'పాలేరుతనం చేసే వాడికి భూమెందుకురా! పాలేరు పనో కూలిపనో చెయ్యాలిగాని... అంతే ' - గత ఏడాదిన్నర నుంచి లక్షింపేట కాపులు అదే పేటకు చెందిన మాలలకు చేస్తున్న హెచ్చరిక అది. దానిని వినకుండా ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటామని ముం దుకు వచ్చిన మాలపేటను కాపులు మసిచేసేశారు. జంతువుల్ని వేటాడినట్టు ముందు బాం బులు వేసి భయపెట్టి, బరిశెలు, గొడ్డళ్లు, దుడ్డు కర్రలు తీసుకొని మాలపేటపై దాడిచేసి, ఇళ్లలో జొరబడి, తలుపులు పగలగొట్టి, దొరికిన వారిని దొరికినట్టు కొట్టి, తప్పించుకు పోతున్న వారిని తరిమికొట్టి కాళ్లు చేతులు విరగ్గొట్టి, ఇళ్లలో మనుషులు దొరకకపోతే ఉన్న సామాను పగలగొట్టి, నానా బీభత్సం చేసి ఐదుగుర్ని చంపేశారు. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆస్పత్రికి మోసుకు వెళ్తుంటే మరో ఇద్దరు చనిపోయారు. అయిదో వ్యక్తి విశాఖపట్నం కెజిహెచ్‌లో చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటూ ఎనిమిదో రోజున ప్రాణాలు వదిలాడు.
దళితులపై దాడి చేయటానికి 'అగ్ర' కులమే అక్కర లేదు. మాల, మాదిగ, రెల్లి లాంటి ఎస్ సి కులం కాని ఇతరులు ఎవరైనా చేస్తారు. లక్షింపేట దాడిచేసిన వారిది రికార్డులో బిసి కులమే! కాని వాళ్లు 'కాపులు'! మాదీ అగ్రకులమే అనుకుంటారు. అంటరానితనం వలన జరిగిన ఘోరం కాదిది. 'కాపుల మాదిరి మాలలు కూడా భూమి దున్ను కుంటారా?' అనే అహంకారమే ఈ దురాగతానికి దారితీసింది. లక్షింపేట మాలలు కాపు భూమిని గుంజుకోవాలను కోవటం లేదు. వారి భూమిని ఆక్రమించుకోనూ లేదు. ప్రభుత్వ భూమిని దున్నుకుంటామన్నారు. అంతే? శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో మడ్డువలస ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూమినిసేకరించింది.
ఆభూసేకరణలో పాతలక్షింపేట మునిగిపోయింది. కాపుల భూములు సేకరించారు. నష్టపరిహారంచెల్లించారు.దానికితోడు నలభైఉద్యోగాలు ఇచ్చారు. వారు వేరే చోట భూమిని కొనుక్కున్నారు. లక్షింపేటలో ఉన్న మాలలకు గుడిసెలు తప్ప భూమి లేదు. మునిగి పోయిన గుడిసెలకు ముష్టి మూడు వేలనష్టపరిహారం దొరికింది.అంతే.లక్షింపేటగ్రామస్థులకు ప్రస్తుతం లక్షింపేట ఉన్నచోటప్రభుత్వం పునరావాసం సంకల్పించింది. కాపులు స్వంత డబ్బుతో ఇళ్లు కట్టుకున్నారు. ఇద్దరూ పక్కపక్కనే ఉంటున్నారు. చిన్న రోడ్డే అడ్డు.
మడ్డు వలస ప్రాజెక్టు కోసం సేకరించిన మొత్తం భూమిలో సుమారు 250 ఎకరాల భూమి ఏ అవసరానికీ రాకుండా మిగిలిపోయింది. రిజర్వాయర్ పూర్తినీటిమట్టం దాటిఈభూమి ఉండి పోతున్నది. అంటే ఇది మునగదు. ఇది ఖాళీగా ఉండటం వల్ల లక్షింపేట కాపులు 190 ఎకరాలు సాగుచేసుకొంటున్నారు. మిగిలిన 60 ఎకరాలు ఇంకా అలానేఉన్నది. అందులో 40 ఎకరాలు పక్క గ్రామమైన దేవకవాడ వాళ్లది. వాళ్లు భూమిని ఇచ్చేసి, నష్ట పరిహారం తీసుకొని సాలూరు వెళ్లి స్థిరపడిపోయారు. ఇటుకేసి తిరిగి చూడనే లేదు. మిగిలిన 20 ఎకరాలు లక్షింపేట కాపులవే. అయితే ఆ కుటుంబాలవారు ఇక్కడ లేరు. ఎక్కడో స్థిరపడ్డారు.
