Tuesday, June 5, 2012

టిఆర్ఎస్‌కు కాంగ్రెస్ వరం! - కంచ ఐలయ్య



రాజ్యపరిపాలనలో చాలా చిక్కులుంటాయి. ఒక చిక్కు ముడిని విప్పేందుకు మరో ముడి వెయ్యాల్సి వస్తుంది. ఈ చిక్కుముడుల చరిత్రలోనే పంజాబ్‌లో బింద్రేన్‌వాలా పుట్టాడు. ఆ రాష్ట్రాన్ని ఒక కొలిక్కి తేవడానికి చాలా కాలం పట్టి ంది. ఆ క్రమంలోనే ఇందిరాగాంధీ బలైంది. ఎట్టకేలకు ఇప్పుడా రాష్ట్రం ఓ కొలిక్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అటువంటి సంక్లిష్ట దశలో ఉంది. 2009 సెప్టెంబర్‌లో రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత రోశయ్య ప్రభుత్వం ఏ దశలోనైనా కూలిపోయే ప్రమాదంలో పడింది. జగన్, కెవిపిలు అందుకు అన్ని ప్రిపరేషన్లు చేసుకున్నారు. 

రోశయ్య ప్రభుత్వం కూలిపోయి జగన్ ప్రభుత్వం వస్తే రాష్ట్రం నుంచి ఎన్నికైన 33 మంది కాంగ్రెస్ ఎంపీల్లో కనీసం 30 మందైనా జగన్-కెవిపి ఒడిలోకి వచ్చేవారు. దాంతో కేంద్ర ప్రభు త్వం సంక్షోభంలో పడేది. ఈ మహత్తర ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్, చంద్రశేఖర్‌రావును ఆమరణ నిరాహారదీక్ష లోకి దింపింది. ఇక తరువాత కథ తెలిసిందే. ప్రాంతీయ యుద్ధ ప్రకటనలు, పైసల జెఎసీలు, రాజీనామాలు, జగన్-కెవిపి ఐక్యతకు అంతం వంటివి జరిగాయి. 

తెలంగాణ-ఆంధ్ర తోలు బొమ్మ ల మధ్య అనునిత్యం యుద్ధం జరిగింది. ఒక రాజకీయ వీధి బాగోతంలో జగన్ గుప్పిట్ల నుంచి మొత్తం తెలంగాణ ఎమ్మల్యేలు (ఒక్క కొండా సురేఖ తప్ప), ఎంపీలు కాంగ్రెస్ గంప కింద కాపాడబడ్డారు. ఎంపీల్లో కోమటి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మేల్యేల్లో కోమటి వెంకట్ రెడ్డి ఇప్పటికీ ఆ సంబంధాల్లో ఉన్నారనే అనుమానాలున్నాయి. మొత్తం మీద జగన్ మాయలోంచి తెలంగాణ ఎమ్మెల్యేలను, ఎంపీలను కాపాడుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కాపాడుకున్నది. 

జగన్ అరెస్టు అయిన తెల్లారి ఇచ్చిన బంద్ కాల్‌కు తెలంగాణలో ఒక్క ఆటో కూడా ఆగలేదు. టిఆర్‌యస్ బంద్ కాల్ ఇచ్చినా లేదా ఏ చిన్న జెఎసి ఇచ్చినా ప్రభుత్వం బస్సులాపి బందు జయప్రదమయ్యేట్టు ఎన్నోసార్లు చేసింది; ఇది మనం చూశాం. ఇలా జరిగేట్టు చూడాలనేది కాంగ్రెస్ హై కమాండ్ టిఆర్‌యస్‌కు ఇచ్చిన మ్యాండేట్. 2014 ఎన్నికల వరకు జగన్ పార్టీకి తెలంగాణలో పుట్టగతులు లేకుండా చూడాలనేది ఆ ఒప్పందంలో భాగం. 

కేంద్ర కాంగ్రెస్ దృష్టిలో టిఆర్‌యస్ ఏదో ఒక ధరకు ఎప్పుడంటే అప్పుడు కొనుక్కునే పార్టీ. కానీ జగన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తానే కొనగలిగే పార్టీ. ఐదేళ్ల అధికారంలో రాజశేఖర్ రెడ్డి ఒక పక్క ప్రజల్ని, రెండో పక్క కుటుంబాన్ని పార్టీలో తన అనుచరుల్ని ఎట్లా మాయజాలంలోకి నడిపాడో ఇప్పుడు మన ముందున్న పరిణామాల్లో చూడొచ్చు. జగన్‌ని, మహబూబాబాద్‌లో విద్యార్థులు అడ్డుకొని, వారి అనుచరుల్ని రాళ్ళతోకొడితే అదంతా ఇప్పుడు టిఆర్‌యస్ ఖాతాలో పడింది.

అంతెందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరు ఎంత శ్రమ పడ్డా, ఎంత కాలం పడ్డా, ఏ రూపంలో పడ్డా అది టిఆర్‌యస్ ఖాతాలో పడుతుంది. అంతిమంగా జరిగేదేమంటే టిఆర్‌యస్ రేట్లు పెరిగి కాంగ్రెస్ ఎప్పుడంటే అప్పుడు కొనుక్కోగలిగే సరుకుగా అది ఉంటుంది. ఇదొక వింత చారిత్రక దశ. దీన్నే కొంతమంది ఉద్యమ దశ అంటున్నారు. 

ఒకప్పుడు జగన్ తిరిగినా, మునుముందు విజయమ్మ, షర్మిల తెలంగాణలో తిరిగినా జనం తండోపతండాలుగా వస్తారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులు తెలంగాణలో కూడా బలంగానే ఉన్నారు. వారిని ఈ ప్రాంతంలో తిరక్కుండా ఆపే శక్తి కాంగ్రెసుకు లేదు. టిడిపికి అంతకన్నా లేదు. వారిని అడుగు పెట్టకుండా ఆపే శక్తి ఒక్క టిఆర్‌యస్‌కు మాత్రమే ఉంది. ముందుగా పరకాలకు వాళ్ళను రాకుండా ఆపాలి. ఆ తరువాత 2014 వరకు వాళ్ళను తెలంగాణలో తిరక్కుండా ఆపాలి. జాతీయ స్థాయిలో బిజెపికి జగన్ కుటుంబంతో మంచి సంబంధాలున్నాయి. రాష్ట్ర బిజెపి అభ్యర్థన మేరకే వాళ్ళు సపోర్టును వాయిదా వేసుకున్నారు. 

గాలి జనార్ధన రెడ్డి, జగన్ వంటి పెద్ద మనీ పార్టీలను బిజెపి ఎన్నడూ ఎదురించదు. ఆ పార్టీ, 'లక్ష్మి' ఎక్కడ వుంటే అక్కడ వాలుతుందని మనకు తెలుసు. తెలంగాణలో జగన్‌కు స్థానం లేకుండా కూడా చెయ్యడంతో పాటు టిడిపిని కూడా టిఆర్‌యస్ బలహీనపర్చింది. ఇది ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందంలో లేకపోయినా, అదనంగా కలిసివచ్చిన అదనపు విలువ. ఆ పార్టీకి తెలంగాణ వ్యక్తిని అధ్యక్షుణ్ణి చేసే అవకాశం లేదు కనుక ఈ అదనపు విలువను పెంచుతూ పోవచ్చు. 

ఇప్పుడు పరకాలలో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం లేదు. జగన్ పార్టీ గెలవద్దు. ఇది తక్షణ కర్తవ్యాలలో ఒకటి. అందుకే జెఎసిని జైపాల్ రెడ్డి ఇప్పుడు ఇటు తిప్పాడు. మహబూబ్‌నగర్‌లో అటు తిప్పాడని అందరికీ తెలుసు. అంటే 2009 ఆమరణ నిరాహార దీక్షతో స్టార్ట్ అయిన యాన్టీ-జగన్ పోరాటం, 2009 డిసెంబర్ 9, డిసెంబర్ 23, వందలాది విద్యార్థుల, అమాయకుల చావుల గుండా, సకల జనుల సమ్మె గుండా తెలంగాణ విద్యారంగం కుప్పకూలడం గుండా పయనించి జగన్ జైలుకు పోవడంతో ఒక కొలిక్కి వచ్చింది. ఈ మొత్తం మహత్తర కాంగ్రెస్ మేనేజ్‌మెంట్ పోరాటంలో టిఆర్‌యస్ విజయాల మీద విజయాలను సాధించుకుంటూ వచ్చింది. 

జనం చచ్చి, సమ్మెలు సాగి, విద్యారంగం విలవిలలాడి ప్రజలచేత రోడ్ల మీద బతుకమ్మ లాడించి కాంగ్రెస్‌ను ఇడుపుల పాయ ముప్పు నుంచి టిఆర్‌యస్ తప్పించగలిగింది. ఈ ఒప్పందంలో భాగంగానే ముడుపులపాయకు ఏ కంపెనీలు హవాలా ఖాతాలు లేకుండా కలెక్షన్ క్యాపిటల్ ద్వారా ఇక్కడ ఒక పేపర్, ఒక టివి వచ్చాయి. దీన్ని 'ఉద్యమ క్యాపిటల్'గా కూడా నిర్వచించవచ్చు. ఇదీ రూ.50,000 కోట్లకు చేరిందనే అంచనాలున్నాయి. 

