Saturday, May 5, 2012


ఏమి నేరము చేసెరా! తెలగాణ
ఒక తండ్లాడే జీవితంలో, జీవన విధానంలో జరిగే పరిణామాలన్నీ తెలంగాణ అనుభవించింది. అది సంక్షుభితమయింది. రాటు తేలింది. అది పోరాడింది. ఓడింది. తన గాయాలను తాను తడుముకున్న ది. కానీ.. ఎన్నడూ అది దేన్నీ పూర్తిగా వదులుకోలేదు. లొంగుబాటును ప్రదర్శించలేదు. ఒక పతనం నుంచి అది ఉత్థానమై లేచి నిలుచున్నది. పడిన కెరటమై, విరిగిపడి అలసిసొలసిన అలయై మళ్లీ లేచిన తరంగమయింది. ఒక ఒంటరి సమాజం. ఒక దక్కన్ పీఠభూమి. తాను వేరుగా జీవించింది. విశిష్ట సంస్కృతులను కన్నది.

ఒక చరివూతను ఆవిష్కరించింది. ఆవాహన చేసింది. ప్రపంచం దిగ్గున కళ్లు తెరిచి చూసేలా అది బుడ్డగోసి గాళ్లతో, దళం కట్టిన మట్టిపాదాల రైతాంగానికి గొట్టపు తుపాకుల యుద్ధం నేర్పింది. పొలంగట్ల మీద నడిచే ఒరం చెక్కే, ఒడ్డు పెట్టే, నడుమొంచి నాటే సే, భూమిని పొతం బట్టే సాదాసీదా ముతక నూలు గుడ్డల, కట్టెపేగుల రైతు కూలీలను తెలంగాణ గెరిల్లా యోధులను చేసింది. నక్సల్బరీ నిప్పురవ్వలు వసంతమేఘ గర్జనలై హడావుడిగా ఆకాశమార్గాన వెళ్తుంటే భూమార్గం పట్టించి జగిత్యాల జైత్రయాత్ర చేయించింది తెలంగాణ. జైత్రయాత్ర జైత్రయాత్ర దోపిడిపై దండయాత్ర. అది గైర్‌ముల్కీ నినాదమై సిటీ కాలేజీ దగ్గర పూచిన మంకెనపూలను కన్నది. పందొమ్మిది వందలా అరవై తొమ్మిదై రాజ్‌భవన్ రోడ్డులో ప్రాణాలను అర్పించింది. అరవై ఏళ్లుగా అది తన ఆత్మను తాను వెదుక్కుంటూ మరణ శాసనాలు రాసుకున్నది. చచ్చిపోయిన శవాలు. చచ్చిపోయిన మనుషులు బతికి బరిగీసిన వీధులవుతు న్న సంరంభం. నెవర్ గివ్ అప్.. అవును తెలంగాణ ఎప్పుడూ లొంగిపోలేదు. అది చరిత్ర మాత్రమే కాదు. వర్తమానం కూడా.. తెలంగాణ ఎన్న డూ ప్రవాహంలేని నిలవనీరులా నిశ్చల జీవితం కోరుకోలేదు. అదొక ఆటుపోట్ల సముద్రం. పడతాం. లేస్తాం.

బీడు భూముల్లో నీళ్లు పారని చెలకల్లో, నిప్పచ్చి కాలరావూతుల్లో, ఎవుసం జేసి వెయిపుట్లు పండించగలిగిన రైతు పోరాట పటిమ తెలంగాణది. కాని కాలాలు, కాటేసే కరువులు, మోసం చేసే రుతువులూ అయినా బతికి ఉండి, నాగేటి చాళ్లల్లో మొలకలై మొలిచే రైతు జాతి తెలంగాణది. ఓడిపోతాం. ఎవుసం ఓ యేడు పంట రాదు. అయినా నేల మనది. భూమి మనది. పోరాడే తత్వం మనది. పోరాడుతాం. చివరికంటా.. బహుశా ఈ విషయం ఎవరికన్నా ఎక్కువ ఢిల్లీలో పెత్తనం చేస్తున్న బధిరాంధ్ర ప్రభుత్వాలకు అర్థం కావలసి ఉన్నది. రాజ్యసభలో మళ్లీ సాలుబెట్టి విలీనం నుంచి ఇప్పటి దాకా సిగ్గులేని దోపిడీని మళ్లీ ఓసారి చెప్పించుకుంటున్న పెద్దలందరికీ తెలియాల్సి ఉన్నది. అవును తెలంగాణది ఒక చరిత్ర. పోరాడే చరిత్ర. ఓటమినీ పోరాటంగా మలుచుకునే నిత్యగాయాల నది తెలంగాణ. ఎప్పుడూ దేన్నీ వదలని తత్వం.

