Thursday, June 21, 2012

లక్షింపేటలో 'కారంచేడు' --డాక్టర్ కత్తి పద్మారావు



రాష్ట్రంలో దళితుల మీద అగ్రకులాల దమనకాండ నిరంతరం సాగుతూనే ఉంది. రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తుంటే ఆ కులాల వాళ్ళు దళితులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఎన్‌టి రామారావు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వియ్యంకుడి ఊరు కారంచేడులో ఆరుగురు దళితుల్ని ఊచకోత కోశారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లా చుండూరులో ఎనిమిది మంది దళితుల్ని తలలు నరికి తుంగభద్రలో తొక్కారు. ఇప్పుడు బీసీగా చెప్పుకుంటున్న బొత్స పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బొత్స వాసుదేవరావునాయుడు తూర్పు కాపుల గుంపు కత్తులతో గండ్రగొడ్డళ్లతో శ్రీకాకుళం జిల్లా లక్షిం పేటలో దళితుల్ని చిత్ర వధ చేసి చంపడం జరిగింది. 


అసలేం జరిగింది? శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్షింపేటలో భూస్వామ్య తూర్పుకాపులు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో దళితపల్లెని చుట్టుముట్టారు. బరిసెలు, గండ్రగొడ్డళ్లు, బాంబులు, కత్తులతో ఒక్కొక్కింటికి 20 మంది చొప్పున చుట్టు ముట్టారు. ఇంట్లో ఉన్నవారిని బయటికి లాగారు. అమానుషంగా, దారుణంగా బూతులు తిట్టారు. కుల అహంకారంతో 'మీరు కూడా పొలాలు చేసే అంతటి వాళ్ళు అయ్యార్రా మాల నా కొడుకుల్లారా!' అని దూషించా రు. 'మా పక్కన పొలాలు దున్నేంతటి వాళ్ళా!' అని నివర్తి వెంకటి (60), ఆయన కుమారుడు నివర్తి సంగమేష్ (35)ను, బూరాడ సుం దరరావు (35), చిత్తిరి అప్పడు (25) -ఈ నలుగురి పైన అమానుషంగా దాడి చేశారు. 



ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురుప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి.బెంజిమన్, నూతలపాటి చంద్రశేఖర్, బోకర నారాయణరావు స్వయంగా చూసిందాని ప్రకారం ఒక్కొక్కరి దేహంపై 40, 50 కత్తి, బల్లెం పోట్లు ఉన్నాయి. ఈ దాడి కక్షతో జరిగింది. దీని వెనుక పథకమూ, వ్యూహమూ, ద్వేషమూ ఉన్నాయి. ఈ పోట్లు పడిన వెంటనే వెంటనే అక్కడికక్కడే మరణించారు. వీరు భూమి పోరులో అమరులయ్యారు. కుల ద్వేషానికి ఆహుతయ్యారు. ఈ నలుగురిపై దాడి సంఘటనలో తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తి బొద్దూరి పాపయ్య (60) బుధవారం విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆస్పత్రిలో మరణించారు. అంటే లక్షింపేట ఊచకోతలో మొత్తం ఐదుగురు బలయ్యారు. 



ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆయా ప్రాంతాల్లో ఉన్న భూమి కలిగిన కులాల వాళ్ళు కమ్మ అయినా, రెడ్డి అయినా, కాపు అయినా, కాళింగులు అయినా, వెలమ అయినా, క్షత్రియులు అయినా దళితులు భూమి దున్నుతుంటే కళ్లలో కారం చల్లుకోవడం, సహించలేకపోవడం, దళితులకు భూమి మీద హక్కులేదు అని కక్ష కట్టడం, వారి మీద దాడులు చేయడం, పల్లెల నుంచి వెళ్లగొట్టడం జరుగుతోంది. ఈ కుల ద్వేషానికి రాజ్యాధికారానికి అవినాభావ సంబంధం ఉంది. పెద్దల అండ వల్లే ఈ దారుణం జరిగింది. ఆంధ్రులు ఎంతో సిగ్గు పడాల్సిన ఈ దారుణ, అమానుష సంఘటనలో హతులతో పాటు మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 



