Tuesday, May 8, 2012

బీవేర్ ఆఫ్ బీఫ్ పాలిటిక్స్! - సుజాత సూరేపల్లి



మానవ హక్కులు, అందులో దళితుల హక్కులు, జీవించే హక్కు, స్వేచ్ఛ, వీటి నిర్వచనాల గురించి ఇపుడు, ఈ కాలంలో చెప్పుకోవలసి రావడం సిగ్గుచేటు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృతీ చిహ్నంగా జరుపుకున్న బీఫ్ ఫెస్టివల్ విద్యార్థుల మధ్య ఇపుడిపుడే గట్టిపడుతున్న సంబంధాలను దెబ్బతీస్తుంది అని కొందరు వాపోతుంటే, ఇది దళితుల చావు బతుకుల సమస్యగా మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇంకాస్త ముందుకెళితే బీఫ్ తినని వాడు, వద్దనే వాడు కూడా దళిత వ్యతిరేకులనే ముద్రను కూడా వేస్తున్నారు. 

శరత్ నలిమెల గొంతు ఇంటర్నెట్‌లో 'బీఫ్ ఇజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ' అని మార్మోగుతుంది. కంచె ఐలయ్య, వినోద్ మరికొందరు ప్రొఫెసర్లు దీనికి వెనుక ముందు ఉండి నడిపిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అన్ని విశ్వ విద్యాలయాలలో దీని గురించి చర్చ అనివార్యమైంది. ఈ చర్చ ఎపుడో అపుడు జరగవలసిందే. అయితే ఇపుడున్న పరిస్థితులలో ఎవరు ఎక్కువ ఈ సంఘటనని అడ్డం పెట్టుకొని లాభపడుతున్నారు అనే చర్చ తప్పకుండా జరపవలసి వుంది. 

బీఫ్ తినడాన్ని ఒక వర్గం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటున్నాం. ఎవరు ఆ వర్గం? హిందూత్వ వాదులు అయితే వారు ఏ కులం వారయి ఉండాలి? అగ్ర కులాలు మాత్రమే వ్యతిరేకిస్తే మనం దీనిని కుల సమస్యగా అంటగట్టవచ్చు. కాని ఇక్కడ మెజారిటీ విద్యార్థులు బహుజనులే, క్రింది కులాల వారే అడ్డుపడుతున్నపుడు, మనం దీనిని మతానికి సంబంధించిన సమస్యగా మాత్రమే చూడాలి కదా! అయితే దీనిని కేవలం దళితులూ వర్సెస్ అగ్ర కులాల కుట్ర అనడానికి వీలు లేదు. 

రెండో విషయం, బీఫ్ ముస్లింలు, ఇతర కులాలు, రాష్ట్రాల వారు తింటున్నపుడు, దీనిని దళితులు మాత్రమే నెత్తిన పెట్టుకొని బరువు మోయడం కూడా అక్కర్లేదేమో. బీఫ్ ఒక కులానికి, అంటరానితనానికి చిహ్నంగా ఉన్నా కూడా, ప్రపంచీకరణలో ఆహారపు అలవాట్లు అందరి అలవాట్లుగా మారాయి. వేజిటేరియనిజం అనేక కారణాలతో అనేకులు, అన్ని కులాల వారు పాటిస్తున్నారు. అగ్రకులాలలో అత్యధికులు మాంసం తింటున్నారు. 

బీఫ్ తింటున్నారు కాబట్టి వాటి ధరలు కూడా పెరిగిపోతున్నాయి అని చాలా సార్లు మాంసం అమ్మే వాళ్ళు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం మనకు తెలియక కాదు. బీఫ్ తినే వారందరూ ఏకం అయితే ఇది కొంతమంది సమస్యగా మనం చూడక్కర్లేదు. దీనిని బీఫ్ తినని ఒక మైనారిటీ వర్గం వారు మరొక మెజారిటీ వర్గం వారిని మతం పేరుతో, పవిత్రత పేరుతో, వారి ఆహారపు హక్కుని కాలరాసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది అందరూ ప్రశ్నించవలసిందే. 

