సామాన్య ప్రజలు తమను ఉత్తేజపరిచిన అసాధారణ స్త్రీ పురుషుల నుంచి ప్రవక్తలు, మహాపురుషులు, అవతార పురుషులను సృష్టిస్తారు. యుగ యుగాల దళిత ప్రజల విషాద చరిత్రలో అంబేద్కర్ వంటి మహనీయుడు నిస్సందేహంగా మరొకరు లేరు. ఆ దుఃఖపీడితులను ఆయనలా ప్రభావితం చేసిన వారు మరొకరు లేరు; బతుకును ఇతరులతో సమానస్థాయిలో ఎదుర్కొనేలా ఆ అణగారిన ప్రజల్లో అపరిమిత ఆత్మ విశ్వాసాన్ని అంబేద్కర్‌లా నింపిన ఆత్మబంధువు మరొకరు లేరు. తన అసాధారణ జీవితం, మేధా సాఫల్యాలతో వారిని ఆయనలా ఉత్తేజపరిచిన సుజనుడు, ధీమంతుడు మరొకరు లేరు.
'ఇవీ మా హక్కులు, ఇంకా ఏమిటి మీ ఆధిపత్యం' అని దళితులు నిలదీస్తున్న కాలమిది. దళిత శక్తిని గుర్తించి, గౌరవించే చరిత్ర ప్రభవిస్తోన్న యుగమిది. ఈ ప్రజాస్వామిక విప్లవానికి కారకుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను చిన్న బుచ్చడాన్ని, ఆయన తన మేధస్సును ప్రధానంగా ఎవరి బాగు కోసమైతే అంకితం చేశారో, ఆ ప్రజలు ఎలా సహిస్తారు? సహించరు. కనుకనే, రాజ్యాంగ నిర్మాణ కాలంలో అంబేద్కర్‌పై వెలువడిన ఒక వ్యంగ్యచిత్రాన్ని నేటి పాఠ్య గ్రంథాల్లో చేర్చడం వివాదాస్పదమైం ది. ఆ వివాదం ఒక సానుకూల ఫలితాన్నీ ఇచ్చింది. దళితులకు, (వారికి స్ఫూర్తి అయిన) బాబాసాహెబ్ అంబేద్కర్‌కు మధ్య ఉన్న మేధో సంబంధం, ఆత్మీయ స్మృతిబంధం ప్రప్రథమంగా జాతీయ చట్ట సభలోను, జాతి జనులలోను చర్చనీయాంశాలయ్యాయి.
అంబేద్కర్ అనుయాయులు తమ ఆదర్శమూర్తిని ఒక ప్రవక్తగా మార్చి వేశారా? ఈ ప్రశ్న కొద్దిమందిని బాధిస్తుంది; ఇతరులలో చాలామందికి అది అనవసరపు ప్రశ్న. ఎందుకంటే దానికి సమాధానం స్పష్టమే కనుక. ఆధునిక భారతదేశపు మహోన్నత చింతకుడు, దార్శనికుడు, కోట్లాది అణగారిన ప్రజల విమోచన కర్త అయిన అంబేద్కర్‌కు ఎట్టకేలకు సరైన గుర్తింపు లభిస్తుండడంతో ఆయన అనుయాయులు పరమానంద భరితులవుతున్నారు. అంబేద్కర్ చాలాకాలంగానే ఒక ప్రవక్త అని వారు విశ్వసిస్తున్నారు. అయితే ఆ వాస్తవాన్ని వారు ఇప్పుడు మాత్రమే బహిరంగంగా అంగీకరిస్తున్నారు.
ఇందుకు వారు ఎటువంటి సంజాయిషీ ఇవ్వడం లేదు, ఎవరైనా పరిహసిస్తారేమోనని భయపడడమూ లేదు. సమాన పౌరులమేనని తమను తాము దృఢంగా వ్యక్తీకరించుకుంటున్న వారు ఇంకా భయపడతారా? ఈ నిర్భీతి, ఆత్మనిశ్చయం వారికి అంబేద్కర్ ఇచ్చిన కానుక. యుగయుగాలుగా జంతువుల కంటే హీనంగా చూడబడినవారు, బానిసత్వం లో మగ్గిన వారు, చాలా నిర్దయగా, క్రూరమైన దోపిడీకి గురైన వారైన దళిత ప్రజల్లో అపూర్వ చైతన్యాన్ని మేలు కొల్పిన మానవతా యోధుడు అంబేద్కర్. అవును, దళితులు ప్రభవిస్తున్నారు; గతాన్ని, వర్తమానాన్ని తార్కికంగా విశ్లేషిస్తున్నారు; ప్రజాస్వామిక భారత దేశ చరిత్రలో తమ గురువు అంబేద్కర్ హోదాను పునర్ నిర్ధారణ చేస్తున్నారు.