అందుకే తెలంగాణ జీవితం కళలను కన్నది. సాహిత్యం రేకులై పరిమళించింది. జీవన గానం చేసింది. పాటై ప్రవాహవేగ కాలగతిని ఉరుకులు పరుగులు పెట్టింది. మొగులు ముట్టిన మబ్బుల ఛాయలు, కుండపోతగా కురిసిన వాన, మేఘ గర్జనలు ఇక్కడి పాట. మాట. ఆట. తెలంగాణ దానికదిగా ఒక విశిష్ట భూమి. తెలంగాణ దానికదిగా ఒక ఓటమి ఎరుగని యోద్ధ. తెలంగాణ దానికదిగా ఒక ధిక్కారం పాట. అడవుల్లో, మదిగిన మడుగు నీళ్లలో, లొద్ది మానుల్లో, ఇప్పపూల వనాల్లో మైమరపించే చందమామ పాట. అడవి గర్భాల్లో చెట్లకు కాసిన నిరసన గీతిక. జీవన ప్రతిబింబమయ్యేదే ఇక్కడి వాక్యం. ఇక్కడి సాహిత్యం. ఇక్కడి కళ.

అన్నెందుకు... మీకు తెలుసా! పత్రికా ప్రపంచంలో ఇవ్వాళ్ల ఏలుతున్న సంపాదకుపూవరు. ఈ భూమి బిడ్డలే. రామచంవూదమూర్తి, వర్ధెల్లి మురళి, కే. శ్రీనివాస్. టంకసాల అశోక్, కే, శ్రీనివాస్‌డ్డి, వినయ్‌కుమార్ సంపాదకులందరూ తెలంగాణ జీవన విధానం నుంచి ఎదిగివచ్చిన వారే. నిజం గా ఒక శుద్ధ వాక్యం. ఒక వేగ వచనం. ఒక పదునెక్కిన పదం. సూటి విశ్లేషణ. ఎవరి తరం. నార్ల వెంక గోరాశాస్త్రి, మల్లారెడ్డి, నండూరి రాంమోహన్‌రావు, పొత్తూరి, ఐవీఆరూ, ఏబీకే ప్రసాదు, శాస్త్రి, శర్మ, మూర్తి, దీక్షితులు ఏలిన పత్రికా ప్రపంచాన్ని ఇప్పుడు ఏలుతున్న వారెవ రు? ఎందుకిలా జరిగింది. విజయవాడ కేంద్రంగా రాజ్యమేలిన పత్రికల్లోకి తెట్టులా తేలివచ్చిన ఈ సంపాదకులు తెలంగాణ నుంచే ఎందుకిలా ఎదిగివచ్చారు. నిజమే సంపాదకుడవడం అంత వీజీ కాదు. యజమానుల రాజ్యంలో సంపాదకుడికి రాతకోతలను మించిన లౌకిక తెలివితేటలేవో ఉండాలి తప్పదు.

కానీ ఒక వాక్యంతో మొప్పించగలిగిన ధీశాలి సంపాద క తరం ఎదిగింది ఇక్కడి నుంచే. ఆ మాటకొస్తే రెండు ప్రభావాలతో తెలంగాణ జర్నలిస్టు తరం ఎదిగివచ్చింది. భాషేరాదని వెక్కిరించిన ప్రాంతం నుంచి, మీ భాష తెలుగు కాదన్న ప్రాంతం నుంచి వీరెట్లా వచ్చారు. రెండు విప్లవాల సంరంభం మధ్యలో నడిచిన సంక్షోభ కాలాల నుంచి ఎదిగి వచ్చిందీ తరం. అందరూ ఏదో ఒక వామపక్షీయ భావజాలాల ప్రభావితులే. తెలంగాణ సమాజం అనుభవాల పొడ తగిలినవారే. ఆలోచనలన్నీ ఈ భూమి చుట్టూ అల్లుకున్నవారే. బహుశా వీరెవరికైనా మేము ఒక ప్రాంతానికి చెందిన సంపాదకులమా? అన్న కించిత్ అభ్యంతరమూ ఉండవచ్చు. కానీ, ప్రింట్ మీడియాలో ఇంత మంది తెలంగాణ సంపాదకులు ఉండడమంటే ఆశ్చర్యమే అంటాను. నిజమే. రెండు పరిణామాలు ఇవ్వాళ్ల ఇక్కడి సమాజం నుంచి సుసంపన్న సాహిత్యాన్ని, కళలను, ఆటలను, పాటలను, బతుకును అందిచ్చిందో? అదే సమాజం అదే పరిణామాలు జర్నలిస్టులను, సంపాదకులను కూడా అందించింది.

