Tuesday, June 12, 2012

మార్క్సిజం మైలపడుతుందా?---- జయరాజు



సమాజంలో రెండే వర్గాలుంటాయని వాటి మధ్య జరిగే వర్గపోరాటమే ప్రధానమని చెప్పే మార్క్సిజం ఒక్కటే ఈ దేశ దళితుల, బహుజనుల, ఆదివాసీల, మైనారిటీల విముక్తికి సరిపోదు. 1920లో ఎంఎన్‌రాయ్, అబానీ ముఖర్జీ, శాంతిదేవి రాసిన తొలి ఇండియన్ కమ్యూనిస్ట్ మానిఫెస్టోలో ఎక్కడా కుల ప్రస్తావన లేదు. కానీ అంబేద్కర్ 1916 మే 9న తన ప్రఖ్యాత వ్యాసం భారత దేశంలో కులాలు రచించాడు. అదే అంబేద్కర్‌కు ఇండియన్ కమ్యూనిస్టులకు ఉన్న తేడా. 

సమాజంలోని వ్యక్తి ఎల్లప్పుడూ ఒక వర్గంలోని సభ్యుడే. వర్గమూ, కులమూ ఇరుగుపొరుగుల్లాంటివి. వాటి మధ్య దూరం ఒక జాన. దడి కట్టుకున్న వర్గమే కులం. బ్రాహ్మణ వర్గం కులవ్యవస్థను పుట్టించింది. బ్రాహ్మణులు తమను ఒక కులంగా చేసుకున్నారు. తద్వారా బ్రాహ్మణేతర కులాల్ని సృష్టించారు. వెలికి గురయిన వారందరూ ఒక కొత్త కులంగా ఏర్పడ్డారు. కొందరు తలుపులు మూసారు. కొందరికి తలుపులు మూతపడ్డాయి - అంబేద్కర్ 

బలిపీఠం, నీడతో యుద్ధం, రామాయణ విషవృక్షం, చైనాలో ఏం జరుగుతుంది మొదలైన తన రచనలు, అనువాదాలతో మాలాంటి ఎందరో దళితుల, ఆదివాసీల, బహుజనుల హృదయాల తలుపులు తెరిచిన రంగనాయకమ్మ గారికి వందనాలు. కాలగమనంలో మీ నిజమైన వర్గకుల పునాదిలోకి వెళ్లిపోతూ మా జాతులకు తలుపులు మూసివేస్తున్నందుకు దళిత అభివందనాలు. జై బుద్ధా.. జై పూలే.. జై భీమ్. మీరు రాసిన దళిత పరిష్కారానికి 'బుద్ధుడు చాలడు అంబేద్కర్ చాలడు మార్క్స్ కావాలి' చదువుతుంటే కలిగిన ఎలపరం వల్ల ఆ పుస్తకం పూర్తిగా చదవలేకపోయినందుకు క్షమించండి. 

మార్క్స్ గతితార్కిక భౌతికవాదం. అంబేద్కర్ కుల నిర్మూలన ఉద్యమం రెంటి మధ్య భయంకరమైన శత్రువైరుధ్యం ఉందని రంగనాయకమ్మ చిత్రించాలని చూస్తున్నారు. వాటి మధ్య ఉన్నది మిత్ర వైరుధ్యం అని మేం భావిస్తున్నాం. మార్క్స్ గతితార్కిక భౌతికవాదం ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఊడిపడలేదు. హెగెల్ గతితార్కిక భావవాదం, ఫ్యూర్ బా యాంత్రిక భౌతిక వాదం రెంటిని జమిలి చేసి సరికొత్త గతితార్కిక భౌతిక వాదం రెంటిని జమిలి చేసి సరికొత్త గతితార్కిక భౌతిక వాదం తయారుచేసాడు కారల్ మార్క్స్. 

భారతదేశ ప్రత్యేక చారిత్రక పరిస్థితుల్లో మార్క్స్ గతి తార్కిక భౌతిక వాదం, అంబేద్కర్ కుల నిర్మూలన ఉద్యమాన్ని కలపకూడదా? దానివల్ల మార్క్సిజం ఏమైనా మైలపడిపోతుందా? మార్క్సిజం మడికట్టుకు కూర్చోవాలా? మార్క్సిజాన్ని ఒక సైన్సుగా రంగనాయకమ్మ అంగీకరిస్తే ఈ వీరపూజలు ఉండేవి కావు. న్యూటన్‌ని పూజిస్తూ కూర్చుంటే ఐన్‌స్టీన్ ఏం కనిపెట్టలేడు కదా. కె.జి.సత్యమూర్తి ఏనాడు ఈ వీరపూజలు చేయలేదు. 