నిజానికి ఎస్ఎఫ్ఐ, పిడిఎస్‌యు, కొన్ని తెలంగాణ సంఘాలు కలిసి నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్‌ని అడ్డుకుంటున్న వారు, వారు మాట్లాడుతున్న భాషని ఎవరూ సమర్థించడం లేదు. వీరు ఎక్కువగా లెఫ్ట్ సంఘాల బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినట్టు కనపడుతుంది. లెఫ్ట్ సంఘాలకి ఒక అవగాహన, కొన్ని విషయాలలో పరిపక్వత ఉన్నట్టు మనకు తెలుసు. తెలంగాణ విషయం అంటే అందరూ వస్తారు కాని మా జన్మ హక్కు అయిన బీఫ్ తినడానికి ఎవరూ ఎందుకు ముందుకు రావడం లేదు అని నిర్వాహకులు బాధపడుతున్నారు. 

ఇవాళ తెలంగాణ అంటే ఒక అగ్రకుల ఉద్యమం, అగ్రహార హక్కుల కోసం పోట్లాడుతున్నట్టు మలచబడుతున్నది, కనపడుతున్నది. వేరే విధంగా కనబడడానికి ఆస్కారం లేదు కూడా. చచ్చేవాళ్ళు, చీపుర్లు, కర్రలు పట్టుకొని జై తెలంగాణ అనేటోల్లు అందరూ అమాయకులు, కులాల కుంపట్లు తెలియనోళ్లు కాని అందరికీ తెలంగాణ వొస్తే న్యాయం జరుగుతుంది అని ముందుకు పడేటోళ్ళు. మండల కమిషన్ అపుడు కూడా దళితులు ముందు పడ్డ విషయం మనకు తెలుసు. కనీసం ఈ ఒక్క సారన్నా తెలంగాణ పేరుతో అందరూ ఒక్కచోట జమ అయితే చూసే అదృష్టం వచ్చింది, అందులో రంగులు చూడడంలోనే ఆలస్యం అవుతుంది. 

అంబేద్కరిజం ఇక్కడ పనికి రావడం లేదు, సంస్కృతి గురించిన చింత ఎవరికీ లేదు అని, వచ్చినోడే మనోడు, రానోడు మనువాది అని ముద్రలు వేస్తున్నారు బీఫ్ ఫెస్టివల్ నేతలు. నిజమే, ఈ దేశంలో లెఫ్ట్ అండ్ రైట్ సంఘాలకి తేడా ఉంది. రైట్ లోను, లెఫ్ట్ లోను మనవాళ్ళే ఉండడం, ఉండేట్టుగా వ్యవస్థని తయారు చేయడం ఈ దేశంలో హిందూ మతం తత్వశాస్త్ర సారాంశం, ఏకైక సిద్ధాంతం. అందరికీ న్యాయం అందించడంలో అంబేద్కర్ చూపించిన మార్గంలోకి ఎవరూ పోకుండా ఈ రైట్, లెఫ్ట్ వింగ్‌లు చాలా జాగ్రత్తగా తమ పాత్రను పోషిస్తుంటాయి. 

ఒకడు కొట్లాడుతుంటడు, ఇంకొకడు అడ్డుపడుతుంటడు, రైట్‌లో మనోడే, లెఫ్ట్‌లో మనోడే. ఒక అన్న బిజెపి నోట్లోంచి ఊడిపడితే మరొకరు మార్క్స్, మావో నోట్లోంచి, చూసేటోల్లు, వినేటోల్లు అందరూ అన్న తమ్ముళ్లే, మనవేలు, మన కన్ను. కళ్ళు తెరిచి చూసే సరికి ఉన్న నలుగురు నాలుగు దిక్కులు. ఈ విభజనలు కుటుంబాల దగ్గరి నుంచి రాజకీయాల దాకా విస్తరించాయి. అరవై ఏళ్ల తరువాత కూడా ఈ కుట్రల పర్యవసానం తెలుసుకొనే దశకి ఉద్యమాలు చేరుకోలేదు. 

