పథకం అమలుకు సరైన సమయంగా ఉపఎన్నికలను ఉపయోగించుకున్నారు. ఎన్నికల బందోబస్తు పేరుతో వాసునాయుడు రెండవసారి పికెట్ ఎత్తివేయించాడు. కాపులు, దళితులు సమానమైన బలం అయినందున గతంలో హక్కుదారులైన కాపు రైతుల గుంపును రహస్యంగా అదే రోజు గ్రామానికి రప్పించుకున్నాడు. ఉదయాన్నే 7.30 గంటలకు పెత్తందార్లు మూకుమ్మడిగా బాంబులు, గొడ్డళ్ళు, కత్తులు, బరిసెలు, కర్రలతో అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. రెండున్నర గంటల సేపు దళితులతో రక్తకేళి ఆడుకున్నారు. దళితులు తేరుకునే లోగా అక్కడ రక్తం ఏరులై పారింది.
ఉదయాన్నే లేచి కూలీ పనికి వెళ్ళేందుకు చద్దన్నం తింటున్న సుందర్‌రావును ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి బరువైన బండరాయిని ఎత్తి గుండెల మీద వేసి చంపేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పక్క వీధిలోకి పరుగిడుతున్న నివర్తి సంగమేశును తోడేళ్ళలా వెంటాడి బరిసెలతో పొడిచి, గోడ్డళ్ళతో నరికేశారు. వీధిగుండా వెళ్తున్న వెంకటిపై నాటుబాంబులతో దాడి చేసి, బరిసెలతో పొడిచి, గాయాల మీద కారం చల్లి కాలువలో పడేశారు. ఇంట్లో ఉన్న చిత్రి అప్పాడును భార్య, పిల్లల కళ్ల ముందే బండరాళ్ళతో తలను పగులకొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. పాపయ్యను కళ్లల్లో కత్తులతో, ఒంటినిండా బరిసెలతో 30 పోట్లు పొడిచారు. ఆ నెత్తుటి మడుగులో కొట్టుకున్న పాపయ్య కాసేపటికే ప్రాణాలు విడిచాడు. కొందరికి రెండు కాళ్ళూ విరిగాయి. మరికొందరికి కాళ్ళూ, చేతులూ విరిగాయి. ఇంకొందరికి ఒక కాలు, ఒక చేయి విరిగి, తలలు పగిలాయి. ఒకరికి చెవి తెగింది. మరికొందరికి వేళ్ళు విరిగాయి. దళితవాడలోని ప్రతి ఇంటిపై దాడి జరిగింది. మహిళలు, వృద్ధులను సైతం కర్రలతో గొడ్లను బాదినట్లు బాదారు. ప్రతి మనిషికీ కందిపోయిన గాయాలయ్యాయి. ప్రతి ఇంటి గోడకూ దళితుల రక్తపు మరకలే. 200 మంది తూర్పు కాపు పెత్తందార్లు, పిల్లలు, మహిళలు బరిసెలు, గొడ్డళ్ళు, కత్తులు, కర్రలు, కారంపొడి, రాళ్ళతో రెండు గంటలకు పైగా దళితవాడపై సైర్వవిహారం చేశారు. మగవారు కొట్టి, కొట్టి అలసిపోయి కూర్చుంటే మహిళలు వారికి విసనకర్రలతో విసిరి, వాటర్ బాటిల్స్‌తో నీరందించి ప్రోత్సహించారు. స్వయంగా మహిళలు కూడా కర్రలతో దాడి చేశారు.
కులం తక్కువ వాళ్లు దేవాలయాలకు రాకూడదు, హోటల్లో రెండు గ్లాసుల విధానం, క్షౌరం, కటింగ్ చేయనివ్వరు. నల్లా నీళ్లు తీసుకోనివ్వరు. దళిత మహిళ సర్పంచ్, ఆమె భర్త గ్రామ పంచాయతీలో కింద కూర్చోవాలి. మాల నాకొడుకులకు, కూలీనాకొడుకులకు భూములు కావాలా? సర్పంచులౌతారా? మాకే ఎదురు తిరుగుతారా? అని నానా దుర్భాషలాడుతూ హత్యాకాండకు తెగబడ్డారు. కులం తక్కువ వాళ్లు కూలీలుగా ఉండాలి, భూములు అడగ కూడదు. భూములు ఆక్రమించుకున్నా ఊరకుండాలి. తమకు నచ్చిన పార్టీలోనే ఉండాలి. తమకు అణిగిమణిగి మాత్రమే ఉండాలి. అగ్రకుల పెత్తందార్లకు ఎదురు తిరగ కూడదు. ప్రశ్నిస్తే దాడులు చేస్తాం. కాళ్ళూ, చేతులూ విరగ్గొడతాం. హత్యలు చేస్తామన్నది వారి వైఖరి.
శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని 12 గ్రామాల్లోని ప్రభుత్వ, రైతుల భూములు 7,779 ఎకరాలు మడ్డువలస ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సేకరించింది. అందులో భాగంగా లక్షింపేట గ్రామమంతా నిర్వాసిత గ్రామమైంది. గ్రామంలో 75 దళిత, 75 తూర్పుకాపుల, 11 ఇతర బిసి కులాల కుటుంబాలున్నాయి. ఇంటి స్థోమతను బట్టి పెత్తందార్ల ఇంటికి లక్ష రూపాయల చొప్పున, దళితులవి పూరి గుడిసెలే కాబట్టి రూ.3 వేల నుంచి రూ.12 వేల లోపు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి గ్రామాన్ని ఖాళీ చేయించింది. పై భాగాన ఉన్న ముత్యాలమ్మ చెరువు దగ్గర ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఎస్సీలు, కాపులకు పక్క పక్కనే పునరావాసం కల్పించింది. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. దళితులు భూములే లేని కూలీలైనందున వీరికి ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వలేదు.
ప్రస్తుతం ఉన్న లక్షింపేట గ్రామానికి పరిసరాల్లోనే ముంపుకు గురికాని 250 ఎకరాలు ఇరిగేషన్ పరిధిలో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమితో లక్షింపేట రైతులకు ఎలాంటి సంబంధం లేదు. అది ఇతర గ్రామాలకు చెందిన రైతులది. వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. వారంతా వేరే గ్రామాల్లో ఉంటున్నారు. ఈ మొత్తం భూమిని గతంలో హక్కుదారులైన రైతుల నుంచి కౌలుకు తీసుకుని లక్షింపేట తూర్పుకాపులు సాగు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత అవి ప్రభుత్వ భూములైనందున కౌలు ఇవ్వకుండానే సాగు చేసుకుంటున్నారు. అందులో 60 ఎకరాల భూమికి గతంలో హక్కుదారులైన రైతులు సాగు చేసుకోమని దళితులకు కౌలుకిచ్చారు. ఇది సహించలేని గ్రామ పెత్తందార్లు ఆ భూమి కూడా తమకే కావాలని, మాల కొడుకులు, కూలీనాకొడుకులు మీకు కూడా భూములు కావాలా అని అడ్డుకోగా ఆ భూమి బీడు పడింది.
కులవివక్ష, దళితుల సమస్యలపై వంగర మండలమంతా కెవిపిఎస్ సర్వేలు, సభలు నిర్వహించి పలు గ్రామాల్లో కులవివక్ష రూపాలపై ప్రతిఘటనోద్యమాలు నిర్వహించింది. లక్షింపేట గ్రామ దళితులంతా సంఘటితమై కెవిపిఎస్ అండతో మళ్ళీ ఆ 60 ఎకరాల భూమిని దున్ని సాగు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అడ్డుపడ్డ పెత్తందార్లను దళితులు సంఘటితంగా ప్రతిఘటించారు. కెవిపిఎస్ మండల కార్యదర్శి గణపతితో సహా ఇరువర్గాలపై 55+54 మందిపై 2011లో బైండోవర్ కేసు పెట్టారు. పోలీసు పికెట్ కూడా ఆరు నెలలు కొనసాగింది. ఆర్డీవో జోక్యం చేసుకుని 60 ఎకరాలు దళితులు సాగు చేసుకునేందుకు అనధికారికంగా నిర్ణయించారు. దళితులు భూమి సాగు చేసుకోవడం సహించలేక ఆ భూమిని కూడా కబ్జా చేయాలని వంగరలోని కాపు నాయకుడు, బొత్స సత్యనారాయణ అనుచరుడు, భూస్వామి, అక్రమంగా కోట్లు సంపాందించిన మాజీ జడ్‌పిటిసి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారే బొత్స వాసునాయుడును సంప్రదించారు. ఆ నియోజకవర్గానికి కొండ్రు మురళి ఎమ్మెల్యే, మంత్రి అయినా ఆ మండలంలో బొత్స వాసునాయుడిదే పెత్తనం. గ్రామాల్లో పోలీసు స్టేషన్లు, తహశీల్దారు కార్యాలయాల్లో ఆయన చెప్పిందే వేదం.
