Saturday, June 30, 2012

సారాంశం, సామాజిక సంక్షోభమే! - కె. శ్రీనివాస్ఇరవయ్యేడేళ్ల కిందట కారంచేడు జరిగినప్పుడు అదొక సంచలనం. షాక్. పత్రికా కార్యాలయాల్లో పెద్ద సంరంభం. 'పంట పొలాల్లో పులిచంపిన లేడి నెత్తురు' అన్న శీర్షికలో దళితుల మారణకాండను మానవీయంగా కథనం చేసిన సందర్భం. మరణాల సంఖ్య పెద్దగా లేకపోవచ్చును. కానీ, ఆ సంఘటన రాష్ట్రాన్ని దేశాన్ని కల్లోలితం చేసింది. దళిత కారంచేడు ఖాళీ అయిపోయి చీరాలలో విడిది చేసింది. ఒకనాటి దాడే కావచ్చు, కానీ అది రాష్ట్రంలో దళిత ఉద్యమానికి నాంది పలికింది. సామాజికోద్యమాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని తెరచింది. 

మరో ఆరేళ్లకు చుండూరు సంఘటన. మరింత దారుణంగా, భీకరంగా, దుర్మార్గంగా దళితులను వేటాడి నరికారు. ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అనేక అంతర్గత విభేదాల మధ్యనే అయినా దళితుల ఐక్యత ప్రస్ఫుటమైంది. దళితుల్లో ఆత్మగౌరవభావన మరింత బలపడింది. మరి మొన్న జూన్ 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా లక్షింపేటలో జరిగిన మారణకాండ, ఉత్తరాంధ్ర భూసామాజిక సంబంధాల్లోని వైరుధ్యాలను బహిర్గతం చేసింది. కారంచేడు, చుండూరు సంఘటనలనుంచి రూపొందిన దళిత నాయకత్వం లక్షింపేట వెళ్లి నిజనిర్ధారణలు చేసింది. మానవహక్కుల కమిషన్లకు, ప్రభుత్వాలకు నివేదికలు పంపింది. 

విప్లవ, వామపక్ష ప్రజాసంఘాలు, వివిధ ప్రధాన స్రవంతి రాజకీయనాయకులు బాధితులను పరామర్శించారు. కానీ, ఎందువల్లనో, గతంలోని ఆక్రోశం, ఆవేదన, ఆవేశం కనిపించడం లేదు. ఉప ఎన్నికల రాజకీయ సంరంభం వల్ల ఈ సంఘటన మరుగున పడిందని అనిపించినా, అందులో పూర్తి వాస్తవం లేదని అర్థమవుతూనే ఉన్నది. ఎక్కడో ఏదో లోపించింది. నిప్పు భగ్గున మండకుండా, గోరువెచ్చగానే మిగిలిపోయింది. ఏమిటి కారణం? గత రెండు దశాబ్దాల కాలంలో దళిత ఉద్యమం చీలిపోవడం వల్ల కలిగిన పరిణామమా ఇది? బాధితుల ఉపకులానికి సంబంధించిన సంఘాలు సైతం సమరశీలంగా కనిపించకపోవడానికి- కాలం తీసుకువచ్చిన మార్పు కారణమా? వారిలో అధికులు వ్యవస్థలో క్రమంగా సంలీనం అవుతున్నారా? 

పై ప్రశ్నలకు వచ్చే సమాధానాలు కూడా నేటి పరిస్థితికి కొంతమేరకు కారణం కావచ్చు. అయితే, సంఘటన జరిగిన ప్రాంతం స్థితిగతులు కూడా ముఖ్యమైన కారణమనిపిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతం తక్కిన రాష్ట్రం నుంచి విడిగా, దూరంగా ఉంటున్నదా? యావత్ రాష్ట్ర సమాజంలో అది అంతర్లీనం కాలేదా? అక్కడి పరిణామాలను తక్కిన రాష్ట్రం తమవిగా స్వీకరించడం లేదా? కారంచేడు, చుండూరు సంఘటనలు జరిగినప్పుడు, నిందితుల సామాజిక వర్గాలు రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న రాజకీయపార్టీల నేపథ్యవర్గాలు. పైగా, అవి రాష్ట్ర సామాజిక, రాజకీయ చిత్రపటాన్ని దీర్ఘకాలంగా శాసిస్తున్న కులాలు. 