ఇలాంటి వీరపూజలను అంబేద్కర్ నిరసించాడు. 'ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి బట్టకట్టాలని నిజంగా కోరుకునేవారు వీరపూజను విడనాడాలి. దేశానికి జీవితాంతం ఎనలేని సేవలు అందించిన మహాపురుషుల ఎడల కృతజ్ఞతాభావం కలిగి వుండాల్సిందే. అయితే, కృతజ్ఞతా భావానికి ఒక పరిమితి వుండాలి. ఏ పురుషుడు కృతజ్ఞతా భావంతో తన శీలాన్ని బలిపెట్టలేదు. ఏ జాతీ కృతజ్ఞతా భావంతో తన స్వేచ్ఛను విడనాడలేదు.' 240 పేజీలకు పైగా రాసిన అంబేద్కర్ సూర్యుడు పుస్తకంలో ఎక్కడా అంబేద్కర్‌ని వీరపూజ చేయలేదు. అంబేద్కర్‌పై రంగనాయకమ్మ చేసిన విమర్శల్లో ఏడు అంశాలను సబబైనవిగా ఆయన అంగీకరించాడు. 

రంగనాయకమ్మ గారి వీరపూజ ఎంత వరకూ వెళ్లిందంటే మార్క్సిజాన్ని అభివృద్ధి చేసిన లెనిన్, మావో, చేగువేరాల ఎడల ఆవిడ వైఖరి ఏంటో తెలియదు. మార్క్సిజాన్ని వేదంలా పరిగణించి అన్ని వేదాల్లోనే ఉన్నాయష అన్నట్టు భావించుకునే హక్కు ఆవిడకు ఉంది. కాని లెనిన్, మావోలు అలా భావించలేదు కాబట్టే వాళ్ల దేశాల్లో విప్లవాలను విజయవంతం చేయగలిగారు. అయితే మార్క్సిజం అమలులో రష్యా, చైనా, తూర్పు యూరప్ దేశాలు, వియత్నాం, కంపూచియా ఎదుర్కొన్న సమస్యలకు సమాధానాలు అక్కడికి వెళ్లే అధ్యయనం చేయక్కర్లేదు. 

బెంగాల్, కేరళ కూడా వెళ్లక్కర్లేదు. కృష్ణాజిల్లా కాటూరులో అగ్ర కుల కమ్యూనిస్టులు వ్యాపారవర్గాలుగా, నల్గొండ జిల్లా వెలిదండలో అగ్రకుల నక్సలైట్లు ఎలా దిగజారిపోయారో ఓ కేస్ స్టడీలా చూడవచ్చు. దొరలుగా ఉన్న అగ్రకుల కమ్యూనిస్టులు, నక్సలైట్లు నాయకులుగా మారితే దళితులు, బహుజనులు, ఆదివాసీలు కార్యకర్తలుగా మారారు. ప్రాణం, మానం, ఆస్తి ఒక్క మాటలో చెప్పాలంటే సర్వస్వం త్యాగం చేసారు. 

రంగనాయకమ్మ చెప్పినట్టు అంబేద్కర్ చెప్పింది ఒకే ఒక్క సిద్ధాంతం, అది మార్క్సిజం పనికిరాదు, దాని జోలికి పోవద్దు అని కాదు. 'ఏ తత్వశాస్త్రానికైనా ఆచరణే గీటురాయి. ఈ దృక్పథం నుండి మనం పనిచేయగలిగితే రష్యాలో విప్లవం విజయం సాధించడానికి చేసినంత శ్రమ, పట్టినంత కాలం భారతకదేశ విప్లవోద్యమానికి పట్టదని నేను దృఢంగా నమ్ముతున్నాను. కష్టజీవుల వర్గపోరాటదానికి సంబంధించి కమ్యునిస్టు తత్త్వ శాస్త్రమే మనకు సన్నిహితం''అని అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఆవిడ పచ్చిగా వ్యతిరేకించే కెజి సత్యమూర్తి తన 'అంబేద్కర్ సూర్యుడు' పుస్తకంలో ఇదే కొటేషన్ ప్రస్తావించారు. అంబేద్కర్‌ని పూర్తిగా చదవకుండా మా దళిత హృదయాలను మీ బ్రాహ్మణ అగ్రకుల అహంకారంతో గాయపరచకండి. కెజి సత్యమూర్తిగారు ఇప్పుడు సమాధానం చెప్పలేదు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరణలకు పూనుకోండి. 