వర్తమాన భారతదేశంలో ఇరవై కోట్ల మందికి పైగా ఉన్న దళితుల స్థితిగతులు ఏమిటి? వారిలో 86 శాతం మంది భూమి లేని వారు; 80 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తున్నారు; 60 శాతం మంది దినసరి కూలీ భత్యంపై ఆధారపడి బతుకులీడుస్తున్న వారు. అక్షరాస్యులు 37 శాతానికి లోపే. పాకీ పనే పది లక్షల మంది దళితులకు జీనవోపాధి! ఇంచు మించు ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒక చోట దళితుల పై దాడులు జరుగుతున్నాయి; నిత్యం దుర్భాషలకు, మానసిక హింసకు గురవుతున్నారు. అంటరానితనాన్ని 1950లోనే చట్ట బద్ధంగా నిషేధించారు. అయినా ఇప్పటికీ అది ఆచరణలో ఉంది. సామాజిక బహిష్కరణను వారు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ఆర్థిక దోపిడీకి అంతేలేదు.
ప్రవక్త లేదా మెస్సయ్యా (అవతార పురుషుడు) ప్రస్తావన వస్తే మనకు రెండు పేర్లు తప్పక గుర్తుకొస్తాయి. అవి: ప్రవక్త మహమ్మద్; జీసస్ క్రీస్తు. అంబేద్కర్ ఆ మహావ్యక్తుల కోవలోనివాడని ఎవరూ అనబోవడం లేదు (మరి కొద్ది శతాబ్దాలలో అంబేద్కర్ ఖచ్చితంగా ఆ మహనీయుల సరసన జేరతారు- వారూ ప్రవక్త /మెస్సయ్యా హోదాకు చేరిన విధంగానే). వాస్తవమేమిటంటే మహమ్మద్, జీసస్‌లు సాధారణ మర్త్యులే. పూర్తిగా పతనమైన సమాజాన్ని సంస్కరించిన వారు; అణగారిన ప్రజలకు, అన్యాయాలకు గురైన వారికి న్యాయం చేసేందుకు నిబద్ధమైన వారు.
సమాజాన్ని సంస్కరించే భావాలను ప్రతిపాదించి, విలువలను పునఃప్రతిష్ఠించి అనుయాయులు, అభిమానులను వారు గెలుచుకున్నారు. మహమ్మద్, జీసస్ లిరువురూ సమాజంలో మౌలిక మార్పు తెచ్చేందుకు జీవితాన్ని అంకితం చేసినవారు; తమ, తమ అనుయాయుల ప్రాణాలను పణంగా పెట్టి తమ లక్ష్యాలను దీర్ఘకాలంలో సఫలం చేసిన ధన్యులు.
ఇస్లామ్ ప్రవక్తలు, భగవంతుడు తన దూతలుగా ఎంపిక చేసుకొన్న మానవులేనని ముస్లింలు విశ్వసిస్తారు. తాము దివ్య పురుషులమని నిరూపించేందుకు ప్రవక్తలలో కొందరు ఏవో అద్భుతాలు చేసినప్పటికీ ప్రవక్తలనే వారంతా మానవులేనని ముస్లింలు విశ్వసిస్తారు. ఇస్లాం సంప్రదాయంలో ఆదమ్, అబ్రహమ్, మోజెస్, జీసస్ అందరూ ప్రవక్తలే. ఆ పరంపరలో చివరివాడు మహమ్మద్. అసలైన ఏకేశ్వరవాదాన్ని పునరుద్ధరించిన ప్రవక్త. జీసస్ క్రీస్తు భగవంతుని కుమారుడని ఆయన అనుయాయులు విశ్వసిస్తారు. అధోగతికి చేరిన తననాటి సమాజాన్ని సంస్కరించిన మానవీయుడు. యూదు పూజారులు పెంచి పోషించిన కరడుగట్టిన సంప్రదాయాలను ధిక్కరించి మతాన్ని పవిత్రీకరించిన మహానుభావుడు. ప్రేమ, దాతృత్వం, వినయం ప్రాతిపదికన ఒక జీవన విధానాన్ని ప్రబోధించిన మహాత్ముడు. జీసస్ మర్త్యుడుగా పుట్టాడు; మహా సంస్కర్త అయ్యాడు.