ప్రస్తుతం వీరు శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలమట గణపతి (35), కలమట ప్రకాశ్ (50), కలమటి సింహాచలం, కలమటి గంగులు, గోనెల రవి (25), నివర్తి గంగయ్య (50), కలమట గడ్డియ్య (లచ్చయ్య కుమారుడు), కలమటి గడ్డయ్య (చిన ముత్యాలు కుమారుడు), నివర్తి సింహాచలం, నివర్తి నర్సయ్య, నివర్తి రామారావు, బొద్దూరి బోగేషు, గొంగాడ శివుడు, నివర్తి దారప్పడు, నివర్తి గంగయ్య, కలమటి సంగమ్మ, చిత్తిరి ఎల్ల య్య, కలమటి గంగులు, బొద్దూరి గౌరయ్య ఆస్పత్రి లో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. 



లక్షింపేట ఘటన కారంచేడు, చుండూరు తరువాత అతిపెద్ద అగ్రకులాల దమన కాండ. ఈ కుల ముష్కరులు రెండున్నర గంటలు మారణాయుధాలతో దళితులను చుట్టు ముట్టి వెంటాడి, వేటాడి మృత దేహాలపై కూడా వికటాట్టహాసాలతో కత్తులతో పాశవికంగా దాడిచేశారు. ఇక్కడ తూర్పుకాపు భూస్వాములు పేరుకి బీసీలైనా కుల అహంకారం ఉన్న వారు. శ్రీకాకుళం జిల్లాలో కాళింగులు, కొప్పుల వెలమలు, తూర్పు కాపులు, కోస్తాంధ్రలో కమ్మ, రెడ్డి, క్షత్రియులు నిర్వహించే పాత్రని నిర్వహిస్తున్నారు. 



భూస్వామ్య కాపులు చేసిన ఈ దాడిలో పక్క గ్రామా ల్లో ఉన్న తూర్పుకాపులు కూడా కులం, బంధుత్వంతో పాల్గొన్నారు. ఈ దారుణమైన దాడి వలన 26 సంవత్సరాల చిత్రి శ్రీదేవి, బోరాడ కాసాలు, నివర్తి రాముడమ్మ, నివర్తి వెంకటమ్మ భర్తల్ని కోల్పోయిన అనాథలుగా మిగిలిపోయారు. వీరందరు 30-40 ఏళ్ళ మధ్య వయస్సు వాళ్ళు. వీళ్ళందరూ మాతృమూర్తులే. ఉదయం ఐదు గంటలకు భర్తలు కలిగివున్నవారు 7.30 గంటలకు భర్తల్ని కోల్పోయారు. వాళ్ళు చేసిన తప్పేంటి? 



80 దళిత కుటుంబాలు 60 ఎకరాల గవర్నమెంటు భూమిని దున్నుకోవటమా? అది 2002లో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ స్వయంగా భూమిని కేటాయించి మీరు దున్నుకోండి అంటే ఒక్కొక్కరూ 45 సెంట్లు పంచుకుని దున్నుకుంటున్నారు. ఈ దేశంలో దళితులు భూమి దున్నుకోవడం తప్పా? దానికి కళ్ళలో నిప్పులు పోసుకోవాలా? ఈ ఘటన మీద సిబిఐ విచారణ చేయించకుండా మాఫీ చేయడం కోసం శవాల్ని పూడ్చి పెట్టక ముందే వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కేవలం మొక్కుబడిగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించి రావడం ఆయన అగ్రకుల భూస్వామ్య తత్వానికి నిదర్శనం. ప్రతి చిన్నదానికి సిబిఐ ఎంక్వైరీ వేసే ఈ పెద్ద మనుషులు ఇంత మారణ హోమం జరిగితే ఎందుకు వేయటం లేదు? పెద్దలు ఇరుక్కుంటారనే కాదా? 



