ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి సక్రమంగా అమలు చేయాలని ఉద్యమం సాగుతున్న దశలోనే, ఈ విషయమై కమిటీ సదస్సులు జరుపుతుండగానే, ఉప ఎన్నికలలో లబ్ధి కోసం దళితుల నిధులు దారి మళ్ళించడం దారుణం. దళితుల అభ్యున్నతికి ఏదో ఒరగ బెడుతున్నట్టు ఎప్పుడూ ఊదరగొట్టే ప్రభుత్వాలు ఆచరణలో చేస్తున్నది శూన్యమని ఆధారాలతో సహా రుజువైంది. అయినా ఈ అన్యాయాన్ని చక్కదిద్దడానికి పాలకులకు మనసొప్పడం లేదు. సబ్‌ప్లాన్ అమలుపై అనుసరిస్తున్న దాటివేత వైఖరి ప్రభుత్వ దళిత వ్యతిరేక దృక్పథాన్ని వెల్లడిస్తున్నది.
ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో ఓట్లు రాబట్టుకునేందుకు ఎస్సీ, ఎస్టీ నిధులను కేటాయించడం పట్ల శనివారం దళిత నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుపై ప్రభుత్వం శనివారం హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఒకవైపు మంత్రివర్గ కమిటీ సదస్సులు నిర్వహిస్తున్న దశలోనే మరోవైపు ప్రభుత్వం బాధ్యతారహితంగా నిధుల మళ్ళింపునకు పాల్పడడంపై దళిత సంఘాలు ఈ సమావేశంలో నిలదీశాయి. ఉప ఎన్నికలు జరుగుతున్న 18 నియోజకవర్గాలకు 180 కోట్ల రూపాయల మేర దళితుల నిధులు మళ్ళించారనే ఆరోపణ ఉన్నది. ఇందుకోసం ఒక్కరోజే 20 జీవోలు జారీ చేశారని దళిత నాయకులు ఆరోపిస్తున్నారు. దళితులు ఇంతగా ఆందోళన చేస్తున్నా నిధుల దారి మళ్ళింపు ఎట్లా జరిగిందనే విషయమై సమగ్ర దర్యాప్తు జరపాలె. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవలిందే. ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ఎస్సీ, ఎస్టీ పేరెంట్స్ అసోసియేషన్ కూడా స్కాలర్‌షిప్ నిధుల మంజూరీలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టింది. దళితుల అభ్యున్నతిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ ఆందోళనలన్నీ సాగుతున్నాయి. ‘ఉప సంఘం బోగస్, సబ్ కమిటీ గో బ్యాక్’ అంటూ దళితులు నిరసన చేపట్టడానికి దారి తీసి పరిస్థితికీ ప్రభుత్వ నయవంచనే కారణం. ఎస్సీ, ఎస్టీ నిధులు ఖర్చు చేయడానికి ప్రత్యేక పద్దు కేటాయించాలనీ, ఉప ప్రణాళిక నిధుల ఖర్చు చేయని శాఖలను గుర్తించి, బాధ్యులైన అధికారులపై చర్య తీసుకునే అధికారం నోడల్ ఏజెన్సీలకు ఇవ్వాలని గతంలో గవర్నర్‌ల కమిటీ సిఫారసు చేయడం గమనార్హం.
తరతరాలుగా అణచివేతకు గురవుతున్న దళితులను అభివృద్ధి చేయడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి- అభివృద్ధి పథకాలు దళితులకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ కనబరచడం. రెండు- దళితుల జనాభా ప్రకారం నిధులు కేటాయించి అవి వారికి చేరేలా చర్యలు చేపట్టడం. మొదటి విధానం సక్రమంగా అమలు కావడం లేదు కనుకనే రెండవ విధానాన్ని పకడ్బందిగా అమలు చేయాలని దళితులు ఉద్యమిస్తున్నారు. ఉదాహరణకు. ఒక ఊరిలో వీధి దీపా లు పెట్టించే పథకం ఎనబై శాతం అమలు జరిగితే, అమలు జరగని ఇరవై శాతం ప్రాంతంలోనే దళిత వాడలు ఉండే అవకాశం ఉన్నది. ఏదైనా స్వయం ఉపాధి పథకం ద్వారా 80 శాతం యువత లభ్ధి పొందితే, దళితులు లబ్ధి పొందని 20 శాతంలో ఉండే అవకాశం ఉంది. ఇది సామాజిక వాస్తవికత. ప్రభుత్వ అధికారులు అభివృద్ధి పథకాలు దళితులకు చేరే విధంగా తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. గిరిజనుల పట్ల కూడా ఇదే అలక్ష్యం జరుగుతున్నది. అందువల్ల దళితుల, గిరిజనుల జనాభాకు అనుగుణంగా ప్రత్యేకించి వారి కోసమే నిధులు కేటాయించి వ్యయం చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. ఇదే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్. జాతీయ స్థాయిలోనే ఈ మేరకు నిర్ణయం జరిగింది.