ఆ అవకాశం కూడా మనం ఇవ్వట్లేదు. ఇప్పటికీ పాఠ్య పుస్తకాలలో ఉత్తమ పురుషుడు రాముడు, ఉత్తమ స్త్రీ సీతగానే చెప్పే చదువులు ఉన్న చోట, సమ్మక్క, సారక్క పండగలతో సహా అన్ని దేవుళ్ళని హిందూ దేవుళ్ళుగా మార్చివేసే చోట, నర నరాల్లో నాలుగు దిక్కుల నుంచి హిందూత్వాన్ని చొప్పిస్తున్న చోట మార్పు అంత సులభం కాదు. దానికి చాలా శిక్షణ అవసరం. అన్ని శక్తులను పసిగట్టే స్థితికి దళితులూ బహుజనులు చేరుకోవట్లేదు, ఆ అవకాశం కనుచూపు మేరలో కనబడట్లేదు. ఇలాంటి సందర్భంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడం ఒకందుకు మంచిదే అయినా, బాగుపడేది మాత్రం శత్రువే. 

ఇపుడు కాకపోతే ఎపుడు ఇట్లాంటి విషయాలని మాట్లాడాలి? మంచి ముహూర్తం చెప్పండి అని ఒక మిత్రుడు అడిగితే ఏమి సమాధానం చెప్పాలి? పొరలు పొరలుగా ఉన్న కులాల కుళ్ళును కడిగేయడం ఒక పగలు, ఒక సంవత్సరంలో సాధ్యమేనా? నన్ను నేను సరిచేసుకుంటూ, నా నమ్మకాలని సంస్కరించుకుంటూ, ప్రజాస్వామ్యీకరించుకునే అవకాశాన్ని కల్పించడం ప్రజాస్వామ్య, 

బహుజనులందరి బాధ్యత కాదా?
ఫూలే, పెరియార్, అంబేద్కర్ పాఠాలు ప్రతి పిల్లవాడికీ నోటికి వచ్చిన రోజు, బ్రాహ్మణ భావజాలానికి దూరంగా దళిత బహుజనులు అందరినీ తీసుకుని వచ్చిన రోజు మాత్రమే ఆహారం కూడా ఒక సంస్కృతీ చిహ్నం అని అర్థం అవుతుంది. అసలు సంస్కృతి, హక్కులు అన్నీ హిందూ కళ్ళతో మాత్రమే చూడాలని అంటుంటే ఇంక లోకం ఎపుడూ కాషాయంలోనే కనబడుతుంది. ఈ కాషాయంలో నుంచి బయటపడ్డప్పుడే కుట్రలను తిప్పి కొట్టగలుగుతాం. లేకపోతే మళ్లీ మనమే మన కోసమే మనల్ని మనం దూరం చేసుకుంటాం. అపుడు అక్కడ మనమే, ఇక్కడ మనమే. 

శత్రువు ఇపుడు జరిగే విభజనపై ఒక వికటాట్టహాసం చేస్తూ మరో పది కాలాల పాటు వాడి స్థానం కాపాడుకుంటాడు. ఇది విభజన సమయం కాదు, ఎన్ని కష్టాలు పడి అయినా ఏకమయ్యే సమయం. అంబేద్కర్ చెప్పిన ముఖ్య సూత్రాలైన భూమిని జాతీయం చెయ్యడం, దాస్య విముక్తి కావడం, హిందూ మతం నుంచి విముక్తి కోసం పోరాటాలు చేస్తేనే ఇక్కడ బతకడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బతుకు ఉన్నపుడే జీవితం, సంస్కృతీ కాపాడబడతాయి. ఇవన్నీ జరగాలంటే ఒక అడుగు ముందున్న వాళ్ళు నలుగురిని నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందే. ఆ తరువాతనే ఇటువంటి అంశాలను తీసుకొని ముందుకు పోవాలి. - సుజాత సూరేపల్లి

Andhra Jyothi News Paper Dated : 09/05/2012 

No comments:

Post a Comment