సమాజంలో రేండే వర్గాలుంటాయని వాటి మధ్య జరిగే వర్గపోరాటమే ప్రధానమని చెప్పే మార్క్సిజం ఒక్కటే ఈ దేశ దళితుల, బహుజనుల, ఆదీవాసీల, మైనారిటీల విముక్తికి సరిపోదు. 1920లో ఎంఎన్‌రాయ్, అబానీ ముఖర్జీ, శాంతి దేవిలు రాసిన తొలి ఇండియన్ కమ్యునిస్ట్ మానిఫెస్టోలో ఎక్కడా కుల ప్రస్తావన లేదు. కానీ అంబేద్కర్ 1916 మే 9న తన ప్రఖ్యాత వ్యాసం భారత దేశంలో కులాలు రచించాడు. అదే అంబేద్కర్‌కు ఇండియన్ కమ్యూనిస్టులకు ఉన్న తేడా. తొంభై ఏళ్ళకు పైగా సాగిన కమ్యూనిస్టు ఉద్యమం. 

ముక్కచెక్కలైన కమ్యూనిస్ట్ పార్టీలు ఏనాడైనా కుల నిర్మూలనకు ఒక కార్యక్రమం రూపొందించారా? వారు సరే మార్క్స్ అలిఖిత వీలునామా అమలుకు వకాల్తా తీసుకున్న రంగనాయకమ్మ ఏనాడైనా కుల నిర్మూలన ఎలా చేయాలో రాయడానికి పూనుకున్నారా. ఇప్పటికైనా రంగనాయకమ్మ తన శేష జీవితంలో భారత దేశ విముక్తి సిద్ధాంతాన్ని రూపొందిస్తే మా దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీలు పరిశీలిస్తాయని హమీ ఇస్తున్నాం. ఎందుకంటే 'ఎక్కడ చదివిన విషమయైనా, ఎవరు చెప్పినా, చివరకు నేను చెప్పినా సరే, నీ స్వంత లోక జ్ఞానం. నీ సొంత హేతువు అంగీకరించకుండా దేనిని నమ్మకు' అని బుద్ధడు చెప్పిన మాటలను మే విశ్వ సిస్తున్నాం. 

శారీరక, వైవాహిక, వ్యవసాయక, రాజకీయ అంటరాని తనాలకు, వివక్షకు మార్గాలు సత్యమూర్తి తన పుస్తకంలో వివరంగా రాశారు. మాకు కలిగిన ఎలపరం లాంటిదే మీకు కూడా కలిగి 'అంబేద్కర్ సూర్యుడు' పుస్తకం పూర్తిగా చదవకుండా మీరు ఈ వ్యాసం రాస్తే మా దళితులు. బహుజనులు, ఆదివాసీలు, మైనారిటీలు చిరునవ్వుతో మీ రాతల్ని క్షమిస్తారని ఆవిస్తున్నాను. 'పాలకవర్గం మేధావుల్ని ఎంత ఎక్కువగానైతే తనలో ఇముడ్చుకుంటుందో అంత స్థిరంగాను, అంత ప్రమాదకరంగాను దాని పాలన తయారవుతుంది.' అన్న మార్క్స్ వాక్యం మీ విషయంలో నిజమయ్యిందనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో వర్గమే కులం. 

కులమే వర్గం. దానికి మినహాయింపులుండవచ్చు. రంగనాయకమ్మ గారి మనసును మనువాదం ఒక వైరస్ లా క్రమక్రమంగా ఆక్రమించుకుంటుందనే అనుమానం కలుగుతుంది. వెనుకటిలా మళ్ళీ మీరు మా దళితుల, బహుజనుల, ఆదీవాసీల, మైనారిటీల అభిమానం పొందాలంటే కెజి సత్యమూర్తి చెప్పిన బుద్ధుడిని, మార్క్స్, అంబేద్కర్ జమిలి తత్వంతో మీ మనసును పరిశుభ్రం చేసుకోవాల్సిందే.

దళిత కవి
Andhra Jyothi News Paper Dated : 13/06/2012 

No comments:

Post a Comment