మహారాష్ట్ర వంటి కొన్నిరాష్ట్రాలు ఈ సబ్‌ప్లాన్‌ను సక్రమంగా అమలు చేస్తున్నాయి. కానీ సరిగ్గా అమలు చేయని రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉన్నది. గత ఏడాది ఎస్సీలకు కేటాయించిన నిధుల్లో 1400 కోట్ల రూపాయలు వినియోగమే కాలేదు. ఇదే విధంగా ఎస్టీ నిధుల్లో 450 కోట్లు వినియోగించలేదు. ఎస్సీలకు కేటాయించిన నిధులు వినియోగించక పోవడం పాలకులు అనుసరిస్తున్న ఒక ఎత్తుగడ. బడ్జెట్‌లో కేటాయించినట్టు కనిపించినప్పటికీ వాటిని దారి మళ్ళించడం మరో ఎత్తుగడ. దళితులకు ఏ మాత్రం సంబంధం లేని పథకాలకు నిధులు కేటాయించడం మరో పన్నాగం. ఈ విధంగా అనేక విధాలుగా ప్రభుత్వం దళితులను మోసం చేస్తున్నది. సబ్‌ప్లాన్ నిధులను ఉపయోగించే విషయమై స్పష్టమైన విధానాలు ఉన్నాయి. దళితులు వ్యక్తిగా లేదా బృందాలుగా లబ్ధి పొందే విధంగా నిధులు ఉపయోగపడాలె. లేదా దళిత వాడలకు ఉపయోగపడేలా నిధుల వినియోగం జరగాలె. ఇందుకు భిన్నంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధం లేని- కొల్లేరు అభివృద్ధి, హుస్సేన్ సాగర్ సుందరీకరణ వంటి పథకాలకు నిధులను కేటాయించి దానిని దళితుల కోసం కేటాయించినట్టు ప్రభుత్వం బుకాయిస్తున్నది.
ప్రభుత్వం అనుసరిస్తున్న టక్కుటమారాలన్నీ గమనించిన దళితులు మహారాష్ట్ర తరహాలో నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ ప్రభుత్వం నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేసినప్పటికీ వాటికి ఆర్థిక పరమైన అధికారాలు ఇవ్వకుండా కాగితపు పులులుగా మార్చిందని దళితులు విమర్శిస్తున్నారు. సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై సాగే పర్యవేక్షణ వ్యవస్థ కూడా నామమావూతంగా ఉన్నది. సబ్‌ప్లాన్ అమలుపై ప్రభుత్వం నలభై శాఖలతో కీలక సమావేశం నిర్వహిస్తే దీనికి ఉన్నతాధికారులు డుమ్మా కొట్టడం తాజా ఉదాహరణ. ముఖ్యమంత్రి సారథ్యంలో ఉండే అపెక్స్ కమిటీ, చీఫ్ సెక్రటరీ ఆధ్యర్యంలోని కమిటీ, సాం ఘిక సంక్షేమ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీలు, జిల్లా డివిజన్ మున్సిపాలిటీ మండల స్థాయి పర్యవేక్షక కమిటీలు అన్నీ ఏర్పాటు చేసి ప్రభు త్వం నిధులను మాత్రం సక్రమంగా వినియోగించడం లేదు. అందుకే సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత ఏర్పడితే అమలు చేయనందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. సంబంధిత అధికారులకు శిక్ష పడుతుందనే భయం ఉంటుంది. అయితే సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలనే ఉద్యమం తీవ్రమైన తరువాత కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి సదస్సులు నిర్వహిస్తున్నది. నిజానికి ప్రభుత్వం సదస్సులు ఏర్పాటు చేయడం, సర్వేలు జరపడం కాదు చేయాల్సింది. ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలె. దళితులు కోరుతున్నట్టు సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడం ద్వారానే ఈ సమస్య పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని గ్రహించాలె.
Namasete Telangana News Paper Dated : 21/05/2012
Namasete Telangana News Paper Dated : 21/05/2012
No comments:
Post a Comment