మరో మానవీయ సంస్కర్త బుద్ధుడు. ఈయనా మర్త్యుడే. కుల వ్యవస్థను వ్యతిరేకించాడు. బ్రాహ్మణ ఆచారాలు, సంప్రదాయాలను త్యజించాడు. ఆయన తాత్త్వికత రెండున్నర సహస్రాబ్దాల పాటు కోట్లాది ప్రజలను ఉత్తేజపరిచింది; ఆయన నైతిక బోధనలు విశ్వజనీనమైనవి. బౌద్ధాన్ని భారతదేశం నుంచి వెళ్ళగొట్టిన హిందూ మతం బుద్ధుడిని భగవంతుని తొమ్మిదో అవతారంగా గుర్తించి గౌరవించింది. బుద్ధుడి నుంచి సిక్కు మత వ్యవస్థాపకుల వరకు మన దేశంలో ప్రభవించిన సంస్కరణోద్యమాలన్నీ కుల వ్యవస్థను, అంటరానితనాన్ని సమర్థించిన బ్రాహ్మణీయ విలువలపై తిరుగుబాటు చేసినవే. హిందూ మత దేవుళ్ళు అందరూ మర్త్యులే. తదనంతర తరా లు వారికి భగవంతుని హోదాను కల్పించాయి. హిందూ మతా న్ని పునరుజ్జీవింప చేసిన ఆది శంకరాచార్యులవారూ దేవునితో సమానంగా ఆరాధనలు అందుకొంటున్నారు. అలాగే మరో ఇద్ద రు మహా సంస్కర్తలు శ్రీ రామానుజాచార్యులు, మధ్వాచార్యుల నూ వారి అనుయాయులు దేవునిగా ఆరాధిస్తారు, పూజిస్తారు.
ఇరవయో శతాబ్దంలో అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడిన ఇరువురు మహావ్యక్తులు అమెరికా క్రైస్తవ మతాచార్యుడు, పౌర హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికా మహానాయకుడు నెల్సన్ మండేలా. జాతి వివక్షకు వ్యతిరేకంగా గాంధేయ అహింసా పద్ధతుల్లో పోరాడి, తన (ఆఫ్రికన్-అమెరికన్) ప్రజలకు సమాన హక్కులు సాధించిన యోధు డు మార్టిన్ లూథ ర్ కింగ్. దక్షిణాఫ్రికాలో జాత్యహంకార శ్వేతజాతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో 27 ఏళ్ళ పాటు ఒంటరిగా జైలు శిక్ష అనుభవించిన నల్ల జాతి యోధుడు నెల్సన్ మండేలా. అంతిమంగా జాతి వివక్ష వ్యవస్థను కూల్చివేసి ఆఫ్రికన్ నల్ల జాతి ప్రజలను సకల అణచివేతల నుంచి విముక్తం చేసిన మహనీయుడు మండేలా. అణచివేత ఏ రూపంలో ఉన్నా దాని పట్ల ప్రజ్వరిల్లే వ్యతిరేకతకు సంకేతం మండేలా.
శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య మొదలైన హిందూ మత సంస్కర్తలను వారి అనుయాయులు ఆరాధిస్తున్నప్పుడు, కోట్లాది భారతీయులను/అంటరాని హిం దువులను ఉద్ధరించిన, వారి జీవితాల్లో ఇప్పటికీ వెలుగులు నింపుతున్న అంబేద్కర్‌ను మహాపురుషుడిగా ఆరాధించడం పట్ల వ్యతిరేకత ఎందుకు? నా దేవుడు నిజంగా దేవుడే, నీ దేవుడు మిథ్యా దేవుడనే వాదనలో ద్వంద్వనీతి, కాపట్యం ఇందులోలేదా? విము క్తి కల్పిస్తామనే వాగ్దానాన్ని ప్రవక్తలందరూ తమ ప్రజలకు ఇచ్చిన వారే. ఆ విముక్తి సాధనకు మార్గాన్ని కూడా వారు చూపించారు. అంబేద్కర్ చేసిందీ ఇదే. కోట్లాది దళితులు తమ బానిస బతుకుల నుంచి విముక్తమయ్యారు. హక్కులు సాధించుకున్నారు. మరి వారు అంబేద్కర్‌ను దేవుడిగా ఎందుకు ఆరాధించకూడదు?
