Thursday, June 7, 2012

అడవిలో అందమైన ఆవుదూడ---హరగోపాల్,సుక్మా జిల్లా కలెక్టర్ అపహరణ సందర్భంలో నేను బస్తర్‌కు వెళ్ళానన్నది చాలా మందికి తెలిసిన విషయమే. ఇంతకు ముం దు కూడా 1993లో కొయ్యూరుకు, 2011లో ఒడిస్సాలో మధ్యవర్తిగా వెళ్ళిన విషయం కూడా చాలా మందికి తెలుసు. అయితే కొయ్యూరు అపహరణ సందర్భంలో కొంతదూరం అడవిలోకి వెళ్ళి ఒక గుట్ట ఎక్కి అప్పటి పీపుల్స్‌వార్ దళంతో కలిసి కన్నబీరన్ నేను చర్చించవలసి వచ్చింది. శాంతిచర్చల సందర్భంలో కూడ రెండు మూడు దఫాలు అడవికి వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ ఛత్తీస్‌గడ్‌లో కూడ రెండుసార్లు అడవికి వెళ్ళవలసి వచ్చింది. ఇంతకు ముందు అన్ని అపహరణలతో పోలిస్తే ఇది కొంత క్లిష్టంగానే ఉండింది. అని నేను ఇంతకు ముందే రాసి ఉన్నాను. రెండవసారి కలెక్టర్ అలెక్స్ మీనన్‌ను మావోయిస్టు పార్టీ మాకు అప్పగించిన తర్వాత బి.డి. శర్మ అలెక్స్ మీనన్, నేను మూ డు సైకిల్ మోటార్ల మీద తిరిగి చింతల్‌నార్‌కు వస్తున్నప్పుడు ఒక చిన్న అందమైన ఆవుదూడ బహుశా పదిపదిహేను రోజుల వయసుండవచ్చు. అది అడవిలో చాలా ఆనందంతో గంతులు వేస్తూ పరుగెత్తిన దృశ్యం నాకు ఒక మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలింది. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పుడు అవు ఈనడం, చిన్న ఆవుదూడలను చాలానే చూశాను. ఆవు దూడ పడుతూనే కొద్ది సమయం తర్వాతే నడవడం, పరుగెత్తడం చూసి అంత చిన్న వయసులో అది నడవడం చూస్తే చాలా అబ్బురంగా ఉండేది.

మనుషులు పుట్టగానే నడుస్తే ఎంత బావుండేది అనిపిస్తుంది. పుట్టిన తర్వాత పెరగడానికి, దొర్లడం, లేచి నిలబడడం, కొద్దిగా అడుగులు వేయడం, తర్వాత నడవడం, పరుగెత్తడం చేస్తారు. అవుదూడకు ఈ పరిణామ దశలో ఏవీ లేవు. బహుశా అవి పుట్టుకతోనే కొం త స్వేచ్ఛతోనే పుడుతాయనిపిస్తుంది. అలాకాక మనిషి స్వేచ్ఛగా జీవించడానికి, అంటే తన కాళ్ళమీద తాను నిలబడడానికి చాలా శ్రమే ఉం టుంది. అందుకే మనిషిది సమష్టి జీవనం. పరస్పర ఆధారిత జీవితం. మా ఇంట్లో కాని, మా ఊళ్లో కాని చిన్నప్పుడే పరిగెత్తిన దూడను చూశా ను కాని బస్తర్ ఆవుదూడ విముక్తి చెందిన దూడలా కనిపించింది.
విశాలమైన అడవి, చెట్ల మధ్య నుంచి దూసుక పరుగెత్తగలదా, దానిని ఆపేవాడు లేడు. దాని స్వేచ్ఛ దానిది. అంతకు మించి అతి ముచ్చటగా, మెరుస్తున్న తెలుపు రంగుల్లో చాలా ఆరోగ్యంగా ఉంది. బహుశా సల్వాజుడుం, గ్రీన్‌హం ట్ ప్రభావాలు దాని మీద పడ్డట్టు కనిపించలేదు. ఇంకా ఈ అణచివేత ఈ లేగదూడ దాక వచ్చినట్టులేదు.