వాటి ఉనికి, వ్యాప్తి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను ఆవరించినవి. లక్షింపేట సంఘటనలో నిందితులుగా ఉన్నవారి సామాజిక వర్గం ఉత్తరాంధ్ర ప్రాంతానికే పరిమితమైనది. ఇతర ప్రాంతాలలో కాపు కులస్తులతో వారికి స్థూలమైన సమీకరణం ఏర్పడుతున్నది కానీ, సాంస్క­ృతికంగా ఐక్యత ఇంకా ఏర్పడలేదు. ఉత్తరాంధ్రలోని తూర్పు కాపులు రాష్ట్ర రాజకీయరంగంలో ప్రాబల్యం పొందుతున్న మాట నిజమే కానీ, దాని ప్రభావం రాష్ట్రవ్యాప్తమైనది కాదు. 

దళితులమీద దాడిచేయడానికి కావలసిన అహంకారాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది కొత్తగా సమకూరుతున్న ప్రాబల్యమే అయినప్పటికీ, దానికి కూడా పరిమితులున్నాయి. కారంచేడు, చుండూరు సంఘటనల నిందితులకు సమాజంలోని వివిధ శ్రేణులలో ప్రాతినిధ్యం ఉండడంతో, వారిని వెనకేసుకువచ్చినవారు కూడా గణనీయంగా కనిపిస్తారు. కానీ, లక్షింపేట నిందితుల వర్గానికి అంతటి హంగు ఇంకా ఏర్పడలేదు. అయితే, ఇంకా అధికారపు సానువులకు సమీపానికి వచ్చీ రాగానే సాంప్రదాయిక ప్రాబల్యశక్తుల మాదిరిగా దళితులపై కత్తిఝళిపించడం ప్రమాద సంకేతం. 

రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితి కారణంగా ఒక సామాజిక దౌర్జన్యం జనం దృష్టిలో పడలేకపోయిందనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే, ఆ రాజకీయపరిస్థితే ఒక సామాజిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ఈ మధ్య రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల వెనుక ఒక పెద్ద సామాజిక సమీకరణం ఉన్నది. ఆ సమీకరణంలో లక్షింపేట బాధితుల కులం కూడా ఒక భాగస్వామే. రాజకీయంగా తమ ప్రాధాన్యాన్ని ప్రకటించడానికి వారు ఒక వర్గంగా ఏ మాత్రం వెనుకాడలేదు. కానీ, సమరశీల పోరాటానికి మాత్రం వారు సంసిద్ధంగా కనిపించడంలేదు. 

ఉప ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి చర్చలోకి వచ్చిన రాష్ట్రవిభజన అంశం కూడా సామాజికంగా తీవ్రమైన పర్యవసానాలున్న అంశం. విభజనను వ్యతిరేకిస్తున్న వారు కానీ, తెలంగాణవాదులు కోరుతున్న సరిహద్దులకు మార్పులు చేయాలని ప్రయత్నిస్తున్నవారు కానీ సామాజికమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నవారే. తమ మతవర్గానికి చెందినవారు అధికంగా ఉన్న మరోప్రాంతాన్ని కూడా తెలంగాణలో కలిపితే ప్రత్యేక రాష్ట్రానికి అభ్యంతరం లేదని మజ్లిస్ భావిస్తున్నది. 

రాయలసీమలోని రెండు జిల్లాలను కలిపితే, తెలంగాణలో తమ ప్రాబల్యానికి గ్యారంటీ ఉంటుందని రెండు ప్రాంతాలలోను బలంగా ఉన్న రెడ్డి కులస్థులు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే, సామాజికమైన సమీకరణాల కారణంగా, జగన్‌మోహన్‌రెడ్డి ప్రాబల్యాన్ని పరిమితం చేయవచ్చునని, పనిలో పనిగా చంద్రబాబును బలహీనపరచవచ్చునని కాంగ్రెస్ భావిస్తున్నది. తెలంగాణ వస్తే, ఇంతకాలం పెత్తనం చేసిన భూస్వామ్య ప్రాబల్యవర్గాలు బలహీనపడి, బిసిల ప్రాతినిధ్యం పెరుగుతుందని ఉద్యమకారులు ఆశపడుతున్నారు. ఆంధ్రప్రాంతం విడిపోతే, తమను అణచివేస్తున్న స్థానిక ప్రాబల్యకులస్థులు బలహీనపడతారని, అంకగణితాలు మారిపోయి తమ పలుకుబడి పెరుగుతుందని అక్కడి దళితులు ఆశిస్తున్నారు. 

