Wednesday, May 2, 2012

ఆదర్శవాది, అచంచల విశ్వాసి - ఆచార్య కొలకలూరి ఇనాక్



సత్యమూర్తీ నేనూ ఆంధ్రా యూనివర్సిటీలో కలిసి చదువుకొన్నాం. ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చి చదువుకోవటం వల్ల మాకు సహ విద్యార్థి అయ్యాడు. పెద్దవాడని మేం గౌరవంగా చూసే వాళ్ళం. తాను స్నేహంగానే ఉండేవాడు. గంగరాజు, సత్యమూర్తీ మంచి స్నేహితులు. దాదాపు సమ వయస్కులు. ఇద్దరూ కమ్యూనిస్టులు. ఒకే ప్రాంతం వాళ్ళు. 1958 అనుకొంటాను. ఇద్దరూ హాస్టలు పా ర్కులో వార్తలు వింటున్న నన్ను పలకరించారు. కుశల ప్రశ్నలు అయ్యాక కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడుగా చేరమన్నారు. 

గుంటూరులో నా అనుభవాలు, యస్.యఫ్. సెక్రటరీగా ఉండటం, దాని నుంచి వైదొలగటం చెప్పి, కమ్యూనిజం ఇష్టమైనా, కమ్యూనిస్టును కాలేనని చెప్పి వచ్చేశాను. ఎప్పుడయినా ఎదురుపడితే 'ఎప్పటికైనా నువ్వు మా వాడివే' అనేవాడు. 'నేను ఎప్పటికీ మన వాణ్ణే' అనే వాణ్ణి. అరసం నాకు ఇష్టంగా ఉండేది. ఏటుకూరి ప్రసాద్ ఆ ఇష్టాన్ని రగిల్చేవాడు. మంచి స్నేహితులం. అయినా నేను అందులో సభ్యుణ్ణి కాలేదు. విరసం ఏర్పడ్డప్పుడు సత్యమూర్తి కబురుచేశాడు. నేను వెళ్ళలేదు. సభ్యుణ్ణీ కాలేదు. నేను 'ఎప్పటికీ మన వాణ్ణే' అని మాత్రం గంగరాజును చెప్పమన్నాను. 

నాకు సత్యమూర్తి అగ్నికణం. కరచాలనం చేయలేను. కానీ వెలుతురు చూడకుండా ఉండలేను. కొండపల్లి సీతారామయ్య ప్రభావం సత్యమూర్తి మీద ఉందో, సత్యమూర్తి ప్రభావం కొండపల్లి మీద ఉందో చెప్పలేం. ఒకరు మరొకర్ని ప్రభావితం చేశారని దగ్గరగా తెలిసిన వాళ్ళు చెప్పుకోవటం విన్నాను. నేను మాత్రం వాళ్ళ ఉద్యమానికి సత్యమూర్తే సూత్రధారి అని నమ్ముతాను. అతను ఎదుటి వాళ్ళను ఒప్పించేట్టు మాట్లాడగల సమర్థుడు. గంగరాజు కూడా వరంగల్లులో ఉండి ఉంటే ముగ్గురూ కలిసి పనిచేసే వాళ్ళు. దళితుడు ఎక్కడున్నా అనుచరుడే కానీ, నాయకుడు కాలేడు. మొండిగా చెప్పాలంటే జీతగాడే కాని ఆసామి కాలేడు. వాడు మంత్రి అయినా అంతే, మహాశయుడైనా అంతే! ఈ అనుభవం నాకు 1955లోనే వచ్చింది. కొందరికి కొంత ఆలస్యంగా వస్తుంది. 

ఉద్యమ సిద్ధాంతం అప్పటికే సిద్ధమయి ఉంది. దానికి మెరుగులు దిద్ది, ఈ ప్రాంతం అవసరాలకు అనుకూలంగా ఆచరణ సాధ్యంగా మార్పులు చేర్పులు సత్యమూర్తి చేసి ఉంటాడని నా విశ్వాసం. సిద్ధాంత వ్యాపకుడుగా, ఉద్యమంలోకి ప్రజల్ని ఆకర్షించే శక్తిగా కొండపల్లి కృషిచేసి ఉంటాడని నా అభిప్రాయం. ఇద్దరూ మిత్రులు. ఇద్దరూ ఈ ప్రాంతంలో ఉద్యమం ప్రారంభించారు. నా యీ అభిప్రాయాలకు సత్యమూర్తి కోర్టులో పీపుల్స్‌వార్ గ్రూప్ సిద్ధాంత వివరణ ఇవ్వటం ప్రోద్బలకం. 

