Wednesday, May 16, 2012

ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టం ఎలా ఉండాలి ?--జాన్‌వెస్లి



  • రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ (ప్రత్యేక ప్రణాళిక) నిధుల్లో గత 19 సంవత్సరాల్లో ఎస్సీలవి 17,970 కోట్లు, ఎస్టీలవి 5 వేల కోట్లు కోత పెట్టారు. కేంద్ర ప్రణాళికా బడ్జెట్‌లో గత 10 సంవత్సరాలలో ఎస్సీలకు ఖర్చు చేయాల్సిన నిధుల్లోనే 5 లక్షల కోట్లు కోత పెట్టారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రణాళికా బడ్జెట్‌లలో గత 60 సంవత్సరాల కోత, దారి మళ్లింపు వివరాలు చూస్తే లక్షల కోట్లు దళిత, గిరిజనులు కోల్పోయారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఉండవచ్చు.
దేశవ్యాపితంగా దళిత, గిరిజనులు సామాజిక, ఆర్థిక దోపిడీి అణచివేతకు గురౌతున్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో కేటాయిస్తున్న నిధులు వారి దరిచేరక అన్ని రంగాలలోనూ అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారు. ఈ స్థితిని మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లలో దళిత, గిరిజనుల జనాభా శాతానికి తగ్గకుండా నిధులు ప్రత్యేకంగా కేటాయించి వారి ప్రయోజనాలకే ఖర్చు చేసేందుకు 1980లో ఎస్సీ స్పెషల్‌ కాంపోనెంట్‌ ప్లాన్‌, ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ రూపొందించి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఎస్సీలకు మన రాష్ట్ర, కేంద్ర ప్రణాళికా బడ్జెట్‌లలో 16.2 శాతం, గిరిజనులకు రాష్ట్రంలో 6.6, కేంద్రంలో 8 శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాల్సి ఉంది. 2011 జనాభా ప్రకారం అయితే మన రాష్ట్రంలో ఎస్సీలకు 18, ఎస్టీలకు 8 శాతానికి పైగా కేటాయించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు కలిపి 8 శాతానికి మించి ఖర్చు చేయడం లేదు. ఖర్చు చేశామంటున్న నిధుల్లో సగం దళిత, గిరిజనేతరులకు దారి మళ్లింపు, బినామీ పేర్లతో అవినీతికి పాల్పడుతున్నారు. సబ్‌ప్లాన్‌ అమలుకు సూచనలే తప్ప సమగ్ర చట్టం లేదు. ఇది పాలకుల్లో చిత్తశుద్ధి లేమిని తెలియజేస్తున్నది.
రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ (ప్రత్యేక ప్రణాళిక) నిధుల్లో గత 19 సంవత్సరాల్లో ఎస్సీలవి 17,970 కోట్లు, ఎస్టీలవి 5 వేల కోట్లు కోత పెట్టారు. కేంద్ర ప్రణాళికా బడ్జెట్‌లో గత 10 సంవత్సరాలలో ఎస్సీలకు ఖర్చు చేయాల్సిన నిధుల్లోనే 5 లక్షల కోట్లు కోత పెట్టారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రణాళికా బడ్జెట్‌లలో గత 60 సంవత్సరాల కోత, దారి మళ్లింపు వివరాలు చూస్తే లక్షల కోట్లు దళిత, గిరిజనులు కోల్పోయారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఉండవచ్చు.
అందుకే స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాల తరువాత కూడా అన్ని రంగాల్లో అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారు. ఈ నిధులన్నీ సక్రమంగా ఖర్చు చేసి ఉంటే అన్ని దళిత, గిరిజన వాడలు అభివృద్ధి చెంది ఉండేవి. ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలతో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఉండవచ్చు. అన్ని దళిత, గిరిజనవాడలకు రక్షిత మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, కమ్యూనిటీ హళ్లు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కల్పించి ఉండవచ్చు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమ హాస్టల్స్‌లో సౌకర్యాలు మెరుగుపర్చడమేకాక పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు ఇవ్వొచ్చు. ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా సబ్సీడి రుణాలు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇవ్వొచ్చు. అలాచేస్తే అన్ని రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉండేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పాలక పార్టీలు, దళిత, గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారినే దోపిడీ చేస్తున్నాయి.
మన రాష్ట్రంలో సబ్‌ప్లాన్‌ (ప్రత్యేక ప్రణాళిక) అమలుకై కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఉద్యమిస్తూనే ఉన్నది. 2007లో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బివి రాఘవులతోపాటు 25 మంది నిరవధిక దీక్షలు, చలో అసెంబ్లీ ఫలితంగా రాష్ట్రంలో సబ్‌ప్లాన్‌ అమలుకు ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలను ఏర్పాటు చేసింది. ఆనాటి నుండి జనాభా ప్రకారం నిధులు కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు. కానీ సబ్‌ప్లాన్‌ (ప్రత్యేక ప్రణాళిక) నిధులను ప్రభుత్వం నోడల్‌ ఏజెన్సీలకు కేటాయించడం లేదు. కోత, దారి మళ్లింపు కొనసాగుతుంది. సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులుతోపాటు ఎస్‌.వీరయ్య, నాగయ్య, బాబురావులు 6 రోజులు నిరవధిక నిరాహర దీక్ష చేశారు. కెవిపిఎస్‌, వ్యకాస, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ జరిగింది. సబ్‌ప్లాన్‌ (ప్రత్యేక ప్రణాళిక) అమలుకు చట్టంపై మేధావులతో కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మాట తప్పారు. ఈ సంవత్సరం బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కెవిపిఎస్‌తోపాటు ఇతర 100 దళిత, గిరిజన, ప్రజా సంఘాలు, రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులు, మేధావులతో ఐక్యకార్యచరణ కమిటీిగా ఏర్పడి ఉద్యమించింది. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు మద్దతునిచ్చారు. ఐక్యకార్యచరణ కమిటి ఆధ్వర్యంలో కెవిపిఎస్‌తోపాటు 10సంఘాల నుండి 10 మంది 72 గంటలు దీక్ష చేశారు. ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులను, సంఘాల నాయకులను అరెస్టు చేసింది. అధికార పార్టీలోని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఐక్యమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, న్యూడెమోక్రసీ నాయకులు వెంకటేశ్వరావుతోపాటు అన్ని సంఘాల నాయకులు, వందలాది మంది దళితులు చట్టం ప్రకటించేంతవరకు కదిలేది లేదని రెండు రోజులు బైఠాయించడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. 2 నెలల్లో చట్టం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మా చైర్మన్‌గా 9 మంది మంత్రులతో సబ్‌కమిటీి ఏర్పాటు చేసింది. కమిటీ ఈ నెల 16 నుండి జిల్లాల పర్యటనలు చేస్తున్నది. కాలయాపన చేయకుండా సమగ్ర చట్టం తీసుకురావాలి.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ (ప్రత్యేక ప్రణాళిక) అమలుకు ఈ క్రింది ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుని సమగ్ర చట్టం తీసుకురావాలని కోరుతున్నాం.
చట్టంలో ఉండాల్సిన అంశాలు


ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చట్టం తీసుకురావాలి.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ జనాభా శాతానికి తగ్గకుండా రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలి.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగానే ప్రణాళికా బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ జనాభా శాతానికి తగ్గకుండా నిధులు వేరుచేసి ఆ మొత్తం నిధులన్నీ ముందుగా ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలకు కేటాయించాలి.
కేంద్ర ప్రణాళికా బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ప్రకారం రావాల్సిన నిధులను కూడా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలకు కేటాయించాలి.
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో నుండి రాష్ట్రానికి కేటాయించే కెేంద్ర సహాయం కూడ ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలకు కేటాయించాలి.
తరతరాలుగా దళిత, గిరిజనులు సామాజిక, ఆర్థిక అణచివేతకు గురౌతున్నారు, వారి అభివృద్ధికి 5 శాతం నిధులు అదనంగా కేటాయించాలి.
రాష్ట్ర ప్రణాళికా బడ్టెట్‌లో ఎస్సీ, ఎస్టీల జనాభా శాతానికి అనుగుణంగా నిధులు కేటాయించగా మిగిలిన జనరల్‌ బడ్జెట్‌లో అందరితోపాటు ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు వినియోగించాలి. జనరల్‌ బడ్జెట్‌లో ఎస్సీ ఎస్టీలకు ఖర్చు చేసిన నిధులను సబ్‌ప్లాన్‌ నిధులుగా పరిగణించరాదు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను వారికి ప్రత్యక్ష ప్రయోజనం కలిగించే వాటికి మాత్రమే ఖర్చు చేయాలి. దళిత, గిరిజన నివాస ప్రాంతాల అభివృద్ధి రక్షిత మంచినీరు, రోడ్లు, డ్రైనేజి, వీధి లైట్లు, మరుగుదొడ్లు, కమ్యూనిటీ హాల్స్‌, సంక్షేమ హాస్టల్స్‌, విద్యా, స్కాలర్‌షిప్‌లు, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్‌ సబ్సిడీ రుణాలు, భూముల అభివృద్ధి తదితర ప్రత్యక్ష ప్రయోజనాలు కల్గించే వాటికి ఖర్చు చేయాలి.
సబ్‌ప్లాన్‌ నిధుల్లో కోత విధించడం, దారి మళ్లించడం, బినామీ తదితర రూపాల్లో అవినీతికి పాల్పడితే తిరిగి రాబట్టడంతోపాటు కఠిన శిక్షలు విధించాలి.
అనివార్య పరిస్థితుల్లో ఖర్చు కాకుండా నిధులు మిగిలితే మురిగిపోనివ్వకూడదు. ఆ నిధులను వచ్చే సంవత్సరం సబ్‌ప్లాన్‌ నిధుల్లో కలిపి అదనంగా కేటాయించాలి.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలకు ప్రత్యేకంగా ఐఏఎస్‌ స్థాయి అధికారులను, జిల్లా స్థాయి వరకు ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాలి.
వీటిని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలతో అనుసంధానం చేయాలి.
రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌తోపాటు మున్సిపల్‌ కార్పోరేషన్‌, మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్‌, మండలం, గ్రామ పంచాయితీలు, స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయంలో బడ్జెట్‌లలో స్థానిక ఎస్సీ, ఎస్టీ జనాభా శాతానికి అనుగుణంగా నిధులు కేటాయించి,
ఖర్చు చేయాలి.
1980 నుండి కోత, దారి మళ్లించిన సబ్‌ప్లాన్‌ నిధులను దశల వారీగా తిరిగి కేటాయించాలి.
సబ్‌ప్లాన్‌ అమలుకు రాష్ట్ర, జిల్లా, డివిజన్‌, మండల, మున్సిపాల్టీలు, కార్పోరేషన్ల స్థాయిల్లో ''సామాజిక తనిఖీల వ్యవస్థ'' లేక అథారిటీ కమిటిలను ఏర్పాటు చేయాలి.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, తదితర సమస్యలపై సంవత్సరానికి రెండు లేదా అంతకు ఎక్కువ సార్లు ప్రజాపథం లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల ఖర్చు కోసం ప్రణాళికను పార్టీ, ప్రజా సంఘాలు, సంస్థలతో చర్చించి ప్రతి సంవత్సరం రూపొందించాలి. శాసనసభలో ఆమోదం పొందాలి.
ఎస్సీ, ఎస్టీ ప్లానును సరైన విధంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సంబంధిత మంత్రులతో, శాఖాధిపతులతో, తరచు అనగా కనీసం మూడు నెలలకొకసారైనా పర్యవేక్షణ సమావేశాలను ఏర్పాటు చేసి, ఏవిధమైన తప్పొప్పులున్నట్లైతే వాటిని సవరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
జిల్లా స్థాయిలో కలెక్టరు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సంయుక్త కలెక్టరు సహకారంతో ఈ ప్రత్యేక పథకాల అమలును కనీసం నెలకొకసారైనా పర్యవేక్షించాలి. తప్పులు చేసి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌, శాఖాపరమైన చర్యలను తీసుకోవాలి.
పై అంశాలు అమలు చేయని శాఖలు, అధికారులు, సంబంధిత మంత్రులు, ప్రజాప్రతినిధులు, బాధ్యులను ఉద్యోగం, పదవుల నుండి తొలగించడంతోపాటు కఠినంగా శిక్షించే విధంగా చట్టంలో ఉండాలి. దళిత, గిరిజనేతరుడైతే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్‌ 4 ప్రకారం శిక్షించాలి.
ఈ అంశాల సాధనకోసం దళిత, గిరిజన, ప్రజా సంఘాలు సంఘటితంగా ఉద్యమించాలి. అన్ని రాజీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. ముఖ్యమంత్రి చెప్పిన 2 నెలల్లో వాగ్దానంలో 49 గడిచిపోయాయి. ఆందుకు మరో 45 రోజులు అంటున్నారు. కాలయాపన జరగకుండా అమల్లోకి తెచ్చేవిధంగా కృషి చేయాలి.
(రచయిత కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) 
Prajashakti News Paper Dated : 16.05.2012 
-జాన్‌వెస్లి

No comments:

Post a Comment