Monday, May 7, 2012

అసత్యాలు - అబద్ధాలు--- - ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక


అసత్యాలు - అబద్ధాలు

ఉస్మానియా యూనివర్సిటీ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ విద్యార్థులు నిర్మించిన 'పెద్దకూర సాంస్కృతిక విప్లవం'పై ఎబివిపి జాతీయ కార్యదర్శి కడియం రాజు గత నెల 19న 'ఆంధ్రజ్యోతి'లో పూర్తిగా అసత్యాలు, అబద్దాలను ('పెద్దకూర పండుగ రోజున..!') రాశారు. ఈయన రాతలకు ప్రజలంతా నవ్వుకుంటున్నారు. బ్రాహ్మణేతర సామాజిక వర్గాలను అంతం చేయడమే లక్ష్యంగా పుట్టిన ఆర్.ఎస్.ఎస్.కు అనుబంధ సంస్థ ఎబివిపి. వేల సంవత్సరాలుగా ఈ దేశంలోని అట్టడుగు అణగారిన దళిత బహుజన ఆదివాసీలను అత్యంత నీచంగా చూస్తూ, అంటరాని తనాన్ని పాటించిన మనువాదానికి పుట్టిన విద్యార్థి సంస్థ ఎబివిపి. దాని రాజకీయ, సాంస్కృతిక, సామాజిక వివక్ష సిద్ధాంతంలో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన పెద్ద కూర పండుగను ఆ సంస్థ తీవ్రంగా విమర్శించింది. 

భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి బయటి ప్రపంచానికి చెబుతూనే వీరు మాత్రం అతి పెద్ద మల్టీనేషనల్ కంపెనీల షాపుల్లో పిజ్జా బర్గర్‌లు తింటారు. వేల రూపాయలు ఖర్చుచేసి విదేశీ విందులకు అలవాటు పడ్డ నాయకులకు భారతీయ సాంప్రదాయిక ఆహారమైన బీఫ్ విదేశీ ఆహారంగా కనిపించడం మాకేమీ వింతగా అనిపించడం లేదు. బుద్దుడు, అంబేద్కర్ సాంస్కృతికోద్యమ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఏర్పాటు చేసిన పెద్దకూర సాంస్కృతిక విప్లవం వీరి ఆరాచకాలకు అడ్డుకట్ట వేస్తుందని భయం. అందుకే తెలంగాణకు వ్యతిరేకంగా ఈ పండుగ జరుగుతుందని అసత్య ప్రచారాలకు పూనుకున్నారు. 

అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘాలన్నీ తెలంగాణ రాష్ట్ర సాధనకు భావజాలాలకు అతీతంగా సమైక్యమయ్యారు. ఈ ఐక్యతను దెబ్బతీయడానికే ఏ ఒక్క యూనివర్సిటీ జెఎసిలో భాగస్వామ్యం కాలేదు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ విద్యార్థుల నాయకత్వంలో ఏర్పడ్డ జెఎసికి మద్దతు ఇవ్వలేదు. రెడ్డి, వెలమ, రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పడ్డ పొలిటికల్ జెఎసిలో మాత్రం భాగస్వాములయ్యారు. అణగారిన వర్గాలు రాజకీయంగా బలపడటం, ఎదగటం, ఎబివిపి, బిజెపి, ఆర్.ఎ స్.ఎస్, వి.హెచ్.పి, భజరంగ్‌దళ్‌లకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. 

ఓయులో పెద్దకూర పండుగకు హాజరైంది పట్టుమంటే పది మందేనని వీరు మాట్లాడడం సత్యాన్ని బలవంతంగా కప్పిపెట్టడమే. పోలీసులు, ఎబివిపి ఎన్ని అడ్డంకులు కల్పించినా దాడి చేస్తామని పదే పదే హెచ్చరించినా రెండువేల మంది హాజరయ్యారు. 'తెలంగాణలో వరస ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పెద్దకూర పేరుతో పండుగ చేసుకోవడం ఎందుకు?' అని ప్రశ్నించే వీరికి వందల మంది పిట్టల్లా రాలుతున్నా దసరా, దీపావళి, గణష్, హోళి, బతుకమ్మ, రామనవమి, హనుమాన్ జయంతి, శోభా యాత్రలు, యజ్ఞయాగాదులు జరుపుతున్నారు. 