ఈ 60 ఎకరాలూ ఖాళీగా ఉండటంతో లక్షింపేట మాలలు దీనిని సాగుచేయటం మొదలుపెట్టారు. వాస్తవానికి ఈ 250 ఎకరాల మీదా లక్షింపేట, దేవకవాడ కాపులకు ఏ సంబంధమూ లేదు. నష్ట పరిహారం తీసుకున్నారు. అయిపోయింది. ఇది ప్రభుత్వ భూమి. కానీ లక్షింపేట కాపులు ఇది మా దగ్గరే తీసుకున్నారు కదా, మేమే దున్నుకుంటాం అని మొదలుపెట్టారు. అయితే లక్షింపేట మాలలకు స్వంత భూమి, పట్టా భూమి ఎక్కడిది? కాని '60 ఎకరాలు ఖాళీగా ఉన్నది, మేము భూమి లేని వాళ్లం, ఇది ప్రభుత్వానికి చెందిన భూమి కాబట్టి దున్నుకుంటాం' అని వీరూ దిగారు. గత 12 సంవత్సరాలుగా దున్నుకుంటున్నారు. ప్రభుత్వ భూమే అయినప్పటికీ ఈ 60 ఎకరాలు దున్నుకుంటున్న మాలలు ప్రతి ఏడూ శిస్తు చెల్లిస్తున్నారు.
ఈ 250 ఎకరాలూ ఒకే చోట ఉన్నాయి. కాపులు చేసుకుంటున్న 190 ఎకరాలు, మాలలు చేసుకుంటున్న 60 ఎకరాలూ అన్నీ కలిసే ఉన్నాయి. 'మా పక్కన మాల వాళ్లు భూమి సాగు చేయటమా, సహించటానికి వీల్లేదని' కాపులు నిర్ణయించుకున్నారు. గత రెండేళ్లుగా మాలల్ని బెదిరిస్తున్నారు. కొడుతున్నారు. ఆడవాళ్లనూ కొట్టారు. కేసుల్లేవు. దెబ్బలకు ఒకామె చనిపోయింది.కూడా. 'కొట్టినా, చంపినా కేసుల్లేవు. వద్దని చెప్పినా వీళ్లు వినటంలేదు. ఇద్దర్నో ముగ్గుర్నో చంపేస్తే గాని ఈ భూమిని వీళ్లు వదలరు' అనే నిర్ణయానికి కాపులు వచ్చారు. ఈ గ్రామం వంగర మండలంలో ఉంటుంది. మండలాధ్యక్షుడిగా బొత్స వాసుదేవరావు నాయుడు ఉన్నాడు. ఆయనా కాపు కులానికి చెందిన వాడే.
లోక్‌సభ సభ్యురాలు బొత్సఝాన్సీ దీ అదే కులం. మంత్రిగా బొత్స సత్యనారారాయణపిసిసిఅధ్యక్షుడు అయ్యారు. ఆయనదీ అదే కులం. అర్థబలం, అంగబలం, రాజకీయ బలం మూడూ కలిసి వచ్చాయి. ఈ మూడూ ఉంటే అధికార యంత్రాంగం వారికే దాసోహమంటుంది. ఉండటానికి లక్షింపేట సర్పంచ్‌గా చిత్తిరి సింహాలమ్మ ఉన్నది. ఆమె మాల కులస్తురాలు. అయితే ఏం లాభం? ఆమెను అయిదేళ్ల పదవీకాలంలో ఒక్క రోజు కూడా సర్పంచ్ కుర్చీ మీద కూర్చోనివ్వలేదు. పంచాయత్ సమావేశాల్లో పంచాయత్ సభ్యులందరూ కుర్చీల్లో కూర్చుని ఉంటే ఈమె గోడవార నిలబడి ఉండాలి. అది కాపుల ఆజ్ఞ! పాపం! ఆమె ఏం చేయగలుగుతుంది?
ఆ గ్రామం రాజాం నియోజక వర్గంలోకి వస్తుంది. అది రిజర్వుడు స్థానం. అక్కడి శాసన సభ్యుడు కొండ్రు మురళీమోహన్ . ఆయన రాష్ట్ర మంత్రి కూడా అయ్యాడు, రిజర్వుడు కోటాలోనించే ! ఆయనదీ మాల కులమే ! అయితే ఏం లాభం? ఆయన కాపుల్ని కాదని ఎమ్మెల్యే అవగలడా? మంత్రి కాగలడా? అయినా మనగలడా? ఆయన దగ్గరకు లక్షింపేట మాలలు ఈ సమస్యను తీసుకు వెళ్లినప్రతిసారీ 'ఆ భూమిలోకి వెళ్లకండి, కాపులతో మీకు తగాదా ఎందుకు?' అంటూ నిరుత్సాహపరుస్తుండే వాడు.
