Thursday, June 7, 2012

పరకాలలో లౌకికవాదుల బాధ్యత - డా. గాలి వినోద్ కుమార్



తెలంగాణ జిల్లాల్లో ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఉప ఎన్నికలు ఒక ఎత్తయితే పరకాల ఉప ఎన్నిక ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సీమాంధ్రలో 17 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణలో ఒకే స్థానానికి ఎన్నిక జరుగుతున్నది. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. 2014లో తెలంగాణలో ఎవరు ఆధిపత్యం వహిస్తారు అనే విషయాన్ని పరకాల ఎన్నిక తేల్చబోతున్నది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టిఆర్ఎస్ వెలమల ఆధిపత్యంలో కొనసాగుతుండగా వారి ఆధిపత్యానికి గండికొట్టడానికి రెడ్డి వర్గం చేస్తున్న ప్రయత్నమే పరకాలలో రెడ్డి కులానికి చెందిన అభ్యర్థిని బిజెపి నిలబెట్టడం. 

శ్రీకృష్ణ కమిటీ లెక్కల ప్రకారం తెలంగాణలో 89.6 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మత మైనార్టీలు ఉండగా 10.4 శాతం అగ్రవర్ణాలు ఉన్నాయి. అందులో వెలమల జనాభా 1 శాతం మాత్రమే. రెడ్ల జనాభా కొన్ని జిల్లాల్లో 6 శాతం ఉండగా మరికొన్ని జిల్లాల్లో 8 శాతం వరకూ ఉంది. గత 40 ఏళ్లుగా సమైక్య రాష్ట్రంలో అధికారాన్ని చెలాయిస్తున్న రెడ్డి వర్గం రేపు ఏర్పడే తెలంగాణలో కూడా తామే అధికారాన్ని సాధించడానికి ఎత్తులు వేస్తోంది. గత పదేళ్లుగా తెలంగాణ ఉద్యమానికి తామే చాంపియన్‌లమని భావించిన తెరాస కోటకు బిజెపి రూపంలో రెడ్లు బీటలు వేయడం ప్రారంభించారు. 

మహబూబ్‌నగర్‌లో యెన్నెం శ్రీనివాసరెడ్డి గెలుపుతో ప్రారంభమైన ఈ పరంపరను పరకాల ఉప ఎన్నికల్లోనూ కొనసాగించాలని బిజెపి ఎత్తులు వేస్తున్నది. అందుకే పార్టీ నాయకుడిని కాదని ఏరికోరి జెఎసి నాయకుడైన డా. విజయ్ చందర్ రెడ్డికి టిక్కెట్ ఖరారు చేసింది. మహబూబ్‌నగర్‌లోనూ ఇదే ప్రయోగంతో సఫలమైన బిజెపి, ఎలాగైనా సరే పరకాలలోనూ బడుగు బలహీన వర్గాలపై ముఖ్యంగా వెలమలపై తమ ఆధిపత్యాన్ని సాధించడానికి ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. 

అందరూ భావిస్తున్నట్లు మహబూబ్‌నగర్‌లో మతతత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారానే బిజెపి గెలిచింది అనేది అర్థ సత్యం మాత్రమే. తమ రెడ్డి కులతత్వాన్ని చాకచక్యంగా పార్టీలకతీతంగా సంఘటితం చేయడం ద్వారా మాత్రమే బిజెపి అక్కడ విజయం సాధించింది. ఎందుకంటే మహబూబ్‌నగర్ జిల్లా అంతటా ఆధిపత్యం రెడ్లదే. వారంతా హిందువులే. వారెందుకు హిందూ మతతత్వాన్ని రెచ్చగొట్టి గెలవలేకపోయారు? 12 శాతం జనాభా కలిగిన మైనార్టీ అభ్యర్థి ఇబ్రహీం తెలంగాణ ఉద్యమ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ, ముస్లిముల్లో ఐక్యత హిందువుల కంటే ఎక్కువ అయినప్పటికీ, ఎందుకు గెలవలేకపోయాడు? ఎందుకంటే ఆయన స్థానికుడు కాదు. 