లక్షింపేట గ్రామంలో దళితులు భూములు సాగుచేసుకుంటే మిగతా 12 గ్రామాల్లోని దళితులు, పేదలు కూడా ఇలాగే ఉద్యమించే అవకాశముందని, మొగ్గలోనే తుంచేయాలని భావించిన బొత్స వాసునాయుడు ఆరు నెలల క్రితం గ్రామంలోని పోలీస్ పికెట్ ఎత్తి వేయించాడు. ఆ మరునాడే కాపు పెత్తందార్లతో దళితులపై దాడి చేయించాడు. ఆ దాడిలో చిత్రి అప్పడు కాళ్లు విరిగాయి. కామేష్‌కు తలపగిలింది. కెవిపిఎస్ నిర్వహించిన ఆందోళన ఫలితంగా నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి అరెస్టు చేయించినా మూడు రోజుల్లోనే బెయిల్ ఇచ్చి కోర్డు కూడా అగ్రకుల పెత్తందార్లకు అండగా నిలిచింది. ఈ దాడి తర్వాత రెండవ సారి పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అధికారులు జోక్యం చేసుకుని ఈ భూమి ఎవరూ సాగు చేయరాదని ఆదేశించారు. ఈ నిర్ణయం ఘర్షణను మరింత తీవ్రతరం చేయడానికి ఉపయోగ పడింది. దళితులు మంత్రి కొండ్రు మురళిని కలిసి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా చెవిటివాని ముందు శంఖం ఊదిన చందమే అయింది. బొత్స వాసునాయుడు దళితులను పిలిపించి భూములు వదులు కోవాలని హెచ్చరించాడు. దళితులు భూమి కావాలన్నందుకు ఇద్దరు, ముగ్గురు చస్తే గానీ మీరు భూమి వదలరని భయపెట్టాడు. వీరికి అండగా ఉన్న కెవిపిఎస్ స్థానిక నాయకుణ్ణి కూడా భయపెట్టే ప్రయత్నం చేశాడు.
దీనికి తోడు ఇటీవల రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల ప్రభావం కూడా ఉంది. ఆ మండలంలో కాంగ్రెస్ పార్టీలోని దళితులు, కాపులు ఎక్కువ మంది వైఎస్‌ఆర్ పార్టీ వైపు వెళ్లారు. లక్షింపేటలోనూ అదే జరిగింది. దీంతో ఆ మండలంలోని బొత్స వాసునాయుడు రాజకీయ ఆధిపత్యానికి గండి పడింది. కాపుల్లో తన పట్టు నిలుపుకునేందుకు లక్షింపేట కాపులను, దళితులు సాగు చేసే 60 ఎకరాలకు గతంలో హక్కుదారులైన ఇతర గ్రామాల కాపు రైతులను ఐక్యం చేశాడు. హత్యాకాండకు పథకం రూపొందించాడు. దీనికి కావలసిన నిధులను ముందే పోగు చేశాడు. దళితులను భూమి నుంచి ఖాళీ చేయించిన తర్వాత ఎకరాకు రూ.80 వేల చొప్పున గత హక్కుదారులైన కాపులకు లక్షింపేట కాపులు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకనుగుణంగానే పోలీసులతో రాయబారాలు నడిపారు.
పథకం అమలుకు సరైన సమయంగా ఉపఎన్నికలను ఉపయోగించుకున్నారు. ఎన్నికల బందోబస్తు పేరుతో వాసునాయుడు రెండవసారి పికెట్ ఎత్తివేయించాడు. కాపులు, దళితులు సమానమైన బలం అయినందున గతంలో హక్కుదారులైన కాపు రైతుల గుంపును రహస్యంగా అదే రోజు గ్రామానికి రప్పించుకున్నాడు. ఉదయాన్నే 7.30 గంటలకు పెత్తందార్లు మూకుమ్మడిగా బాంబులు, గొడ్డళ్ళు, కత్తులు, బరిసెలు, కర్రలతో అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. రెండున్నర గంటల సేపు దళితులతో రక్తకేళి ఆడుకున్నారు. దళితులు తేరుకునే లోగా అక్కడ రక్తం ఏరులై పారింది. భార్యలు చూస్తుండగానే భర్తలు రక్తపు మడుగులో శవాలయ్యారు. 5 కిమీ దూరంలో ఉన్న పోలీసు స్టేషనుకు రక్షణ కల్పించమని ఫోన్లు చేయగా రెండు గంటల తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చి అక్కడ కొనసాగుతున్న మారణకాండను చూసి వెనక్కు పరుగులు పెట్టాడు. ఘటన జరిగిన మూడు గంటల తర్వాత నిందితులంతా ప్రశాంతంగా తప్పించుకున్నాక పోలీసుల సైరన్ మోతలు వినిపించాయి. ముగ్గురు దళితులు అక్కడిక్కడే మరణించారు. ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. మరొకరు హాస్పిటల్‌లో ప్రాణాలొదిలాడు. 18 మంది నేటికీ గాయాలతో హాస్పిటల్‌లోనే ఉన్నారు.