కాపుల రాజకీయ బలం అలా ఉంటే ఎస్‌సిల రాజకీయ బలం ఇలా ఉన్నది. గత రెండేళ్లుగా మాలలపై దాడులు ఎక్కువయ్యాయి. పోలీసు శాఖ కాపుల పక్షాన్నే ఉన్నది. ఎస్ సిలపై జరిగిన అత్యాచారానికి ఎస్‌సి, ఎస్‌టి (అత్యాచారాల నిరోధక) చట్టం వర్తింప చెయ్యటం లేదు. ఏదో ఐపిసి నేరం క్రింద అరెస్టు చెయ్యటం రెండు రోజుల్లో విడిచి పెట్టటం జరుగుతున్నది. పైగా, దాడిచేసింది కాపులయితే రెండు వర్గాల పైన సిఆర్ పిసి సెక్షన్ 107 కింద ఇద్దరినీ బైండోవర్ కేసులో ఇరికించారు. మరో సారి మాలల పై దాడి జరిగే ప్రమాదం ఉన్నదని లక్షింపేట పోలీస్‌ని కాపలా ఉంచారు.
జూన్ 12న శ్రీకాకుళం జిల్లాలో నర్సన్న పేట నియోజక వర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది. దీనికీ లక్షింపేటకూ ఏ సంబంధమూ లేదు. ఎక్కడో జరిగే ఉప ఎన్నికకు పోలీసు బలగం కావాలని లక్షింపేటలో కాపలా ఉన్న పోలీసుల్ని అక్కడ నుంచి పిలిపించుకున్నారు. అంతే, మంచి సమయం దొరికింది, సరైన సిగ్నల్ అందింది. జూన్ 11 రాత్రి లక్షింపేటలో పథకం తయారయింది. కావలసినది సేకరించుకున్నారు. పోలీసులా లేరు, ఇంక అడ్డు ఏమిటి అని ఉదయం అందరూ ఒక ఇంటి దగ్గర గుమిగూడారు. అది చూసి సర్పంచ్ భర్త ఉదయం 7 గంటలకు వంగర ఎస్ఐకి ఫోన్ చేశాడు. పోలీసులు రాలేదు. రారని ముందే తెలుసుకున్న కాపులు దాడికి దిగారు. ఆడవాళ్లు కారం పట్టుకొని కూడా వచ్చారు.
ముందు బాంబులు పేల్చారు. ఉదయం పనుల్లో ఉన్నారందరూ. ఏమయిందని బయటకు వచ్చిన వారిని అక్కడికక్కడే కొట్టి పడేశారు. ఇళ్లల్లో జొర బడ్డారు. బరిశెలతో, బళ్లాలతో గొడ్డళ్లతో బాదారు. కొట్టవద్దని చేతులెత్తిన వారి చేతులు విరగ్గొట్టారు. పరిగెత్తుకు పోతున్న వారి కాళ్లు విరగ్గొట్టారు. నెత్తి పగలగొట్టారు. కొన ప్రాణంతో ఉన్న కొడుకుకి నీళ్లు తెచ్చి పోస్తున్న ఒక తల్లి చెయ్యి విరగ్గొట్టారు. సర్పంచ్ భర్త కోసం చూశారు. అతను దొరకకపోతే అతని తమ్ముణ్ణి చంపారు. ఆ పేటలో కొంచెం ఎక్కువ చదువుకున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతను పాటలు పాడతాడు. ఊళ్లో ఏ అవసరం వచ్చినా దరఖాస్తు వ్రాసి ఇస్తాడు. అతన్ని గురి చేశారు. బళ్లాలతో దాడిచేస్తే అక్కడికక్కడే చనిపోయాడు. ఏభైమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయాలు బాగా తగిలినా ఆస్పత్రికి వెళ్లలేక కట్టుకట్టుకొని ఇంటి దగ్గరే ఉండిపోయిన వాళ్లు చాలమంది ఉన్నారు.