అంతేకాక తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నది యెన్నెం కులానికి చెందిన కోందడరాం రెడ్డి, లోకల్ జాక్ నాయకుడు రాజేందర్ రెడ్డి, లోకల్ టిఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన పార్టీ అభ్యర్థి గెలుపు కంటే తన కులం అభ్యర్థి గెలుపుకే సహకరించాడు. బిజెపి జిల్లా అధ్యక్షుడు పాండురెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇలా తెలంగాణ ఉద్యమాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న వీరు రెడ్డియేతర అభ్యర్థిని ఎలా గెలవనిస్తారు? 2009లో గెలిచిన రాజేశ్వర్ రెడ్డి కులబలంతోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవలేదా? దీన్ని బట్టి తెలుస్తున్నది ఏమిటి? మతం కంటే కుల బలం వల్లనే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి గెలిచారు తప్ప కేవలం మతతత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా మాత్రమే బిజెపి గెలిచిందని లగడపాటి చేసిన ఆరోపణ అర్థసత్యం మాత్రమే. 

అయితే తెలంగాణ ఉద్యమంలో బిజెపి బలంగా దూసుకుపోవడం కూడా మహబూబ్‌నగర్ గెలుపునకు దోహదపడింది. ఇదేవిధంగా పరకాలలో కూడా మహబూబ్‌నగర్ పాచికనే ప్రయోగించాలని బిజెపి నిర్ణయించింది. అందుకే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయిన డా. విజయ్ చందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. అయితే బిజెపి గమనించాల్సింది ఏమిటంటే వరంగల్ జిల్లా బిసిల ఆధిపత్యం ఉన్న జిల్లా. ఇక్కడ మతతత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు సాధించడం అంత సులువుకాదు. పరకాల నియోజకవర్గంలో బీసీ కులస్తులే అనేకసార్లు గెలిచారు. ఈ సారి కూడా వారే గెలిచే అవకాశం ఉంది. 

ఎందుకంటే పరకాల నియోజకవర్గంలో రెడ్ల జనాభా తక్కువే. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలదే అధిక జనాభా. మహబూబ్‌నగర్‌లో ముస్లిం అభ్యర్థిని ఓడించిన బిజెపిపై ముస్లిములు పరకాలలో పగతీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. పరకాల ఉప ఎన్నికలను కెసిఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కారణంగానే అన్ని కోణాలను పరిశీలించి బలమైన బిసి అభ్యర్థి, తెలంగాణ ఉద్యమానికి పరకాల ప్రాంతంలో జీవం పోసిన మెలుగూరి భిక్షపతికి టిక్కెట్ ఇచ్చారు. దీంతో బిజెపి లాగా తమది రెడ్ల పార్టీ కాదని మహబూబ్‌నగర్‌లో మైనార్టీకి, పరకాలలో బిసికి టిక్కెట్ ఇచ్చి బడుగు బలహీన వర్గాల పార్టీగా టిఆర్ఎస్‌ను బలోపేతం చేసేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. 

అయితే ఇటు టిఆర్ఎస్ అటు బిజెపిలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే ఉద్యమిస్తున్న పార్టీలయినప్పుడు ఉమ్మడి అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేకపోతున్నాయి? వీరిద్దరి పోటీ కారణంగా తెలంగాణ ఓట్లు చీలి సమైక్యవాద పార్టీలైన కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టిడిపిలకు గెలిచే అవకాశం లేదా? తెలంగాణ ఓట్లు చీలకుండా ఉండడానికి వీరు ఉమ్మడి అభ్యర్థిని ఎందుకు బలపరచలేకపోతున్నారు? ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ చెప్పిన ప్రకారం తెలంగాణ ఉద్యమం రెడ్డి, వెలమల ఆధిపత్య పోరుగా మిగిలిపోయింది. 