అందరి ఆశలూ నెరవేరే అవకాశమైతే లేదు కానీ, రాష్ట్ర విభజన మాత్రం ఊహించిన మార్పులనే కాక, అనూహ్యమైన మార్పులను కూడా సామాజిక రంగంలో తీసుకువచ్చే అవకాశం ఉన్నది. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, కాపు- రాష్ట్రంలో అధికారపీఠాలు సంక్రమిస్తున్న ఈ క్రమం బిసిలకు, దళితులకు చేరువ కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నది. ఈ లోపున లక్షింపేట వంటి సంఘటనలు అనేకం జరిగి, మన వాస్తవికతను గుర్తుచేస్తుంటాయి. 

పదేళ్ల కిందటే, మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకోల్‌లో నామాల బాలస్వామి అనే దళితుడి హత్య తెలంగాణ సమాజానికి ఒక హెచ్చరిక పంపింది. ఉద్యమక్రమంలో ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణతిని, అవగాహనను సంతరించుకున్న తెలంగాణవాదులు సామాజికమైన ప్రహేళికను పరిష్కరించుకున్నప్పుడే వాస్తవమైన విజయం సాధించగలరు. లక్షింపేట బాధితులకు సంఘీభావం తెలపడానికి ఉస్మానియా విద్యార్థులు తరలివెళ్లారనే వార్త అటువంటి ఆశను కలిగిస్తోంది. 

కారంచేడు నుంచి ప్రారంభమైన ఆత్మగౌరవ అస్తిత్వాల ప్రస్థానం, తమను తాము చాటిచెప్పుకునే క్రమంలో సాంప్రదాయిక ప్రగతిశిబిరాలను ప్రశ్నించాయి, నిలదీశాయి. దూరంగా నడిచాయి. సొంత అస్తిత్వాల నుంచే ప్రారంభమయ్యే ప్రశ్నలు, ఆ అస్తిత్వాలను కూడా విభజించాయి. వివక్ష, అసమానత్వం ఎక్కడ ఉన్నా వేరుమాటలు మాట్లాడాయి. ఇప్పుడు, అనేక సంఘాలు, అనేక సంస్థలు, అనేక అస్తిత్వాలు. తాము విస్మరించిన కోణాలను, పార్శ్వాలను వామపక్ష ప్రగతిశీల శక్తులు సరిదిద్దుకోలేక తప్పలేదు. 

స్థైర్యంతో తాము నమ్మిన మార్గంలో నడవడమూ విరమించలేదు. ఇప్పుడు అనేక శక్తులు ఇంకా అనేకంగా ఉండడమే పెద్ద సమస్య. ఒకరి ఉనికిని మరొకరు మింగేసే విలీనాలు అక్కరలేదు కానీ, ఒకరి చేతులను ఒకరు పెనవేసుకునే ఐక్యత కావాలి. బాధిత కులాలు, ఉపకులాలు, మతాలు, జెండర్, ప్రాంతాలూ, ప్రజాస్వామిక సంస్థలూ ఉద్యమాలూ- అవసరమైనప్పుడు ఒకటిగా నిలబడాలి. వాస్తవమైన అర్థంలో ఆ ఐక్యత ఇప్పుడే ఉండి ఉంటే, లక్షింపేట ఉదంతం త్వరగా మసకబారే ప్రమాదం ఉండేది కాదు. 

మనకు స్పష్టంగా తెలియకపోవచ్చును కానీ, ఈ నేల మీద పెద్ద సామాజిక సుడిగుండమే చెలరేగుతున్నది. రకరకాల మారువేషాల్లో వాటి సంకేతాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అధికార రాజకీయ క్రీడ వెనుక పెద్ద సామాజిక సంక్షోభం ఉన్నది. తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాల వెనుక సామాజిక కోణమే ప్రభావం వేస్తున్నది. సీమాంధ్ర ప్రాంతంలో ఏర్పడే కొత్త అధికార సమీకరణలను, చేజిక్కనున్న కొత్త అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఎదుగుతున్న కులాలు జబ్బ చరుస్తున్నాయి. లక్షింపేట అందుకు సంకేతం. ఇంత పెద్ద రంగస్థలాన్ని సామాజికోద్యమాలు ఎట్లా వినియోగించుకుంటాయన్నది సమస్య. 

- కె. శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated : 1/7/2012

No comments:

Post a Comment