మంద కృష్ణ నాకు ఆత్మీయుడు. పుత్ర తుల్యుడు. కృష్ణ ఉద్యమంలో ఉండేవాడు. సత్యమూర్తితో కలసి పనిచేసేవాడు. సహజంగానే సామాజిక సమస్యల పరిష్కారాలకు వీళ్ళు మార్గాలు అన్వేషించే సమయంలో మాల మాదిగల సంబంధాల మీద చర్చలు జరిగాయి. మాల మాదిగలు కలిసి రాజకీయంగా సామాజికంగా జాగృతులు అయితే ఆర్థికంగా బలపడతారని సత్యమూర్తి అభిప్రాయం. ప్రత్యేక ప్రతిపత్తి లేకపోతే మాదిగలు పైకి రారని కృష్ణ దృష్టి. 

అందుకు ప్రాథమికంగా రిజర్వేషన్లలో జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు రాగలదని, అలా తీర్మానం చెయ్యాలని కృష్ణ సూచన. అది ఆత్మహత్యా సదృశమని సత్యమూర్తి దృష్టి. కమ్యూనిస్టులు మార్క్సిస్టులు కూడా ఈ దృష్టినే కలిగి ఉంటారు. సత్యమూర్తి, కృష్ణ గురు శిష్యులే! ఆత్మీయులే! ఆత్మీయతా బంధం ఉన్న వాళ్ళే! అయినా ఈ విషయం మీద విభేదించారు. ఈ విభేదం చివరకు విడిపోవటం దాకా వచ్చింది. కృష్ణ ఉద్యమం నుంచి వెలుపలికి వచ్చాడు సహాలోచనలున్న వాళ్ళు కృష్ణతో పాటు ఉద్యమం నుంచి బయటకు వచ్చారు. సత్యమూర్తి ఉద్యమంలోనే నాయకుడుగా ఉన్నాడు. 

బయటకు వచ్చిన కృష్ణ సహాలోచనాపరులు సమాజంలోని సానుభూతి పరులతో కలిసి 'దండోరా' ఉద్యమం ప్రారంభించి వర్గీకరణం వాంఛిస్తూ ప్రచారం ప్రారంభించాడు. సత్యమూర్తి వాళ్ళ చర్చల్లో కృష్ణ కోరిన తీర్మానం గ్రహించి ఉంటే దండోరా ప్రారంభమయ్యేది కాదేమో! ఒక విధంగా దండోరా ఉద్యమం కావటానికి సత్యమూర్తి పరోక్ష కారకుడని నాకు అనిపస్తుంది. కులం మీద ఆధారపడి ఒక జాతిని కానీ, ఒక నీతిని కానీ నిర్మించలేమన్న అంబేద్కర్ దృష్టికోణం సత్యమూర్తికి ఇష్టంగా ఉండి ఉంటుంది. 

కులం ప్రాతిపదికన ఏ ఉద్యమం విజయవంతంకాదని మార్క్సిస్టులు విశ్వసించటం బహిరంగ సత్యం. నిజానికి అంతరంగ సత్యాలు కూడా ఉంటాయి. కులం ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఏర్పడ్డాయి. అయితే కొన్ని కులాలను, కొన్ని తెగలను కలిపి రెండు భిన్న వర్గాలను సృష్టించారు. ఇవి ఆర్థిక వ్యత్యాసాలు తెలిపే వర్గాలు కావు. కుల ప్రయోజనాలు సాధించే కొత్త వర్గాలు. 

దళితుల్లో మాదిగలు వెనుకబడి ఉన్నారు కాబట్టి, వాళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే రిజర్వేషన్ ఫలితాలు, రాయితీలు అన్నీ జనాభా ప్రాతిపదికన విభక్తం కావాలని, వర్గీకరణం వాంఛిస్తూ దండోరా ఉద్యమం ప్రారంభమయింది. దండోరాకు సిద్ధాంత నేపథ్యం అందించే దృష్టితో, ప్రజలు అర్థం చేసుకోవాలన్న భావనతో నేను పది పన్నెండు వ్యాసాలు వ్రాసి పత్రికల్లో ప్రచురించాను. అందులో మొదటిది 'దండోరా -అంబేద్కరు అభీష్టం' ఆంధ్రజ్యోతిలో వచ్చింది. కొంత సంచలనం, కొంత అంగీకారం, కొంత తిరస్కారం పొందింది. దండోరా ఉద్యమం దాన్ని పునర్ముద్రించి పంచిపెట్టింది. తిరస్కరించిన వాళ్ళు ప్రసంగించారు. 