మిగతా వర్గాలు వారిని అనుసరిస్తున్నాయి. వీరి ఆధిపత్య పోరులో బహుజనులు బలి అవుతున్నారు. వీరికంటూ ఒక రాజకీయ పార్టీ లేనంత వరకూ బలవుతూనే ఉంటారు. అయితే పరకాల ఎన్నిక వరకైనా బహుజనులు ఎవరిని బలపర్చాలి? సెక్యులర్ దొరతనాన్నా? మతతత్వ భూస్వామ్యాన్నా? అనేది చర్చించాలి. సెక్యులర్ టిఆర్ఎస్ కంటే మతతత్వ బిజెపి బహుజనులకు ప్రమాదకరం. 

ఎందుకంటే గుజరాత్‌లో దళితులు, మైనార్టీలను నరికిచంపి నరమేధాన్ని సృష్టించిన పార్టీ. బిజెపి ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ దళిత, మైనార్టీలకు రక్షణ లేదు. వారికి జీవించే హక్కు లేదు. తమ స్వంత గడ్డమీద విదేశీయులుగా భయం భయంగా బిక్కు బిక్కుమంటూ ఉగ్రవాదులుగా ముద్రపడి బతకాల్సిన భయంకర దుస్థితి, రేపు బిజెపి తెలంగాణలో గెలవడం ద్వారా ఏర్పడుతుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ పోరు గడ్డ అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దళిత, ఆదివాసీ, మైనార్టీ విద్యార్థులు వేల సంవత్సరాలుగా వస్తున్న తమ ఆహార సంస్కృతి, తాము జీవించే హక్కును బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం ఎ.బి.వి.పి. ఎంతటి ఘోర బీభత్సం సృష్టించిందో మీడియా ద్వారా ప్రపంచం అంతా చూసింది. 

తెలంగాణ ఉద్యమం పేరుతో కుల, మతతత్వాన్ని రెచ్చగొట్టి ఎలాగైనా అధికారాన్ని సాధించి తెలంగాణను మరో గుజరాత్‌గా మార్చే కుట్ర బిజెపి తెలంగాణ ఉద్యమం వెనుక ఉంది. నిజంగా బిజెపికి తెలంగాణ సాధనే ఏకైక ధ్యేయం అయితే ఎన్నికలే పరమావధిగా భావించరాదు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ కన్నా తెలంగాణ తెస్తామంటున్న బిజెపి తెలంగాణ ప్రజలకు ముఖ్యం కాదు కదా. ఆనాడు అధికారం కోసం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే కాకినాడ తీర్మానాన్ని విస్మరించి తెలంగాణను మోసం చేసింది బిజెపి. 

2014లో అధికారం కోసం పచ్చి సమైక్యవాది అయిన జగన్‌తో కూడా పొత్తు పెట్టుకోదన్న గ్యారంటీ ఏమీ లేదు. యుపిని మూడు ముక్కలుగా చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన మాయావతిని బలపర్చకుండా ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం చీల్చడానికి తమ మద్దతు ఉంటుందని బిజెపి చేస్తున్న తెలంగాణ పోరు ఏ మేరకు చిత్తశుద్ధితో కూడుకున్నదో పరకాల ప్రజలు ముఖ్యంగా తెలంగాణ వాదులంతా గమనించాలి. 

పరకాల ఉప ఎన్నికల్లో సామాజిక తెలంగాణను కోరుకునే బలమైన అభ్యర్థి లేని కారణంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన సెక్యులర్ మొలుగురి భిక్షపతి కంటే తెలంగాణ వాది అయిన రెడ్డి కులానికి చెందిన మతతత్వ పార్టీ అభ్యర్థి డా. విజయ్ చందర్ రెడ్డి ఏ మేరకు మెరుగైన నాయకుడో పరకాల ఓటర్లు గమనించాలి. సమైక్యవాద పార్టీలైన కాంగ్రెస్, టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లు తెలంగాణ ఉద్యమానికి ఎంతైతే ప్రమాదకరమో తెలంగాణ ముసుగులో కుల, మతతత్వాన్ని రెచ్చగొడుతున్న బిజెపి అంతకన్నా ఎక్కువ ప్రమాదకరం. 

- డా. గాలి వినోద్ కుమార్
Andhra Jyothi News Paper Dated : 07/06/2012 

No comments:

Post a Comment