లక్షింపేట బాధితులు చిత్రి గంగయ్య, గొంగోడ గంగయ్య, నివర్తి సింహాచలం, నివర్తి తిరపతిరాజు, బోడిసింగు రాము చెప్పిన వివరాలివి: తాము సాగుచేసుకొంటున్న భూమి పది సంవత్సరాల క్రితం మద్దుకూరు రిజర్వాయరు కోసం వివిధ కులాల వారి నుంచి సేకరించినది. వారందరికీ ప్రభుత్వం అప్పుడే ఎక్స్‌గ్రేషియా ఇచ్చివేసింది. ఇప్పుడు ఇది అసైన్డ్ ల్యాండ్. ప్రభుత్వానికి ఎవరికైనా ఇచ్చే అధికారం ఉంది. ఈ 250 ఎకరాల భూమిని దళితులకు ఇస్తున్నట్టు ఇంత రక్తం నేలలో ఇంకిన తరువాత కూడా ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటించలేదు? ఇక్కడ ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకిగా వ్యవహరించారు. ఇది ముఖ్యంగా దళిత మంత్రి కొండ్రు మురళి నియోజక వర్గం. 



దళిత మంత్రులు సిబిఐ విచారణని కోరక పోవడం, 250 ఎకరాల భూమిని కోరకపోవడం అధికార వర్గానికి భజనపరులుగా ఉండి, దళితులపై కత్తులతో దాడులు జరిగినా పదవీ వ్యామోహంతో వ్యవహరించడం సిగ్గుచేటైన విషయం. వీళ్ళు ఏ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల ద్వారా మంత్రులయ్యారో ఆ విషయాన్ని విస్మరించారు. ఈనాడు దళిత ప్రజా సంఘాలు, లెఫ్ట్ పార్టీల అనుబంధ దళిత ప్రజాసంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయి. ఈ డిమాండ్లు నెరవేరే వరకు అన్ని ప్రజాశక్తులు మూకుమ్మడిగా అగ్రకుల రాజ్యాధికారం మెడలు వంచి దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని విజయవంతం చేయాల్సిన చారిత్రక సందర్భం ఇది. 



దళిత ఉద్యమాల ఐక్యతే ఈనాటి పోరాటరూపం. నేలలో ఇంకిన దళితుల నెత్తురు వృధా పోదు. ఈ నెత్తుటి ప్రశ్నకు చరిత్ర సమాధానం చెప్పాల్సిందే. అమరవీరులైన వారి ఆత్మగౌరవ భేరి మోగుతుంది. దళిత శిబిరం లక్షింపేటలో ఆత్మరక్షణ నినాదం చేస్తుంది. ఐదుగురు చనిపోయినా బాధితులు నిస్సారంగా లేరు. 250 ఎకరాలు దళితుల సొంతం అయ్యేవరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటంలో భాగస్వాములవుతున్న ఎర్ర, నీలి ఉద్యమాలన్నీ ఈ డిమాండ్లు నెరవేరేవరకు ఐక్యంగా పోరాడాలి. 



ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మిగిలిన సంఘాలతో కలిసి, బాధితులతో కలిసి పనిచేస్తుంది. ఈనాటి ఈ దళిత ఆత్మగౌరవ ఉద్యమం కులాధిపత్యాన్ని, భూస్వామ్య ఆధిపత్యాన్ని, రాజ్యాధిపత్యాన్ని నిలదీయాల్సిన చారిత్రక సమర దినాలివి. దళిత బహుజన మైనారిటీల్లారా! పార్టీల్ని పక్కన పెట్టి నెత్తురు ఇంకిన నేల నుంచి వస్తున్న పెను కేకలకు స్పందించండి. దళిత సమరయోధులుగా పోరుకు సిద్ధంకండి. చరిత్ర పీడితులదికాదు పీడించబడేవారిదే. తిరుగుబాటే విజయానికి బాట. 



(ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో జూలై 17న 'చలో హైదరాబాద్' కార్యక్రమం తీసుకుంటున్నాం. అందరూ కలిసి రావాలని పిలుపునిస్తున్నాం.)



-డాక్టర్ కత్తి పద్మారావు





Andhra Jyothi News Paper Dated : 21/06/2012 

No comments:

Post a Comment