Friday, June 8, 2012

శాస్త్రీయతకూ పక్షపాతమే! - రమేశ్ హజారి



అస్తమా రోగులకు ఆత్మస్థైర్యాన్నిచ్చి రోగాన్ని ఆత్మవిశ్వాసంతో నయంచేసే బత్తిన సోదరుల చేపమందు కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ప్రజాదరణ పొందిన వైద్య కార్యక్రమం. చేపమందు అస్తమా రోగాన్ని నయం చేస్తుందా లేదా అనే అంశం పక్కకు పెడితే జనవిజ్ఞాన వేదిక, కుహనా 'శాస్త్రీయ' సంస్థల ముసుగులో నడుస్తున్న (ప్రాంతీయ, కుల వివక్షతతో కూడిన) అజ్ఞాన విశ్లేషణలు యిప్పుడు చర్చనీయాంశం. ఇక్కడ తెలంగాణ ప్రాంత వివక్షతో పాటు మనువాద బ్రాహ్మణీయ ఆధిపత్య సంస్కృతి; మూలవాసుల మీద చూపిస్తున్న వివక్ష కూడా గమనించాలి. 

కిందిస్థాయి ప్రజల నమ్మకాలతో కూడిన సాంప్రదాయాలు, పండుగలు పబ్బాలు, వైద్య విధానాలు అశాస్త్రీయాలుగా కన్పించడానికి ముఖ్యకారణం అగ్రకుల బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలమే. బత్తిన సోదరులు తెలంగాణ ప్రాంతపు వెనుకబడిన కులస్థులు కావడంతో వారికి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలుగా శాస్త్రీయత పేరుతో మీడియా ద్వారా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇదే చేపమందును కోస్తా బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు పంపిణీ చేస్తే యిప్పటికల్లా పది ఎకరాల్లో పెద్ద పెద్ద భవంతులు కట్టి సకల సౌకర్యాలతో వారికి రక్షణగా నిలిచేది ప్రభుత్వం. మీడియా ప్రచారం చేసేది. 

ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. చేపముందు వినియోగదారుల్లో దాదాపు ఎనభై శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కులాలకు వర్గాలకు చెందిన ప్రజలే. ఇది కూడా అగ్రకుల ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యానికి ముఖ్య కారణం. విజ్ఞాన సంస్థల ముసుగులో పనిచేస్తున్న సంస్థలన్నీ కార్పొరేటీకరణ చెందుతున్న అగ్రకుల బ్రాహ్మణీయ సంస్కృతీ సాంప్రదాయాలను ఒక్కనాడు కూడా విమర్శించిన పాపాన పోలేదు. ఎందుకంటే వారికి ఆ ధైర్యం లేదు. పైగా వారిని కూడా ఆ విలువలే నడిపిస్తున్నాయి. ఒక కుగ్రామంలో స్థానిక బాబాల చేతిలో మోసపోతున్న ప్రజల విశ్వాసాలను, భూతద్ధంలో పెట్టి చూపించినంతగా అంతర్జాతీయ స్థాయిలో సాయిబాబాలు, ఇతర మోసగాళ్లు మంత్రాల తంత్రాల నెపంతో ప్రజల మీద పడి దోచుకుంటున్న తీరును మీడియా ప్రచారం చేయదు. 

పైగా అడ్వర్టైజ్‌మెంట్‌ల పేరుతో ప్రైమ్‌టైమ్‌లో గంటలకు గంటలు ప్రచారం చేస్తూ లక్షలాది రూపాయల తాయెత్తులు, ఉంగరాలు, రుద్రాక్షలు ప్రజలకు అంటగడుతూ మోసంలో తానూ పాత్ర పోషిస్తోంది. ఎందుకంటే రాశీఫలాలు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అనేవి మనువాద బ్రాహ్మణీయ హిందూమతానికి చెందిన నమ్మకాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు కాబట్టి వాటికి అలా ప్రచారం కల్పిస్తారు. నిజానికి అణగారిన ప్రజల్లోని విశ్వాసాలు వీరు చెప్పే 'మూఢ నమ్మకాలు' ఉత్పత్తి సంబంధాలలో భాగమై ఉంటాయి. ఉత్పత్తిలో భాగమైన ప్రజలకు ముఖ్యంగా వ్యవసాయాధారిత జీవనం గడుపుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలకు కనీస వైద్య, విద్య, సౌకర్యాలందించలేని ఈ అగ్రకుల పాలక ప్రభుత్వాల వైఖరే ప్రజల్లో మూఢ విశ్వాసాల పట్ల ఆమోదయోగ్యమైన కార్యాచరణకు కారణం. 