కరపత్రాలు పంచిపెట్టారు. రాజకీయంగా సామాజికంగా తీవ్రంగా ఆలోచిస్తున్న సత్యమూర్తి అప్పటికే ఉద్యమం నుంచి వెలుపలికి వచ్చాడు. మనిషి మానసికంగా డసిలి పోయాడు. సహజంగానే నిరాశకు నిస్పృహకు లోనయ్యాడు. తన భావజాలం ప్రచురించే ధైర్యమయిన పత్రిక లేకపోవటం వల్ల తానే 'ఏకలవ్య' పత్రిక ప్రారంభించాడు. నా మీద ఇష్టమో, దండోరా మీద ఇష్టమో, సాహిత్యం మీద ఇష్టమో చెప్పలేనుకానీ 'ఏకలవ్య'లో 'దండోరా-అంబేద్కర్ అభీష్టం' పునర్ముద్రించి విరివిగా పంచిపెట్టాడు. విప్లవోద్యమం నుంచి బయటికి వచ్చాక సత్యమూర్తి గిలగిలలాడాడు. ప్రజాచైతన్య కార్యక్రమాల గూర్చి ఆలోచించేవాడు. 

మళ్ళీ ఇప్పుడు మరో ఉద్యమం ప్రారంభించటం, ప్రచారం చేయటం, సిద్ధాంత నేపథ్యంతో సమర్థుడే అయినా, ఆర్థిక పరిస్థితి వల్ల, ఆరోగ్య దుస్థితి వల్ల, వయో భారం వల్ల కష్టమని గ్రహించాడు. ఈ దశలో కాన్షీరాం బహుజన సమాజ్ పార్టీ ఉత్సాహం కలిగించింది. సత్యమూర్తి మొదటినుంచీ కులానికి మతానికి వ్యతిరేకి. అయితే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బహుజనుల అభివృద్ధి ఆరంభం నుంచీ అతనికి అభీష్టమే! అందువల్ల బియస్‌పి పట్ల ఆకర్షితుడయ్యాడు. రాజకీయ చైతన్యంలో సత్యమూర్తి సింహం వంటి వాడు. సిద్ధాంత రూపకల్పనలో అపర చాణక్యుడు. పేదలపట్ల, పీడితుల పట్ల ప్రేమలో అచంచల హృదయుడు. 

అలాంటి మనిషి సహజంగానే పురోగామి నాయకుడు. పేదలు ఆర్థిక శక్తిగా ఎదగటానికి భూమే శరణ్యమని నమ్మినవాడు సత్యమూర్తి. ముమ్మూర్తులా కమ్యూనిస్టు. అవిభక్త కమ్యూనిస్టు. విభక్త కమ్యూనిస్టు గాట కట్టాలంటే మార్క్సిస్టు నక్సలైటు. కాన్షీరాం దళిత బహుజన కులాల సమీకరణం వల్ల రాజ్యాధికారం వస్తుందని, ఆ పైన వీళ్ళు ఆర్థిక శక్తిగా ఎదుగుతారని నమ్మే నాయకుడు. స్థూలంగా సత్యమూర్తి పేదల ఆర్థిక శక్తిని ఆశించే సిద్ధాంతకర్త. కాన్షీరాం పేదల రాజ్యధికారం కోరే రాజకీయ నాయకుడు. ఇద్దరికీ పేదలే కేంద్రం. అదే సమాన ధర్మం! సత్యమూర్తిని కాన్షీరాం స్టేట్ లీడరా, స్ట్రీట్ లీడరా అని తృణీకరించి బిఎస్‌పికి దూరం చేసుకొన్నప్పుడు సత్యమూర్తి మళ్ళీ వ్యధకు లోనయ్యాడు. 

