రాష్ట్రంలో ఉప ఎన్నికల వరస చూస్తే ఈ పాలనా రంగం, ఎన్నికల ప్రక్రియ, రాజకీయ ఎత్తుగడలపై ఏవగింపుని, అసహ్యాన్ని కలిగించక మానవు. అటు సీమాంధ్ర ప్రాంతంలో జగన్ వర్సెస్ అధిష్ఠానం పోటీ నడుస్తోంది. నాయకుల గొడవ ఏదైనా కాని నేడు ఐఏఎస్‌లు, ఐఆర్ఎస్‌లు, పెద్ద పెద్ద గనులను మింగిన ఘనులు కూడా ఊచలు లెక్కబెడుతున్నారు. ఏలిన వారికి కోపం వస్తే కాని పెద్ద పెద్ద తిమింగలాలు బయటపడేటట్టు లేవు. ఇంక ఇక్కడ తెలంగాణలో జరిగే పరకాల ఎన్నికల వ్యూహాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి.
ప్రాణాలకు తెగించి, ఎదిరించి సాధించిన ప్రజాస్వామ్యం పక్కన పగలబడి నవ్వుతోంది. ఎన్నికలు! ఉప ఎన్నికలు! ఉద్యమాల పేరుతో రాజీనామాలు. నాయకుల మీద ప్రేమతో, ఏదో ఒక అజెండాతో చేసేవి కూడా రాజీనామాలే. ఇంక తెలంగాణ విషయానికొస్తే, తెలంగాణ కావాలంటే రాజీనామా, వద్దంటే కూడా రాజీనామా అస్త్రమే. ఎన్ని పాపాలు చేసయినా సరే, ఒక్కసారి రాజీనామా చేస్తే పవిత్ర తెలంగాణ బాప్టిజం తీసుకున్నట్టే. ఒక్క వేటుతో అన్ని గొంతులు నొక్కేయొచ్చు. జై తెలంగాణ అంటే వందకు వంద మార్కులు. ఎవరు ఎన్ని మోసాలు, నేరాలు చేసినా, వెన్నుపోటు పొడిచినా 'మాఫీ!' మాఫ్!
ఇంక మహబూబ్‌నగర్‌లో టిఆర్ఎస్‌కి కోలుకోలేని దెబ్బ తగిలిందనడంలో సందేహం లేదు. ముస్లిం సోదరుల తెల్లటోపీలు పెట్టుకొని ఓల్డ్‌సిటీలో హలీం, బిర్యానీ తిని, నాలుగు ఉర్దూ మాటలు చెప్పినంత వీజీ కాదు ముస్లిం సమాజాన్ని బోల్తా కొట్టించడం అని ఈ పాటికి అర్థం అయ్యుంటుంది. అంతే కాకుండా మైనారిటీల పట్ల వివక్షతపై ప్రజాసంఘాల, లౌకికవాదుల మండిపాటు చూసి ఖంగు తిన్నారు పెద్ద పెద్ద నాయకులు. ఒక్క సీటు ఓడిపోతే ఓడిపోయారు కానీ, అసలైన రంగులు చూసే అవకాశం కలిగింది.
మళ్లీ జీవితంలో మోసపోకుండా ఒక గుణపాఠం. సెంటిమెంట్, ఎమోషన్ మీద కట్టిన భవంతుల పునాదులు ఎక్కడో కదిలినట్లు, ఆకాశంలో, అరచేతిలో స్వర్గం చూపించినట్టు తెలంగాణని చూపించి సొమ్ముచేసుకున్న వోట్లు వెక్కిరిస్తున్నట్టు తెలంగాణ పార్టీలు భావించడం సమంజసమే. రాజకీయ పదవులకు, ఊకదంపుడు ఉపన్యాసాలకు పేరుగాంచి, ఉర్రూతలూగించిన 'కారు బొమ్మ'కి కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి.