బస్తర్ ఆదివాసీలు కూడ ఒక కాలంలో ఇంత స్వేచ్ఛతో కూడుకున్న తమ జీవితం తాము జీవించారు. వాళ్ళ ఆచారాలు, విశ్వాసాలు, సంపదలు, పెళ్ళిళ్ళు, విడిపోవడాలు, వాళ్ళపాటలు, నాట్యం, దుస్తులు ధరించే తీరు అన్ని చాలా భిన్నంగానే ఉండేది.వాళ్ళు ప్రకృతికి దగ్గరగా జీవించిన మను షులు, ఆ జీవితాన్ని రొమాంటెసైజ్ చేయవలసిన అవసరం లేదు. కానివాళ్ళు నాగరికులు అనడం తప్ప. నాగకరికత ప్రమాణాలు ఎవరు నిర్ణయిస్తారు అనేదే సమస్య. కోస్తాంధ్ర ప్రాంతవాసుల దృష్టిలో తెలంగాణవాళ్ళు కొంత అనాగరికులు అనే అభివూపాయం ఉంది. అది రేగడి విత్తుల నవలలో స్పష్టంగానే వ్యక్తమయ్యింది. బస్తర్ ఆదివాసీలతో దాదాపు జీవించి వాళ్ళలో పూర్తిగా మిళితమైవాళ్ళ కోసం నిరంతరంగా శ్రమపడ్డ బి.డి శర్మలో కూడ కొంత అమాయకత్వం, మనుషుల మీద విశ్వాసం, మాట మీద నమ్మకం . రాసిన పదాల మీద, చట్టాల మీద కంటే కూడా ఇచ్చిన మాట చాలా బలమైంది. నాలుగు దశాబ్దాలు ఐఏఎస్ ఆఫీసర్‌గా పనిచేసిన తర్వాత కూడా ఆ నమ్మకాలు అలాగే ఉన్నాయి. మనం ఎంత వాదించినా, ఇచ్చిన మాట గౌరవించనివాడు రాసిన ఇచ్చిన మాటను కూడా పాటించడు అని ఆయన భావిస్తాడు. బహుశా అది ఆయన మీద ఆదివాసీ సంస్కృతి ప్రభావమేమో. మావోయిస్టు పార్టీకి నిజమైన బలం కూడ పార్టీకి ఆదివాసీలకు ఉండే పరస్పర విశ్వాసమే.

లేగదూడ స్వేచ్ఛతో పోల్చగల ఆదివాసీల స్వేచ్ఛ ఎలా విధ్వంసం అవుతూ వస్తున్నదో, చారివూతక మలుపులను చూస్తే తప్ప అర్థం కాదు. ఆదివాసీలు ప్రకృతికి దగ్గరగా జీవించినా ప్రకృతితో ఘర్షణ కూడా ఉంటుంది. ముఖ్యం గా పులులు, ఎలుగుబంట్లు లాంటి వాటితో వాళ్ళు నిరంతరంగా పోరాడుతూనే ఉంటారు. కనక ప్రతి ఆదివాసీ చేతిలో ఏదో ఒక ఆయుధ ముంటుం ది. చాలామంది దగ్గర ధనస్సు బాగాలు చూస్తే నాలాంటి వాడికి కొంత విం తగా అనిపించింది. బి.డి.శర్మ ఒక ఆదివాసీని నీ బాణం ఎంత దూరం వెళ్ళగలదు అని అడిగాడు. ఆ ఆదివాసి ఒక చిన్న చిరునవ్వును సమాధానంగా ఇచ్చాడు. ఈ క్రూర జంతువులతో నిరంతర పోరాటం వలన వాళ్ళకు పోరాట స్ఫూర్తి ఒకటుంటుంది. తెల్లవాడు బస్తర్‌లో ప్రవేశించినప్పుడు ఎచటివాడు, ఎవడువాడు ఇటువచ్చిన తెల్లవాడు అని శ్రీశ్రీ అన్నట్టు తెల్లవాడితో కలబడ్డారు. మానవీయ పరిణామ శాస్త్రజ్ఞుడు ఎల్విన్ బస్తర్ జీవితాన్ని గురించి చాలా మంచి రచనలు చేశాడు. వాళ్ళ జీవన విధానాన్ని సంస్కృతిని భవిష్యత్ తరాలకు తన రచనలలో భద్రపర్చాడు.

