Monday, May 7, 2012

అస్పృశ్యతా వద్దు అనైక్యతా వద్దు - కల్యాణ్ పవార్



'తోటి మానవున్ని నీచునిగా అంటరాని వానిగా వారి ఆహారాన్ని సాంప్రదాయాలను వృత్తులను అంటరానివిగా పరిగణించే సంస్కృతి భారతీయ సంస్కృతి ఎలా అవుతుంది?' అని డా. గాలి వినోద్‌కుమార్ చక్కగా అడిగారు. అవును. అటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి కాదు. ముమ్మాటికీ కాదు. నిజానికి అటువంటి సంస్కృతి భారతీయతకూ భారతీయుల సమైక్యతకూ గొడ్డలిపెట్టు కూడా. అందుకే జాతీయవాద సంస్థలు కుల దురహంకారాన్ని అంటరానితనం లాంటి దురాచారాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. 

జాతీయ వాద విద్యార్థులది ఇటువంటి మూఢాచారాల్ని అనేక శతాబ్దాలుగా వ్యతిరేకిస్తూ వస్తున్న ఆధ్యాత్మిక ఉద్యమకారులు సంఘసంస్కరణ ఉద్యమకారుల వారసత్వమే. అంతే తప్ప విదేశీయుల కొమ్ము కాసి అయినా సరే తమ తమ ఛాందస మత సంప్రదాయ సిద్ధాంతాలనో రాజకీయ సిద్ధాంతాలనో నెగ్గించుకుని తోటి భారతీయుల్ని దూరంగా పెట్టడం ద్వారా భారతీయ సమాజాన్ని చీల్చడంలో పాలు పంచుకునే వాళ్ల వారసత్వం కాదు. 

కాని ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేపట్టిన బీఫ్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలు అందుకు మార్గం కాకపోగా అవి ప్రతికూల ఫలితాలనిస్తాయనీ విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లాంటి బహిరంగ ప్రదేశాల్లో చేయడం అప్రజాస్వామికమని భారతీయుల సమైక్యతను దెబ్బతీసే అనేక పరిణామాలకు అవి దారితీసే ప్రమాదం ఉందని భావించడం వల్లే జాతీయవాద విద్యార్థులు వ్యతిరేకించాల్సి వచ్చింది. 

మాట వరుసకి పూర్వం ఎద్దుమాంసం తిన్నారనుకుందాం. అయితే ఏమిటి ఇప్పుడు? పూర్వం అంటరానితనం పాటించిన వాళ్లున్నారు. అయితే? ఆ అమానవీయ ఆచారాన్ని ఈ నాటికీ కొనసాగించాలనా? అట్లాగే ఎద్దు మాంసం తినడం ఒకప్పుడు ఎవరైనా చేసి ఉన్నా వాళ్లు తరువాత తమకు తప్పు అనిపించి మానేసి ఉంటే తప్పేమిటి? పూర్వం మానవులు ఆదిమ దశలో దిగంబరంగా తిరిగారని పచ్చి మాంసం తిన్నారని పరిణామవాద చరిత్రకారులు అంటారు. 

అయితే మానవ జాతి పరిణామం అంతటితో ఆగిపోయిందా? భారతదేశంలో శాకాహార వ్యాప్తికి జైన మత ప్రభావం ఒకానొక బలమైన కారణమన్నది చరిత్రకారుల్లో నిర్ద్వందంగా ఉన్న అభిప్రాయం. అశోకుడు జంతువధను నిషేధిస్తూ శాసనం కూడా చేశాడు. ఆ శాసనంలో పేర్కొనబడ్డ జంతువుల, పక్షుల మంసాలకు ఉండే 'ఔషధ విలువల్నీ', అందులోని పోషక పదార్థాలను అశోకుడు పట్టించుకున్నట్టు లేదు. నేపథ్యమంతా ఇలా ఉండగా బౌద్ధులంతా ఎద్దు మాంసం తినే వాళ్లేనని బౌద్ధాన్ని భారతదేశం నుంచి వెళ్లగొట్టడం కోసమే ఎద్దు మాంసం తినేవాళ్లను వెలివేశారనీ సూత్రీరించడం ఒక పక్క బౌద్ధాన్ని సంకుచితీకరించడం లేదా వక్రీకరించడం అవుతుంది. 