అంతో ఇంతో జాక్‌ని అడ్డం పెట్టుకొని నడిపిస్తున్న ఉద్యమం కాస్త అటకెక్కే పరిస్థితి దాపురించింది. జాక్ అనగా ప్రజల ఆకాంక్ష, ప్రజా ఉద్యమ ఐక్య వేదిక. అటు ప్రజలను ఇటు రాజకీయ పార్టీలను సమన్వయ పరిచేది నిజమైతే, ఇవాళ రాజకీయ పార్టీలు జాక్‌ని దూరం పెడుతున్నారు. అంటే ప్రజలను దూరం పెడుతున్నట్టే అర్థం చేసుకోవాలి. వోటు రాజకీయాల ముందు ప్రజలు, ఉద్యమాలు, పిచ్చివారి పానాలు ఏపాటి? టిఆర్ఎస్‌కి ఉన్న బలం అంతా జాక్‌కి పోతుందేమో అని ముందు జాగ్రత్త చర్యగా ఆ పార్టీ నాయకులు ఆలోచించడంతో పాటు జగన్‌నే గెలిపిద్దాం అని మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ, పైకి పరకాల ఎన్నికల గురించి ఆచితూచి మాట్లాడడం నేటి పరిస్థితిలో తప్పకుండా సాహసమే. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న పార్టీలన్నింటితో జత కట్టడం అయిపోయింది,
ఇంక మిగిలింది జగన్ పార్టీ మాత్రమే. వారు ఏ ప్రాంతం వారు ఐతేనేమి, డీల్ మంచిగుండాలే! ఇప్పుడు సచ్చిపోయిన వాళ్ళు ఎనిమిది వందలే కదా, ఇంకొన్ని వందలు పోయినా మనకు పెద్ద లెక్కలోకి రావు. ప్రజల ప్రాణాలు ఇవ్వాళ చాలా చీప్. మహబూబ్‌నగర్‌లో ఒకవైపు తెలంగాణ అమ్మ కట్నం త్యాగం చేసిందని పెళ్ళికి వెళ్ళిన నాయకులకి, మరోవైపు ప్రాణం తీసుకున్న మరొక బిడ్డ దగ్గరకి పోవడానికి మనసొప్పలే. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని ఆలోచిస్తున్న అన్ని కుల, వర్గాల శ్రేణులు ఈ దగా కోరు పార్టీల నైజాన్ని పసిగట్టడంలో విఫలమౌతున్నాయి.
రెండు రోజుల క్రితం వరంగల్‌లో తెలంగాణ వనరుల పరిరక్షణ సదస్సు జరిగింది. ఒకవైపు తరలిపోతున్న నదులు, గుట్టలు, మైనింగ్ గురించి వక్తలు మాట్లాడుతుంటే, మరోవైపు అన్ని హోటళ్లు, ఇళ్లు రకరకాల పార్టీలతో నిండి ఉన్నాయని, అందరు రాజకీయ నాయకులు వారి వారి బలగాలతో మొహరించి ఉన్నట్టు మిత్రులు చెప్పుకొచ్చారు. వీరికి ప్రజా సమస్యలు ఏవీ పట్టవు. అందులో ముఖ్యంగా భూమి, నీళ్ళు అనే విషయాలు అసలు పట్టవు.
అసలు పరకాల ఎన్నికల మీద అత్యుత్సాహం చూపించడానికి ముఖ్య కారణాలు 1. మహబూబ్‌నగర్‌లో టిఆర్ఎస్ ఓడిపోవడం పోతే పోయింది కాని బిజెపి గెలవడం, ముస్లింలతో నానా చీవాట్లు తినడం. 2. కొండా సురేఖ అనే స్వచ్ఛమైన తెలంగాణ మహిళ పోటీ చేయడం, ఆమెను ముందు నిలబెట్టి వైఎస్సార్ పార్టీ నాయకుడు జగన్ తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడానికి జరుపుతున్న ప్రయత్నాలు. 3. బిజెపి రెట్టించిన ఉత్సాహంతో మేము సైతం అంటూ పోటీచేసి తీరుతాం అనడం. 4. టిడిపి నేతలు ఊరూరా తిరుగుతూ తమ బలాన్ని కూడా నిరూపిస్తామని వెనుకంజ వేయకపోవడం. 5. ఇంకా తెలంగాణ కోసం రాజీనామా చేసిన నళినీ, విద్యార్థులు, కవులు, కళాకారులు, ఇతరులు అనేకులు ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం. 6. తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం నెత్తిన మోస్తున్న జాక్ ఎటూ చెప్పలేక ఒకవైపు మదనపడుతూ, టిఆర్ఎస్ బహిరంగంగానే బహిష్కరిస్తున్నా కూడా నోరు మెదపలేని స్థితిలో ఉండడం.