ఎక్కువ తక్కువ కులాలు అనుకుంటున్న వ్యవస్థ మనది. ఎంత తక్కువ అయినా తక్కువే, ఎంత ఎక్కువ అయినా ఎక్కువే. తక్కువ కులాల వాళ్లు అణిగి మణిగి ఉండాలి. లేకపోతే అగ్రకులాలు దాడి చేస్తాయి. తక్కువ కులాల వాళ్లు తగ్గి ఉండాలి, ఎక్కువ కులాల వాళ్లతో సమానంగా ఎదగటానికి సాహసించకూడదు. పాలేరు, పాలేరుగానే ఉండాలి. అతను భూమి అడగకూడదు.
అతని దగ్గర భూమి ఉంటే ఇద్దరూ సమానమై పోతారు. అది కుదరదు. అందుకే లక్షింపేటలో ఇంత కిరాతకం, ఇంత ఆటవికం! ప్రభుత్వ భూమిని ఆక్రమించి అగ్రకులాలు అనుభవించవచ్చు. అదే పని దళితులు చెయ్యకూడదు, చేస్తే అగ్రకులాలు సహించవు. ప్రభుత్వం దగ్గర మొరపెట్టుకుంటే ఇంకోచోట ఎక్కడైనా ఇస్తాములే అంటారు. పరామర్శించటానికి వెళ్లిన ముఖ్యమంత్రి మీకు వేరే చోట కొని ఇస్తాము అని అన్నాడంటే, 'ఈ భూమి గురించి మా ప్రాణాలు నాలుగు పోయాయి, ఇంకోచోటకి మేమెందుకు వెళ్తాం'అంటున్నది ఒక మహిళ. ఆమె కుమారుడిని ఈ దాడిలో చంపేశారు.
ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అత్యాచారాలకూ దీనికీ ఒక ప్రధానమైన తేడా ఉన్నది. ఎక్కవచోట్ల ఆత్మగౌరవం గురించి అడుగుతున్నారని దాడులు చేస్తే ఇక్కడ భూమి కావాలంటున్నారనిదాడి చేశారు. అత్యాచారాలన్నీ ఆత్మగౌరవం, భూమి చుట్టూనే తిరుగుతుంటాయి. లక్షింపేటలో అయిదు ప్రాణాలు పోయినా అక్కడి మాలలలో ఆత్మస్థైర్యం పోలేదు. మేము సాగు చేసుకుంటున్న అరవై ఎకరాలు కాదు, మొత్తం 250 ఎకరాలు మాకే ఇవ్వాలి అంటున్నారు.
ఇంతకు ముందే మండలాధ్యక్షుడు లక్షింపేట మాలలకు 'పనికి ఆహార పథకం' మాన్పించాడు. వృద్ధాప్య పింఛన్‌లు ఆపించాడు. మంచి నీళ్లకు మూడు నాలుగు కిలో మీటర్లు నడిచివెళ్లే పరిస్థితి కల్పించాడు. ఎక్కడైనా ఏదైనా పనిచేసుకు బ్రతుకుదామనుకుంటే కాళ్లు చేతులు విరగ్గొట్టించాడు. అక్కడ చదువుకున్న వాళ్లు లేరు. వారికి ఉన్న ఆస్తి కాళ్లూచేతులే. అవీ విరగిపోయాయిపుడు. కారంచేడు, చుండూరులో కమ్మ, రెడ్లు దాడులు చేస్తే లక్షింపేటలో కాపులు చేశారు. అవును, ఇప్పుడు కాపులు కొత్తగా ఎదుగుతున్న రాజకీయ శక్తి . భారతదేశంలో కులాన్ని, భూమిని కలిపి చూడకుండా ఈ రెండింటికీ పరిష్కారం చూపలేము.
లక్షింపేట మాలలపైన తగిలింది ఈ జమిలి దెబ్బ. దీనికి ఎదురు దెబ్బ వేయాలంటే మళ్లీ అదే జమిలి దెబ్బ తగిలించాలి. లక్షింపేట మాలలకు, ప్రాజెక్టుతో గుడిశెలు కోల్పోయి పొరుగు గ్రామమైన కొడిశ లో ఉంటున్న మాల మాదిగలకు కలిపి ఈ 250 ఎకరాలను కేటాయిస్తే దళితులకు భూమిదొరుకుతుంది, ఆ పైన ఆత్మ గౌరవం వస్తుంది. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆ పని జరగటం లేదు కాబట్టే కారంచేడు అయినా, చుండూరు అయినా , బెల్చీ అయినా కీలవేన్మణి అయినా, ఖైర్లాంజి అయినా, లక్ష్మణ్‌పూర్ -బాతే అయినా, కంబాలహళ్లి అయినా, బతాని తోలా అయినా, దీయో సాధుపూర్ అయినా లక్షింపేట అయినా!
Andhra Jyothi News Paper Dated 22/06/2012
No comments:
Post a Comment