దళిత కులాలలో గోమాంస భక్షణ ఎంత మేరకు ఉందో అంతవరకు అది మహోన్నతమైన మానవ సేవనందించిన వారి కులవృత్తితో ముడిపడి ఉంది. దానికి మతసంబంధం అంటూ ఏదన్నా ఉంటే అది గ్రామదేవతల కొలువులూ మొదలైన జానపద మత అంశాలతోనే తప్ప బౌద్ధంతో కాదు. దళితుల కులవృత్తుల్నీ వాళ్ల కొలువుల్నీ తదితర ఆధ్యాత్మిక విశ్వాసాలను ఆహార సంస్కృతినీ వ్యతిరేకించడం భారత జాతీయతకు వ్యతిరేకమైన చర్య. దళితుల్ని వారికి శారీరకంగానూ మానసికంగానూ హాని కలిగించే కులవృత్తులనుంచీ విముక్తులను చేసి వారికి ఔన్నత్యాన్నీ అధికారసిద్ధినీ కలిగించే అన్ని చర్యలూ వెంటనే చేపట్టడమే భారత జాతికి శ్రేయోదాయకమైన పని అని జాతీయవాదుల సిద్ధాంతం. 

జాతీయవాదులు దళితులను అవమానించడాన్ని ఎంతగా వ్యతిరేకిస్తారో దళితులకు లేని ప్రజాస్వామ్యవ్యతిరేక లక్షణాలను వాళ్లకు ఆపాదిస్తూ వాళ్లను భారతీయతకు వ్యతిరేకమైన కుట్రల్లో భాగస్వాములు చేయడాన్ని కూడా అంతగానే వ్యతిరేకిస్తారు. కరుణామయుల అవతారాలెత్తి దళితుల కొలువుల్నీ ఆధ్యాత్మిక విశ్వాసాల్నీ 'సైతాన్ ఆచారాలు' అనే పేరుపెట్టి వ్యతిరేకించి మాన్పించే వాళ్లే ఆ కొలువులూ ఆచారాల్ని ప్రత్యేక మతంగా వారించే గ్రంథాల రచయితల్ని అభినందించడమనే కపట నాటకాలు ఆడుతున్నారు. వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన కొందరు భారతీయులు కూడా జాతివ్యతిరేకమైన కుట్రలకు సహకరిస్తూ అనేక అప్రజాస్వామిక ఉద్యమాలలో తమ వంతు ఆజ్యం పోసి తమాషా చూస్తున్నారు. 

భారతదేశంలోని మిగిలిన సాంస్కృతిక అంశాల వర్గీకరణ లాగానే ఆహార సంస్కృతి వర్గీకరణ కూడా చాలా జటిలమైన అంశం. అంటే బెంగాలీ ఒడిషా బ్రాహ్మణుల్లో మాంసాహారపు అలవాట్లున్నాయి కనుక బ్రాహ్మణులందరినీ శాకాహారులుగా వర్గీకరించలేం. అట్లాగే అనేక బ్రాహ్మణేతర కులాల్లో శాకాహార నిష్ఠ బలంగా ఉంటుంది కనుక బ్రాహ్మణేతరులందరినీ మాంసాహారులుగా వర్గీకరించలేం. అట్లాగే మాంసాహారుల్లో గోమాంస భక్షణ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నవారూ ఉన్నారు. 

ఈ వ్యతిరేకత వెనుక వారి వారి కులవృత్తులూ ఆ కులాల ఆవిర్భావ దశల్లోని టోటెంల నమ్మకాల్లాంటి వాటిల్లో ఏవి కారణమో ఈ రోజున గుర్తించడం కష్టం. అట్లాగే గిరిజనుల్లో కూడా అందరూ గోమాంస భక్షకులు కాదు. తొద, హల్బా లాంటి అనేక తెగల్లోని గోమాంస భక్షణకు గల వ్యతిరేకత వాళ్ల టోటెంల లాంటి నమ్మకాలతో ముడిపడి ఉంది. లంబాడా లాంటి కొన్ని గిరిజన తెగల గోమాంస భక్షణ వ్యతిరేకత వారి గిరిజనీకరణకు ముందరి చరిత్రతో ముడిపడి ఉంది. 

ఇంతటి జఠిలమైన వైవిధ్యాల మధ్య కూడా భారత జాతి ఐక్యంగా ఎలా సాగగలుగుతోంది అన్నది అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోతోంది. విశ్వాసాల పేరిట అంటరానితనం లాంటి దురాచారాలను కొనసాగించే వాళ్లను సున్నిత విశ్వాసాల తేనె తుట్టెను కదిలించి వాతావరణాన్ని కలుషితం చేసి భారతజాతి సమైక్యతను దెబ్బతీసే అన్ని అప్రజాస్వామిక కుట్రలనూ కూడా ఏకకాలంలో ఎదుర్కొంటూ ముందుకు పోవడమే జాతీయవాద విద్యార్థుల ముందున్న కర్తవ్యం. 

- కల్యాణ్ పవార్
రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం

Andhra Jyothi News Paper Dated : 08/05/2012 

No comments:

Post a Comment