ఇక్కడి మేధావివర్గంలో కొందరు 'వైఎస్ఆర్‌తో వెచ్చని కరచాలనం చేసినట్లు రావుతో నునుమెత్తని కరచాలనం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో అక్కడ అదుపు, అడ్డులేకుండా ఎట్లా ఇడుపుల పాయ పెరిగిందో, ఇక్కడా ఉద్యమ కాలంలో ముడుపుల పాయ అట్లానే పెరిగింది. దాన్ని పెంచింది కేంద్ర కాంగ్రెస్సే, దీన్ని పెంచింది కాంగ్రెస్సే. ఆ క్యాపిటల్ ఆంధ్రా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల అండతోనే పెరిగింది. ఇది వారి నల్లడబ్బు ట్రాన్స్‌ఫర్‌లోనే పెరిగింది. అయితే విజయమ్మ, షర్మిల కాన్వాయ్‌ని కూడా రాళ్ళతో కొట్టిస్తే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య ప్రాంతం కాదు. 

టిఆర్ఎస్‌కు కేంద్ర కాంగ్రెస్ రాసిచ్చిన జాగీర్. ఎవర్నైనా రాళ్ళతో కొట్టి ఆ రాళ్ళకు పూజచేసే హక్కు కేంద్రం, టిఆర్‌యస్‌కు పూర్తిగా ఇచ్చింది. ఈ అధికారం జగన్ జైలుకు పోయినంక కూడా అలానే కొనసాగుతుందా? 2014 ఎన్నికల వరకు అది అవసరమే అని కేంద్రానికి అనిపించవచ్చు. కాని ఇక్కడ దాదాపు ఐదేళ్ళు వసూళ్ళ పెట్టుబడి ఒకచోట జమైతే దాని ప్రభావం ప్రాంతం మీద ఎలా ఉంటుంది? చట్టపరంగా ప్రజల మధ్య పారాడాల్సిన డబ్బు పార్టీ యజమానుల ఇండ్లలో ఉంటే ఏం జరుగుతుంది? అక్కడ జగన్ కుటుంబం ఆడ-మగ టీమ్‌ల్ని రంగంలోకి దింపినట్లే ఇక్కడ రావు కుటుంబమూ దింపింది. 

రెండు కుటుంబాలకు రాజకీయ భాష తిట్లు-సాపెనలు, నిత్య విద్యలాగ నేర్చుకుంటున్నాయి. వాళ్ళు రాజశేఖర్ రెడ్డి 'ప్రజాదరణ' చావకుండా చూసుకుంటే వీళ్ళు 'తెలంగాణ నినాదం' చావకుండా చూడాలి. కేంద్ర కాంగ్రెస్ రాజశేఖర్‌రెడ్డిని నెత్తికెక్కించుకొని తిరిగినప్పుడు 'రావు'ను రాచపుండును చూసినట్లే చూసింది. ఇప్పుడు రావు రక్షకుడయ్యాడు. ఉద్యమాన్ని ఏ రూపంలో నడపమంటే ఆ రూపంలో నడపగల సమర్థుడు కూడ. అప్పుడు 'సీమ' కంపెనీలోకి పెట్టబడుల్ని వరదరానిచ్చినట్టు ఇక్కడ 'తెలంగాణ' కంపెనీకి పెట్టుబడుల్ని కాలువలు, కాలువలుగా రానిచ్చింది. అక్కడంతా 'దేవుడు' చూసుకుంటే ఇక్కడంతా 'చండేసి' చూసుకుంటుంది. వారిచుట్టూ ఉన్న మేధావులకు 'చండేసి' సిద్ధాంతం మార్క్స్ సిద్ధాంతం కంటే మహాకమ్మగా ఉంది. 

అయితే సిబిఐ ఏదో ఒకరోజు ఇటుకూడా కన్నుపెడుతుందా? ఏ దశలో ఆ స్థితి వస్తుంది? కాంగ్రెస్ 2014లో ఏ స్థితిలో బయటపడుతుందో ఆ స్థితిపై ఆధరాపడివుంటుంది. ఇప్పటివరకు ఉద్యమ సంపాదనలను ఎలా చూడాలనే అంశంపై చర్చ జరగలేదు టిఆర్‌యస్‌లా ఉద్యమం ద్వారా అంత పెద్ద మొత్తంలో సంపాదించిన పార్టీ ఇప్పటికి దేశంలోనే పుట్టలేదు. కాంగ్రెస్ కనుసన్నల్లో మొదటిసారి ఇటువంటి ఉద్యమం జరిగింది. ఇటువంటి పార్టీ పుట్టింది దినదినాభివృద్ధి గాంచుతూనే వుంది. ఇది మామూలు పరిణామం కాదు. ఇదొక చండేసి పరిణామం. 