ఇతర ప్రవక్తలు, మహాపురుషులు, అవతార పురుషుల (వీరంతా మర్త్యులే అన్న వాస్తవాన్ని విస్మరించకూడదు) వలే అం బేద్కర్ కూడా తన విశ్వాసాలకు అనుగుణంగా జీవించారు; అణచివేతకు వ్యతిరేకంగా జీవితాంతం ఆయన చేసిన రాజీలేని పోరా టం నేటికీ కోట్లాది ప్రజలను ఉత్తేజపరుస్తోంది. ఆయన వారి ఆదర్శమూర్తి. ఆయన ప్రతిపాదించిన రిజర్వేషన్ అనే భావన కారణంగానే వేలాది దళితులకు, మళ్లీ, మానవులుగా కాకపోయినప్పటికీ, వ్యక్తులుగా రూపొందేందుకు అవకాశం లభించింది. ఏ ప్రమాణాల ఆధారంగా చూసినా అంబేద్కర్ ఒక అసాధారణ, అత్యుత్తమ మేధావి.
ఆయన ఒక సంస్కర్త, ఒక తాత్త్వికుడు, ఒక విప్లవకారుడు, ఒక కార్యసాధకుడు. భారతీయులకు ఆయన ప్రసాదించిన సమానత్వం, మానవ స్వాతంత్య్రం, హుందాలు ఈ దేశానికి ప్రపంచంలో ఒక గొప్ప స్థాయిని సాధించాయి. అయినప్పటికీ నవభారత నిర్మాతలుగా గుర్తింపు, గౌరవం పొందుతున్న రాజకీయ మహాపురుషులలో ఒకరుగా ఆయనకు స్థానం లభించలేదు. తమ హక్కుల కోసం పోరాడేందుకు అసంఖ్యాక ప్రజల్ని అంబేద్కర్ ఉత్తేజపరిచారు. అలా ఉత్తేజపరిచినవారు అంబేద్కర్‌కు ముందు ఎవరూ లేరు, ఆయన తరువాతా ఎవరూ లేరు.
దళితుల మానసిక శృంఖలాలను పూర్తిగా బద్దలు గొట్టిన స్వాతంత్య్రయోధుడు అంబేద్కర్. మరి ఈ అసంఖ్యాక ప్రజలు అంబేద్కర్‌కు తమ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? ఆయన్ని అమరజీవిగా చేయడం ద్వారా. కేవలం తమ గృహాలు, ఆలోచనలు, ఉద్వేగాల్లోనేకాదు, తమ ముక్తిదాత అని బహిరంగంగా చెప్పడం ద్వారా ఆయన్ని అమరుణ్ణి చేయాలి. అంబేద్కర్ పరిపూర్ణ హేతువాది. తన అనుయాయులు తనను ఇలా ఆరాధించడాన్ని ఆయన ఒప్పుకొని వుండేవారు కాదు. అయితే దళితులు ఆయన్ని అసాధారణ మానవుడిగా ఆరాధిస్తున్నారనేది గమనార్హం.
దళితులు ఎల్లెడలా అంబేద్కర్‌ను దేవుడిగా కొలుస్తున్నారు. ఊరూరా ఆయన విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. మరెన్నో విధాల ఆయన్ని గుర్తుచేసుకొంటున్నారు; స్ఫూర్తి పొందుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ ఆరాధన తీరుతెన్నులన్నీ పూర్తిగా హిందూ సంప్రదాయాలే. కనుక అంబేద్కర్‌ను ప్రవక్తగా, ఒక అవతార పురుషుడుగా పరిగణించడం పట్ల హిందువులకు ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు. సామాన్య ప్రజలు తమను ఉత్తేజపరిచిన అసాధారణ స్త్రీ పురుషుల నుంచి ప్రవక్తలు, మహాపురుషులు, అవతార పురుషులను సృష్టిస్తారు.
యుగ యుగాల దళిత ప్రజల విషాద చరిత్రలో అంబేద్కర్ వంటి మహనీయుడు నిస్సందేహంగా మరొకరు లేరు. ఆ దుఃఖపీడితులను ఆయనలా ప్రభావితం చేసిన వారు మరొకరు లేరు; బతుకును ఇతరులతో సమానస్థాయిలో ఎదుర్కొనేలా ఆ అణగారిన ప్రజల్లో అపరిమిత ఆత్మ విశ్వాసాన్ని అంబేద్కర్‌లా నింపిన ఆత్మబంధువు మరొకరు లేరు. తన అసాధారణ జీవితం, మేధా సాఫల్యాలతో వారిని ఆయనలా ఉత్తేజపరిచిన సుజనుడు, ధీమంతుడు మరొకరు లేరు.
జర్నలిస్టు, విద్యావేత్త
Andhra Jyothi News Paper Dated : 13/06/2012
No comments:
Post a Comment