెలంగాణలో దాని తాత్విక గడ్డైన ఉస్మానియాలో ఏ ఫెస్టివల్ జరగాలో ఆర్.యస్.యస్, బి.జె.పి. వాటిని ఇప్పుడు వెనుక ఉండి నడిపే జె.ఎ.సి నిర్ణయించాక రేపు జరగబోయేదేమిటి? ఈ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో లక్షలాది మంది తినే తిండికే గౌరవం లేకపోతే ముస్లింల, దళితుల, ఆదివాసుల, బి.సి.ల జీవితాలకేమి రక్షణ ఉంటుంది? సిద్ధాంతాలకతీత తెలంగాణ పేరుతో బి.జె.పి.ని కలుపుకొని జె.ఎ.సి చేసే సంపాదనోద్యమంతో తెలంగాణకు ఎంత పెద్ద ప్రమాదమొచ్చిందో చూడండి. బి.జె.పి.లో ఉండి అందరిమీద దాడిచేసే దళిత, బి.సి., ఆదివాసీ యువతకు ఆ పార్టీ బంగారు లక్ష్మణ్‌కు పట్టించిన గతి చూశాకనైనా అర్థం కావడం లేదా? 

ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ ప్రపంచ స్థాయి చర్చను లేవనెత్తింది. అది పిడికెడు మంది 'పిచ్చి పండుగ' అని వాదించిన మేధావులందరికీ సమాధానం చెప్పింది. ఆహార సంస్కృతిపై ఆధిపత్యం చలాయించి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని హిందూత్వ వాదులు చూస్తున్నారు. ఆ ప్రయత్నం తెలంగాణలో మొదలైంది. దానికి మొదటి చెక్ ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్. ఈ దేశంలో సాంస్కృతిక విలువలు కేరళ రాష్ట్రంలో ఉన్నట్టు ఉండాలా లేక గుజరాత్ రాష్ట్రంలో ఉన్నట్లు ఉండాలా అనేది అతి ముఖ్యమైన విషయం. ఆదిశంకరాచార్య పుట్టిన కేరళలో రెస్టారెంట్లలో అన్ని రకాల తిండి పదార్థాలు - బీఫ్, పోర్క్, ఫిష్, వెజ్ - అందుబాటులో ఉంటాయి. 

ఎవరికి నచ్చింది వారు తింటారు. కాని గుజరాత్‌లో ఏ మాంసాహారం రెస్టారెంట్స్‌లో దొరకదు. దళితులు, శూద్రులు, ముస్లింలను కూడా శాకాహారులుగా మారాలనేది సిద్ధాంతం. లేకుంటే బెదిరింపులు. ఈ సిద్ధాంతాన్ని బి.సి. నరేంద్ర మోడీ అమలు చేస్తున్నాడు. కాని హిందూ గుళ్లలో మాత్రం ఒక్క బి.సి, ఎస్సీ, ఎస్టీని పూజారిగా నియమించే ప్రసక్తి లేదు. అంటే శాకాహార దళితులు బహజునులు శాఖాహార బానిసలే. దేవునితో కూడా స్వయంగా మాట్లాడే హక్కు లేకుండా బతకాలి. ఈ పద్ధతే తెలంగాణకు రావాలనేది వీరి ఆలోచన. బీఫ్‌ను ఇష్టపడే వాళ్ళు తినొచ్చు అని చెబితే వారు కుట్రదారులు, వారిపై కుట్రకేసులు పెడతారు. అంటే ఇష్టంగా తినే తిండిని కూడా కుట్ర పన్ని తినాల్సిన స్థితికి ఈ ప్రజాస్వామ్యాన్ని దిగజారిస్తే రాబోయే తెలంగాణ ఎట్లా ఉంటుందో ఆలోచించండి. 