మూఢవిశ్వాసాలను పాటించడం బడుగుల అనివార్యతే తప్ప మరొకటి కాదు. ఉదాహరణకు పాలిచ్చే బర్రె పాలియ్యకున్నా పసిపిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నా కనీస వైద్య సౌకర్యం లేని గ్రామీణ ప్రజలకు ఈ 'విశ్వాసాలే' డాక్టరుగా మారి సాంత్వన చేకూరుస్తాయి. వెటర్నరీ డాక్టర్ లేని ప్రాంతంలో బర్రెను శాస్త్రీయ వైద్య విధానం ద్వారా రక్షించడం కుదరదు. అప్పుడు ఆ రైతుకు ఆత్మవిశ్వాసం అందించేది తనకు అందుబాటులో వున్న కార్యాచరణే. మంత్రాల తంత్రాల ద్వారా లోకల్ బాబా చేస్తున్న క్రతువు పట్ల విశ్వాసం ఏర్పరచుకోవడం ద్వారా తనకు జరగబోయే నష్టాన్ని తన 'కర్మ'కు వదిలేయడం జరుగుతున్నది. 

పసిపిల్లలు అనారోగ్యం పాలయితే 'దిష్టి తీయడం' అనే సంప్రదాయం కూడా అనివార్యత నుంచి వచ్చిందే. వీటి స్థానంలో శాస్త్రీయ వైద్యాన్ని అందించలేని ప్రజా ప్రభుత్వాలుగా చెప్పుకుంటున్న అగ్రకుల పాలకుల వైఫల్యాలే. ఇక్కడ మనం నిందించాల్సింది ప్రభుత్వాలనే కాని వాటిని తమ రక్షణ కోసం అనివార్యంగా ఆదరిస్తున్న ప్రజలను కాదు. ఇంకా తప్పు పట్టాల్సింది ఆధిపత్య సాంస్కృతిక విలువలనే తప్ప మరోటి కాదు. 

రేపు చేపమందు పంపిణీ ఉందనంగా కూడా ఏమాత్రం స్పందించకుండా వేదికను ఖరారు చేయకుండా నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వమే చేపమందు మొదటిరోజు జరిగిన తొక్కిసలాటలో జరిగిన ప్రాణ నష్టానికి బాధ్యత వహించాలి. ఒకవేళ చేపమందు పంపిణీ అశాస్త్రీయమని అనుకుంటే దానిపట్ల ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని ప్రకటించాలి తప్ప లక్షలాది ప్రజలు దేశ విదేశాల నుంచి తరలివస్తున్న అతి ముఖ్యమైన కార్యక్రమం పట్ల అలసత్వం వహించడం సహించరాని నేరం. 

అదే సమయంలో ఒక స్పష్టమైన సాంస్కృతిక విధానం ప్రకటించాలి. చేపమందుతో పాటు పుష్కరాల పేరుతో లక్షలాది మంది ప్రజల విశ్వాసం పట్ల, వినాయక చవితి సందర్భంగా పదిరోజుల పాటు జరుగుతున్న వినాయక పూజలు ఆ సందర్భంగా వెలువడుతున్న ధ్వని కాలుష్యం నిమజ్జనం పేరుతో జల కాలుష్యం తదితర అశాస్త్రీయ విధానాల పట్ల స్పష్టమైన ప్రకటన చేయాలి. చిత్తశుద్ధి వుంటే జనచైతన్య వేదిక లాంటి సంస్థలు కూడా మెయిన్ స్ట్రీమ్ అవిశ్వాసాల పట్ల ఉద్యమాలు చేయాలి. కేవలం అమాయకులైన బత్తిన సోదరుల మీద చేయడం వలన పక్షపాత శాస్త్రీయ వాదులుగా మిగిలిపోక తప్పదు. 

- రమేశ్ హజారి

Andhra Jyothi News Paper Dated : 09/06/2012 

No comments:

Post a Comment