వాస్తవాలు ఇలా ఉండగా కొందరు నాయకులు, కొన్ని పత్రికలు, మీడియా దీనిని ఇరువర్గాల మధ్య ఘర్షణగా చిత్రించే ప్రయత్నం చేశారు. ఇది ఏక పక్ష దాడని దళితులు, దళిత సంఘాల నాయకులు మొత్తుకున్నా వారి చెవిన పడలేదు. కెవిపిఎస్, అన్ని దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శవాలను తీసుకెళ్లకుండా అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి వచ్చి సవరించిన జీవో ప్రకారం హత్యకు గురైన వారికి రూ.5 లక్షలు సబ్‌ప్లాన్ నిధుల నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వెళ్లిపోయారు. సిపియం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఘటన జరిగిన గ్రామాన్ని, బాధితులను పరామర్శించి రాజాంలో జాయింట్ కలెక్టర్, ఎఎస్పీలతో చర్చించారు. దళితులపై ఇది ఏకపక్ష దాడి తప్ప ఘర్షణ కాదని, కొందరిపై జరిగిన దాడి కాదని, మొత్తం దళితవాడపై జరిగిన దాడి అని స్పష్టం చేశారు. ఏ భూమి కోసమైతే దళితులు హత్యలకు గురయ్యారో ఆ భూమి దళితులకు ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ఈ మేరకు వెంటనే జీవో జారీ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. బొత్స వాసునాయుడుతోపాటు నిందితులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బాధితులకు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలో ఉన్న సౌకర్యాలన్నీ వెంటనే కల్పించాలన్నారు. దళితులపై దాడి జరిగే అవకాశం ఉందని తెలిసినా పోలీసు పికెట్ ఎత్తివేశారు. రెండు సంవత్సరాల నుంచి ఈ సమస్య రగులుతున్నా దీనిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చొరవా చూపనందున ఈ హత్యాకాండకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ డిమాండ్లపైనే దళిత, ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో చేసిన ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం నీటి ముంపునకు గురికాని మొత్తం భూమి దాదాపు 200 ఎకరాలు దళితులే సాగు చేసుకునేందుకు ఇస్తామని, ప్రతి దళిత కుటుంబానికీ ఒక ఎకరానికి తగ్గకుండా పట్టాభూమి ఇస్తామని, హత్యకు గురైన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి ఆర్థిక సహాయం, ఇతర అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని కలెక్టర్, ఎస్పీలు హామీ ఇచ్చారు. వీటిలో కొన్ని అమలు చేశారు. కానీ ప్రధానమైన నిందితులు ఎనిమిది మందిని నేటికీ అరెస్టు చేయలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికార పార్టీ ఎస్సీ ఎమ్మెల్యే, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అదే పార్టీకి చెందిన పెత్తందార్లు అదే పార్టీకి చెందిన దళితులను ఊచకోత కోశారు. అదే పార్టీకి చెందిన రాజకీయ నాయకులే హంతకులను కాపాడుతున్నారు. దళితులను అన్యాయంగా హత్య చేసిన నేరస్థులు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చా? లేకుంటే వారిపై పార్టీ పరంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అలాంటప్పుడు దళితులు ఎందుకు ఆ పార్టీలో ఉండాలి? దళితుల హక్కుల పట్ల చిత్తశుద్ధి లేని ఏ పార్టీ ఇక మనుగడ సాగించలేదు. కారంచేడులో నీళ్ళ కోసం, చుండూరులో ఆత్మగౌరవం కోసం, లక్షింపేటలో భూమి కోసం దళితులు రక్త తర్పణ చేశారు. ఆత్మగౌరవం, భూమి, సమానత్వం, హక్కులన్నీ అమలు చేసుకోవాలంటే అన్ని పార్టీల్లో ఉన్న దళితులు, సంఘాలు ఐక్యం కావాలి. కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులు, అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులతో ఐక్య సంఘటనగా ఉద్యమిస్తే అంతిమ విజయం సాధిస్తాం.
రచయిత కెవిపిఎస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్)
Prajashakti News Paper Dated : 23/06/2012
No comments:
Post a Comment