ఇవి కాకుండా ఇంకా ఇతర కారణాలు ఎన్ని ఉన్నా, పరకాల ఎన్నికలు కొన్ని నిజాలని నిగ్గు తేలుస్తున్నాయి. ఇక్కడ ఎన్నికలు అంటే జయలలిత లాగా ఇంటికొక కలర్ టీవీలు వంటి ఖరీదైన సౌకర్యాలు కల్పించకపోయినా కూడా కనీసం ప్రజలు అనుభవిస్తున్న బాధలు కూడా వినే స్థితిలో లేరు. అందరూ తెలంగాణ వాదులే, తెచ్చేది, ఇచ్చేది కూడా అన్ని పార్టీలే. అధిష్ఠానం మాత్రం నిమ్మళంగా తెలంగాణ తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్నట్టుంది. ఇంతకీ ఇంతమందిలో ప్రజలు ఎవరిని గెలిపించాలి? ఈ ఒక్క సీటుతో నిజమైన తెలంగాణ ఎవరిని గెలిపిస్తే వస్తుంది. ఇదే మాట మహబూబ్‌నగర్‌లో, మొన్న జరిగిన ఉప ఎన్నికలలో కూడా చెప్పినారు కదా? సామాన్యుడికి ప్రశ్నలు తప్ప ఇంక మిగిలింది ఏమీలేదు.
ప్రజలు ఇంకా గొర్రెలు అనుకుంటున్న రాజకీయ పార్టీల వైఖరి చూస్తే జాలేస్తుంది. కెసిఆర్ బిజెపి మీద వ్యాఖ్యలు చూస్తుంటే ముక్కున వేలువేసుకోవాల్సిందే. ఆయనకి ఇవ్వాళ బిజెపి మతతత్వ పార్టీ అని జ్ఞానోదయం అయింది. అందులో నుంచి వచ్చిన నరేంద్రని తీసుకున్నపుడు కానీ, హార్డ్‌కోర్ బిజెపి నాయకురాలు విజయశాంతిని తీసుకున్నపుడు కాని, మొన్నటిదాకా చెట్టాపట్టాలేసుకొని, పార్టీల కండువాలు మార్చుకొని వారిని గెలిపించమని తిరిగినపుడు గుర్తుకు రాలేదు. జాక్‌ని సృష్టించినపుడు లేని ఆంక్షలు అన్ని ఇపుడు జాక్ మీద గుమ్మరిస్తున్నారు.
మహబూబ్‌నగర్ ఓటమికి కేవలం జాక్, కోదండరాం మాత్రమే బాధ్యులు అన్ని చెప్పుకొస్తున్నారు. వీరి పార్టీ ఏమిచేసింది అని ఎవరూ అడగకూడదు అని ముందు జాగ్రత్త పడుతున్నారేమో. తెలంగాణలో మాకు లేరు సాటి అనుకుని నిమ్మలంగా ఉన్న పార్టీకి కంట్లో నలుసులాగా తయారయింది బిజెపి. అసలే జాతీయ పార్టీ, ఇంకా బిజెపి కనుక గెలిస్తే మాకు మనుగడ లేదని తెలుసుకున్నట్టు వారి చర్యలే చెబుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో ముస్లింలు ఉన్నారు కనుక ముస్లిం కార్డ్ వాడారు, ఇక్కడ బీసీలు ఉన్నారు కనుక బీసీ కార్డ్ వాడాలే. ఏ పార్టీ అయినా కూడా ఇదే సూత్రం అనుకరించాలే. అదే రాజకీయ నంబర్ గేమ్. కులాల, మతాల గుప్పిట్లో ఎన్నికలను చుట్టగట్టి నడిపిస్తున్నా రాజకీయాలు, కుల సమీకరణలో బిజీ అయిపోయారు.