కొంతమంది మేధావులు ఆహారపు సెంటిమెంట్ సిద్ధాంతం చెబుతున్నారు. విశ్వవిద్యాలయాలు ప్రజాసంస్థలు. ఆ ప్రజల్లో ఆదివాసులు, దళితులు, బి.సిలు, మైనార్టీలు మెజార్టీ వారి సెంటిమెంట్‌కు, గౌరవం లేకుండా 5 శాతం కూడా లేని బ్రాహ్మణ, బనియా అలవాట్లు గలిగిన వారి సెంటిమెంట్లను గౌరవించి పబ్లిక్ స్థలంలో తిండి మానెయ్యాలా? ఇది ప్రపంచాన్ని, ప్రజాస్వామ్యాన్ని, మానవ ఆహార విలువల్ని అర్థం చేసుకున్న మేధావుల వాదనేనా? మేధావి అనే పదానికి 'శాక ఆహారి' అనే నిర్వచనం ఇస్తున్నారు. అటువంటి వారు యూనివర్శిటీలో కాదు ఉండాల్సింది. హిందూ గుళ్లలో ఉండి పూజలు చేసుకోవాలి. మా తిండి మీరు తినండి అని బలవంతం చేస్తే తప్పు. 

అది మాంసాహారులను శాకాహారులను చేసినా తప్పు, శాకాహారులను మాంసాహారులు చేసినా తప్పు. మాది మేం తింటాం, అదీ భయపడుతూ కాదు గర్వంగా తింటాం అంటే ఆపడానికి మీరెవరు? తెలంగాణలో ఉన్న ఒక మంచి సామెత 'పందిని తినేవాడు పందిని తింటాడు, నందిని తినేవాడు నందిని తింటాడు'. ఈ ఇద్దరూ పరస్పరం గౌరవించుకోవాలి. అప్పుడే ఈ రెండు జంతువుల ఆధారంగా మత కల్లోలాలు జరగడం ఆగిపోతాయి. ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ ఆ తోవను చూపింది. మేధావి ప్రతి నిత్య సంస్కర్త. సమానత్వం ఆ సంస్కరణకు చుక్కాని. ఈ విలువలు గలిగిన తెలంగాణను కాపాడుకోవాలి. దాన్ని మతోన్మాదులకు, డబ్బులకు అమ్ముకొని సంస్కర్తలకు సంకెళ్ళు వేయిస్తే ఇక యూనివర్శిటీలు ఎందుకు? 

తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యం పేరుతో ఈ ప్రాంతాన్ని గుజరాత్‌గా మార్చే ప్రక్రియని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలి. ఇక్కడి ప్రతి విలువను ఇక్కడి శ్రమజీవుల పిల్లలు నిర్వచిస్తారు. మీరు తెలంగాణ తిండిపై నిఘా పెడితే ఇక్కడి దళిత బహుజనులు శివసాగర్ చెప్పినట్లు ట్రిగ్గర్ నొక్కుతారు. ఇప్పుడు జరిగే పోరాటం గన్ను పోరాటం కాదు, అది పెన్ను పోరాటం. ఈ పోరాటంలో బీఫ్ బిర్యాని తినే తెలంగాణే గెలిచి తీరుతుంది. భూముల కోసం జరిగే పోరాటం కంటే సంస్కృతి పరిరక్షణ కోసం జరిగే పోరాటం చాలా విలువైంది. తెలంగాణ ప్రజలు ఏం తినాలో భద్రాచలం రాముడు కాదు చెప్పేది. విగ్రహ రూపం దాల్చే వినాయకుడు అంతకన్నా కాదు. తెలంగాణ ప్రజలందరూ ఏం తినాల్నో చెప్పేది సమ్మక్క, సారక్క. హిందూత్వ చుట్టూ ఉర్రూతలూగుతున్న ఆదివాసీ, దళిత బహుజనులారా మీరొక్కసారి మేడారం పొయ్యి మన కోయ దేవతలను అడిగిరండి - బీఫ్ ఫెస్టివల్ జరగాలో వద్దో. ఆ దేవత కోరుకొనే తెలంగాణ కావాలంటే ఆంధ్రులకే కాదు, ఆర్యులకు ఇక్కడ స్థానం లేదు. వారి సంస్కృతికీ స్థానం లేదు. 

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత
Andhra Jyothi News Paper Dated : 03/05/2012 

No comments:

Post a Comment