కాఫీ తాగుతున్నప్పుడు 'నువ్వు బిఎస్‌పిలో చేరకుండా ఉండవలసింద'ని నేనంటే 'నిజమే'నన్నాడు. ఈ రాజకీయాలు అనైతికంగా ఉన్నాయి. నీతిమంతుడు వీటిలో ఇమడలేడు. నాయక స్థాయి మనిషి అనుచరుడుగా ఉండలేడు. రైతు కావలసిన వాడు జీతగాడు కాలేడు కదా. 'అందుకే నువ్వు మా వాడివి కాలేదు' అన్నాడు. 'నేను ఎప్పటికీ మన వాణ్ణే' అన్నాను. 'నువ్వు మాట తప్పవు కదా' అని నవ్వాడు. నేను వైస్ చాన్సలర్‌గా ఉన్నప్పుడు సత్యమూర్తి విసి బంగ్లాకు వచ్చాడు. మనిషి బాగా కుంగిపోయాడు. 

రోజంతా కలిసి ఉన్నాం. మధ్యాహ్నం తీరుబడిగా భోజనం చేశాం. 'ముద్రణకు డబ్బు కావాలి'అని స్క్రిప్టు చూపించాడు. ఎంత అంటే చెప్పాడు. రెట్టింపు ఇచ్చాను. ఇంత కొంచెం డబ్బు కూడా తన దగ్గర లేని పరిస్థితి నన్ను హింసించింది. ఆ స్క్రిప్టు నేను చూడలేదు. తన జీవితచరిత్ర అనుకొన్నాను. 

సత్యమూర్తి రాసిన శివుడో, భాస్కరుడో కవితను శ్రీశ్రీ నడివీధిలో నడుస్తూ పాడిన సందర్భం నాకు ఆనందం, ఆశ్చర్యం కలిగించింది (చాగంటి భాస్కరరావు పోలీసు కాల్పుల్లో మరణించినప్పుడు). నిరంకుశ విప్లవకవికి సత్యమూర్తి కవిత్వం ఆదరణీయం కావటం ఆనందానికి కారణం. కె.జి.సత్యమూర్తికి కవిగా శివుడు, శివసాగర్, రెంజిమ్ పేర్లుపెట్టుకున్నాడు. 'నా చెల్లీ చెంద్రమా', 'ఏటికెదురీదే వాళ్ళమురా', 'తోట రాముని పాట' నాకు బాగా ఇష్టమైనవి. సత్యమూర్తి అనుభూతి మార్మికుడు. మనిషి సుకుమారుడు. మనస్సు వెన్న. సున్నితమైన వ్యక్తి. ఆ్రర్ద హృదయుడు. అనురాగపూర్ణుడు. జనమంటే ప్రేమ. ఈ గుణాలే సత్యమూర్తి కవిత్వం నిండా ఉన్నాయి. 

ప్రేమ, కరుణ, దయ నిండిన కవిత్వం సత్యమూర్తిది. సత్యమూర్తి కవిత్వం పదికాలాల పాటు నిలుస్తుంది. అవి పాఠ్యాంశం కావటంలో నా ప్రమేయం కూడా ఉంది. అనుభూతి కవితావైప్లవ్య భావుకుడు. జీవితాంతం సమాజ అభ్యుదయం సాహిత్యంలోనూ జీవితంలోనూ కాంక్షిస్తూనే ఉన్నాడు. సమాజ పరిణామ గతిలో సత్యమూర్తి ఒక స్థిరమైన మైలురాయి. చరమైన పథగామి. స్పష్టమైన ఆదర్శవాది. అచంచల విశ్వాసి. అంతవరకు సత్యమూర్తి సంకల్ప విజయుడు. 

ఇంతకన్నా అధికంగా విశేషంగా సమాజాన్ని విజయ పథంలో నడపటానికి అతనికి అవకాశం ఉండి ఉంటే ఎంతో బాగుండేది. కాలం కఠిన శిలా శాసనం. విముక్త మానవులు స్మరించే చైతన్యమూర్తి సత్యమూర్తి. అడవుల్ని వనాలుగా తీర్చిదిద్ద తలపెట్టిన మనిషి అలసిపోయాడు. అలసిపోయిన గుండె ఆగిపోయింది. సత్యమూర్తి మరణించాడంటే దిగులేకానీ, ఈ గుండె నిబ్బరపు మనిషి ఇంత చైతన్య కారకుడని గుర్తించి నప్పుడు దిగులు పటాపంచలవుతుంది. 

సత్యమూర్తి శాశ్వతుడు.
- ఆచార్య కొలకలూరి ఇనాక్
Andhra Jyothi News Paper Dated : 03/05/2012 

No comments:

Post a Comment