బి.డి. శర్మ మీద నేను గత వ్యాసంలో ప్రస్తావించినట్టు,1949, 26 జనవరి నాడు బస్తర్ ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోయారు అన్న మాటలు చాలా లోతైనవి. నూతన ఆర్థిక విధానం పరిణామం వలన విపరీతమైన వేగంతో విదేశీ పెట్టుబడి సాయుధ బలగాలతో బస్తర్‌లోకి చొరబడింది. ఆబలం సరిపోక బస్తర్ ప్రజల్లోని కొందరిని విడదీసి ‘సల్వాజుడుం’గా మార్చి విపరీతమైన దుర్మార్గాలు చేయించారు. నిజానికి గంటల తరబడి విన్నా సరిపోని భయంకర వాస్తవాలు వాళ్ళు చెప్ప గలరు. తమ మనుషులే అంత క్రూరంగా తమ పట్ల ప్రవర్తించడాన్ని వాళ్ళు తట్టుకోలేక పోతున్నారు. సల్వాజుడుం అంత అమానుషంగా ఎలా తయారయ్యింది అని మావోయిస్టు నాయకత్వాన్ని అడిగితే రాజ్యం వాళ్ళను సాధారణ ప్రజలనుంచి వేరు చేసి అమానవీయమైన మనుషులుగా మార్చి వీళ్ళ మీదికి వదిలారు అని అన్నారు.బస్తర్‌లో సల్వాజుడుం చేసిన దుర్మార్గాల గురించి కొన్ని నివేదికలు, కొంత సమాచారం అందుబాటులో ఉంది. మేము చూసిన, విన్న విషయాల గురించి కూడా వేరే ఒక వ్యా సంలో రాయవలసి ఉంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి మాత్రం ఆపరేషన్ గ్రీన్‌హంట్ కాని, సల్వాజుడుం కాని ఛత్తీస్‌గఢ్‌లో లేవని, ఆపరేషన్ గ్రీన్‌హంట్ తమ డిక్షనరీలోనే లేదు అని ఒక పత్రి కా విలేఖరుల సమావేశంలో చెప్పారు. అరుంధతీరాయ్ బస్తర్ మీద రాసిన వ్యాసంలో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ని అబద్దా లు ప్రచారంలో ఉన్నాయో చెప్పుతూ మావోయిస్టు పార్టీ గురించి మీడియా చేసే అబద్దపు ప్రచారంలో ‘ఆవులు మాయమైన’ ఒక సంగతి గురించి రాసింది.
బి.జె.పి పోయిన ఎన్నికలలో తాము గెలిస్తే ప్రతి ఇంటికి ఒక ఆవును ఇస్తామని వాగ్దానం చేసింది. ఆవును ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి బస్తర్‌లోని ఆవులంటే గిట్టని మావోయిస్టుపార్టీ చంపేసిందని, ఆవులు లేకపోవడం వలన ఇవ్వలేకపోయామని ప్రచారం చేసింది. పార్టీ ఈ విషయాన్ని నిర్దందంగా ఖండిస్తే, మీడియాలో అది ప్రచారం కాలేదు.అందమైన ఆవుదూడ పరుగే ఆవులు సజీవంగా ఉన్నాయ నడానికి ప్రత్యేక సాక్ష్యం. సమస్యల్లా బస్తర్‌లో ఇప్పుడుండే యుద్ధ వాతావరణం ఇంకా ఎంతముందుకు పోతుందనేది. స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జీవించే మనుషుల జీవితాలను వాళ్ళ వనరుల దోపిడీ కోసం విధ్వసం చేయడం ఎందుకు అనే ప్రశ్న నాగరిక సమాజం అడగాలి. ఈ అంశం నేను పదేపదే రాస్తున్నాను. గుర్తు చేస్తున్నాను. వాళ్లు అడవిలో తమకు తోచిన రీతిలో జీవిస్తున్నారు.

రాజ్యం అడవిలోకి వెళ్ళదలిస్తే అక్కడి మనుషుల జీవితాలను వాళ్ళు మరింత అందంగా, ఆనందంగా జీవించే పరిస్థితులను కల్పించడానికైతే వేరు. కాని కేవలంవాళ్ళ వనరుల కోసం వెళ్ళి వాళ్ళ కాళ్ళకింద భూమిని తొలిస్తే భూకంపం రాకుండా ఎలా ఉంటుంది. విశాలమైన అడవిలో అందమైన ఆ లేగ దూడ స్వేచ్ఛగా ఉంటుందా లేక అది కూడ భయంభయంగా జీవించే వాతావరణం ఏర్పడుతుందా అన్నదే ప్రశ్న.

పొఫెసర్ హరగోపా
Namasete Telangana News Dated : 07/06/2012 

No comments:

Post a Comment