ఆత్మహత్యలు ఆపడానికి దళితులు మాత్రమే పండుగలు రద్దు చేసుకోవాలా? వందల మంది చస్తున్నా, చంపబడుతున్నా బ్రాహ్మణీయ, మనువాద పండుగలు మాత్రం నిరంతరాయంగా కొనసాగాల్సిందేనా? ఇది సాంస్కృతిక అరాచకవాదం కాక మరేమవుతుంది? అసలు ఈ దేశంలో దళితుల్ని ఏనాడైనా కనీసం మనుషులుగానైనా చూశారా? 'సోదరుల్లా కలసి ఉన్న విద్యార్థుల్ని విడగొట్టేందుకే పెద్దకూర' కుట్ర జరిగిందని చెప్పడం నీచం కాదా? ఒకవేళ అంద రు సోదరుల్లా కలిసి ఉంటే తెలంగాణ ఉద్యమంలో అందరితో కలవకుండా ఎందుకు విడిగా ఉన్నారు? ఉస్మానియాలో ప్రస్తుతం ఫూలే, అంబేద్కర్, పెరియార్, మార్క్స్‌ల సైద్ధాంతికతతో దళితులు మనువాదంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు మనువాదానికి అంబేద్కర్ వాదానికి మధ్య జరుగుతున్న యుద్ధమే తప్ప మరోటి కాదు. 

పెద్దకూర పండుగను ఆకాశానికెత్తడానికి మీడియా ప్రయత్నించిందని చెప్పడం ముమ్మాటికీ అబద్ధం. పండుగ నిర్వాహకులు సంపూర్ణంగా సంయమనం పాటించినప్పటికీ పరస్పరం విద్యార్థులు రాళ్లు రువ్వుకున్నారని మీడియా దుష్ప్రచారం చేసింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న ప్రదేశంలో ఉన్న మీడియా వాహనాలపై ఎబివిపి దాడిచేసి దహనం చేసింది. పండుగ వ్యతిరేకంగానైనా సరే వార్తలు ప్రసారం కావడాన్ని వారు భరించలేకపోయారు. 'బలవంతంగా విద్యార్థులకు బీఫ్ తినిపిస్తున్నారని' ఎబివిపి దుష్ప్రచారం చేసింది. 

బీఫ్ తినే మనుషుల్ని నీచంగా చూడడం అంటరానితనం పాటించడం అమానవీయం అని చెప్పడం కోసం మాత్రమే ఫెస్టివల్ ఏర్పాటు చేశాం తప్ప ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా బీఫ్ తినాలని మేము ఎవరినీ ఒత్తిడి చేయలేదు. తినడాన్ని తినకపోవడాన్ని బలవంతంగా నిర్దేశించడం మా కార్యక్రమం కాదు. ఇష్టం ఉన్నవారు తినొచ్చు అని ముందే చెప్పాం. కానీ నీచంగా చూస్తే సహించమని కూడా హెచ్చరించాం. మా హెచ్చరిక సైద్ధాంతికమైందే కాని భౌతికమైంది కాదు. మేం తినే ఆహారాన్ని ఎవరూ నిరోధించలేరు. ఇది బాబాసాహెబ్ మాకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు. 

ఇకనైనా బీఫ్ ఫెస్టివల్‌కు వ్యతిరేకంగా పనిచేయడాన్ని ఎబివిపి మానుకోవాలి. ఎద్దుకూర తినడానికి వ్యతిరేకం కాదని దళితుల ఆహార హక్కులను సంపూర్ణంగా గౌరవిస్తామని జాతీయ, రాష్ట్ర కమిటీల్లో తీర్మానం చేయాలి. దళితులు, ఆదివాసీలు, బహుజనులు, మైనార్టీల సంస్కృతిపై జరుగుతున్న బ్రాహ్మణీయ హిందూత్వ దాడులకు వ్యతిరేకంగా బహిరంగ ఉద్యమాలు చేయాలి. ఇదంతా ఎబివిపికి అసాధ్యమని తెలుసు. దాని లక్ష్యం హిందూ, బ్రాహ్మణ రాజ్యస్థాపనే అనీ తెలుసు. వ్యతిరేకం కాద ంటూ, దాడులకు పాల్పడుతున్న ఎబివిపిపై దళిత, బహుజన, ఆదివాసీ, మైనార్టీలు దేశవ్యాప్తంగా సైద్ధాంతికంగా యుద్ధం ప్రకటిస్తున్నాం. 

- ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక
ఉస్మానియా విశ్వవిద్యాలయం
Andhra Jyothi News Paper Dated : 08/05/2012 

No comments:

Post a Comment