ఈ సమాజ ప్రత్యేకతల నుంచి ఎదిగి వచ్చిన తరం ఆటుపోట్ల నుంచి ఎదిగిన వారే. ఈతరం సంపాదకులు. ఒకటి తెలంగాణ సాయుధ పోరాటం నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం సాధిస్తే, నక్సల్బరీ కరీంనగర్, ఆదిలాబాద్‌లను అంటించింది. జీవితం ఇక్కడ ఏమంత సొబగుగాలేదు. అట్ల ని అది ఏ పరిష్కారమూ ఇవ్వలేదు. కానీ తెలంగాణ ఇక్కడి ప్రజానీకానికి గొప్ప జీవితానుభవాలను ఇచ్చింది. కాకలు తీరిన వీరయోధులను తయా రు చేసింది. సామాజిక రంగంలో అది మకుట సమానమైన సంపాదకుల ను తయారు చేసుకున్నది. పత్రికలు, వాటి యజమానులు, పెట్టుబడులు ఎవరివైనా కావొచ్చు. వాళ్లకెన్ని పరిమితులైనా ఉండవచ్చు. కానీ ఒక నిర్వహణా సామర్థ్యం కోసం మంచి వాక్యం కోసం, ప్రపంచాన్ని ఆకళింపు చేసుకుని సాకల్యంగా వివరించగలిగిన జ్ఞానం కోసం ఇప్పుడు పత్రికలు తెలంగాణ మీద ఆధారపడవలసిందే. అదొక అనివార్యత, అట్లని ఆంధ్ర నుంచి ఎదిగి వచ్చిన ఈ తరం జర్నలిస్టు సోదరులకు అర్హతలు లేవనికాదు.

వాళ్లు ఒక నిరామయ ప్రపంచంలో నిశ్చలంగా బతకనేర్చారేమొ కానీ.. ప్రతిస్పందనలు కరువై గిడసబారి పొయ్యారు. క్షమించాలి. అట్లని లేరన లేం కానీ.., ఇన్ని యుద్ధాలు, ఇన్ని పోరాటాలు, ఇన్నేసి ఓటములు, పడిలేవడాలు.. అన్నీ అనుభవించిన తెలంగాణ ఇప్పుడు సంపాదకుల నిచ్చిం దీ నిజమే. నా సహచర జర్నలిస్టులు ఆంధ్ర మిత్రులు చాలామంది మధ్య లో ఆగిపొయ్యారు. మంచి వాక్యం ఉన్నవాళ్లూ బతుకు యావలో ఇదే సర్వ స్వం అని నమ్ముకోలేదు. కొందరెట్లాగూ మినహాయింపు. ఇదొక పరిశీలన మాత్రమే కాదు. చేదు యధార్థం. కానీ.. ఇంత చైతన్యం, ఇంత ప్రతిభ, ఇన్నేసి కళలు, ఇంత పాండిత్యం, ఎడిటర్లను తయారు చేయగలిగిన జీవితం లో ఒక విషాదం నిండుకున్నది. తెలంగాణ ఓటమిని అంగీకరిస్తున్నదా? తెలంగాణ విలవిలలాడిన ఒక నిస్సహాయ వలె తనను తాను బలిచేసుకుంటున్నదా? సిగ్గులేని చట్టసభలు, సిగ్గులేని పౌర సమాజం, న్యాయం, ధర్మం లేని ఇరుగు పొరుగు, నక్కజిత్తులు, హైనా క్రూరత్వం కలిగిన రాజ్య స్వభావానికి బెంగటిల్లి ఎనిమిది వందల మంది మరణించడమా? సంపాదకు లూ, మనమూ, మనమూ.. నిస్సహాయ తెలంగాణను నిలబెట్టలేమా? ఇంతకీ...

ఏమి నేరము చేసెరా! తెలగాణ
ఎదనిండగాయాపూరా.
ఎందుకో! ఏడుపొస్తున్నది. తెరలు, తెరలుగా..
దశాబ్దాల దుఃఖం.. పోరాడేవాడిదే తెలంగాణ.
-అల్లం నారాయణ
( ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్‌కు అభినందనలు..
Namasete Telangana News Paper Dated : 06/05/2012 

No comments:

Post a Comment