తెలంగాణలో కిరణ్ కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఇప్పుడు తిరుగుతున్నారు. ఈ స్థితిలో జగన్ పార్టీని ఆపడానికి ఒక కొత్త భాష, కొత్త ఎత్తుగడ కావాలి. ఆ పార్టీని రాకుండా చూడడానికి టిఆర్‌యస్ తెలంగాణతో పాటు 'అవినీతి'ని కూడా జోడిస్తుంది. జగన్ సంపాదన క్రమంలో పరిటాల రవి లాంటి కొంత మంది తప్ప ఎక్కువ మంది చావలేదు తెలంగాణ సంపాదనలో ఏడెనిమిది వందల మంది చచ్చారు. కానీ తెలంగాణ రాలేదు. ఇక రాదని చనిపోయిన వారికి కూడా అర్థమైంది. 

తండ్రిని చంపిన రామున్ని అంగదుడు పూజించి పట్టాభిషేకానికి హాజరైనట్టు తెల ంగాణ రాకున్నా టిఆర్‌యస్ వారిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించి వారి 'పదవీషేకాల'కు హాజరుకావలసిన బాధ్యత చనిపోయిన వారి తల్లితండ్రుల మీద ఉన్నది. ఇది తెలంగాణ నినాద రక్షణ కోసం వారి మీద సమాజం ఉంచిన బాధ్యత! 

ఇక రానున్నవి ఎన్నికల ఉద్యమ రోజులు. తెలంగాణ కంపెనీ లోకి పెట్టుబడులు రావాలంటే తెలంగాణ ప్రజలు ఉద్యమంగా ఓటెయ్యాలి. ఓట్లు ఉద్యమాన్ని బలంగా నడుపడానికి జెఎసిలు ఉద్యోగాలు వదిలేసి తెలంగాణమంతా తిరుగుతుండాలి. వారికి ప్రభుత్వం ఇచ్చే జీతాలకంటే ఎన్నో రెట్లు ఎక్కువ జీతాలు ముడుతున్నాయని చెబుతున్నారు. ఉద్యమ కష్టకాలం ప్రజలకైతే ఉద్యమ పండుగ నేతలకు. అవినీతికి రాయలసీమ ఒక మార్గం వేస్తే, తెలంగాణ మరోమార్గం వేస్తుంది. కోస్తా రెంటి మధ్య అన్ని రకాల వ్యాపారం చెయ్యాలి. ఇప్పుడు ప్రాంతాల ఐడెంటిటి వ్యాపారాల ద్వారా నిర్ణయించబడుతోంది. 

ఈ ఐడెంటిటీ చుట్టూ కొత్త సిద్ధాం తం రాసే వారు కూడా కావాలి. కోట్లు చూసి జడ్జీలు లొంగి పోయినట్లు తెలంగాణ ఉద్యమ సంపాదన విప్లవకారులను వెముడాల రాజన్నకు మోకరిల్ల చేస్తుంది. జెఎసీల్లోనో, ఇతర ఉద్యమాల్లోనో సంపాదించిన వారు భద్రాచలం పరుగెత్తి మొక్కు తీర్చు కోవడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే రాజ్యం వీర భోజ్యంగా మారుతుంది. కాంగ్రెస్‌ను నడిపే వారికి ఈ 'వీర భోజ్యం'తో ఎన్నో ఏండ్ల అనుబంధం ఉంది. అందుకే జగన్ ప్రమాదం నుంచి తప్పుకోవడానికి అది డిసెంబర్ 2009 ఉద్యమాలను నడిపింది. జగన్ అరెస్టుతో ఆ ఉద్యమాల ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి. 

పడిపోయే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బతికి ఉన్నాయి. కాని ఈ సంపాదనలు, సంస్కార రహిత ఉద్యమాల నుంచి ఇక్కడ కూడ బింద్రేన్‌వాలాలు పుడితే బాధ్యులెవ్వరు? ఆ పరిణామంతో పం జాబ్ చాలాకాలం సతమతమయింది. వారికి ప్రత్యేక దేశం రాలేదు. పవిత్రంగా భావించే స్వర్ణాయలంలోనే యుద్ధం చెయ్యాల్సొచ్చింది. గత రెండున్నర సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు ఆకు-అలం తినే స్థితికొచ్చారు. ఈ స్థితికంతటికీ బాధ్యత ఎవరు వహించాలి? ఈ ప్రశ్నకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. వైఎస్ఆర్ పాలనలో రాజ్యం వీరభోజ్యంగా మారితే 2009 డిసెంబర్ 9 తరువాత ఉద్యమాలు విందు భోజనాలుగా మారాయి. ఈ వింతస్థితి నుంచి మనం ఎలా బయటపడగలమో చూడాలి. 

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత
Andhra Jyothi News Paper Dated : 06/06/2012 

No comments:

Post a Comment