అసలు వీరికి కుల రహిత సమాజం గురించి మాట్లాడే అర్హత ఉందా? అసలు తెలంగాణ తేవడానికి ఈ లెక్కలకి ఏమిటి సంబంధం? ఇన్నేళ్ల స్వతంత్రం తరువాత కూడా మన లెక్కలు మారవా? ఫూలే, జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ జన్మదినాలు జరుపుకుంటున్న వారు ఈ కుల సమీకరణాలను చూసి ఏమి సమాధానం చెబుతారు? ఎవరు లౌకిక వాదులు? అసలు జాక్ ఏర్పడినప్పుడు ఎంతోమంది, సంఘాలుగా, వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా ఉండమని కోరితే పెడచెవిన పెట్టారు.
ఇపుడు రాజకీయ నాయకులకు సంతృప్తిని ఇవ్వలేక అసహాయస్థితిలో ఉంది జాక్. ప్రజా ఉద్యమాలు వేరు, రాజకీయ పార్టీల ఉద్యమాలు వేరు అని ఇప్పుడు కొత్త పాఠాలు నేర్చుకోవాలేమో. ఇక్కడ కులం, మతం పునాదుల మీద లేని పార్టీ ఏది? ఉన్న పార్టీలను మనం దరిదాపుల్లో కూడా రానివ్వం కదా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను నిర్ణయించేది కూడా అగ్రకుల శక్తులే, పార్టీలే.
తెలంగాణ అనుకుంటూనే ఇంత మంది నిలబడడం తెలంగాణకు ద్రోహం చేయడమే. ఇపుడు పరకాలలో నిజానికి టిఆర్ఎస్, బిజెపి నిలబడి సాధించేది ఏమీ లేదు. అక్కడ నిలబడే కంటే ముందు ఎవరు ఏవిధంగా తెలంగాణను తీసుకొస్తారు అన్న విషయం స్పష్టంగా, సూటిగా చెప్పాలి. మేము గెలిస్తే వస్తాం, తెలంగాణ తెస్తాం అనే డైలాగ్ చాలా అరిగిపోయిన రికార్డ్. ప్రజలను స్వచ్ఛందంగా తమకు కావలసిన వ్యక్తిని ఎన్నుకొనే పరిస్థితి కల్పించనంత కాలం ఈ రాజకీయాలు మారవు. ఉత్తర తెలంగాణ, ఆ మాటకొస్తే తెలంగాణ అంతా దోపిడీకి గురి అవుతున్నది. దీనిని మాట్లాడకుండా కేవలం వోటు కోసం మాత్రమే మాట్లాడితే ప్రజలకు ఒరిగే ప్రయోజనం లేదు. ఉద్యోగాలు, చివరికి కూలి పని కోసం కూడా ప్రజలు తన్నులాడుతున్నారు.
ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పార్టీల అజెండాని పక్కనపెట్టి ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యట్లేదు. ఇవాళ పార్టీలు పుట్టినదే తమ మనుగడ కోసం సమాజంలోని అసమానతలను పెంచి పోషిస్తున్న అన్ని రాజకీయ పార్టీలను కనీసం తెలంగాణ మొత్తంగా బహిష్కరించాలి. గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రజలు నాయకుల కపట చిత్రాలు చూసి అలిసిపోయారు. ఈ కుట్రల ముసుగులో ఇంకా ఎక్కువ రోజులు రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోలేవు. తెలంగాణ రాని తీసుకురాని పరకాలలో ఎవరో ఒకరిని, ఉద్యమకారులని గెలిపించడం న్యాయం. ఇప్పుడు ఉన్న పార్టీలలో మనుషులు ఎలాంటి వాళ్ళో అందరికీ అర్థం అయింది. ఇప్పుడు కనీసం నిబద్ధత కొలమానంగా ఉన్న వాళ్ళ కోసం వెతకడంలో తప్పులేదు.
- సుజాత సూరేపల్లి
Andhra Jyothi News Paper Dated : 22/05/2012
No comments:
Post a Comment